10 ఆగ, 2014

సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి

సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి

Sakshi | Updated: February 21, 2014 01:49 (IST)
వైవీయూ (వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్ : వివిధ సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతుడు పుట్టపర్తి నారాయణాచార్యులు అని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్ అన్నారు. గురువారం వైవీయూలోని సర్ సి.వి.రామన్ సెమినార్ హాల్‌లో ఏపీ సాంస్కతికశాఖ, వైవీయూ తెలుగుశాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి నారాయణాచార్యులు శతజయంతిని పురస్కరించుకుని ‘పుట్టపర్తి నారాయణచార్యుల జీవితం-సాహిత్యం’ అనే అంశంపై రెండురోజుల జాతీయసదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ మాట్లాడుతూ పుట్టపర్తి వారి కలం నుంచి జాలువారిన శివతాండవం, మేఘదూతం సంకల్పిత గ్రంథాలన్నారు.

సదస్సులో కీలకోపన్యాసం చేసిన యునిసెఫ్ అవార్డు గ్రహీత శశిశ్రీ మాట్లాడుతూ 400 సంవత్సరాల క్రితం కష్ణదేవరాయల కాలంలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన తిరుమల తాతాచార్యుల కోరిక మేరకు కష్ణదేవరాయల ఆజ్ఞతో తమిళనాడు నుంచి రాయలసీమకు పుట్టపర్తి నారాయణాచార్యులు విచ్చేశారన్నారు. తెలుగు వ్యాకరణం, ఛందస్సు నేర్వకనే ‘పెనుగొండలక్ష్మి’ కావ్యాన్ని రచించారన్నారు.

ఆయన జీవితంలో 143 గ్రంథాల రచన చేయడమే కాక గొప్ప మానవతావిలువలు కలిగిన వ్యక్తి అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలిగిన కవి పుట్టపర్తి వారన్నారు. సదస్సు సమన్వయకర్త డాక్టర్ తప్పెట రామప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో మూడవ తరానికి చెందిన పుట్టపర్తి నారాయణాచార్యులు నిజజీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ప్రభావం ఆయన రచనలపై ఉందన్నారు.

అనంతరం జనప్రియరామాయణంపై డాక్టర్ గోష్లాపిన్ని శేషాచలం, శ్రీనివాసప్రబంధంపై విద్యాన్ కట్టా నరసింహులు, పండరిభాగవతంపై మల్లికార్జునరెడ్డి, బహుభాషావేత్త పుట్టపర్తి అనే అంశంపై చెన్నైకి చెందిన ఆచార్య సంపత్‌కుమార్ ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో తెలుగుశాఖ విభాగాధిపతి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, డాక్టర్ వినోదిని, పార్వతి, రమాదేవి, అంకమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.