చిన్నవయసులోనే త్యాగయ్య తండ్రి గతించాడు
అన్నదమ్ముల భాగపరిష్కారంలో
శ్రీరామ లక్షమణుల విగ్రహాలు లభించాయి
ఉంఛవృత్తిచేస్తూ జీవనం రామభక్తి సేవనం
సంగీత సాధనం ఆయన వ్యాపకాలు
అంతకు మించి రాజు కానుకలు పంపినా
ఆయన కన్నెత్తి చూడలేదు
అలాంటి వారుంటారా..
ఉంటారు..
త్యాగయ్య పరమభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ శిధిలావస్తలోనున్న త్యాగయ్య సమాధిని
కావేరీ నది ఒడ్డున గుర్తించింది.
తంజావూరు రాజుల ద్వారా రెవెన్యూ అధికారుల ద్వారా
తన అధీనంలోనికి తెచ్చుకొని
మద్రాసులోని తన ఇంటికి అమ్మి
ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి గుడి కట్టించింది.
మంటపము పాకశాల..
ఈ ప్రయత్నంలో
తన సంపద ఆభరణాలు హరించుకు పోయాయి..
అలాంటి ప్రయత్నాలే
మనుషుల హృదయాలు పరవశింపచేస్తాయి.
1946 లో త్యాగయ్య చిత్ర నిర్మాణ సమయంలో
చిత్తూరు నాగయ్య గారు ఆమెను కలిశారు
ఆమె సలహాపై
త్యాగరాజనిలయం అనే సత్రం కూడా కట్టించారు..
త్యాగయ్యగారు తిరుపతి దేవుని దర్శనానికి వెళ్ళారు
తెరలు వేసేశారు
దర్శనం లేదన్నారు
ఎంతో ఆర్తితో వచ్చిన త్యాగయ్యకు నిరాశకలిగింది..
బిడ్డ తండ్రిని చూడడానికి వస్తే
తండ్రి తెరలు బిగించుకొని రేపురాపో అంటాడా..
అయితే వాడు తండ్రెలా అవుతాడు
బిడ్డ వస్తున్నాడనే వార్త అందగానే
వీధి తలుపు దగ్గర ఎదురు చూసేవాడే కదా నిజమైన తండ్రి..
రాధవస్తే ఇద్దరం కలిసి భోజనం చేస్తాం అని
నేను కాలేజ్ నుంచీ వచ్చే సమయానికి ఒంటిగంటకు
బయట నిలబడి..
నాకోసం ఎర్రటి ఎండలోకి చూసే వాడు నా తండ్రి..
కానీ
త్యాగయ్య తండ్రి తెరవెనక వున్నాడు ..కనపడడట
ఆయన హృదయం జ్వలించుకు పోయింది..
మామూలు పిల్లల్లా
నేను నీ కోసం వస్తే లోపలుండి బయటకు రావా..
నేనంటే నీకెప్పుడూ అంతే..
అంటూ దెబ్బలాడడు
కారణం
తెరవెనకనున్న ఆయన తండ్రి శరీరం కాదు శిలావిగ్రహం
ఆ తండ్రిని కేవలం మనో నేత్రంతోనే చూడాలి
ఆ నేత్రానికి లౌకిక దృష్టికాదు దివ్య దృష్టి కావాలి
లోపలున్న దేవుడు కనపడకున్నాడంటే
తనకళ్ళు ఆయనను చూడడానికి అనువుగా లేవు
అందుకే యీ కీర్తన..
నా కళ్ళను కప్పిన ద్వేషము అసూయ ఓర్వలేని తనము
అవి తీయి అప్పుడే నేను నిన్ను చూడగలను అని హృదయం పగులగొట్టుకున్నాడుత్యాగయ్య
తెరవెనుకనున్న శిల ద్రవించింది
వెంటనే తెరలు తొలగిపోయాయ్..
తండ్రి చేతులు చాచి కొడుకును ఆలింగనం చేసుకున్నాడు
కాదు కాదు
ఆ ఆలింగనాన్ని కన్నీళ్ళతో అనుభవించాడు త్యాగయ్య..
తెరతీయగరాదా లోని ॥తెర॥
తిరుపతి వేంకటరమణ మచ్చరమను ॥తెర॥
పరమపురుష ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని ॥తెర॥
ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులురీతి యున్నది
హరిద్యానము సేయువేళ చిత్తము
అంత్యజువాడకు బోయినట్లున్నది ।।తెర॥
మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరు
గిడబడి చెఱచినట్లున్నది ॥తెర॥
వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను ॥తెర॥
త్యాగయ్య తరువాత అలాంటి మనుషులు
ఆ భక్తి తీవ్రతా లేవనుకుంటారేమో
లోకంలో అన్యాయం అరాచకం ఎంత సహజంగా పెచ్చరిల్లుతూందో
అంతే సహజంగా భక్తీ స్వార్థ రహిత జీవనాలూ నడుస్తున్నాయి
అయితే వాటిని చూడడానికి మనకూ మరో దృష్టి కావాలి
పుట్టపర్తి మాతామహులు రేవా సంస్థానంలో ఉండేవారు
వీరు భక్తి రస ప్రధానమైన అనేక రచనలు చేసారు
వారో సారి తిరుపతికి వెళ్ళారు
గుడితలుపులు మూసిపొతున్నారు పూజారులు
దర్శనమిప్పించమని ప్రాధేయ పడ్డారీయన
ససేమిరా అన్నారు వాళ్ళు
దేవుని సన్నిధిలో నిత్యం వుండి వుండి
భక్తుదెవరో విరక్తుడెవడో తేడా పట్టలేక పోతున్నారు అర్చకులు
ఆశాభంగం తో వెంకటాచార్యులవారు
శ్రీనివాసుని ఉద్దేశించి
వేదాంత దేశికులవారి శ్లోకం చదివారు ఇలా
కానీ అందులో
త్యాగయ్యలా నా కళ్ళలోని మత్సరం తీయమన్న వేడుకోలు లేదు
భక్తి పండిన ఉక్రోషం
యేం శ్రీనివాసా ఐశ్వర్యం తో కళ్ళు మూసుకుపోయాయా..
విశిష్టాద్వైతం పూర్వపక్షంలో పడిపోతూ
శత్రువుల చేత ఓడింపబడే స్థితి నీకు వచ్చినప్పుడు నిన్నుధ్ధరించవలసిన వాడను నేనే కదా..
ఆ మాత్రం గుర్తించలేవా..
అని అంటూ ధ్వజస్థంభాన్ని ఢీకొన్నారట..
దెబ్బలాడే పిల్లలకు తండ్రిపై ప్రేమవుండదా..
అది ఆ పరమేశ్వరునికి తెలియదా..
అందుకే..వెంటనే వాకిళ్ళు తెరుచుకున్నాయి
యీ విషయాన్ని ''జీవితం అనుభవాలు ''
లతమాసపత్రికలో అక్టోబర్ 1967 18వ పుటలో ప్రస్తావించారు పుట్టపర్తి
భాషాపరశేషభోగిలో పుట్టపర్తి నాగపద్మిని యీ విషయాన్ని చెప్పింది..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి