7 జన, 2016

క్షమయా ధరిత్రీ..

క్షమయా ధరిత్రీ..
పై మాటలో ఎంత అర్థముందో మా అమ్మను చూస్తే.. తెలుస్తుంది.. ఎవరి అమ్మలైనా అంతే కదా..
ఒకపక్క మా అయ్యకు 
ఇల్లు పిల్లలూ సంసారం అంటూ బంధాలు ఏమీ లేవు..
ఆయనకు విశ్వమే ఒక సంసారం
మామూలు భర్తతో సంసారంలో అడుగుపెట్టిన స్త్రీ జీవితమే కొన్ని సంవత్సరాలు అగమ్యగోచరం
దానికి తోడు కళాభిరుచి కలిగిన భర్త తో నడక 
ఇంకింత సంక్లిష్టం..
మరి.. జీవితమే తపస్సుగా నడిచేవానితో ..??
పరుగులు పరుగులే..
ఎప్పుడు ఏ ఉపద్రవాన్ని తెస్తారో నని 
మా అమ్మ బిక్కు బిక్కు మంటూండేది
''పెద్దవాళ్ళెవరైనా అంతే అనూరాధా.. 
వారు ఒక చట్రంలో బంధింపబడరు '
అంది మంగళగిరి ప్రమీలాదేవి..
ఆమె రచయిత్రి ప్రొఫెసర్ 
ఎన్నో పుస్తకాలు రాసింది

ఇక మా అమ్మ స్తితిని అర్థం చేసుకోలేని మా అక్కయ్యలు చీరల కనీ.. మర్యాదలకనీ పంతాలు పోయేవారు..
ఇంకా పిల్లల మైన మా నుంచీ కూడా
 లెక్కలేనన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొంది మా అమ్మ
'అమ్మను బాధ పెట్టకూడదు..'
 అనే ఇంగితం లేని వయసు కదా.. అది..
మనకు 'డింగు 'మని జ్ఞానోదయం అయ్యి
 కంటికి కడివెడుగా కన్నీళ్ళు కార్చే సరికల్లా 
వాళ్ళు ఉస్సూరుమని గోడెక్కేస్తుంటారు..