నెల్లూరు టౌన్ హాల్..
1990 పుట్టపర్తి వారి సంస్మరణ సభ..
బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు
కె.పి.నారాయణరావ్ తదితరులు మాట్లాడారు. 
ఆయన జడ్జి...
పుట్టపర్తి వారి సాహిత్యావలోకనం జరిగింది..
ఒకరు శివతాండవం అత్యుత్తమమైనదన్నారు.
కాదు కాదు..
జనప్రియ రామాయణం ..
పుట్టపర్తి వారి కీర్తి కిరీటంలో కలికితురాయన్నారు. 
ఇంకొకరు..
మరొకరు వారి వారి తొలి రచన పెనుగొండలక్ష్మి 
వారి పాఠ్యపుస్తకంగా రావటం అద్భుతమని 
ఇది యే కవి జీవితంలోనూ ..
జరగని సన్నివేశమని వక్కాణించారు..
ఇంతలో..
ఓ గొంతు వినిపించింది  కిందనుంచీ
"నేనూ పుట్టపర్తి వారి గురించి మాట్లాడతాను.."
అందరూ అటువేపు చూసారు.
ఓ వ్యక్తి వేదికపైకి వచ్చాడు..
అతను రిటైర్డ్ పోస్ట్ మాన్ 
కడప మోచంపేటలోనే 
అతను ఉత్తరాలు పంచిపెట్టేవాడు.
పుట్టపర్తి వారిని రోజూ దాదాపు చూసేవాడు.
వారికి వచ్చిన ఉత్తరాలు ఇచ్చి ..
కాసేపు కూచునేవాడు.
వారు ఉత్తరాలలోని సారాంశాన్ని 
అతనికి వినిపించేవారు వారు 
నమస్కరించుకుని వెళ్ళేవాడు.
అతను వేదికపైకి వచ్చి మైకు సవరించాడు.
"అతను ఎవరా..?" 
"ఏం చెప్తాడా..?"
 అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
"మీ అందరికంటే ఎక్కువ 
నారాయణాచార్యులవారి గురించి నాకే  తెలుసు..
ఎలా అంటారా..?
నేను ఒక పోస్ట్ మాన్ . .
కడప నారాయణాచార్యులవారుండే మోచంపేటలోనే 
నా ఇరవైయ్యేళ్ళ డ్యూటీ..
ప్రతిరోజూ వారిని చూసే వాడిని మాట్లాడేవాడిని.
కాసేపు వారి పక్కన కూర్చుని 
నమస్కరించుకొని వెళ్ళేవాడిని 
ఉత్తరాలలోని విషయాలు 
ఉత్తరం చదివి చెప్పేవారు అయ్యగారు.
అయ్యతో నాకున్నంత చనువు ఎవ్వరికీ లేదు.."
అన్నాడు అతను 
అందరూ నివ్వెర పోయారు.
"అమ్మాయ్ ఇలా రా.."
అంటూ పిలిచాదు.
ఓ అమ్మాయ్ బహుశా ..
అతని కూతురనుకుంటా వేదికపైకి వచ్చింది.
"శివతాండవం చెప్పమ్మా.."
అన్నాడతను..
అంత చిన్నపిల్ల 
పుస్తకం చూడకుండా..
ఎక్కడా తడబడకుండా ..
చక్కగా అత్యంత రసభరితంగా 
శివతాండవాన్ని గానం చేసింది..
సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పోయింది..
సభికులు ఆనంద పరవశులయ్యారు. 
