కావ్యం అంటే రామాయణమే!
Sakshi | Updated: April 07, 2014 22:48 (IST)

పుట్టపర్తి నారాయణాచార్యులుగారు సంస్కృత సాహిత్యం గురించి ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు. సంస్కృత సాహిత్యమనగానే మన మనస్సులో మెదిలే వ్యక్తులిద్దరు. వాల్మీకి, వ్యాసుడు. వాల్మీకి రామాయణమహాకావ్యం రచించాడు. వ్యాసుడు మహాభారత మహేతిహాసం రచించాడు. మన ప్రాచీనులు విషయాన్ని బేరీజు వెయ్యడంలో మహాప్రవీణులు. పరమ రసజ్ఞులు. వ్యాసుడు చేసిన పని ఎవరికీ ఊహకు కూడా అందనిది. మనవాళ్ళు వ్యాసుణ్ణి ఎంతగానో పొగిడారు. కడకు ‘వ్యాసో నారాయణో హరిః’ అని దీర్ఘదండప్రణామం చేశారు.
ఎన్ని బిరుదులిచ్చినా ‘కవి’ అనడానికి మాత్రం జంకారు. వారి దృష్టిలో కవి అంటే వాల్మీకే. కావ్యం అంటే రామాయణమే. ఎంత చక్కటి ఆలోచన! రామాయణాన్ని పరమపవిత్రమైన భక్తివేదంగా పఠించి, పారాయణ చేసి పరవశించి తరించినవారు కొందరు. దానిని మహోత్కృష్టమైన కావ్యంగా అధ్యయనం చేసి పులకించిపోయినవారు కొందరు.
ఒక గొప్ప కథగా మాత్రమే చదివి, ఏ మాత్రం ఉత్కంఠ (సస్పెన్సు) లేకపోయినా వదలకుండా చదివించిన కథన కౌశలానికి ముగ్ధులైపోయినవారు కొందరు. ఎవరెలా చదివినా రామాయణం యీ జాతి హృదయస్పందన. మానవజీవితానికి చుక్కాని. అభ్యుదయపథంలో సాగాలనుకునేవారికి దిక్సూచి.
- ఉప్పులూరి కామేశ్వరరావు
(‘వాల్మీకి రామాయణము’ తెలుగు అనువాదం నుంచి)