18 మే, 2017

పుణ్యంబై..మునివల్లభ గణ్యంబై..


ఒక కొడుకు తనను వీడిపోయాడు
అదీ తనవల్ల
కారణం తనకు ధర్మబధ్ధమే
కానీ పర్యవసానం అతి ఘోరం
మనసు దహించుకుపోతోంది..
స్వాంతన కావాలి
ముగ్గురు భార్యలు
ఒక్కోరిదీ ఒక్కో పంధా..
చిన్నదని ముద్దు చేసిన మూడవ భార్య తన నిస్సహాయతను అడ్డంపెట్టుకుని
కోరరాని కోరిక కోరింది..
ఇచ్చిన మాట వలన తను నిస్సహాయుడు

ఫలితం ..
ముక్కుపచ్చలారని కొడుకు అడవులు పట్టిపోవలసివచ్చింది
ఇక మిగిలిన ఇద్దరు భార్యలు ప్రజలు అధికారులు అందరు తనని అపరాధిగా చూస్తున్నారు
తన ఆత్మే తనని చిత్రవధ చేస్తూంది
కొడుకు కోడలు పసిపిల్లలు వట్టికాళ్ళతో నడచివెళ్ళారు
ఇంకో కొడుకు అన్నకు అండగా వెళతానని పోయాడు
అతని భార్య చేసేదేమీలేక దీర్ఘ నిద్రను ఆశ్రయించింది
అన్నీ తనవల్లే..
ఇంతకీ తన తప్పేమిటి
సత్య సంధత ధర్మ పాశానికీ సత్యపాశానికీ కట్టుబడిన నేరం తనది
సత్యం ధర్మానికీ కట్టుబడటం తప్పెలా అవుతుంది

కుమిలి కుమిలి పలవరిస్తూ కళ్ళుమూసాడు
నలుగురు కొడుకులున్న ఆయనను అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక్కడూ లేడు
ప్రేతసంస్కారం జరపడానికి వీలులేని ఆ శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టవలసివచ్చింది..


ఇది దశరధ పాత్ర.
ఇలాంటి ఎన్నో సంఘర్షణల కలయిక రామాయణం.

ఇంత అద్భుత సృష్టి గురించి 
మిగిలిన  మహాకవుల స్పందన ఎలా ఉండేది .. 
ఇవి మనకెవరు చెబుతారు .. 
పుట్టపర్తి తప్ప .. 

ఏ ముహూర్తంలో వాల్మీకి రామాయణ రచన ఆరంభించినాడో ..
అందరికీ దాని పైననేకన్ను..

గత దశాబ్దాలలో కొందరు పాశ్చాత్యులు 
 రహస్యంగా మత దురభిమానం ఎక్కడో పని చేసేవారు
తమ గ్రంధాలతో రామాయణాన్ని పోల్చి చూడటానికి 
వ్యర్థ ప్రయత్నాలు చేశారు
కానీ అవి వ్యర్థాలుగానే మిగిలిపోయాయ్ 

వారు కూడా కడకు రామాయణ కవిత్వానికి 
తలవంచక తప్పదు
రష్యా దేశంలో సుమారు ఇరవైయేండ్లనుంచీ 
కొన్ని నూర్ల సార్లు రామాయణం నటింపచేశారట.

ఇంకా వారి హృదయాలు రామాయణచాపల్యాన్ని వదలలేదని 
వాళ్ళ వ్రాతలే చెబుతున్నాయి
కవిత్వం వరకూ పోకుండానే
కేవలం కథయే వారి దృష్టిని ఎంతో ఆకర్షించింది

రాముని పితృవాక్యపరిపాలనా
ఏకపత్నీవ్రతమూ
భ్రాతృప్రేమ
ఇలాంటి గుణాలే వారిని సమ్మోహితుల్ని చేశాయి

ఇక భారతీయులకు రామాయణమంటే నిత్యదాహం
దేశ భాషల్లో ఎందరో
 రామకథను వ్రాసుకుంటూ వచ్చినారు
రామకథాకారుల్లో పరమభక్తులై 
భగవత్సాక్షాత్కారం పొందినవారున్నారు
మహారాష్ట్రలో పండరీనాధుణ్ణి సాక్షాత్కరించుకున్న ఏకనాథుడు
భావార్థరామాయణం రాసినాడు
అవధీభాషలో తులసీదాసు రామకథను పాడినాడు
అతడు రామభక్తాగ్రేసరుడు
తమిళంలోని కంబరామాయణం చాలా ప్రసిధ్ధమైనది
మళయాళంలో ఎజుత్తచ్చెన్ రామాయణ కర్త.
వీరంతా కూడా భగవదనుభూతి కల్గినవారే.

వీరే కాక కావ్యరచనా దృష్టితో రా మకథను చేపట్టినవారెందరో
కన్నడంలో రెండు మూడు రామాయణాలున్నాయి
ఇక తక్కిన భాషల్లోను లేకపోలేదు
జైన రామాయణాలూ కొన్ని
విదేశీయ రామాయణాలూ కొన్ని.
తెలుగు కన్నడాలలో మొన్న మొన్న కూడా ఏదో శిల్పమని పేరుపెట్టి
రామకథను కొత్తరంగులు పూసిన వారున్నూ లేకపోలేదు

కానీ
 ఎవరెన్ని వ్రాసినా ఇవన్నీ 
వాల్మీకి రచనా కౌశలమ్ముందు పిల్లి మొగ్గలే అయిపోయినాయి

సావిత్రి వంటి మహాకావ్యాన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా 
వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అనే నిరాశ.

ఇక సంస్కృత కవులందామా
ప్రతి ఒక్కరికి రామాయణం పైననే కన్ను
ఇది ఒక అమృత సముద్రం
సంస్కృతకవులలో అనేకులు ఆ సముద్రానికి దూరంలోనే నిలిచి నమస్కారం చేసినారు
కొందరు గట్టువరకు పోయి నిలబడినారు
కొందరు ఏవో చిన్న చిన్న మునకలు వేసినారు

ఉత్తర రామ చరిత్ర చూస్తే ఒక్కొక్కసారి నా దృష్టికి రామాయణాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతినే
అని భవభూతి పడిన వేదనగానే అర్థమవుతుంది


ఒక భవభూతి యేమిటి ..
అలా మథన పడిన వారెందరో ఉన్నారు.