22 సెప్టెం, 2011

           (ఆచార్య ఫణీంద్రగారి కి కృతజ్ఞతలతో )

సరస సల్లాపము - 13










ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ అప్లై చేసుకొన్నారు. ఇంటర్వ్యూ రోజు తెలుగు శాఖాధిపతి, అభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను. ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఇంత వరకు చాలా మందికి తెలిసిన కథే. చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు : విశ్వనాథ వారు స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం - " ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస జ్ఞానం కొరవడితే నేనేం చేయను? "

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

చంద్రశేఖర్ (lanpad@gmail.com) చెప్పారు...

నాదొక విన్నపము: నేను కూడా జాబ్ ఇంటర్వ్యూలు చేస్తుంటాను అమెరికాలో కూడా. వచ్చిన అభ్యర్ధి సత్తా బట్టి ప్రశ్నలు మొదల పెట్టాలి. చక్కగా రిసీవ్ చేసుకోవాలి. బహుశ: రామరాజు గారికి ఆ విజ్ఞానం కొరవడి వుంటుంది. అందరికీ లాగేమూసకట్టు పశ్నలు వేసిన రామరాజు గారికి తన ఆధిక్యం చాటుకోవాలనే తాపత్రం (నేనుఇచ్చేవాడిని-వాడుపుచ్చుకొనేవాడు) ఎక్కువయిందనిపిస్తోంది. విశ్వనాధ మరలా ప్రొఫెసర్ గా ఎక్కడా చేరకపోవటం నాకు చాలా గర్వ కారణంగా వుంది. ఇప్పుడు-అప్పుడూ యెప్పుడూ ప్రతిభకి దర్పణం పదవులు కాదు అని చాటి చెప్పేవాళ్ళు ఎంతో మంది వున్నారు. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఇంకొక మచ్చుతునక.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి