28 జులై, 2015

నూటికో కోటికో ఒక్కరు ..


అబ్దుల్ కలాం 
నిన్న పరమ పవిత్రమైన తొలి ఏకాదశి పుణ్య దినాన పరమ పదించారు..

ఒక దివ్య తేజం వెళ్ళిపోయింది..
టీవీల్లో పేపర్లలో
కలాం గురించి మాట్లాడుతున్నారు.
కలాం M.S.సుబ్బులక్ష్మి గారి అభిమాని..

 విజయపథంలో నడిచి గమ్యం చేరుకున్న పరిపూర్ణమానవుడు
ఈ రోజు స్కూళ్ళకూ కాలేజీలకు సెలవు..
సెలవు రోజున పిల్లలేం చేస్తారు..
నిద్ర సినిమా ప్రెండ్స్ తో ముచ్చట్లు..
సెల్లు ఫోన్లు మెసేజ్ లు..

ఎవ్వరైనా పెద్దవాళ్ళు చనిపోతే..
సెలవు వస్తుందని మాత్రమే వాళ్ళకు తెలుసు..
అంతే కానీ 
వాళ్ళెంత గొప్ప వాళ్ళు
యేం సాధించారు.. 
యే విలువలు పాటించారు
ఏ సందర్భాలలో ఎలా ప్రవర్తించారు.. 
ఇవేవీ తెలియవు..

అలా కాక 
ఆ రోజున అర్ధ పూటన్నా స్కూళ్ళు కాలేజీలు నడిపి..

మరణించిన మహాత్ముని గురించి
పిల్లలకు చెప్తే..
వాళ్ళ మనసులో అద్భుత  చిత్రం ఏర్పడుతుంది..

జీవితంలో యేం సాధిం చాలో .. 
అసలు ఎందుకొరకు జీవితమో అవగాహన ఏర్పడుతుంది..

నిరుపేదగా జీవితం ప్రారంభించిన కలాం
''కలలు కనండి..
ఆ కలలు నిజం చేసుకోడానికి నిర్విరామంగా కృషిచేయండి..''
అనే స్థాయికి ఎలా ఎదిగాడో గోచరమవుతుంది..

''నీవు నీ డ్యూటీకి సెల్యుట్  చేయి
 {త్రికరణ శుధ్ధిగా చేయి)
అప్పుడు నీకు 
మరెవ్వరికీ సెల్యూట్ చేయాల్సిన గతి పట్టదు..''
అనే వారి మాటల్లో
వారి జీవిత కాలపు సూత్రం దర్శనమిస్తుంది..

పుట్టపర్తీ ఆ తోవలో నడచిన వారే గనుక
ఇద్దరికీ ఒకే దారి కనిపించింది..

వి.వి. గిరి.
నీలం సంజీవరెడ్డి
సర్వేపల్లి రాధాకృష్ణ 
జవహర్ లాల్ నెహ్రూ

మరెందరో ప్రముఖులు
పుట్టపర్తితో సాన్నిహిత్యం ఉన్నవారు

నీలం సంజీవరెడ్డి గారు 
రాష్ట్రపతిగా పదవీ విరమణ చేస్తూ
''పుట్టపర్తీ .. 
ఇక నేను ఈ రాష్ట్రపతి తొడుగును వదిలేసి
మదనపల్లి లో ప్రశాంత జీవనానికి వెళుతున్నాను..''

అంటూ స్వహస్థాల్తో వ్రాసిన ఉత్తరం 
నా చేతులతో పోస్ట్ అందుకుని చదివాను..

ఇప్పుడు ఇది మళ్ళీ మీ కోసం
పాతదైనా ఎప్పటికీ కొత్తదే..

హృషీ కేశ్.. 
 నిర్మల మనసు తో తపోసాధన చేయటానికి 
అన్ని రకాలా అనువైన ప్రదేశం ..
అందుకే లక్షలాది మహర్షులు 
ఇక్కడే తపస్సు జపము యజ్ఞ  యాగాలు చేసి 
ఆత్మ  తత్త్వం తెలుసు కొ  ని 
బ్రహ్మ జ్ఞానం పొంది మోక్షం సంపాదించారు .

శ్రీ శంకర భగవత్పాదుల పవిత్ర పాద ముద్రలతో 
పునీత మైన క్షేత్రం
హృషీ కేశ్..
ఆమహాను భావులు నడిచి నడిపించి ప్రపంచానికి 
త రుణో   పాయం చూపిన పవిత్ర భూమి

అబ్దుల్ కలాం
హృషీకేశ్ లో..
గంగానదిలో స్నానం చేసి..
శివానందుల ఆశ్రమానికి వెళ్ళి 

స్వామివారి ఎదుట నిల్చున్నాడు
మనసంతా నిర్వేదం..
 

విమాన పైలెట్  గా  వెళ్ళాలని ప్రయత్నించాడు
ఊహూ..
సెలెక్టవలేదు..
తీవ్రమైన నిరాశ..
 

కటిక దరిద్ర జీవితం..
చదువుకోవాలనే ఆశ..
పైకెదగాలనే కోరిక..
ప్చ్ .. ఫలించలేదు..
 

విపరీతమైన బాధ..
ఎదురుగా శివానంద..
మంచుకొండల నడుమ..
వాటి ఎత్తంత.. ఉన్నతమైన ప్రశాంతమైన వదనం..
చల్లటి చూపులు
 

అబ్బ.. హాయిగా ఉంది..
గొప్ప సంతృప్తి..
 

నీపేరేమి..
శివానందులడిగారు..
అబ్దుల్ కలాం..
పేరు వినగానే.. భృకుటి ముడిపడలేదు..
శరీరంలో వింత ప్రకంపన లేదు
 

అదే ఆదరణ అదే ప్రశాంతత..
ఎందుకంటే 

వారు శరీరాలకు అతీతులు
ఆత్మోన్నతులు..
సత్యదర్శనం చేసిన వారు
అన్నిటికీ మించి దయా సముద్రులు..
 

ఈ శ్వరునిదయ ఎటువంటిదో 
వారి దయ అటువంటిది.. 
ఆయన సనాతన ధర్మానిని ప్రతినిధి..
 

నీ ముఖం చూస్తే.. 
ఏదో నైరాశ్యంలో ఉన్నట్లున్నావ్..
అన్నారు..
 

కష్టపడి మెడ్రాస్ లో 
ఐ ఐ టీ  ఏరోనాటి కల్ ఇంజనీరింగ్ చదివాను..
డెహ్రాడూన్ లో పైలట్  అవ్వాలని కల
కానీ కాలేక పోయాను..
మాట ఆగింది
యేదో నీటిపొర మాట కడ్డుతగిలింది..

నాకు ఉద్యోగం రాలేదు .. చాలా బాధగా ఉంది..
 

నీవు ఒకటి కావాలనుకున్నావ్
భగవంతుడు నిన్ను వేరొకటి చేయాలనుకున్నాడు..
నిన్నేం చేయాలో నిర్ణయం చేసి వుంచాడు..
దానికి తయారుగా వుంటే..

నీవు అవ్వాలనుకున్న దానికన్నా 
చాలా గొప్పవాడివే అవుతావు..
పరమేశ్వరుడు నిన్ను ఎందుకు ఎక్కడ ఉపయోగించుకోవాలనుకున్నాడో.. 

ఎక్కడ నిలబెడతాడో 
నీకు ఒకనాడు అర్థమవుతుంది..
 

అంతే..
కలాం లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది..
జీవితంలో వెనుదిరిగి చూడలేదిక..


అది 1940 లు
ఒక యువకుడు.. ఆ శిఖరాల పైకి ఆవేశంగా వెళుతున్నాడు..
కళ్ళనుండీ ధారపాతంగా కన్నీరు..
అప్పటికి దాదాపు సంవత్సరం న్నరగా దేశం పట్టి తిరుగుతున్నాడు
ఎందరో సాధువులను సన్యాసులను కలుస్తూ.. పిచ్చివాడిలా ..
 

అతనిలోనూ తీవ్రమైన నిరాశ..
అతనిని పట్టే బంధాలు యేవీ ఉన్నట్లు లేదు..
 

అయ్యయ్యో శిఖరాన్ని చేరాడు..
కిందకు చూస్తే లోతైన లోయ..
దూకేస్తాడో యేమిటో..
ఎవరైనా కాపాడే వాళ్ళు లేరా..
 

అతను శిఖరం పై నిల్చుని ఆకాశం పైకి చూశాడు..
అక్కడినుంచీ అది చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది..
 

అతనికి ఆ ఆకాశంలో
సిరికిం జెప్పడు..
శంఖ చక్ర యుగముం జేదోయి  సంధింపని 

ఆ శ్రీమన్నారాయణుడూ..
ఆయన వెనుక 
సిరి..
 
ఆ లచ్చివెంట..

అవరోధ వ్రాతములూ .. 
పక్షీంద్రుడూ..
ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయాలూ 
నారదుడూ.. 
వైకుంఠ పురంలో వుండే ఆబాల గోపాలమూ కనిపిస్తున్నాయి..
 

ఆ దేవుని తో యేవేవో మాట్టాడాడు..
దూ.. క.. బో.. యా.. డం.. తే...
 

స్టాప్..
అన్న పిలుపూ
భుజంపై పడ్డ చేయీ..
వెనుదిరిగి చూశాడా యువకుడు ..
 

అదురుతున్న ముక్కు పుటాలూ..
ఉక్రోషంతో ఎరుపెక్కిన కన్నులూ..
ఒక్క చూపుతో వాని నుదుటి రేఖలను చదివేశాడా వ్యక్తి..
పెదవులపై సన్నని చిరునవ్వు..
లీలగా.. హేలగా..
 

కం .. కం విత్ మీ..
చేయి పట్టుకు.. తీసుకు పోయాడు..
వెంట ఆవును అనుసరించిన దూడలా..
 

వెనుక నుంచీ
ఆ శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపని శ్రీమన్నారాయణుడూ..
చిరునవ్వుతో చూశాడు..
వెడుతున్న వానివేపు..
ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరూ ..

ఆయన శివానంద సరస్వతి..
ఆ యువకుడు పుట్టపర్తి నారాయణాచార్యులు
స్వామి తెలుసుకున్న వివరాలు..
మంచి పండితుడు..
చాలా భాషలు తెలుసు ..
సంగీత నాట్యాలు బాగా వచ్చు
 

అంతేకాదు
కరడు గట్టిన సాధకుడు ..భక్తుడు..


తల్లి చిన్ననాడే గతించింది
తండ్రి రెండవ పెళ్ళి చేసుకున్నాడు
ఇతనికి పెళ్ళయింది
భార్యా పిల్లలు..
అక్షర లక్షలు గాయత్రి చేసాడు
అష్టాక్షరి కోట్లాదిగా చేసాడు..
యే ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు
 

అందుకే తీవ్రమైన మనస్తాపం
అదెంత వరకూ పోయిందంటే
సంసారం విడచి
దేశం పట్టి తిరుగుతున్నాడు..
 

ఇల్లువిడచి.. తన ప్రాంతం విడచి.. 
ఒకే ప్రశ్నకు సమాధానం వెదకుతున్నాడు
అది యెవరి దగ్గరా దొరకలేదు..
 

వైరాగ్యాలు రెండట..
జిహాసా..
జిజ్ఞాసా..
జిహాసా అప్పుడప్పుడూ వచ్చి పొయ్యేది..
జిజ్ఞాసా..
ఒకసారి వస్తే..అది తనతో అతన్నీ పరమ పదానికి తీసుకువెడుతుంది..
 

ఆరునెలలు ఆశ్రమంలో ఉన్నాడు..
తన శిష్యులతో పాటే అన్ని పనులూ చేస్తూ..
త్యాగరాజ కీర్తనలు పాడతాడూ..
భాష తెలియకపోయినా..
ఆ మాధుర్యం పరమాద్భుతం..
పైగా అతనే దానికి అద్భుతమైన వివరణ ఇస్తాడు..

శివతాండవం యేం పాడతాడూ..యేం ఆడతాడూ..
ఆ పరమ శివుడే నా ఆశ్రమానికి వచ్చీఅడుతున్నాడా అనిపిస్తుంది..
వీడు సామాన్యుడు కాడు
ఈ కర్మ భూమిలో ఎందరో పవిత్రాత్మలు 

ఈవిధంగా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ.. ఉంటారు..
వారికి దిశానిర్దేషనం చేయడం కేవలం లాంఛనమే..

నీవడిగే ప్రశ్నలు అనాదిగా ఋషులూ యోగులూ..
వేల వేల సంవత్సరాలుగా మధిస్తున్నారు..
వారికీ జవాబు దొరకలేదు..
 కాయ పులుపు వగరు
పండితే..
తియ్యగా మారిపోతుంది.
 

జీవితమూ అంతే..
అనుభూతి కావాలంటే జన్మ పండాలి..
పక్వానికి వస్తే 

దాని సువాసనలను నీవు దాచనేలేవు..
 

వెళ్ళు..
జీవితాన్ని తృప్తిగా అనుభవించు..
ఎన్నో మధురతలు నీకోసం వేచి చూస్తున్నాయి..
ఎన్నో విజయ కేతనాలు నీకు స్వాగతమిస్తున్నాయి..
 

ఆ ఘడియ వచ్చిందంటే..
నీవు అడగనక్కరలేదు..
ఆ పరమాత్మ నీ ఇంటి కాపలాదారుగా నిలబడతాడు
నీ సేవకుడుగా చామరం పడతాడు..
అంతటి ప్రేమను ఆయనా పంచడానికి ఎదురు చూస్తున్నాడు..
అందుకోవటానికి ఎదురుచూడు...
తలపై చేయివేసి ఆశీర్వదించాడు


వాని పాండిత్యానికీ గురు భక్తికీ.. 
ఇచ్చాడో వరం 
అదే  సరస్వతీ పుత్రా .. అన్న పిలుపు.. 
పోయిరమ్మన్నాడు..
దక్కిన మెప్పును హృదయమంతా మోస్తూ 
వెళ్ళాడు ఆనందంగా పుట్టపర్తి నారాయణాచార్యులు

సామాన్యులనుంచీ ఎంతటి మహాత్ములకీ 
జీవితంలో నిరాశ భంగపాటు ఎదురైనప్పుడు
తీవ్రమైన మనస్తాపానికి గురి కావడం సహజమే..
 

ఆ నిరాశలో కొట్టుకుంటున్నప్పుడు..
అతన్ని తిరిగి లేపేవి..
 సాంగత్యం
చదువుకున్న పుస్తకాలూ
నమ్మిన గురువులు..
పెరిగిన వాతావరణం..


మహాత్ముల పరిచయం ఎలా వుతుంది..??
ఉన్నతమైన మార్గంలో పయనించే వారి జాడను వెతుక్కుంటూ వారే వస్తారా..??
తగిన దిశా నిర్దేశం చేసి
ఆత్మ స్థైర్యం మనో బలం గుండెల్లో నింపి..
తిరిగి వాళ్ళు గమ్యంవైపు నడిచేలా చేసి వెళతారా..??