25 జన, 2016

కంచె దాటిన భావాలు



నిన్న కంచె సినిమా 
ఒక పక్క ప్రేమ కథ
మరో పక్క యుధ్ధ సన్నివేశాలు
ఇదీ సినిమా
మధ్యలో కులాల ఆభిజాత్యం పై పోరు

నాగబాబు కొడుకు బానే వున్నాడు ఆ చరణ్ కంటె
కథలో యేదో కొత్తదనం ఉన్నప్పుడు మరేవీ దృష్టికి రావు
కానీ ఈమధ్య ప్రేమ అంటేనే విసుగ్గా వుంది
యేదో ఆ భాగాన్ని కాస్త లో అయిపోగొట్టొచ్చుగా అనిపించింది.
అయినా అలా ప్రేమించి గొడవలు తప్ప యేం బావుకున్నారు
ఆఖరికి ఆ పిల్ల చచ్చే పాయె..
ఆ ఫైటింగ్ కూడా హీరో అమ్మాయి వాళ్ళ అన్న కొట్టుకున్నారు తప్పించి
ఇంక విపరీత రక్త పాతాలేవీ లేవు..
అయినా అన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన పెద్దవాళ్ళు
తనతో పాటు పెరిగి తన జీవితం కోసం తాపత్రయ పడే అన్న ను మించి
ఆ అబ్బాయిలో యేం చూసిందో నాకు తెలీలేదు
బహుశా love at first sight కామోసు

యుధ్ధం సన్నివేశాలు నాకు నా గతాన్ని గుర్తు చేశాయి
మా అయ్య నన్ను ముక్కూ మొహం తెలీని 
మా ఆయనతో పెళ్ళి చేసి పంపించేశాక
(ఏదో పెళ్ళిచూపుల్లో చూసిందే)
చాలా దిగులు పడిపోయారట
వాడు రాధను బొంబాయిలో అమ్మేస్తాడేమో నని
అందరినీ బతిమలాడేవాళ్ళట 'ఒకసారి వెళ్ళి చూసి రమ్మనీ
కానీ మా అక్కలూ అన్న యెవరూ పట్టించుకోలేదు..

మా ఆయన Airforce లో కాపుల్ అప్పట్లో..
మహరాష్ట్రలో ఉద్యోగం..
ఆ అమ్మ అనారోగ్యం తో బేజారైపోయిన మా పెద్దవాళ్ళు
చివరకు వచ్చేసరికి నా పెళ్ళి విషయంలోను 
అశ్రధ్ధ వహించారు
యేదో ఒక సంబంధం చూసి పెళ్ళిచేసి పంపించేశారు
ఆఖరికి మా అత్తగారిల్లు బెంగుళూరులో వుంది
ఒక్కరూ వచ్చి చూడలేదు
వాళ్ళు ఎవరు ఎట్లావాండ్లు అని

నేనొక్కదాన్నే అత్తవారింట్లో అడుగుపెట్టాను
తోడు కూడా ఎవరూ లేరు..
కేవలం అయ్య అమ్మల ఆశీ స్సులు వెనక వున్నాయేమో..

అక్కడంతా తమిళ లోకం
అదీ కాక చదువుకున్న దాఖలాలు ఎవరికీ లేవు
ఒకరోజు మా చిన్న మరిది 
యేదో తమిళ పదనుడికట్టు ఫిలప్ చేస్తున్నాడు
'అప్పా బ్రహ్మ పొండాటి యారు..?'
అని అడిగాడు
'ఆ .. బ్రహ్మ పొండాటి యా ..?
యెన్నమో ఎనకు తెరియాదు 
ఉంగ అమ్మకు కేళు .."
అన్నారు మా మామగారు
ప్రశ్న మా అత్తగారిని చేరింది
'పోడా .. ఉనకు వేరె వేల ఇల్లియా..?'
అని ఆమె కసిరింది
ఇంక అన్నలూ చెల్లెళ్ళూ ఎవరు ఆ రహస్యాన్ని విప్పలేక పోయారు
అంతా చూస్తున్న నాకు
గుండెల్లోంచి దుఃఖం ఎలా తన్నుకొచ్చిందంటే

'బ్రహ్మ పొండాటి యారో కూడా తెలియని కుటుంబంలోకి నేను వచ్చిపడ్డాను అని అర్థమయ్యి 
గుండెలవిసేలా ఏడ్చాను
మా అయ్య సరస్వతీ పుత్రుడు..
మా ఇల్లు కళలకు నిలయం
మా అమ్మ రామాయణాన్ని నర నరాన జీర్ణించుకున్న తల్లి
కానీ నా జీవితం చూడండి ఎలా మిగిలిందో..

ఇంక నేను సాలె గూటిలో చిక్కిన కీటకంలా విల విల లాడాను
చూసి చేసిన నా పరిస్తితే ఇలా వుంటే
ఇంక ప్రేమించిచేసుకున్న వారి విషయం ఎలా వుంటుంది..


అమ్మ లేదు
ఇంటిదగ్గర అయ్యను వదిలి వచ్చానని బాధ
ఇక్కడ అయ్య కూడ నా ఎడబాటును తట్టుకోలేక బాధపడేవారు
తల్లి తండ్రీ తానే అయి
యేవేవో బుధ్ధులు ఉత్తరాలలో చెప్పేవారు
అప్పటికి నా పుట్టింటి ద్వారాలు మూసుకుపోయాయినాకు
మా వదిన నన్ను రానీదని అర్థమైపోయింది
మా అయ్యను పైకి పంపించే ప్రయత్నాల్లో ఉందామె..
ఇంక చావైనా బతుకైనా ఇదే
అన్న నిశ్చయానికొచ్చాను..

పెళ్ళయి మూడు నెలలయ్యింది
అయ్యను ఎప్పుడూ విడిచి వుండని నాకు 
కలలో అయ్య వచ్చేవారు
అయ్యదగ్గరికి పోతానని అడిగాను
ఏ కళనున్నారో మా ఆయన ఒప్పుకున్నారు
మా ఇంట్లో దిగబెట్టారు
అర్ధరాత్రి లేచి అయ్యా అని ఏడుస్తుంది
అని తన తమిళ తెలుగులో చెప్పారు
మా అయ్య ఎంతో సంతోషపడ్డారు

అమ్మ లేని పుట్టిల్లు అనుభవాలన్నీ చవిచూసి
తిరిగి మా ఆయనతో వెనుదిరిగాను
ఎవరికీ సెండ్ ఆఫ్ ఇవ్వని మా అయ్య
రిక్షా వరకూ వచ్చి చెయ్యి ఊపుతుంటే
నాకు గుండె మెలిపెట్టినంత బాధ
ఎవరు చెప్పారు పెళ్ళి చేసుకు తీరాలని.. 

ఆ.. 

కొద్ది రోజులకు నేను మా ఆయనతో 
మహారాష్ట్ర లోని ఓజార్ అనే గ్రామం చేరుకున్నాను..
అక్కడ కంచె సినిమాలో చూపించినటువంటి వాతావరణాన్ని చూశాను
మేము ఒక రూములో వుండేవాళ్ళం
అందులోన వంట పడక అన్నీ ఒకే రూము
కిటికీ లోచీ ప్రపంచం చూడడం
మా ఆయన జీతం 2,500
అందులో సగం అందుకున్న వెంటనే 
వాళ్ళ ఇంటికి పంపేసేవారు 
నేను బిచ్చ గత్తె కంటే కొంచెం ఎక్కువ అంతే .. 
నాకు రెండు పూటలా ఇంత తిండి పెట్టండి చాలు అనేదాన్ని 
చీరలు అవీ కొనుక్కోవాలనే కోరికలే వుండేవి కావు .. 
మనసంత నిస్తేజం 
అమ్మ లేదు  
అయ్యా ముసలివారు 
ఇంక అశ లేం  వుంటాయి .. 

చుట్టూ మరాఠీ భాష
అన్ని  భాషల వాళ్ళు Airforce లో వుండేవాళ్ళు 
కానీ అందరినీ కలిపేది హిందీ మాత్రమే..

పొద్దున ఏడు గంటలకళ్ళా సైరన్ మోగేది
అందరూ రెడీ అయ్యి వెళ్ళిపొయ్యేవాళ్ళు
యూనిఫాం స్కై బ్లూ షర్టూ.. నేవీ బ్లూ ప్యాంట్, నల్ల షూస్, నెత్తిపై క్యాప్
అదీ
కిటికీ లోంచీ చూస్తే వందలు వందల మంది
యూనిఫారమేసుకుని సైకిళ్ళలో స్కూలుపిల్లల్లా పోతూ కనిపించేవారు
అక్కడక్కడా మాత్రమే స్కూటర్ లు కనిపించేవి..

మధ్యాన్నం రెండూ మూడు వరకు మాత్రమే డ్యూటీ
మా ఆయన ఎలక్ట్రికల్ అంటే యుధ్ధ విమానాలను చెక్ చేసేవారంట
ప్రతిరోజూ విమానాలను చెక్ చేయాలి తరువాత పైలెట్ తీసుకెళ్తారు
ఒక చోటి నుంచీ మరో చోటికి డ్యూటీపై యుధ్ధ విమానాల్లోనే వెళ్ళేవారు
సినిమాలలో చూపించినట్లు యుధ్ధం వచ్చినప్పుడు 
ఎలా ఎదుర్కోవాలని ప్రాక్టీసు 
వారానికి ఒక సారి వుంటుంది
గుంతలలోంచీ గోడల చాటునుంచీ అప్రమత్తంగా వుండటం..
పదిహేను రోజుల కొకసారి 
Airforce quarters వాళ్ళందరు లైట్లు ఆర్పేయమని ఆదేశాలిచ్చేవారు
అసలే చుట్టు అడవిని పెంచి మధ్యలో వుంటుంది ఆ ప్రాంతమంతా
యుధ్ధ విమానాలు ఎత్తునుంచీ ఎగురుతూ ఒక్కసారి వేగంగా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయేవి
అది బాంబులు వేసే ప్రాక్టీసు పైలెట్లకు
ఆ రోజు కనీసం పదిసార్లన్నా అలా జరిగేది
ఒకసారి యుధ్ధ విమానం వేగంగా కిందిదాకా వచ్చి మళ్ళీ పైకెళ్ళిపోతే భయంకరమైన శబ్దం
ఆ శబ్దంతో నా గుండెలవిసిపొయ్యేవి
నేను రెండుచెవులు గట్టిగా మూసుకునేదాన్ని
పైగా అప్పుడు యుధ్ధమొస్తుంది ఇప్పుడు యుధ్ధమొస్తుంది అని ఊహాగానాలు

మా ఆయన యుధ్ధమొస్తే నేనొక్కడినే పోతాను
మీరు ఊరెళ్ళిపోండి అనేవారు
కానీ నేను అంగీకరించేదాన్ని కాదు
చావైనా బతుకైనా మీతోనే
వుంటే అందరం వుంటాం 
పోతే అందరం పోతాం
అనేదాన్ని
అప్పటికి మాకు ఇద్దరు మగపిల్లలు
ఇక quarters లో
చుట్టూ అడవి 
ఎప్పుడూ  పాములు..తేళ్ళు..
మనం ఇక్కడ కుక్కలు చూస్తాం . . 
కానీ అక్కడ మాకు నక్కలు
నెమళ్ళు 
మాకు కనిపించేవి
వానా కాలం వస్తే 
మా quarters లో పురివిప్పిన నెమలిని 
ఎన్నో సార్లు నేను చూసాను..

విపరీతమైన చలి మైనస్ లోకి వెళ్ళిపోయే చలి 
ఢిల్లీ దగ్గర ఆగ్రాకు మారాక
ఆగ్రాలో తాజ్మహల్ 
ఎవరొచ్చినా తాజ్మహల్ చూపించడం ఆనవాయితీ
ఎప్పుడూ తెల్ల జాతి వాళ్ళు పొట్టి పొట్టి బట్టలేసుకుని
చూడడానికి వచ్చి కనిపించేవారు
నాకు తాజ్ మహల్ లాగానే వారి ఒళ్ళు తెల్లగా నున్నగా అందంగా కనిపించేది
బహుశా నేనూ మగకళ్ళతో చూశానేమో..

మా ఆయన ఫ్రెండ్ వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం ఓ రోజు 
బహుశా అది నాలుగో అంతస్తు 
తింటూ వుండగా దూరంగా పెద్ద శబ్దం 
 ఆందోళన గా అందరు కిటికీ లోంచి చూసారు 
విమానం పేలిన శబ్దం అది .. 
అప్పుడే అ త ను భోజనం వదిలి యునిఫామ్ వేసుకుని 
గబా గబా వెళ్లి పోయాడు .. 

వాళ్ళు నలుగురు కూచుని మందేస్తూ మాట్లాడుకున్నా 
యుద్ధం లో ఎలా చేయాలి 
అనే  మా మాట్లాడుకునేవారు..తప్ప
పారిపోవాలని కాదు
ఒకవేళ VRS తీసుకుని బయటికి వచ్చినా
ఎప్పుడైనా యుధ్ధం వచ్చి వాళ్ళ Airforce పిలిస్తే మళ్ళీ యుధ్ధానికి వెళ్ళి యుధ్ధం చేయాలనే ఆరాటపడేవాళ్ళు
ఓ కన్నడ స్నేహితుడు 'ఇర్లికి  ఆగల్ల కణ్ణో' అనేవాడు..  

మేం హైదరాబాద్ వచ్చినా మా ఆయన గుజరాత్ లో పనిచేసారు 
అక్కడ లాతూర్ భూకంపం వచ్చినపుడు సేవ చేసారు 
కార్గిల్ యుధ్ధం నా జీవితంలొ ఒక మరిచిపోలేని అనుభవం
ఆయన అక్కడా నేనిక్కడా
తొమ్మిదినెలల కడుపుతో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా

టీవీ చూస్తూ చనిపోయిన ప్రతి సైనికునిలోనూ మా ఆయనను చూసుకుని
నేను తల్లడిల్లిపోయేదాన్ని
ఆయన క్షేమ వార్త తెలియక
ఆ దేవుని దగ్గర దీపాలు వెలిగించి మా ఆయనను రక్షించమనై వేడుకునేదాన్ని..
ఏర్ ఫోర్స్ డే  రోజు విమానాల విన్యాసాలు .. 
ఒక్కో విమానాల ప్రదర్శన లో 
ఒక్కో యుద్ధ విమానాన్ని దాని నైపుణ్యాన్ని ప్రత్యేకతలను వివరిస్తుంటే వాటిని దగ్గరినుంచి  చూ డ టం 
అన్నీ మంచి అనుభవాలే .. 
విమానాల లోకి మనల్ని అనుమతిస్తారు 


సినిమా చెప్పడానికి వచ్చి 
మొత్తం మా సినిమా చెప్పేసాను
ఆ .. ఏం చెబుతున్నాను..??
కంచె సినిమా పోయి పోయి యేమో ఐపోయింది
కానీ నాకు జ్ఞాపకం ఉన్న ..పట్టేసిన డైలాగులు
''అయితే సన్యాసంలో ..
లేకపోతే సైన్యంలో కలవమన్నారు
సన్యాసంలో కలిస్తే యేమొస్తుంది బూడిద ..
అని సైన్యంలో కలిసాను
కానీ ఇక్కడ నేనే బూడిద అయిపోయేలాగున్నాను''

''ఆడతనం ఒక్కో దేశంలో ఒక్కోలాగ వుంటుందని అనుకున్నాను.. 
కానీ అమ్మతనం యేదేశంలోనైనా ఒక్కటేఅని తెల్సిందమ్మా..''
''ఒక శత్రువు కైనా పిండం పెడితే 
అమ్మకు దండం పెట్టినట్టే ..''
లాంటి కొన్ని డైలాగులు అవసరాల రామకృష్ణ కు ఇచ్చారు 
బాగున్నాయి .. 
ముఖ్యంగా ఒక జర్మన్ యువతి 
సైనికులను రక్షించడానికి తన అభిమానాన్ని అడ్డం పెట్టడం నచ్చింది .. 

17 జన, 2016

రసలుబ్ధులు



ఒకసారి గుంటూరులో పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులుగారితో 
వారి శిష్యుడు
'స్వామీ నాకు వాల్మీకి రామాయణం చదవాలనివుంది'
అన్నాడట
'చదువు..  ఇందులో నీకు కష్టమేముందీ ..??
తెలుగే కదా..'
అన్నారట 
నిజమైన మాట..
అలాగే కన్నడిగులకు అది కన్నడంలాగే కనబడుతుంది
మళయాళీలకు కూడా అంతే..
ఎటొచ్చీ తమిళునికి మాత్రమే 
దానిని ప్రత్యేకంగా అర్థం చేసుకోవ ల సి న 
అవసరం వుంటుంది
ఎందుకు చెబుతున్నానంటే 
వాల్మీకి వాడిన సంస్కృతం 
ఏ భాషలోనైనా ఒదిగిపోయి 
అది తమ భాషే అనిపించేంత సులభంగా వుంటుంది
నిఘంటువు చూచుకోవలసిన సంస్కృత శబ్దం ఒక్కటిన్నీ సాధారణంగా వాల్మీకి రామాయణంలో కనిపించదు..

ఇక మనస్తత్త్వం విషయానికొస్తే..
వాల్మీకి మనస్తత్త్వం పరమ కోమలమైనది
ఎంతసేపు చెప్పినా తనకు విసుగులేదు
ఇతరులని విసిగించడు
తాత్త్వికంగా వాదించడు
ఏదైనా క్లిష్ట సమస్య వస్తే 
ఏష ధర్మః స్సనాతనః
అని మెల్లగా జారుకుంటాడు..

సావిత్రి వంటి మహాకవ్యన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అని నిరాశ

ఇది శ్రీమద్వాల్మీకి ప్రణీత శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
మొదటి సంపుటము వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామ చంద్రుడు
వారి శ్రీమద్రామాయణ దర్శనం 
ముందుమాటలో పుట్టపర్తి ప్రస్తావించిన విషయాలు

పాత్ర చిత్రణ విషయానికొస్తే
వాల్మీకి పాత్ర చిత్రణ 
వాని ప్రవేశం 
వానిని అవసరం తీరిన వెంటనే 
మృదువుగా అదృశ్యం చేయటం లో 
వాల్మీకి అనుసరించిన విధానం మొదలైన విషయాల్లో ఎందరినో కవిత్వం వరకూ పోకుండానే కేవలం కధే ఎందరినో అకర్షించింది..

ఇక్కడ చూడం డి


విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికై 
తపస్సు మొదలెడతాడు
మొదట పరమ శివుడు ప్రత్యక్ష మౌతాడు
ఏవో వరాలు .. 
తరువాత వెయ్యి సంవత్సరాల ఘోర తపస్సు 
మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షం
'నీవు రాజర్షివైనావు' అన్నాడు
సంతోషపడలేదు.. 
'నేనెప్పటికి  బ్రహ్మర్షి నౌతా' నని బాధపడ్డాడు
తరువాత త్రిశంకునితో తపస్సు వ్యయం
శునశ్శేపునికి   తపస్సు ధారపోయడం
మళ్ళీ పశ్చిమతీరంలో తపం
అక్కడ మేనక ప్రత్యక్షం
మానవ దౌర్బల్యం కమ్మి మేనకతో జీవితం సాగిస్తూండగా
హటాత్తుగా
 'యేం చేయాలని వచ్చాను.. 
యేం చేస్తున్నాను.. ??'
అన్న స్పృహ
మళ్ళీ ఉత్తర తీరంలోవెయ్యి సంవత్సరాల ఘోర తపస్సు

బ్రహ్మ 'నీవు మహర్షివయ్యావయ్యా' అన్నా డు 
విన్నవెంటనే 
'బ్రహ్మర్షి నెప్పుడౌతానో..?' అన్న చింతకన్నా
జితేంద్రియుడనయ్యానా
అని అడిగాడట
ఎందుకు 
తన ప్రయత్నమంతా
కామ క్రోధాల వల్ల పాడైపోతూంది
చూశారా..
మనం చేసే ప్రయత్నాలను అడ్డుకొనేది ఎవరో కాదు 
మన మనసే..
మనసు చేసే మాయ వల్ల 
మనం మనం కాకుండా పోతాం
మనల్నిమనం కోల్పోతాం
మనం వేరే అవతారమెత్తుతాం

కనుకే వాల్మీకి 
విశ్వామిత్రుని ప్రయత్నాన్నే ప్రధానంగా చూపాడుతప్ప 
అతను ప్రలోభ పడిన సన్నివేశాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు
అదే పుట్టపర్తి వారు చెబుతున్నారు..



''కొన్ని విషయాలు ఆయన జారవిడుస్తూ పోతాడు.. ఇతరులు ఆ సన్నివేశాలను పెంచి పెద్ద జేస్తారు.. 
ఒక సన్నివేశం చూపుతాను
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావలెనని తపస్సు చేస్తున్నాడు
అంతకుముందు రెండు మూడు విఘ్నాలు జరిగినాయి..
వాటిని దాటుకుని మరలా వెయ్యి సంవత్సరాలు
తపస్సు చేసినాడు తపస్సు ముగించి వ్రతస్నాతుడై నెమ్మదిగా కూర్చున్నాడు..
ఇంతలో దేవేంద్రుడు వచ్చి 
''నీవు ఇప్పటికి ఋషివైనా''
వని చెప్పిపోతాడు
కాని గాధేయుని ఆకాంక్ష అదికాదు గదా..
తాను బ్రహ్మర్షి కావలె..
మరలా  తపస్సున కారంభించినాడు.
దేవతలు విడుస్తారా..
ఆయన తపోభంగం కలిగించడానికి 
ఇంకో ఎత్తుగడ యెత్తినారు
మేనకను పంపినారు.
అదీ సామాన్యురాలు కాదు
పరమాప్సరస
పుష్కరాల్లో స్నానం చే స్తూంది
విశ్వామిత్రుడు చూస్తాడు
మేఘంలో మెరుపు వలె మేనక ప్రకాశిస్తూంది.
ఆమెను చూచిన విశ్వామిత్రుడు కందర్పవశుడైనాడు
'ఓసీ.. అప్సరా నీకు స్వాగతం..
నా ఆశ్రమంలో వుండు.. మదన తాప తప్తుణ్ణైన నన్ను అనుగ్రహించు..'
అంటాడు.. 
'సరే ..' నంటుంది
పదివర్షాలు గడిచిపోయినాయి..
ఒకనాడు తన పరిస్తితిని తలచుకొని విశ్వామిత్రుడు సిగ్గుపడతాడు
ఇదంతా దేవతలు పన్నిన పన్నుగడ
మేనకను చూస్తాడు
ఆమె శాప భయంతో వణకిపోతుంది
నమస్కరించి నిలబడ్డది
మేనకను అనునయించి పంపివేస్తాడు
ఈ కథనంతా వాల్మీకి మూడు నాలుగు శ్లోకాలలో చెప్పివేసినాడు
బ్రహ్మర్షివంటి విశ్వామిత్రుని జీవితంలో 
ఇది ఒక చిన్న దౌర్బల్యం
ఇది పెంచి పెద్దగా వర్ణించవలసిన అవసరం 
వాల్మీకికి తోచలేదు
వాల్మీకి తప్ప తక్కిన కవులంతా
ఈ సందర్భంలో తమ శృంగార చాపల్యాన్ని

గ్రుమ్మరించినారు
వారు వాల్మీకి హృదయాన్ని గమనించనేలేదు

8 జన, 2016

అదేమైనా ..బ్రహ్మ విద్యా ..


మా అయ్య రచనలు పబ్లిషర్ లు వేశారంట
ఎన్నో సార్లు ప్రచురించి బాగా బాగుపడినారంట..
రాసినాయన షష్టి పంచె తోనే మిగిలాడట..
అయ్యో నా రచనలు ఇంత ప్రాచుర్యం పొందాయి..
పబ్లిషర్లు నన్ను దోచేశారు 
అని తెగ ఇదయిపోయారట..
తానే శక్తిని కూడగట్టుకుని 
తెలియని విద్య ప్రదర్శించారట..
ఏమైంది..
ఇంటినిండా పుస్తకాలు గుట్టలు.. గుట్టలు. 
రాసే జ్ఞానం ఉన్న ఆయనకు
అమ్ముకునే జ్ఞానం లేదే..
ఏమైంది..
చెదలు ఆ పుస్తకాలు తిని జ్ఞానాన్ని పొందాయి

అయ్య కష్టించి.. కష్టించి..
సమాచారాన్ని సేకరించారట..
ఎంత బాగా రాశారు స్వామీ..
అవునురా.. 
కానీ దీన్ని బయటికి ఎట్లా తెచ్చేదిరా..
స్వామీ..
పోనీ .. నీవు తీసుకుని.. నీ పేరిట వేసుకోపోప్పా..
ఏమైంది..
చూసి ఇస్తామనీ..
ఎత్తి రాసి ఇస్తామని తీసుకున్న చిత్తు ప్రతులు పరాక్రాంతమైపోయాయి
ఆ జ్ఞాని .. అజ్ఞాని లా 
మళ్ళీ నిస్సహాయంగా ..

అయ్యో స్వామీ..
మమ్మల్ని అజ్ఞానులంటావే..
చదువుకున్న వాడినని బిర్రు కదా నీకు

చదువుకోవటం మాకు కష్టం
కానీ 
బ్రతక నేర్వటం నీకు వచ్చా .. 
రాదుకదా..
తూచ్..
నిన్ను ఓడించామోచ్..
ఈ విద్యను నువ్వీ జన్మకు నేర్వలేవు..
హహ్హ హ్హా..

7 జన, 2016

క్షమయా ధరిత్రీ..

క్షమయా ధరిత్రీ..
పై మాటలో ఎంత అర్థముందో మా అమ్మను చూస్తే.. తెలుస్తుంది.. ఎవరి అమ్మలైనా అంతే కదా..
ఒకపక్క మా అయ్యకు 
ఇల్లు పిల్లలూ సంసారం అంటూ బంధాలు ఏమీ లేవు..
ఆయనకు విశ్వమే ఒక సంసారం
మామూలు భర్తతో సంసారంలో అడుగుపెట్టిన స్త్రీ జీవితమే కొన్ని సంవత్సరాలు అగమ్యగోచరం
దానికి తోడు కళాభిరుచి కలిగిన భర్త తో నడక 
ఇంకింత సంక్లిష్టం..
మరి.. జీవితమే తపస్సుగా నడిచేవానితో ..??
పరుగులు పరుగులే..
ఎప్పుడు ఏ ఉపద్రవాన్ని తెస్తారో నని 
మా అమ్మ బిక్కు బిక్కు మంటూండేది
''పెద్దవాళ్ళెవరైనా అంతే అనూరాధా.. 
వారు ఒక చట్రంలో బంధింపబడరు '
అంది మంగళగిరి ప్రమీలాదేవి..
ఆమె రచయిత్రి ప్రొఫెసర్ 
ఎన్నో పుస్తకాలు రాసింది

ఇక మా అమ్మ స్తితిని అర్థం చేసుకోలేని మా అక్కయ్యలు చీరల కనీ.. మర్యాదలకనీ పంతాలు పోయేవారు..
ఇంకా పిల్లల మైన మా నుంచీ కూడా
 లెక్కలేనన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొంది మా అమ్మ
'అమ్మను బాధ పెట్టకూడదు..'
 అనే ఇంగితం లేని వయసు కదా.. అది..
మనకు 'డింగు 'మని జ్ఞానోదయం అయ్యి
 కంటికి కడివెడుగా కన్నీళ్ళు కార్చే సరికల్లా 
వాళ్ళు ఉస్సూరుమని గోడెక్కేస్తుంటారు..

6 జన, 2016

రామాయణం నిత్య దాహం



పాత్రలను ప్రవేశపెట్టటంలో గూడా వాల్మీకి గొప్ప చాతుర్యాన్ని చూపుతాడు..
శ్రీరామునికి పట్టాభిషేకం నిర్ణీతమైపోయింది..
అయోధ్యలో అలంకరణలు ఆరంభమైనాయి
అవన్నీ ఒక రాత్రిలో జరిగిన పనులు

మంధర కైకేయి దాసి
ఆమె పుట్టింటినుంచీవెంట వచ్చింది

ఆవిడ ఎందుకో బుధ్ధి పుట్టి.. 
చంద్ర సంకాశమైనప్రాసాదాన్ని అ ధి రో హిం చిం ది ..
అయోధ్యా నగర వీధులన్నీ ధగ ధగ లాడిపోతున్నాయి
హఠాత్తుగా యేమిటీ వేడుక 
మెకు చాలా ఆశ్చర్యం కలిగింది..

కౌసల్య దాసి ..
రాఘవునికి జ రిగేపట్టాభిషేకాన్నిగూర్చిసమాచారాన్నందిస్తుంది
'రేపుపుష్యమీ నక్షత్రంలో.. 
రాముడు యువరాజౌతాడన్నది'
ఈ మాటతో మంధర హృదయంలో నిప్పుపడ్డది..

వెంటనే సర సరా ప్రాసాదం దిగివచ్చింది..
ఆ సందర్భంలో వాల్మీకి ఒక మాట అంటాడు..'
'విదీర్యమాణా హర్షేణ..'

కౌసల్య దాసి సంతోషంతో పగలబడిపోతున్నదనుట
ఇక్కడ మంధరను గూర్చి 
అంతకు ముందు మనకేమీ తెలియదు
శాంత గంభీరమైన మహా  సముద్రంలో 
హఠాత్తుగా ఒక పెద్ద తిమింగలంలేచినట్లు 
మంధర లేచింది..
ఇతర కవి ఎవరైనా అయివుంటే 
మంధరను గూర్చిన సోది అంతా మనకు చెప్పి
తర్వాత మంధరను ప్రవేశ పెట్టి వుండేవాడు..''

శ్రీమద్వాల్మీకి ప్రణీత శ్రీమద్రామాయణ ము
అ యోధ్యాకాండము మొదటి సంపుటము
వ్యాఖ్యాత ; ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు
శ్రీమద్రామాయ ణదర్శనము
ముందుమాట పుట్టపర్తి