సప్తగిరి ప్రచురితమైన పుట్టపర్తివారి భాగవతం ఇంగ్లీషు వ్యాఖ్య Pdf లో మీ కోసం- పుట్టపర్తి అనూరాధ
8 జన, 2013
సప్తగిరి ప్రచురితమైన పుట్టపర్తివారి భాగవతం ఇంగ్లీషు వ్యాఖ్య
సప్తగిరి ప్రచురితమైన పుట్టపర్తివారి భాగవతం ఇంగ్లీషు వ్యాఖ్య Pdf లో మీ కోసం- పుట్టపర్తి అనూరాధ
శ్రీమదాంధ్ర మహా భాగవతము మహాకవి పోతన-పుట్టపర్తి వారి పీఠిక
శుక బ్రహ్మ భాగవతాన్ని ఏడురోజులు
కేవలం పరీక్షిత్తు కోసం ప్రవచించాడు
కొన్ని కోట్ల జన్మల తరువాతనే భాగవత శ్రవణం జరుగుతుంది.
కొండలు చెట్లు పశువులు పక్షులు క్రిమికీటకాలు
అన్నీ దాటుకుని మానవ జన్మ పొందినా
భాగవతం చెవుల బడటం మాత్రం
కేవలం భగవంతుని నిర్హేతుక కృప చేతనే
ఉ ప నిషత్తుల సారం భాగవతం
జ్ఞానం నిక్షేపింపబడింది భాగవతంలో

భాగవత సప్తాహం అంటారు.
ఏడురోజులలో భాగవతం చెప్పటమనికాదు.
ఏడురోజుల జీవితమిది అని చెప్పటానికే
చావు శరీరానికే కాని ఆత్మకి కాదు అన్న సత్యం తెలియడానికే.
అందుకేనేమో
కడప మోచంపేట శివాలయం దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు
పుట్టపర్తి వారు భాగవత ప్రవచనం చేసారు.
పరమ ప్రశాంతంగా
సమయ నిబంధన లేదు
ఏ ఊరికో వెళ్ళవలసిన అవసరం లేదు.
ఎందరో వచ్చీక్కడక్కడా కూచుని భక్తిగా వినేవారు.
కడప లో ప్రముఖులు..
మల్లెమాల వేణుగోపాలరెడ్డిగారు
అది మోచంపేట కాదమ్మా 'మోక్షం పేట 'అనేవారు.
కొందరు ఎదురుగా కూచుని వింటే
ఇంకొందరు ఏస్తంభం చాటునో
కొందరు నోట్సు రాసుకునే వారు
ఇంకొందరు కన్నీరు కార్చేవారు
మూడభక్తిని పెంపొందించుకొనేవారు ఇంకొందరు..
అయ్య శివునికి చెబుతున్నా ననుకొనేవారు
ఆ శివుడో పుట్టపర్తి చెబుతున్నాడని వినేవాడు
భక్తులు తమకోసం చెబుతున్నారనుకొనేవారు
ఎవరికివారు ఉధ్ధరింపబడేవారు ఆ భాగవత సుధల్లో..
అనువాదము అనేది ఒక కళ
అనువాదము చేసేటప్పుడు మూలం తో సాగుతూనే
ఒక్కోచోట కవి హృదయం వివశమైనప్పుడు
ఉన్న విషయానికి తన ఆవేశాన్ని జోడించటమో
విషయంలో రసావిష్కరణమోతాదు ఎక్కువైందని భావించినపుడు
దాన్ని తగ్గించి లేదా కుదించి వ్రాసే స్వాతంత్ర్యం కవికి వుండవచ్చు.
ఇక్కడ పుట్టపర్తి వారు
వ్యాసుని పోతన్న అనుసరించిన విధమూ
తెనిగించిన విధమూ మనకు చెప్తున్నారు.
గోపికల ఉన్మాద భక్తి పోతన్న స్వకపోల కల్పితమట
తనకే గాక చదివిన వారందరికీ
జన్మ రాహిత్యాన్ని ప్రసాదించిన పోతన్నకూ..
'భాగవతమూ భక్తుడూ భగవంతుడూ ఒక్కటేరా..'
అని చివరిశ్వాస విడిచిన పుట్టపర్తి వారికీ..
మనసా నమస్కరిస్తూ ..
జక్కా సుబ్బరాయుడు గారు ముద్రించిన
ఈ భాగవతానికి పుట్టపర్తి వారు ఇచ్చిన పీఠికను
చదవడం మొదలెడదామా..

శ్రీమదాంధ్ర మహా భాగవతము
మహాకవి పోతన-పుట్టపర్తి వారి పీఠిక
శ్రీమదాంధ్ర మహాకవులలో
పోతన్న యొక విశిష్టవ్యక్తి
నన్నయభట్టులు జపహోమతత్పరులే గావచ్చును
తిక్కనామా త్యుడి నాసాగ్రవిహారసికుడై
నాదామృత ధారా సార రూపుడగు
హరిహర నాధుని యడిగుదమ్ములను సేవించియుండవచ్చును
అతడు కర్మ యోగి.
ఈ ఇర్వురుమహా కవుల యుపాసనలును సాంకేతికమైనవి. శాస్త్రీయములు.
పోతన్న భక్తి యట్టిది కాదు.

విశ్వాసమే మంత్రము.
ఆత్మార్పణ్మే పూజ.
నన్నయ శాపానుగ్రహదక్షుడు.
పోతన్న కరుణాలలితహృదయుడు.
ఆతనికి శాపమన్న నమితభయము.
తానెవరిననుగ్రహింపగలనన్న యమిత వినయము.
పోతన్నకు భక్తి
తండ్రి తాతలనుండి తరతరములుగ సంక్రాంతమైనది.
అందుచే దాని లోతును ఎక్కువ పాతును దక్కువగాదు.
మూలము ననువదించుటలో
పోతన్న యనుసరించిన దారులనేకములు.
ఒక్కొకయెడ మూలమునకు మెరుగువెట్టెను.
వ్యాసమహర్షి యొయ్యారములగు పోకలు పోయినచోట

కొన్నియెడల మూలమునగల కాఠిన్యమును దొలగించి
తెనిగింపును సౌలభ్యమును నింపెను.
వ్యాఖ్యానవిషయములనక్కడక్కడజొప్పించెను.
ఒక్కొకసారి వ్యాఖ్యానకారులతో విభేదించి
స్వాభిప్రాయములను వెల్లడించినాడు.
దశమస్కంధములోని గోపికల యున్మాదభక్తి
మొదలైన వర్ణనములలో నాయన స్వకపోలకల్పితము చాల గలదు.
బమ్మెర పోతన్నది ప్రాసాదిక కవిత్వము.
అనగా భగవదనుజ్ఞ తో
తదీయారాధనారూపముగ వ్రాయబడినదన్నమాట.
ఆ కవితకు తీరుతీయము లేమి తక్కువ.
కవి ఋష్యంశజుడగుటచే
మాటతీండ్రయు వర్చస్సును
నా రచన ప్రధానగుణములైయుండును.
కావ్య రచనయందాయన ధ్యేయమే వేరు.
తనకొక్కనికేగాదు తన గ్రంధమును జదువువారినిగూడ
జన్మ రాహిత్యము నాతడుద్దేసించెను.
ఎంత గంభీరమైన ఆదర్శము.
ఇంతకన్న నుత్తమమైన విశ్వశ్రేయమేదిగలదు
పోతన్న భక్తి పరమ సాత్వికమైనది.
దయయు సత్యంబు నాతనికి రెండు బహిః ప్రాణములు.
వీరశైవుల రజోగుణప్రేరితమగు విజృంభణపై

ఎడ గ న్నులేదు.
'చేతులారంగ శివుని బూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని'
అన్న యుదాత్త లలితమగు నాదర్శముతో
శివకేశవాద్వైతమును బండించుకొని
యనుభవించిన యదృష్టశాలి యాయన
భాగవత రచనకు ముందుగూడ పోతన్న మహేశ్వర ధ్యానమే సేసెను.
'శ్రీ కైవల్యపదంబు జేరుటకునై ..'
విష్ణు భక్తిని పట్టెనట.
మనస్సునందు శ్రీరామభద్రుని సన్నిధానంబు గల్పించుకొన్న
మహాకవి యతడు.
షష్ట్యంతములను గృష్ణపరముగ వ్రాసినాడు.
అనగానాత నికి శివకేశవభేదము లేనట్లే.
రామకృష్ణాద్యవతార భిన్నదృష్టి గూడ లేదన్నమాట.
'సర్వం విష్ణుమయం జగత్'
అనెడు అనుభూతిని చక్కగ సమన్వయించుకొని యనుభవించినాడనుటకింకేమి సాక్ష్యము గావలెను.
పోతన్న మహాకవి పేరిట
నీ మూడు గ్రంధములు బ్రచారమున నున్నవి.
మొదటిది నారాయణ శతకము.
దీని రచన భాగవత శైలిలోనే నడచినది.
పోతనాబాత్యుని దని చెప్పబడు వీరభద్ర విజయము మాత్రము
ఆయనదని చెప్ప వీలులేదు.
'భోగినీదండకము'న
మహాకవి పోతన్న రచనారీతులు గుప్పలుతిప్పలుగనున్నవి.
మనుష్యులను బొగడరాదనటాతనికి
వయస్సుముదిరినవెనుక గలిగిన యూహ.

'ఈ మనుజేశ్వరాధము'ల దుశ్చర్యలను
గమనించినపిదప గలిగిన యేవగింపు.
పోతనామాత్యుడు
జన్మతోనే యాదర్శములముద్ద యని నమ్ముట పొరబాటు.
మహాత్ములును మనవంటి మనుష్యులే.
విష్ణు భక్తికి ప్రధమ యోగ్యత యగు దారిద్ర్యము
పోతన్నకు వెన్నంటియేయుండినది.
దారిద్ర్యము మానవుని పై నొనర్చు దురాగతములకు లెక్కయేలేదు.
కాని వాని కన్నిటికతడు తాళి నిలచెను.
తన నిశ్చయమునుండి చలితుడు కానేలేదు.
కొండలవంటి కష్టములకు జంకలేదు.
సింగభూపాలుడు దన గ్రంధమును బాతిపెట్టించినను
వీసము లొంగలేదు.
జీవితాంతమువరకు ధైర్యముగ నిలచినాడు.
"ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు
సొమ్ములు గొన్ని పుచ్చుకొని శరీరమువాసి కాలుచే
సమ్మెటవ్రేటులన్ బడక సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జధ్ధితంబుగన్"
అను పద్యమును రొమ్ము విరిచి పలికి కీర్తికాయుడైనాడు.

మహాకవి.
పోతన శైలి నన్నయ రచనవలె ఋషివాణి.
ఆ శయ్య ..
ఆ రచన..
అతనికే చెల్లింది.
అతడు భాగవతమున నీ పద్యము బలికెను.
"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నితాంతాపార భూతదయయును
దాపసమందార నాకు దయసేయ గ దే "
పోతన్న భాగవతమును నిష్టతో జదివినవాని కంతయు
నీ భావము దప్ప దక్కిన చాపల్యములన్నియు
వదలిపోవు స్థితి వచ్చితీరును.
అతని జీవితము స్వర్గంగ.
అతని కవితలా గంగా తీరమున నెలకొన్న యుత్తమ క్షేత్రములు
ఆ జీవితముచే సృష్టి ధన్యమైనట్లారచనచే
శబ్దమయప్రపంచము ధన్యమైనది.
ఇట్టి ఈ భాగవతమును ఇంత కష్టపడి
నష్టమునకైనను ఓర్చి
ఆస్తిక బుధ్ధితో సర్వాంగ సుందరముగ ముద్రించిన
మా రాయలు అండ్ కో
జక్కా సుబ్బారాయని జీవితమును ధన్యమైనది.
ఈ భాగవతమును జదివి పులకించుటకై తెలుగునేల కాచికొన్నది.
త్యాగేనైకే అమృతత్వ మానశుః
రాయలు అండ్ కో ప్రచురణ 16.4.54
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు
(భాషా శాస్త్ర పరిశోధకుడు ,తిరువాంకూరు విశ్వవిద్యాలయము.)
(త్రిపుటి నుంచీ.. )
లేబుళ్లు:
వ్యాసాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)