26 జన, 2014

వాసన

పై ఫోటో గూగుల్లోనిది
ఎంత బాగున్నాడుకదా సన్యాసి..
ఓ చేత్తో సెల్లూ
మరో చేత్తో సిగరెట్టూ..
మాడ్రన్ సన్యాసికి ప్రతీకలా వున్నాడు
నవ్వుతూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు..పాపం
యే పుష్కరాలకో వచ్చుంటాడు..
చటుక్కున ఫోటో తీసారు యేవరో

అవును మరి ఎంత సన్యాసి అయినా సెల్ లేకపోతే.. విషయం కన్వే చేయటమెలాగూ
తమ సన్యాసులతో నైనా మాట్లాడాలి కదా..

 
సన్యాసం..
అంటే కోర్కెలను త్యజించడమేనా..?
భగవంతునికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం కూడా..
 

 సన్యాసి ధర్మ అర్థ కామ మోక్షాలలో 
చివరి దాన్ని పట్టు కోవాలి..
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను త్యజించాలి
ఇవి కేవలం బట్టలను మార్చినంత మాత్రాన జరుగుతాయా..?
అర్థము కనబడిన వెంటనే.. 

సన్యాసికీ సంసారికీ 
ఒకే విధంగా కళ్ళు మెరుస్తాయే..
మరి కామాన్ని జయించడం ఎంత సన్యాసికైనా సాధ్యమా..?
 

మండోదరి రావణుడు చనిపోగానే 
యేడుస్తూ వచ్చిందట..
రావణా రాముడు నిన్ను చంపాడని అందరూ అంటున్నారు..
కానీ నాకు తెలుసు నిన్ను చంపింది రాముడు కాదు
నీ కామమే నిన్ను చంపింది..
తపస్సు .. తపస్సు..  అని వేల సంవత్సరాలు 

శరీరాన్ని ఆకలి దప్పులకు ఇతర భోగాలకు 
దూరం చేసి .. కాల్చి కాల్చి..  యేం సాధించావ్?
నీ వరాలు నిన్ను కాపాడాయా..?


పైగా..

ఇన్నాళ్ళూ లొంగి వున్న కోర్కెలు..
బుట్టలో అణచిపెట్టబ డ్డ బుసకొట్టే పాముల్లా 
నీపై ప్రతీకారం తీర్చుకున్నాయి ..
అని వాపోయిందట..



యీ విషయంలో పోతన్న గారి అభిప్రాయాలెలా వున్నాయి
పుట్టపర్తి గారి భాగవతోపన్యాసాలు మనకు చెబుతాయి
ఇందులో ఒక పిట్టకథ కూడా
మీరా బాయికి కృష్ణభక్తి ..మనకు తెలుసు..
ఆమె ఒక సన్యాసిని చూడబోయింది
ఆయన స్త్రీలను చూడరట..
అనుమతి లభించలేదు..
కారణం ఆ స్వామి ఆడవాళ్ళంటే పారిపోతున్నాడు..
మీరకు నవ్వొచ్చింది..
అడ్డువచ్చిన శిష్యుణితో ఆమె అందీ..
యీ జగత్తులో కృష్ణుడొక్కడే మగవాడనుకున్నాను..
ఇవ్వాళ మీ గురువొకడు తయారయ్యాడా..?
అంతే..
మీర నవ్వుకుంటూ వెళ్ళిపోయింది..



మానవునకు సుఖదుఃఖములు  
తాను తాను ముందు జేసికొన్న పుణ్య పాపముల ననుసరించి వచ్చును
ధనము ఆలు బిడ్డలు 
వీరందరు తన కర్మ పండించికొన్న పంటయే

వీరిలో నెవ్వరినిగాని వదలిపోవుటకు 
తన కధికారములేదు
అవసరమును లేదు
ఇట్టిది పోతన్న విశ్వాసము

అందుచే..
ఇల్లుగుల్లజేసి యే చెట్టు గుట్టలనో జేరి దేబిరించుట వల్లమాలిన పని అనియు నతడు భావించెను
ఆతని దృష్టిలో సంసారము 
భగవద్భక్తికి భంజకము గాదు రంజకము గూడ

కామ క్రోధాదులను సంపూర్ణముగ విసర్జించుట యే ధ్యేయమైనను 
హఠాత్తుగ వానిపై దండెత్తక 
కొంత నియమ బధ్ధముగ జేసికొనుటయు
ఆ ప్రక్రియలో కొంత వాని బలము సడలించి నిమ్మళముగ నిగ్రహించుటయు 
వివేకమైన ప్రయత్నముగదా.. 

పైగా సన్యాస మొక్కటే 
భగవత్ప్రాప్తికి మూలమనుటయు 
పోతన్నకంత సమ్మతముగాదు
 

సర్వమును భగవత్స్వరూపమే యైనప్పుడు సంసారము మాత్రమేల కాక పోవలసివచ్చినది..?
 

అపుడు 
లేని సన్యాసమును దలపోసి యంగలార్చుటకంటె ఉన్న సంసారమున నూరట జెందరాదు..?
 

కర్మ తంత్రముల నొనర్చుచు 
కమలాక్షు గొల్చుట అసాధ్యమా?
సాధ్యాసాధ్యములు మనో భావములే.
ఇవి యాతని తలంపులు..
 

ప్రాప్తమైన సంసార సుఖములను గూడ నాతడు 
తృప్తిగ ననుభవించివుండునని నాయూహ
కొందరు వేదాంతుల మనుకొనువారు

 స్త్రీని జూచినంతనే భయము నటింతురు
 

మీరాకాలమున నిట్టి సన్నివేశమే యొకటి జరిగినది
ఎవరో యొక స్వామి 

రూప గోస్వామి యనుకొందును
బృందావనము నందుండెను
మీరాబాయి వారిని దరిసింపనేగినది
 

వారికొక నియమముండెను
స్త్రీలముఖమును వారు జూడరట
వారి శిష్యుడు దారిలో ఆమె నడ్డగించి 

మఠములోనికి బోనివ్వక పోయెను
 

ఆమె శిష్యుని మాటలు విని 
నేనింతవరకు నఖండ బ్రహ్మండములలో 
కృష్ణ పరమాత్ముడొక్కడే మగవాడనుకొంటిని 
నేటికి మీ గురువొకడు దయారయ్యెనా 
యని నవ్వుచు వెనుదిరిగినది
 

ఈ మాటలు రూపగోస్వామికి దెలిసి పశ్చాత్తాపపడెనట
స్త్రీలపై నిట్టి యేహ్య భావము 

సుఖములపై శుష్కమైన ద్వేషము పోతనామాత్యులకు లేదు కనుకనే..
 

"అనఘ విరక్తులకైనన్
దనయంత లభించు సౌఖ్యతతి వర్జింపన్ జనదట "

తృ. స్క. 783
అని తన మనస్సును సమాధాన పెట్టుకున్నాడు..