30 అక్టో, 2013

పుట్టపర్తి బాల్యం



‹''ఓయమ్మ నీ కుమారుడు. మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా. పోయెద మెక్కడి కైనను. మాయన్నల సురభులాన మంజులవాణీ.. (పోతనామాత్యుడు..) 

భాగవతంలో ప్రతి ఒక్కటీ అద్భుతమే..
కృష్ణుని బాల్య క్రీడలు
ఎప్పుడు తలుచుకున్నా 

చక్కని చిరునవ్వు ప్రతివారిముఖంపై నాట్యం చేస్తుంది..
 

 పాలూ పెరుగూ వదలడు
వెన్న కోసం పిల్లలందరితో దొంగతనాలు చేస్తాడు
కోడలి మూతికి వెన్నపూసి 

అత్తాకోడళ్ళ తగవుకు కారణ మౌతాడు..
అమ్మా  
నీ కొడుకు అల్లరి భరించలేకుండా వున్నాం 
పాలూ పెరుగూ బతకనియ్యటం లేదు..
ఇది ఇలాగే కొనసాగితే 

మేం మా పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం
అని మొరపెట్టుకున్నారు గొల్లభామలు   . 
 
దశావతారాలలో శ్రీకృష్ణావతారానికి 
ఎంతో ప్రాధాన్యత వుంది. 
కృష్ణుడి బాల్య క్రీడల నుంచి ఆయన అవతార పరిసమాప్తి వరకూ 
ప్రతి ఘట్టం ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది.
 జగన్నాటక సూత్రధారి అనిపించుకున్న కృష్ణుడు, నిత్య చైతన్య మూర్తిలానే 
నాటి ప్రజలకు ... నేటి భక్తులకు దర్శనమిస్తూ వచ్చాడు. 
ఆయన ఏ పేరుతో ఎక్కడ ఆవిర్భవించినా భక్తులు సేవిస్తూ ... స్మరిస్తూ ... తరిస్తూనే వున్నారు.

 ప్రతి ఒక్కరికీ వారి బాల్యం ఒక మధుర స్మృతి, 
కానీ పుట్టపర్తి బాల్యంలోనే తేరుకోలేని విషాదం.
 తల్లిని కోల్పోవటం. 
ప్రేమనీ ఆప్యాయతనీ త్యాగాన్నీ ఇచ్చే ఒక అమృత కలశాన్ని 
పుట్టపర్తి పెదవుల దగ్గరినుంచీ బలవంతంగా లాక్కున్నాడా పరమాత్మ
అయిదేళ్ళ ..

పాలు మరిచే ప్రాయంలో తల్లినే పుట్టపర్తి కోల్పోయారు
 

అందుకే పుట్టపర్తి విపరీతమైన అల్లరి పిల్లాడు
 మా అయ్య అల్లరిని ఆయన నోటి వెంట మేమెన్నో సార్లు విన్నాం
జనప్రియ రామాయణంలో మా అయ్యగారే వివరించారు
ఇంకా బ్రౌన్ అకాడమీ వారు ప్రచురించిన్ భాషాపరశేషభోగి లో
 

ఆనాటి పరిస్థితులూ వాతావరణం..
కొండ చిలువలు, నెమళ్ళూ జింకలూ పావురాలూ..
నిండిన పెనుగొండ కొండ..
చిత్రావతి నది అందాలు అవి పుట్టపర్తిని అలరించిన వైనం..
ఇదిగో చదవండి..


 పదేళ్ళ పిల్లోడొకడు పది మంది పిల్లకాయలనేసుకొని ఒక తోటలో దూరాదో మధ్యాన్నం
తోట కావలికున్న వాడు గుర్రు పెట్టి నిద్ర పోతున్నాడు..
అందరూ జారిపోతున్న నిక్కర్లను పైకి లాక్కుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు..
మెల్లగా పిల్లి మాదిరి తోటలో జొరబడ్డారు...
మామిడి తోట..
తోటంతా కలయజూశాడొకడు..
నలుగురైదుగురు చెట్లపైకెగబాకారు..
వెంటనే విధ్వంసం మొదలైంది
కాయలు తెంపటం
కొరకటం నేలకేసి కొట్టడం..
ఒరేయ్ రమణా ఈ కాయ బాగుంది రోయ్ ఇంద అంటూ వాణి కేసి విసిరాడు..
నువ్విది తీసుకోరా.. వాడూ వీణికో కాయ విసిరాడు
ఒరేయ్ తొందరగా కానీండ్రా వాడొచ్చేస్తాడు..
పది నిమిషాల్లో దాదాపు తోటంతా ఖాళీ..
నేలపైనంతా మామిడి కాయలే..
అందరూ చెట్ల నుంచీ దిగారు
కలిసి కాయలు సంచీ కెత్తారు..
చస్తూ పడుతూ మోసుకుంటూ..వస్తున్నాడొకడు..
అందరూ బయటికొస్తూ..
ఇంకా నిద్రపోతున్న కావలి వాడిని చూసారు
కాయలు మోస్తున్న వాడు పరిగెత్తాడు..
పిల్లల నాయకుడు.. ఒక గడ్డి పరక తీసుకొని కావలోడి దగ్గరికి పోయినాడు
పుల్లతో వాడి చెంపపై రాశాడు
ఛీ పాడు చీకటీగలు..
పగలూ నిద్ర ల్యా..
రాత్రీ ల్యా..
చెంపపై ఠాప్ మని కొట్టుకున్నాడు వాడు
మళ్ళీ రాశాడు
ఈసారి వాడు తుమ్మాడు..
అందరూ కిల కిల నవ్వారు..
ఒరేయ్ వద్దురా..అంటున్నాడొకడు భయంగా..
వాడు ఠక్కున కళ్ళు తెరిచాడు
జరిగింది అర్థమైంది వాణికి, 

కారణం ఇది మొదటి సారి కాదు ఇలా జరగటం
వెంటనే ఆ పిల్లోణ్ణి పట్టుకున్నాడు
వెంటనే ఒరేయ్ దొంగ నాయాళ్ళారా..
కాయలన్నీ తెంపేసినారా.. తోటంతా గబ్బు గబ్బు చేసినారా..
ఉండు నీ పని చెప్తా..
వాడి పట్టులో వున్న పిల్లోడు.. 

తన చేతిలో నున్న కాయతో బలంగా వాడి ముక్కుపై కొట్టాడు..
అమ్మా..
అయ్యోయ్.. వాడు ముక్కు పట్టుకున్నాడు..
పట్టులో పిల్లోడు జారిపొయాడు..
అందరూ పరుగందుకున్నారు..
ఒరేయ్ మమ్మల్ని పట్కోడం నీ చేతకాదురా..
వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిగెత్తుతూ ఒక్కోకాయా విసురుతున్నాడొకడు..
ఒరేయ్ నారాయణా ఈ కాయలనేం చేస్తాం..
అన్నాడొకడు..
పుట్టపర్తి నారాయణ ఆలోచించాడు
మొన్న ఒకడు వాడి అరటి తోట నాశనం చేశారని 

ఇంటికి వచ్చి అన్న మాటలు మెదిలాయ్
ఇగో సామీ 

నీ పెండ్లాం చచ్చిపోతే ఇంగో పెండ్లి చేసుకో 
పెండ్లైతే  నీ పెండ్లామే నీ కొడుకు సంగతి చూసుకుంటాది..
ల్యాకపోతే వాణ్ణి సావగొట్టు..
అంతేగానీ 

నీ కొడుకును మాపై వదలాకు నీకు దండం పెడ్తా.. 
వాడితో మేం సావలేం ..
కొంచం భయమేసింది
ఆ కాయల గోనెను  కాలవలో పారేశాడు..
ఒరేయ్ ఒరేయ్ ఎందుకురా నీళ్ళలో యేసినావ్..
అన్నాడొకడు..
పాండిరా .. పెనుగొండ కొండపైకి పోదాం..
అంతే అందరూ కొండపైకి చేరారు..
అక్కడ...

కొండచిలువలు.. 
నెమళ్ళు.. 
జింకలు.. 
పావురాలు .. 
ఇంకా ఎన్నో..
అక్కడే వీరి ఆట పాటలు..
సాము గరిడీలు ,కుస్తీ లు, దండీలు వీరి ఆసక్తులు.