7 మే, 2014

విశ్వనాధ పుట్టపర్తి ఇంకొక ఆసక్తి కర విషయం..


అష్టాక్షరీ కృతుల గ్రంధం ఆవిష్కార సభలో..
లక్ష్మణ మూర్తి గారు  చక్క గా మట్లాడారు
వారు విశ్వనాధ అభిమానులు
అంటే పుట్టపర్తి విరోధులనికాదు
పుట్టపర్తికీ అభిమానులే
 

ఒకరి అభిమానులంటే వేరొకరిని తిట్టాలనుకోవటం దురభిమానం అవుతుంది
వారే పుట్టపర్తి శివకర్ణామృతాన్ని 

దాదాపు ముఫై సంవత్సరాలు పదిల పరిచింది
 

ఇపుడు  సహృదయంతో వె తికి ఇచ్చినదీ
దాని అర్థ వివరణ..
ముద్రణ  సంపాదకత్వం
వారే చేశారు
 

మరి విశ్వనాధ పుట్టపర్తి కాలు దువ్వుకొనే వారు 
అంటారు కదా..
అని కొందరి సందేహం
 

అప్పటి కాలంలో ప్రాంతమేదైనా 
ఒకరినొకరు గౌరవించుకోవటమూ
మాటా మాటాఅనుకున్నా 

తిరిగి అనురాగంతో ఆలింగనం చేసుకోవటం 
మనకు తెలియని సంగతులు
 

ఒకసారి విశ్వనాధ 
రాయలసీమ ప్రాంతాలకు వచ్చారు
వారి సభకు అధ్యక్షత యెవరు వహించాలి?
వారు విశ్వనాధకు సమఉ జ్జీ అయివుండాలి కూడా
 

సరే ..
అధ్యక్షులు పుట్టపర్తి
' నేను విశ్వనాధ సభకు  అధ్యక్షత వహించాను అన్న కీర్తి పొందేందుకు ఎవరైనా తయారే కదా '
అన్నారు విశ్వనాధ.


పుట్టపర్తి ఊరుకుంటారా..
'ఇది నా ప్రాంతం..
ఇక్కడ నన్ను తెలియని వారు ఎవరూ లేరు..
నాకు పరిచయం అవసరం లేదు..
కాకపోతే

నేనే తమరిని పరిచయం చేయవలసి వుంటుంది. '
అని చురుగ్గా అన్నారు
 

తరువాత ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు
ఆలింగనం చేసుకున్నారు
అది వేరే విషయం
 

ఇలాంటి విషయాలను పెను భూతాలుగా 
వర్ణించి పొంగిపోయే 
ఇటువంటి  '' వైరి వీరుల '' వలన 
ఇద్దరికీ వచ్చే నష్టమేమీ లేదు కదా..


సాధ్యమైతే ఇద్దరి గ్రంధాల పై పనికి వచ్చే 
విశ్లేషణలు వ్రాయవచ్చు
విశ్వనాధ పై పుట్టపర్తి వ్రాసిన 

ఒకే ఒక వ్యాసానికి పొంగిపోయిన విశ్వనాధ
 అక్కడినుంచీ పుట్టపర్తిని అభినందించడానికి 
స్వయానా కదలి వచ్చారు
 

అభిమానుల మని చెప్పుకొనే వారు 
ఆ పనులు చేయవచ్చు..
ఈ సంఘటనను సాక్షాత్తు విశ్వనాధ అభిమాని 

లక్ష్మణ మూర్తి గారే సభలో సెలవిచ్చారు..

2 మే, 2014

వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ..


 
డూ ఆర్ డై..
ఇవే మాటలు..
ఆ ..ఇవే మాటలు మా ఇంటికొచ్చే సుధ చెప్పేది
సుధ కూచిపూడి చేస్తుంది..
చిన్నప్పటినుంచీ నేర్చుకుంది..
 

పాపం చిన్నప్పుడెప్పుడో అమ్మ చనిపోయింది దానికి..
ఎంత గట్టిదో తెలుసా..
దానికి ఒక చెల్లెలు ఒక తమ్ముడూ.
వాళ్ళ నాన్న హోమియో లేక ఆయుర్వేదం డాక్టరు..
ఆయన తన భార్య పోయిన తరువాత 

ఇంకో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు..
 

మీరేమనుకుంటారు..
రెండో అమ్మ వచ్చింది కదా..
ఇంక పాపం సుధా ఆమె చెల్లెలు తమ్ముడు.. ప్చ్
కదూ
 

పెళ్ళి నాటికి సుధ వయసు పదో పదకొండో వుండచ్చు
కానీ ఆపిల్ల వాళ్ళ రెండో అమ్మ ఆటలు సాగనివ్వలేదు
ఆమెని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచింది.
వాళ్ళ నాన్న సుధ మాటే వింటాడు..
ఆ ఇంట్లో సుధ మహారాణి
దాని అమ్మా నాన్న చెల్లెలూ తమ్ముడూ దాస దాసీజనం..
దాని ఆజ్ఞ జవదాటరు..
భలే వుంది కదూ..
 

ఇంకా వినండి ..
సుధ యోగా చేస్తుంది..
నాట్యం.. యోగా..
కడప రాఘ వేంద్ర స్వామి గుడి దాటి అలా వస్తే.. 

ఎడమ పక్క రోడ్డు రౌనఖ్ థియేటర్ కు వెళుతుంది
కృష్ణ కాలువ వెంట..
 

అక్కడే శ్యామ సుందర్ సారు ఇల్లు
రామకృష్ణా హైస్కూల్ లో టీచరు..
ఆయన అయ్యతో సభలూ సన్మానాలకు 

అప్పుడప్పుడూ అయ్య వెంట వెళుతుంటాడు..
 

అయ్యకు ప్రయాణాలలో తోడు కావాలి  కదా..
బస్సు ఎక్కితే .. పుస్తకం
బసలో పుస్తకం

అయ్యదే ఓ ప్రపంచం ..
 

అలా తిన్నగా ముందుకు వస్తే ..
ఎడమ చేతివైపు ఎత్తుగా ఒక ఇల్లు
అదే సుధ వాళ్ళది..

వచ్చిన కొద్దిరోజులకే నాట్య శిక్షణ మొదలెట్టింది
పిల్లలందరూ చేరిపోయారు
ఉచితంగా యోగా నేర్పిస్తానంది.
ఆడాళ్ళందరూ తయారు.
 

వాళ్ళింటి ఎదురుగా వున్న ఖాళీ స్థలాన్ని బాగుచేయించింది..
తెల్లారి అయిదున్నరకు అందరూ అక్కడికి చేరిపోయేవారు..
అక్కడ వాళ్ళకి ఆసనాలూ ...ప్రాణాయామాలూ..

 కడపకు ఎవరొచ్చినా పెద్దవాళ్ళ దర్శనం చేసుకుంటారు
అలానే అయ్యను వెతుక్కుంటూ వచ్చారు 

సుధా తన నాన్నా..
 

అంత గొప్ప వాడూ ..
ఎంత డాంబికంగా వుంటాడో..
కానీ ..

అయ్య వాళ్ళ కథ ఆసక్తిగా విన్నారు..
 

డాన్స్ నేర్చుకున్న పదహారేళ్ళ సుధ పట్ల 
అయ్యకు అప్పట్లో ఓ విధమైన  మెచ్చుకోలూ..
దాంట్లో  తన గొప్ప దనాన్ని మర్చిపోయి పసిపిల్లవాడై పోతుంటారు అయ్య
తల్లిని కోల్పోయినా జీవితాన్ని తన చేతిలోనే వుంచుకున్న సుధ పట్ల ఉత్సుకత..

ఎందుకంటే చిన్నప్పుడు తల్లిని కోల్పోవటం 
అనే కటిక చేదు అయ్యకు అనుభవమే..
యోగా చేసే సుధ పట్ల ఆసక్తి
 

ఆ సుధ యెలా వుండేది..
అందరు పదహారేళ్ళ పిల్లల్లా కాదు
తనో డిక్టేటర్.. కదా..
నుదుట పేద్ద కుంకుమ బొట్టూ
తెల్ల కాటన్ చీర గోచీ పోసి కట్టుకొని..
తల్లో మల్లె పూలు పెట్టుకుని..
ఇదీ వేషం..
 

ఆమె పట్ల మేము ఇంట్రస్ట్ గా చూస్తే
మా పట్ల తనూ ఇంట్రస్ట్ గా చూసింది
కానీ
కొన్ని నిమిషాలలో కనిపెట్టింది..
తనలో వున్న ప్రత్యేకతలు.. ఎదుటి వాళ్ళకు నచ్చాయని
అంతే
ఇంక దాని ప్రతాపం చూపడం మొదలెట్టింది..
 

ప్రతిరోజూ వచ్చి కూచోవటం..
తన గొప్పలు..
అయ్య ఆసక్తిగా వినడం..
ఇదీ కథ..
 

త్వరలోనే మా ఇంట్లో పిల్లైపోయింది..
అంతే అయ్యలో ఉత్సాహం ఉరకలు వేసింది..
యేమే సుధా.. రావే నీకు షేక్స్పియర్ చెబుతాను..
అన్నారు..
 

సుధకే కాదు.. అందరితోను ఇంతే  
ఎవరు అయ్యకు చేరువైనా.. వాళ్ళకు
తనకు తెలిసిన వాళ్ళందరినీ పరిచయం చేయడం 

అయ్య వీక్నెస్..

కానీ మొదట్లో వాళ్ళు కొంత ఉత్సాహంగా వచ్చినా 
తర్వాత్తర్వాత మొదటి ఉత్సాహం ఉండదు 

అదీగాక 
అయ్యా వాళ్ళని ఒక గంట రెండు గంటల్లో వదలరు 

మొత్తం షేక్స్పియర్ నూ 
ఈరోజే వాళ్ళ బుర్రల్లో దూర్చేయాలి 
అది అయ్యకు వారిపై అంకిత భావం 
వాళ్ళ సాహిత్యంపై ప్రేమ  
ఆ ఘాటు ను తట్టుకోవటం 
మహా మహుల వల్లే అవలెదు..

కొన్నిరోజులు సాగిన ఆ పాఠం 
ఒక రోజుకు ముగింపుకు వచ్చేసింది

ఆపిల్లకు వేయి పనులు..
తెల్లవారి పిల్లలకూ పెద్దలకూ యోగా శిక్షణ..
తర్వాత కాలేజీ..
సాయంత్రం నాట్య శిక్షణ..
రాత్రి అయ్య దగ్గర పాఠం..
 

రాత్రి పది గంటలకు మా ఇంటికి విచ్చేసేది..
ఎలా..
తెల్ల చీర గోచీ పోసి కట్టుకుని
నుదుట అమ్మవారిలా పేద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని
తల్లో విరిసిన మల్లె పూలు తురుముకుని..
కాళ్ళకు గజ్జెలతోనే..


అమ్మ నాకూ సుధకూ సంగీతం చెప్పేది..
అలానే స్వరజతులూ నేర్చుకున్నా..


మా ఇంట్లోనే  పదకొండయ్యేది
ఈ రాత్రిపూట ఒక్కతీ ఆ మూలకు ఎలా వెళుతుంది..
చీకట్లో
దార్లో వీధి లైట్లు వుంటాయీ.. వుండవూ..
కానీ
ఆ యేం కాదు..
యెవడేం చేస్తాడు..
డూ .. ఆర్ డై..
అనేది..


ఇలా కొంత కాలం సాగింది..
అయ్యకెక్కడ తీరిక..
ఎప్పుడూ సన్మానాలు
నాలుగు రోజులకోఊరు..
పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు..
టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు..
ఇంటర్వ్యూల కోసం వచ్చే వాళ్ళు..
మా ఇంట్లో బంధు జనం..



ఆ మా ఇల్లంటే గుర్తొచ్చింది..
ఎంత బాగుండేది తెల్సా..
ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు
పెద్దక్కయ్య వచ్చి ఒక మూడు రోజులు వుండిపోతే..
 

ఆమె వున్నన్నాళ్ళు వాళ్ళ ఇంటి విశేషాలూ
తన ఉద్యోగం కబుర్లు..
తను స్కూల్ టీచర్
తన స్కూల్ గురించీ పిల్లల గురించీ..
చెప్పి చెప్పి భలే నవ్వించేది..
 

ఆ పిల్లలకు తాను సంగీతం చెప్పడం..
గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్ల ఘాతుకాలూ..
మధ్యాన్న భోజన పధకానికి వచ్చే బియ్యం నూనె 

టీచర్ల ఇళ్ళకెలా వెళ్ళిపోతాయో..
 

టీచర్లు పెద్ద పెద్ద క్యారియర్ల నిండా 
మధ్యాన్న భోజనాన్ని నింపుకొని
ఎలా పోతారో..
ఒకటేమిటీ..
అందరూ అయ్య చుట్టూ కూచుని మాట్లాడితే 

అయ్య కెంత ఇష్టమో ..
 

ఆమె పోయిన నాల్గు రోజులకే
రెండో అక్కయ్య కొడుకు యేదో పని మీద దిగేవాడు
వాడితో ఒక నాలుగు రోజులు కాలక్షేపం..

వాళ్ళ వూరు బళ్ళారి దగ్గర కామలాపురం..
పొలాలు మామిడిపళ్ళూ
ఆవులూ పంటా..
మా బావ బ్యాంక్ ఉద్యోగం..
అక్కడి విశేషాలు
తాతా.. తాతా..
అని వాడూ దగ్గర కూచుని మాట్లాడేవాడు
పదరా మనిద్దరం ముష్టి యుధ్ధం చేస్తాం..
అంటూ అయ్య అప్పుడప్పుడూ వాణితో 

సరదాగా కుస్తీ పట్టు పట్టేవారు..

ఎక్కడున్నానూ..
అలా సుధ కథ కొంతకాలం సాగింది
ఆపిల్లకు కళలంటే ఇష్టం
చదువు ఇష్టం లేదు
కష్టపడి చదివేది
కొన్ని సార్లు పాసు , కొన్ని సార్లు ఫెయిలూ
 

తర్వాత వాళ్ళ నాన్నకు వేరే వూరు బదిలీ అయింది
కానీ
పరీక్షలకు కడపకు వచ్చేది నెల ముందుగా
మా ఇంట్లోనే మకాం..
ఇద్దరం కలిసి చదుకొనే వాళ్ళమా..

చక్కగా టిఫెన్ తిని ..
 పట్టపగలే.. పుస్తకం పట్టుకు కూచుని అది తూగుడే తూగుడు..

అలా ఒక అయిదారు సార్లు పరీక్షలు రాసింది..

తర్వాత చదువేమైందో తెలీదు కానీ..
కొన్నాళ్ళకు మళ్ళీ మాఇంట్లో దిగింది..
వెంపటి చిన సత్యం వద్ద నృత్యం నేర్చుకుంటున్నానని చెప్పింది..
అయ్య పక్కన కూచుని..
ఆయన దృష్టిలో ఎలా పడింది
ఆయన వద్ద ఎలా చేరింది
 

అదో కథ..
కూచి పూడి వెళ్ళింది
సత్యం గారింటి ఎదురుగా ఇల్లు తీసుకుంది
ఆయన తెల్లవారి సూర్య నమస్కారాలకోసం పైకి వస్తాడట..
అది కనిపెట్టి
ఆవేళకు తానూ పైకి పోయి పెద్దగా విష్ణు సహస్త్ర నామాలు చదివేదట..
ఒకరోజు ఆయన సుధను చూడనే చూసాడు..
పరిచయం పెంచుకుని నాకు నాట్యం నేర్పండి..
నాట్యం నా ప్రాణం అందట..
అంతే..
అక్కడ ఆయన శిష్యురాలైపోయింది..

                                 ఇతి సమాప్తః


27 ఏప్రి, 2014

అతిశూన్యం..


రాత్రి పది గంటల సమయం
వీధిలో కారు ఆగింది..
అందులోంచీ అయ్య మరికొందరు దిగారు..
అందరూ లోపలికి వచ్చారు
ఎక్కడో సన్మానం నుంచీ వస్తున్నారు అయ్య..

అయ్య ముఖమంతా సంతోషం .. 

రాధ యేదీ..
రాధా..
రాధా..
వచ్చింది
రా.. రా.. రా..
కుటుంబ సభ్యులందరూ హాలులో చేరారు
చిన్న రాధ చుట్టూ అందరూ
అయ్య రాధను ఎత్తుకున్నారు ముద్దు పెట్టారు
రాధ వయసు ఎనిమిదేండ్లు
దింపారు
ఊ.. ఇప్పుడు నీకు సన్మానం..
అంటూ పూలమాల వేసి..
శాలువా కప్పి ..
అయ్య చప్పట్లు కొ
ట్టి నారు.. సంతోషంగా నవ్వేనారు అందరూ..చప్పట్లు
ఊ.. యేమైనా మాట్లాడు..

'మీరు నాకు సన్మానం చేసినందుకు కృతజ్ఞ తలు..'
అంది సిగ్గుగా  రాధ..
అంతే..
మళ్ళీ నవ్వులు..
నవ్వులు..
నవ్వులు.
ఊరంతా అయ్యను సన్మానిస్తే నిండిన 

అయ్య హృదయం ఇలా ఆనందించింది..

26 ఏప్రి, 2014

గువ్వల చెన్నా ..


గుడికూలును - నూయి పూడును
వడినీళ్ళకు చెరువు తెగును
వనములు ఖిలమౌ
చెడనిది ‘పద్యం’ బొక్కటె
కుడియెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!!

కవి వాక్కు నిలిచినంతకాలం 
తనకీర్తి నిలవదని రాజులకు చక్కగ తెలుసు
అందుకే విజయ స్థంభాలను చెక్కించడం 
గుళ్ళు గోపురాలుకట్టించడం
విగ్రహాలను ప్రతిష్టించడం నగరాలు నిర్మించడం
వీనితో సంతృప్తి చెందక కవు లను దగ్గరతీస్తారు
 
భోజుని వంటి రాజు కలిగితే 
కాళిదాసు వంటి కవి అప్పుడే వుంటాడు అనడం తప్పు
కాళిదాసు వంటి కవి కలిగితేనే 
భోజుడు వుండడం
కవికృపను సంపాదించగలిగితే 
సామ్రాజ్జాధిపులైనా 
సామాన్యులైనా అమరత్వం పొందగలరు..
 
ప్రపంచ చరిత్రలో ఇందుకు తార్కాణాలు వందలూ వేలూ
ఇందులో పైధియాస్ కు సంబంధించిన గాధ 
బహు చక్కనిది
 
ప్రాచీన కాలంలో ఇతడు ఈజియానాకు చెందినవాడు
ఇస్థమియన్ పోటీలో జగజ్జెట్టీగా ఎన్నికై
తనను కీర్తిస్తూ ఒక పద్యం రాయడానికి 
ఎంత చెల్లించ వలసివుంటుందని అడగడానికి
తమ ఊరుకవి పిండార్ దగ్గరకు వెళ్ళాడు
 
తన కట్నం ఇప్పటి మనలెక్క ప్రకారం 
సుమారు మూడు వేల రూపాయలని చెప్పాడా కవి
'అబ్బో అంతే ..
అంత పెడితే నా కంచు విగ్రహాన్నే పోత పోయించుకోవచ్చు..' నని పైధియాన్ పెదవి విరిచాదు
 
'నిజమే కావచ్చు '
అని పిండార్ మందహాసం చేసి మిన్నకున్నాడు 
రాత్రి ఇంటిలో బాగా ఆలోచించుకున్న మీదట..
అడిగిన డబ్బు ఇచ్చి పద్యం రాయించుకోవటమే మంచిదని పైధియాన్ కు తోచింది
ఇప్పుడు
ఈజి
యానాలేదు  అందులో కంచువిగ్రహాలు లేవు
కానీ పద్యం మాత్రం నిలిచివుంది..
మనలో చాలామంది
అయితే మనమూ ఆపని చేద్దామనుకోవచ్చు

అయిదో పదో చేతిలో పెడితే 
పంచరత్నాలూ నవరత్నాలు దండిగా దొరుకుతాయి
అందుకు బాలకవులు ప్రౌఢ కవులు మధుర కవులు సరస కవులూ ఫుల్లుగా వున్నారు..
కానీ ఆ పిండార్ వంటి కవి దొరకాలికదా
ఇవి నా మాటలు కావు ..
నార్ల వారి సంపాదకీయంలోవి..

భట్టుమూర్తి రాయల కొలువులో ఒక దిగ్గజం
అతడు ఒక బెస్తవానిపై ఒక పద్యం కాదు
 శతకాన్నే వ్రాసినాడు
కారణం
వాడెంతో త్యాగ శీలి
వాడొక బెస్త వాడు చేపలమ్మితేనే వాణి పొట్టకు తిండి
అలాంటివాడేమి త్యాగం చేయగలడు
చేసినా ఎంత చేయగలడు..
 
తనకున్న దానిలోనే 
ఎంతో కొంత ఉదార బుధ్ధితో ఇస్తారు కొందరు
లక్షలు కోట్లు ఉన్నా 
దానం త్యాగం అనే పదాలే తెలియవు కొందరికి..
 
భట్టుమూరి బెస్తడి త్యాగాన్ని చవిచూశాడు
ఆశ్చర్య పడ్డాడు
వెంటనే అతని హృదయం ఉప్పొంగింది
వెంటనే కొన్ని పద్యాలు చెన్నడిపై దొర్లాయి అవి 'గువ్వలచెన్నా' అనే మకుటం కలవి
ఈ కథ పిల్లలకోసం పుట్టపర్తి వ్రాసిన
 రాయల నీతి కథలు లోనిది


 

 

16 ఏప్రి, 2014

పాత్రలేమంటాయి ..?

భాగవతంలో స్త్రీ పాత్రలెన్ని వున్నాయి
ఆ .. దేవకి..యశోద..గోపవనితలు..

కుబ్జ..సత్యభామ..
రుక్మిణి .. ప్రహ్లాదుని తల్లి లీలావతి..
 అబ్బో .. 

చాలా..  చాలా .. ఉన్నాయి.. 

దేవకి 'అన్నా..  అన్నా..  '
అని  పిలుస్తూ తిరిగే పిల్ల. 
ఆకాశవాణి 
 'నీ చెల్లెలి ఎనిమిదవ గర్భంలో జన్మించేవాడు 
నిన్ను చంపుతాడు '
అని చెప్తే చెల్లెలని కూడా చూడకుండా
 తీసుకెళ్ళి జైల్లో వేశాడు కంసుడు
 

అక్కడే ఎనిమిది మందినీ కని 
వారిని అన్న వధిస్తూ వుంటే కన్నీరు కార్చింది
కనీసం నిందించనైనా లేదు అన్నను
 

ఆఖరికి ఎనిమిదవ బిడ్డను చంపబోగా
'అన్నా..  ఇది ఆడపిల నీ మేన గోడలు.. వదులన్నా..'

అని ప్రాధేయపడింది
ఆ ఎనిమిదవ బిడ్డనా కాశానికి ఎగురవేయగానే 

'ఒరే..  నిన్ను చంపేవాడు ..
ఇంకో చోట పెరుగుతున్నాడ్రా..'
  అని మాయమైతే
 

కంసుడు
'అయ్యయ్యో చెల్లీ ..తప్పయిపోయింది..

 నిన్ను ఇన్ని రోజులూ ఇబ్బంది పెట్టాను..
 యేం చేయను ..?
నా ప్రాణమూ విలువైనదే కదా..
నన్ను క్షమించండి ..

మీరు మీ రాజ్జానికి పోయి హాయిగా వుండండి
 అని అంటే
 

'సరే'.. నంటూ 
భర్తతో కలిసి వెళ్ళిపోయింది
ఎంత సౌజన్య మూర్తి ..

ఇంక కృష్ణుని పెంచిన యశోద  

నందుని భార్య
తన ముద్దుల తనయుని పై వల్లమాలిన ప్రేమ
అబ్బ ..

కృష్ణుని ఎన్ని తిప్పలు పెట్టిందనుకున్నారు
రోలుకు వేసి కట్టింది, 

చెవి మెలి పెట్టింది,
మన్ను తిన్నావా ? ఏదీ నోరు చూపించమంది
 

పాలు వెన్న పెరుగూ దొంగతనం చేస్తున్నాడని 
అందరు ఆడవారు పిర్యాదు చేస్తే
'మా ఇంట్లో పాలు పెరుగూ లేవా?

 మీ ఇంట్లో దొంగతనం చేయలా..?
పొండమ్మా ..మా చెప్పొచ్చారు ..''
అని వాళ్ళని దబాయించింది.
 

కాళీయమర్దనం చేసినా .. 
బకాసుర సం హారం చేసినా..  
శకటాసుర భంజనం చేసినా.
నా బిడ్డకేమైతుందో .. 

అని గాభరా పడి దిష్టి తీసిందే కానీ..
ఇంతటి అతిలోకుడు తన బిడ్డడన్న 

స్పృహ ఆమెకు కలగలేదు
 


చుశారా..  యెన్ని వైవిధ్యాలో..
 

పుట్టపర్తి అంటారూ ..
పోతనామాత్యులకు వివిధ చిత్తవృత్తులు గల నాయకులను సృష్టించటం కంటే
నాయికలను సృష్టించమే ఇష్టమట..
 

అంగవర్ణనలు కాక ..
వారి చేష్టలు.. విలాసములు.. వర్ణించటం 
పోతన్న గారికి ప్రియమైనదట..
మరి మనమేం చేద్దాం..
చక్కగా విందాం..
సరేనా.. 








పోతనామాత్యులకు 
వివిధ చిత్తవృత్తులుగల నాయకులను సృష్టించుటకంటెను 
నాయికలను సృష్టించుట లో 
నెక్కువ యపేక్ష యున్నట్లున్నది

ఆతడు వర్ణించిన 
శకుంతల శర్మిష్ట దేవకి దేవయాని రోహిణి యశోద వీరందరు చిత్తవృత్తులలో 
కేవలము విభిన్నలైన వ్యక్తులు.

త మ కొక రెండుదాహరణములు 
మాత్రమే మనవి చేసు కొందును

ఊర్వశికి మిత్రావరుణుని శాపము గలిగెను. 
అందుచే నావిడకు మానవజన్మ మేర్పడినది

కాని యంతకు ముందే 
యూర్వశికి పురూరవునిపై నొక ప్రెమ కద్దు
కారణమేమనగా.. 
ఆతని శౌర్య సౌందర్య గంభీర్యాది  గుణములను 
నామె యింద్రుని సభలో నారదునిచే విన్నదట

ఊర్వశి భూలోకమునకు వచ్చి 
పురూరవుని ముందట నిలువబడినది
వాడిట్లున్నాడు.. 

''సరసిజాక్షు మృగేంద్ర మధ్యు విశాలవక్షు మహాభుజున్
సురుచిరానన చంద్రమండల శోభితున్, సుకుమారు నా
పురుష వర్యు పురూరవుం గని పూవుటం పరజోదుచే
దొరగు క్రొవ్విరి సూపులం మది దూల పోవగ భ్రాంతయై''

ఊర్వశి భ్రాంతయైనను 
ఆమె తన హృదయము నెరి గింపలేదు 
ఊరక నిలచియున్నదట.. 
ఇది స్త్రీ ధర్మమే.. 

పురూరవుడును ఊర్వశిని జూచెను.. 
వాడు 'దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటికంచు.. ? మరు ని ముసముననే నిర్ణయించుకున్నాడట

ఎట్టకేలకు వాడే ప్రేమోదంతము నారంభించెను
పురూరవుడన్న మాటలివి.. 

'ఎక్కడ నుండి రాక మనకిద్దరకుం దగు నీకు దక్కితిన్
మ్రుక్కడి వచ్చెనే యలరు ముల్కులవాడ డిదంబు ద్రిప్పుచే
దిక్కు నెౠంగనీడు నను దేహము దేహము గేలు గేల నీ
చెక్కున చెక్కు మోపి తగు చెవ్యుల నన్ను విపన్ను గావవే''

ఊర్వశి మహా ప్రౌఢ.. 
వాడీ మాటలన్నంతనే 
'వీడు లఘు హృదయుడని..  
యర్థము సేసికొన్నది

ఈ భావము నామె బైట బెట్టినది గాదు
ఇంతలో గంధర్వులు వచ్చి 
పురూరవుని ప్రేమ విఘాతమును జేసినారు
ఆమె వాని కన్ను మర గి పోయినది

నాటనుండి పురూరవుడు వెర్రి వాడై 
ఊర్వశిని వెదుకుచున్నాడు 
ఒకసారి సరస్వతీ నదీ తీరమున నామె 
వాని కంట బడెను

వీనిని వదలి పోయినది మొదలు.. 
 ఊర్వశికి వీని గాలియే లేదు
'యోగ వియోగములకు మనసివ్వరాద'నునది 
యామె నేర్చుకున్న కామ శాస్త్ర వేదాంతము

పురూరవుడామె కడకేగి
దీనముగ యాచించినాడు 
అపుడూర్వశి తన మనస్సులో 
వీనిని గురించి యున్న 
నిజమైన భావమును బైటపెట్టినది
అది యిది.. 
మగువలకు నింత లొంగెదు

''మగవాడవె నీవు పశువు మాడ్కిన్ వగవన్
దగవే .మానుష పశువును
మృగములు గని రోయుగాక మేలని తినునే''

ఈతలపామెకీనాడు కలిగినది కాదు 
పురూరవుని జూచిన నాడే యేర్పడినది
ఆ భావమునింతవరకు దాచినది. 

ఆ తరువాత నా మె తన కుల ధర్మము 
నీరీతి వెల్లడించెను

''తలపుల్ చిచ్చులు మాటలుజ్జ్వల సుధాధారల్ విభుండైన పూ
విలుతున్ మెచ్చర యన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు క్రూ
రలు తోడన్ బతినైన చంపుదు రధర్మల్ నిర్దయల్ చంచలల్
వెలయాండ్రెక్కడ వారి వేడబములా వేదాంత సూక్తంబులే''

ఊర్వశీ పురూరవుల ప్రేమలో 
పురూరవుడు ప్రేమైకవశుడు. 
కడుంగడు దీనుడు గూడ.. 

ఆ దేవకాంత 
వానితో నెప్పుడును సేవ జేయించుకొన్నదే గాని
వాని కొకనాడైనను 
సేవ జేసినట్లు గానరాదు

ఇది యనుకూల పతిక
ప్రౌఢ నాయిక

దుష్యంతుడు వేటకు బోయెను 
ఆశ్రమమునందు 
శకుంతల యొక్కతియ యున్నది
ఆశ్రమమున బ్రవేశించిన 
దుష్యంతునకా మె కంటబడినది

''దట్టపు దురు ము .. 
మిఱు మిఱు చూడ్కులు .. 
నట్టాడు నడుము.. ''

దుష్యంతున కింకేమి గావలెను..?
వెంటనే యతడు 
తన మనస్సును బైట పెట్టినాడు

ఆమెకును 
దుష్యంతుని జూచిన వెంటనే మతివోయినది
ఇంతలో మన్మధుడొకడు నడుమ దూరెను 
వాడు 
గుసుమాస్త్రములతో నా బాలను గొట్టినాడట 
శకుంతల తాలిమి సెడి 
ఇట్లు బదులు వలికినది.. 

''అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూ భర్తమున్
గనిరా మేనక డించిపోయె నడవిన్ గణ్వుండు నన్నింతగా
మనిచెన్ సర్వము నామునీంద్రు డురుగున్ మద్భాగధేయంబునన్
నిను గంటిన్ పిదపన్ గృతార్థనగుదున్ నేడీ వనాంతంబునన్''
 

శకుంతల ముగ్ధ ..
భావగోపన మింకను .. 

ఆమెకు బాగుగ నలవాటైనదిగాదు
 

ఊర్వశి తాను పురూరవుని ప్రేమించితినని 
నోరార చెప్పనేలేదు .. 
శకుంతల చెప్పినది..
ఆ చెప్పుట..  

'కృతార్థనగుదున్.. '
అని ఎంతో నాజూకుగా నన్నది
 

సత్కులమున బుట్టిన కన్యక
 ఇంతకంటె మరి యేమనును.. ?
 

పోతనామాత్యులు సృష్టించిన దేవయాని 
మహా గర్వోద్యమస్థాని
'భూరికోపానలాకలితగ్లాని' కూడ
 

ఆమె దృష్టిలో 
శర్మిష్ట తండ్రి శుక్రాచార్యునకు దాసుడు
తన చీర కట్టుకున్న శర్మిష్టను 

'విహితములే .. కుక్కలజు హవిర్భాగంబుల్.. '
యని యామె ప్రశ్నించు చున్నది
 

శర్మిష్ట గూడ కోపమున తక్కువదిగాదు .. 
 కాని యాకోపము క్షణమాత్రము
శర్మిష్ట దేవయానికి దాసియైనది
 

దానికి కారణము తండ్రి యాజ్ఞ 
అపుడామె 'చలమింకేల పోనీలె మ్మ' ని 

తన్ను తాను సవరించుకొన్నదట
ఆ సవరింపు 

తన కార్యమును సాధించుకొనుటలో దీక్షయే
 

ఎడరువేచి 
ఒకానొక నాడు యయాతిని లోగొన్నది
దేవయానికాసంగతి తెలిసి 

క్రోధమూర్చిత యైనది
యయాతి భంగపడినాడు 

ఆమె విన్నదిగాదు
యయాతి యపరాధము 

శుక్రుని చెవులకు తాకనేతాకినది 
శర్మిష్ట క్షత్రియ కాంత
కుచితమైన భావగోపనముగల యువతి
దేవయానికి 

తోచిన భావము దాచికొను నలవాటులేదు

సాధారణ కవులు 

అంగిక శృంగారమును వర్ణించి తృప్తి చెందుదురు
ఇతడును స్త్రీల యంగములను వర్ణించును
 

కాని .. దానికన్నను..  
స్త్రీల చేష్టలు .. విలాసములు .. వర్ణించుట పోతనామాత్యులకు ప్రియమైన పధ్ధతి.

12 ఏప్రి, 2014

యోగరతో వా భోగరతోవా




నారాయణాచార్యులు ఈ యుగానికి మహా భక్త కవి 
తాను భక్తి సాహిత్యంతో తరించి పఠితలను తరింపజేసాడు
నారాయణాచార్యులు మనసాటి మానవుడే
లోపాలు లేని వాడు కాడు..
 

కానీ..
ఆ లోపాలను అరసి..
ఎప్పటికప్పుడు భక్త్యావేదనలో తపించి.. లోపాలను దహించుకుంటూ..
శ్యామ శబలం చేసిన బంగారు లాగ పరిశుధ్ధుడైనాడు.
తన రచనలతో లక్షలాది ప్రజలను తరింపజేశారు కనుక
ఉత్తమగతులు పొంది ఉంటారు
సందేహం లేదు..
 

శ్రీనాధుడు
"దివిజ కవి వరుగుండియల్ దిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాధుడమరపురికి ''

అని చెప్పుకున్నాడు అవసానకాలంలో..
 

''ఒకనాడు కృష్ణదేవరాయ సుమ శేఖ
రంబైన యభయహస్తంబు మాది
ఒకనాడు గీర్దేవతా కమ్ర కంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది
ఒకనాడు రమానుజ కుశాగ్ర బుధ్ధికే
చదువు నేర్చినది వంశమ్ము మాది
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెను   గొండమాది
దల్లి దండ్రుల మేధ విద్యా నిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడబట్టిన రాయలసీమ మాది..''
అని చెప్పుకున్నాడు..
 

ఇది స్వాతిశయం కాదు..
యధార్థం..
ఇంతటి వానిని పరలోకంలోనూ 'శ్రియః పతి' 

కరుణా కటాక్షంతో అనుగ్రహిస్తాడు.
-తిరుమల రామచంద్ర.