రాజులకాలంలో
రాజు కొడుకే మళ్ళీ పాలనాధికారాలు చేపట్టేవాడు..
చిన్నప్పటినుంచే గుర్రం స్వారీ.. ఖడ్గ చాలనం వంటి ఎన్నో విద్యలు నేర్పించేవారు
తండ్రిని చూసే పాలనాదక్షత రాజకీయపుటెత్తుగడలు ప్రజాపాలన మొదలైనవి ఫాలో అయిపోయ్యేవాళ్ళు
మరిప్పుడు ప్రజాస్వామ్యం
అయిదేళ్ళకోపారి ఎన్నికలు..
ప్రజలెన్నుకున్నవాడే నేత...
కానీ మనకలా అనిపిస్తుందా ..
కె సీ ఆర్ కొడుకే కాబోయే ముఖ్యమంత్రి..
చంద్రబాబు బాబే మనకు కాబోయే మరో బాబు..
పధ్ధతి మారింది కానీ అంతా సేం టు సేం..
ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడం తొక్కిపెట్టటం..రిగ్గింగ్ రెండుసంవత్సరాలముందే రాబోయే ఎన్నికలకు జనాల నెలా బుట్టలో పడేసుకోవాలి
అనే అంశాలమీద తర్ఫీదునిప్పిస్తున్నారు..
మన సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయలవారు తన ఇరవయ్యవయేట రాజ్జాధికారాన్ని చేపట్టి
అంధ్ర భోజునిగా
కన్నడ రాజ్య రమా రమణునిగా
కీర్తించబడి..
గొప్ప రాజనీతిజ్ఞునిగా..సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త వ్యూహ నిపుణుడు..పట్టినపట్టు విడువనివాడు
అంతే కాదు
కవిపోషకుడు.. సాహితీ సమరాంగణ సార్వభౌముడు గా నుతింపబడ్డాడు..
మరి ఈయన తన వారసుణ్ణి తన తర్వాత రాజుగా చూసుకున్నాడా..
ఇందులో కొన్ని సందేహాలు
మనచరిత్ర అంతా యే పోర్చుగీసు వాడో..
లేకపోతే మనల్ని పాలించి పోయిన బ్రిటిషు వాడో చెబితే తెలుసుకోవలసిన దుస్థితి..
వాళ్ళలో ఒకడైన న్యూనిజ్
మన రాయల పాలనా వైభవాన్ని పరాయి దేశస్తుడైనా కళ్ళకు కట్టినట్టు చూపించాడు
1346 లోని యొక శాసనమిట్లున్నది..
'' మహామండలేశ్వర భాషగె రాయరగండ హిందూసురత్రాణ, శ్రీవీర అరియప్ప వడయరు బుక్కప్ప వడయరు రాజ్యపాలన్ చేస్తుండంగాను..''
తమిళములోనే మరియొకటి యిట్టిదే గలదు..
హరియప్ప బుక్కణ్ణ లిర్వురును జేరి
తెక్కల్ నాడు లోని జనులకిచ్చిన యాజ్ఞాపత్రమది..
1386 లో గూడ
హరిహర బుక్కల సమిష్టి పాలనము దెల్పు శాసనము గద్దు..
దేవరాయల సుతుడైన విజయ రాయుడును
దండ్రి కాలముననే సహాయ సం రక్షకుడుగ నున్నట్లు శాసనములున్నవి..
అట్లే..
విజయరాయసుతుడైన రెండవ దేవరాయుడు గూడ
ఇతడు వీర విజయ రాయల సహాయ సమ్రక్షకుడుగ పనిజేసెను..
విరూపాక్ష రాయలును దన కుమారునితో గలసి రాజ్యపాలన మొనర్చినట్లు శాసనాధారములుగలవు..
ఇంతలో సాళువ నరసిమ్హుడు సిమ్హాసనము నాక్రమించెను..
కృష్ణదేవరాయలుగూడ దన కుమారుడైన తిరుమలునితో జేరి సమిష్టి పాలన మొనర్చెనేమో..
ఈ విషయమును ధ్రువపరచు
1524 లోని యొక దాన శాసనము గలదు..
దానివిషయమిది.
'' తిమ్మరుసు
గృష్ణదేవరాయల కాయురారోగ్యములు బ్రాప్తించుటకై.. గొన్ని పల్లెలపైని సుంకమును
'మాగడీ లోని తిరువేంకటేశ్వరునకు సమర్పించెను..
ఈ సుంకములా దేవుని భూషణసేవకు..
తిమ్మణ్ణ ధన్నాయకుడను మరియొక యుద్యోగి తిరుమల రాయని నిరంతరాభివృధ్ధికి
మరికొన్ని సుంకముల నా దేవునికే యొసగెను..
కృష్ణ దేవరాయడు దన కొడుకుతో జేరి పరిపాలనమును కొన్ని దినములు సాగించెనని
న్యూనిజ్ వ్రాతగూడ నున్నది..
పైశాసనమావ్రాతకు దోడ్పాటు..
కృష్ణదేవరాయల కుమారునిపేరేమో
న్యూనిజ్ వ్రాయలేదు ..
తురుష్కులపై విజయమును సాధించిన తరువాత రాయలేమి చేసెనో యాతడిట్లు దెలిపెను.
'వృధ్ధాప్యమున దాను విశ్రాంతి గైకొనవలెనని
రాయల యాశ.
తన యనంతరము
గుమారుడు సిం హాసనము నెక్కి పరిపాలింపవలెనని వేరొక యాకాంక్ష.
ఈ రెండు కోరికలను సాధించికొనుటకు
బూర్వ రంగమున దాను బ్రతికియుండగనే
వానిని రాజుగ నొనర్చుటకు రాయలు సంకల్పించెను
అప్పటికి గుమారుని వయస్సు
ఆరు సంవత్సరములు మాత్రమే..
తన యనంతరము పరిస్తితులెట్లుండునో యని యనుమానించి రాయలు గుమారునకు బట్టాభిషేకమొనర్చెను..
తన యధికారములన్నియు వానికి గట్టబెట్టినాడు..
సిం హాసనము నప్పగించెను..
తాను మహాప్రధానియైనాడు..
తిమ్మరుసు మహామంత్రికి సలహాదారుడు..
కృష్ణరాయల రాజభక్తి యెంతవరకు వచ్చెననగా..
సిం హాసనాధిష్టుడైన కుమారుని యెదుట
నాతడే మోకరిల్లుచుండెనట..
పట్టాభిషేకమహోత్సవములు
సుమారెనిమిదినెలలు సాగినవి..
ఈ వేడుకలలోనే ..
చిన్నరాజుకు జబ్బువచ్చి మరణించెను..''
అదే న్యూనిజ్ మరియొక చోట
''కృష్ణరాయ సుతుని వయస్సు పదునెనిమిది నెలలు మాత్రమే నన్నాడు అతని వ్రాతలలోననేక చోటులనిట్టి వ్యాఘాతములు దగులుచుండెను..''
అదీ సంగతి ..
రాచరికపు రాజకీయాలు ..
సొంత తమ్ములు... సవితి తమ్ములు..
చిన్నాయన పెదనాయన పిల్లలు..
చంపడాలు బందీలుగా చేసి మగ్గబెట్టడాలు ..
ఎన్ని పన్నాగాలో..
అందులోనూ
వారసులను కాపాడే రాజభక్తులు
వేరేచోట పెంచి పెద్ద చేసి ..
ఆఖరికి పుట్టుమచ్చలాంటి ఋజువు లు చూపి రాజును చేసేయడాలు ..
అన్నీ మనం సినిమాలలో చూసేసాం ..
ఆ పసివానిముందు మోకరిల్లిన
రాయల రాజభక్తి మన కట్టప్పనుపోలి లేదూ..