29 జులై, 2012

ఓ రసావేశ ఝరి పుట్టపర్తి - నరాల రామారెడ్డి శతావధాని ప్రొద్దుటూరు.



                                          నారాయణుని శివత్వం..


ఏమానందము.. 
భూమీతలమున
శివతాండవమట..!
 శివలాస్యంబట..!
తలపైని చదలేటి యలలు తాండవమాడ..
అలల త్రోపుడుల క్రొన్నెరపూవు కదలాడ..
మొనసి ఫాలముపైన ముంగురులు చెఋఅలాడ..
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ..
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప..
కనుచూపులను తరుణ కౌతుకము చుంబింప..
కడగి మూడవకంట గటిక నిప్పులు రాల..
కడుబేర్చి పెదవిపై కటిక నవ్వులు వ్రేల..
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ..
నమిత సమ్రంభ హాహాకారములు రేగ..
ఆడెనమ్మా శివుడు..
పాడెనమ్మా భవుడు..

             
 
               పెనుగొండ ఆణిముత్యం

ఎట్లు పైకెత్తిరో..?
 యేను  గు గున్నలకైన
తలదిమ్ము గొలుపు నీ శిలల బరువు..
యేరీతి మలిచిరో యీ స్తంభముల యందు..
ప్రోవుగ్రమ్మిన మల్లెపూల చాలు..
యేలేపనంబున నీకుడ్యములకెల్ల..
దనరించినారో యుధ్ధాల తళుకు..
ఏ యంత్రమున వెలయించిరో వీనికి..
చెడక యుండెడు చిరంజీవశక్తి..
కనివిని యెౠంగనట్టి దుర్ఘటములైన..
పనులు స్వాభావికము నుండినట్టి వారి
కా మహాశక్తి యేరీతి యబ్బెనొక్కో..
కాలమో జీవనమొ..
యేదో కారణంబు..
   
 నరాల రామారెడ్డి..
అయ్య శిష్యుడు..
అవధానాలు చేసేవాడు..
ఆయనతో కొన్ని వేదికలపై నేనూ పాల్గొన్నాను.
అది పెద్ద చెప్పవలసిన విషయం కాదు.
 

రాజన్న 
రామారెడ్డి ప్రతి సభలోనూ 
అయ్య ను గురువుగా స్తుతించేవారు.
పుట్టపర్తి వారి తొలి నాళ్ళను 
దగ్గరినుంచీ గమనించిన వారు.

మహాపురుషులు 
వేలల్లో  లక్షల్లోవుండరు
కేవలం ..
వేళ్ళమీద లెక్కించగలిగేలా వుంటారు..
వారిని కారణ జన్ములంటారు
 

ఒక్కొక్కరి జీవితం పరిశీలించినప్పుడు..
వారు కేవలం కర్మ అనుభవించడంకోసం 

పుట్టినవారు అనిపించరు..
సుస్పష్టంగా కనిపిస్తుంది.

భగవద్గీత వంటివి ఎన్ని సృష్టించినా ..
కృష్ణపరమాత్మగా ఎన్ని లీలలు చేసినా..
వీరు నా దారిని రావటం లేదని..
కొందరు మహాత్ములను సృష్టించి..
ఆయన తన జీవన విధానం ద్వారా కూడా 

మనకు పాఠాలు నేర్పాలని చూస్తాడు.

అయ్య ఉన్న ఒక్క జీవితాన్ని 
సద్వినియోగం చేసుకొని 
ధన్య జీవి అయ్యారు.
మనం తిరిగి అంతటి మనిషిని చూడగలమా..
 




                  ఓ రసావేశ ఝరి పుట్టపర్తి
      నరాల రామారెడ్డి, శతావధాని, ప్రొద్దుటూరు.
                 సాక్షి 29.3.2010 ఆదివారం
               సహకారం రామావఝ్ఝుల శ్రీశైలం
మహాకవి 
సరస్వతీపుత్ర పద్మశ్రీ వారికి 
లోకం సమర్పించుకున్న బిరుదులు.
 

విలక్షణ వ్యక్తిత్వం 
విశిష్ట వైదుష్యం 
విశృంఖల సంభాషణా చాతుర్యం 
తేరిపార చూడలెనంతటి తేజస్సు 
వారిలో జనం గుర్తించిన వైదుష్యాలు. 

కవి 
వక్త 
విమర్శకులు. 
అనువాదకుడు 
వాగ్గేయకారుడు 
బహుభాషాకోవిదుడు
వారికి ప్రజలు పెట్టికున్న పేర్లు.
 

ఆయన కావ్యాలను గురించి చెప్పవలసి వస్తే 
రమ్య కవితా రశ్మి 
హృదయ నైవేద్యం 
రసావేశ జలపతం 
కమనీయ కవితా కాసారం 
అభ్యుదయ భావనాగీతం 
లాంటి మాటల మూటలు దొర్లుకొస్తాయి. 

తాను రచించిన కావ్యాన్నే 
తాను చదివి పరీక్ష రాసిన కవి 
ప్రపంచంలో 
పుట్టపర్తి నారాయణాచార్యులు తప్ప 
ఇంకెవరున్నారు..?
 

విలక్షణ వ్యక్తిత్వంతో 
విశిష్ట వైదుష్యంతో 
విశృంఖల సంభాషణా చాతుర్యంతో 
తేరిపార చూడలేనంతటి తేజస్కుడుగా 
ఆంధ్ర సాహితీ  క్షేత్రంలో  ప్రజ్వలించారు 

పుట్టపర్తి కవిగా 
వక్తగా 
విమర్శకుడుగా 
అనువాదకుడుగా 
వాగ్గేయకారుడుగా 
అనేక రంగాల్లో 
అసాధారణ ప్రతిభా పాటవాలను 
ప్రదర్శించారాయన 

పన్నెండేళ్ళ పసి వయసులోనే
పరిణితి పొందిన ప్రతిభను ప్రదర్శించి
 చారిత్రక ప్రదేశంగా 
ప్రఖ్యాతమైన పెనుగొండ క్షేత్రాన్ని 
పెనుగొంద్డ లక్ష్మి కావ్యంగా తీర్చిదిద్దారు. 

సంస్కృత సా హిత్యంలో 
అమరుక మహాకవి రచించిన 
అమరుక శతకాన్ని
"ఏకః శ్లోకః ప్రబంధ శతాయతే.."
 అని విమర్శకులు ప్రశంసించారు. 
అలాగే 
నారాయణాచార్యుల పెనుగొండలక్ష్మి లో 
ఒక్కొక్క పద్యం 
ఒక్కొక్క ఆణిముత్యం. 

అంత చిన్నప్రాయంలో 
నారాయణాచార్యులు 
ఇంత ప్రౌఢ కావ్యం రచించడం అధ్భుతం. 

వారు ఉద్యోగం కోసం 
విద్వాన్ పరీక్షకు వెళ్ళినప్పుడు 
పెనుగొండలక్ష్మి పాఠ్యభాగంగా ఉండిందట. 
తాను రచించిన కావ్యాన్నే 
తాను చదివి పరీక్ష రాసిన కవి 
ప్రపంచంలో 
నారాయణాచార్యులు కాక 
ఇంకెవరున్నారు..?
 

రమ్య కవితా రశ్మి.
పెనుగొండలక్ష్మి రచన 

ప్రముఖ విమర్శకులు 
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 
వంటి మహనీయుల ప్రశంసలు పొందింది. 
"ఉలిచే రాళ్ళకు చక్కిలింతలిడి.."
 వంటి అపురూపమైన పద చిత్రాలకు 
రాళ్ళపల్లివారు మురిసిపోయారు. 

ఒకనాడు..
కృష్ణరాయల ప్రాభవానికి పట్టం కట్టిన ప్రాంతం 
ఆంధ్ర శిల్పుల ధిషణా వైభవానికి 
అద్దం పట్టిన క్షేత్రం 
 ఈనాడు కాలపురుషుని 
 కర్కశపాద ఘాతానికి శిధిలమైపోయిన 
దారుణ దృశ్యాన్ని భరించలేక 
బాల నారాయణాచార్యుల హృదయంలో 
ఉప్పొంగిన ఉధృతమైన ఆవేశం 
పద్య ఖండికలుగా ప్రవహించిం ది. 

12 సంవత్సరాల బాలుడు 
ఇంత గొప్ప పద్యం 
ఎలా రచించాడో. .?
హృదయ నైవేద్యం 

పాద్యం
నారాయణాచార్యులు రచించిన 

భక్త రస ప్లావితమైన పాద్యం గొప్ప కావ్యం .  
ఇదొక్కటే చాలు ..
నిజానికి ..
దీనిలో ఒక్క పద్యమే చాలు..
నారాయణాచార్యులను 
కవిగా నిలబెట్టడానికి 
అన్నారు..
ప్రముఖ విమర్శకులు 
తిరుమల రామచంద్ర గారు. 

రవీంద్ర కవీంద్రుని గీతాంజలి గా 
పుట్టపర్తి వారి పాద్యం 
భగవంతునికి సమర్పించుకొన్న
 హృదయ నైవేద్యం 
అని చెప్పవచ్చు 

భగవంతుని సాన్నిధ్యం కోసం 
పరితపించిన నారాయణాచార్యులు 
గోవుగా పుట్టి వుంటే బాగుండును 
గోపాలకృష్ణుని లాలన భాగ్యం లభించేది 

ఎందుకయ్యా..?
మనుష్యజన్మ నా నెత్తిమీద రుద్దినావు..?
అని దేవుని మీద కోపగించుకొన్నారు.
రసావేశ జలపాతం
నారాయణాచార్యుల రచనల్లో 
శివతాండవ గేయకావ్యం 
ఆంధ్ర దేశంలోనే కాదు 
భారతదేశంలోనే బహుళ ప్రచారం పొందింది. 

కేవలం ఆంధ్రులేకాదు 
ఇతర భాషల వాళ్ళు కూడా 
శివతాండవ రచన లోని 
శబ్ద సమ్మేళనానికి పరవశించి 
మా భాషల్లో కూడా అనువదించండి 
అని కోరినారట 

ఎన్నో వందల వేదికల మీద 
పుట్టపర్తి వారు 
ఉధృతమైన ఆవేశంతో గానం చేస్తుంటే 
ప్రేక్షకులు ముగ్ధులైపోయేవారు. 
ఏమానందము భూమీతలమున 
అని ఆరంభమయ్యే శివతాండవం 
ఎన్నో అభినయాలతో 
ఆంగిక విన్యాసాలతో 
ఉధృత జలపాతంలా దూకుతుంది. 

నారాయణాచార్యులు ఏ సభకు వెళ్ళినా 
శివతాండవ గానం చేయక తప్పదు 
ఎన్నో నారాయణాచార్యుల సభల్లో 
పాల్గొన్న ఈ వ్యాసకర్త 
ప్రేక్షకుల కోసం 
శివతాండవ గానం చేయమని 
అర్థించవలసి వచ్చేది. 

పుట్టపర్తి వారు అంటారు 
"నా రచనల్లో ..
ఈ శివతాండవానికి ఎంత అదృష్టం పట్టిందిరా..?
 జనప్రియ రామాయణం గానం చేద్దామంటే చేయనివ్వరు."
అని
 
కమనీయ కవితా కాసారం
నారాయణాచార్యుల ఆత్మ సంవేదనాగ్నికి 
అద్దం పట్టిన కావ్యం ..
"సాక్షత్కారం .."

మహాకవి తులసీదాస్ జీవితంలోని 
ఉజ్వల ఘట్టం.
ఈ కావ్యంలో ఇతివృత్తం 
తులసీదాసు భార్య పేరు మమతాదేవి 
ఆమె సౌందర్యమెంత లలితమో 
హృదయమంత గంభీరము 
మమతాదేవి కన్నుల నీడలే 
సమస్త ప్రపంచము తులసికి ..!

ఆమెది శరీరంతో సంబంధంలేని 
జ్యోతిర్మయ ప్రేమ..
ఈ రెంటి సంఘర్షణ ఒక్కటే వర్ణింప బడుతుంది 
అంటారు పుట్టపర్తి నారాయణాచార్యులు

 గొప భావుకత్వం ఉన్న కవి.
 కవిత్వమే తపస్సుగా జీవించి..
 మనోజ్ఞమైన భావనాబలంతో 
మన హృదయాలను 
రస లోకాలకు పయనింపజేస్తారు.
 
అభ్యుదయ భావనా గీతం
సంస్కృత సాహిత్యంలో 
సుప్రసిధ్ధమైన మహాకవి కాళిదాసు రచించిన మేఘసందేశం ఇచ్చిన స్పూర్తి తో
 నారాయణాచార్యులు తెలుగులో 
మేఘదూతం రచించారు 

ధనవంతుల దౌర్జన్యానికి గురై
 చెరసాల పాలైన ఒక నిరపరాధి 
తన ప్రియురాలికి 
మేఘంతో పంపిన సందేశం 
మేధదూతంలోని ఇతివృత్తం 

ఈ సందేశంలో పుట్టపర్తి వారు 
ఆంధ్రదేశంలో
 చారిత్రక ప్రాధాన్యం సంతరించుకొన్న 
పుణ్యక్షేతాలను 
శిల్పకళా పదేశాలను
 ఎన్నో స్థలాలను 
ఎన్నో ప్రదేశలలో ప్రజల జీవన విధానాలను
 అందమైన భాషలో 
ఆకర్షణీయంగా 
నిసర్గ రమణీయంగా వర్ణించారు. 

పెనుగొండ నుంచి శ్రీకాకుళం దాకా 
ముఖ్య స్తలాలను మేఘం ద్వారా 
పాఠకునికి పరిచయం చేసారు  పుట్టపర్తి వారు.

 గేయ చందస్సులో సాగిన ఈ కావ్యంలో 
హృదయాన్ని కదిలించే 
ఎన్నో జీవితాలను చిత్రించారు. 
నిరుపేదల బాధల్ని
 ఈ గేయంలో పుట్టపర్తి వర్ణించిన తీరు
 ఆయనలోని 
అభ్యుదయ దృక్పధానికి నిర్దర్శనం 
పేదరాలు 
పాలకోసం ఏడుస్తున్న పసివానికి 
తన చన్నుబాల నిస్తుందా..?
 వక్షస్తలాన్ని చీల్చి రక్తమే త్రాపుతుందా..?

ఇది ధనికులకెలా తెలుస్తుంది..?
అని మేఘం ద్వారా 
సమాజాన్ని పుట్టపర్తి ప్రశ్నించారు. 

తులసీదాసు రామచరిత మానస్ ప్రేరణతో నారాయణాచార్యులు 
తెలుగులో రామకథను 
గేయచ్చందస్సులో 
"జనప్రియ రామాయణాన్ని" రచించారు. 

ఇరవై వేల ద్విపదలతో 
"పండరీభాగవతం "
అనే మహా కావ్యాన్ని రచించినారు
"మహా భారత విమర్శనం "
"భాగవతోపన్యాసాలు "
"ప్రబంధనాయికల" వంటి
ఎన్నో విమర్శనాగ్రంధాలు వెలువరించినారు 
విభిన్న్న రంగాలలో 
అనితరసాధ్యమైన ప్రతిభను పదర్శించిన 
మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులవారికి 
జ్ఞాన పీఠ అ వార్డు రాకపోవడం 
వారి అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించింది. 

రాయలసీమలో పుట్టడం శాపమైంది.
అని వారి అభిమానులు 
నిరాశా నిస్పృహలను ప్రదర్శించడం 
గమనించదగ్గ అంశం.