9 జూన్, 2014

గతించినది 'గ' చింతనం


చాలామంది 
ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు
మా అయ్య వైతే 

ప్రతి దిన వార పత్రికలలో చూసి చూసి 
మాకు కొత్తగా అనిపించేవి కావు
 

కానీ ఇది
అప్పటి రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పని చేసిన 

అనంత పద్మనాభరావు గారుచేసినది
 అదీ మా అమ్మను
 

1975లో కేంద్ర సాహిత్య అకాడమీ 
మా అమ్మను ఉత్తమ రచయిత్రిగా సత్కరించింది  
 అది మా అమ్మ ఊహించనిది
మేమూ కూడా
 

మా అమ్మలో సంతోషమూ లేదూ 
విచారమూ లేదు


అందరూ 

మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికొచ్చామండీ
అంటే 

ఉత్సాహం చూపించి వీలైనంత సహకరిస్తారేమో
 

కానీ మా అమ్మ
అక్కడినుంచీ మెల్లగా తప్పుకొనే ప్రయత్నం చేసింది..


ఆనాటి సదస్సుకు వచ్చిన స్త్రీలలోకెల్లా 

కట్టూ బొట్టులలో సదాచార కుటుంబం నుంచీ పసుపుకాళ్ళతో
నవీన లోకానికంలోకి అడుగుపెట్టిన స్త్రీలా
కొంగుకప్పుకుని 

తొమ్మిది గజాల చీర మడిచార పోసి కట్టుకుని..
నుదుటన కుంకుమ దిద్దుకుని..
జారుముడి తో 

సభలో అందరూ నమస్కరించాలనుకొనే విధంగా..
 

అందుకే
ఆనాటి విలేక రి జి కృష్ణ
ఆనాటి సదస్సుకు వచ్చిన స్త్రీలలోకల్లా

కట్టు బొట్టు మాటా తీరుతెన్నులలో 
పురాతన సీమలనుంచీ 
నవీన లోకానికి వచ్చినట్లు కనపడ్డారు..
అని వ్యాఖ్యానించారు
 

నిజమే..
అమ్మ ఎక్కువగా తెల్ల జాకెట్లనే కుట్టించే
ది..
 ఎందుకంటే 
తెల్లవైతే అన్నిటికీ నప్పుతాయి అనేది..


కాదు కాదు.. 
తనే సూదీ దారం తో కుట్టేది 
ఆ కుట్టు ఎంత గట్టిగా ఉండేదంటే  
మిషన్ కుట్టంత .. 
మిషన్ లానే దగ్గర దగ్గరగా.. 

నాకు పావడాలు  జాకెట్లు అన్నీ అలానే కుట్టేది అమ్మ.. 
 
ఫోటో గ్రాఫర్లు అమ్మను ఫోటో తీయడానికి చుట్టుముడితే..
 బెజవాడ గోపాలరెడ్డిగారు 

నవ్య నవనీత సమానులు కాబట్టి
భర్తతో కలిపితీయండి
అని పురమాయించారట..
అంతే ఇరువురు కలసిన వ్యక్తిత్వం అన్నారు జి. కృష్ణ..



ఇంకో విషయం 
అందరిళ్ళలో నలుగురూ కలిసినపుడు
 కుటుంబ విషయాలు
వాళ్ళనీ వీళ్ళనీ అనుకరించటాలూ
లేకపోతే సాధించటాలూ..
కక్ష.. పగ సాధిపులూ స్వార్థం సంకుచితత్వం
ఇవే రక రకాలుగా దర్శనమిస్తుంటాయి
 

కానీ అమ్మా అయ్యల సంగమంలో 
సంగీత సాహిత్యాలు లేదా దైవిక విషయాలూ..
ఇప్పుడు చదువుతుంటే 

గతించినది 'గ' చింతనం అనిపిస్తుంది

                   విదుషీమణి కనకమ్మ గారు 
            డా . రేవూరి అనంత పద్మనాభ రావు


ఒకనాటి సాయంకాలం పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని కలిసి మాట్లాడుదామని వెళ్ళాను వారింటికి..
 

భార్యాభర్తలిద్దరూ యేదో చర్చలో వున్నట్లుంది..
మధ్యంతరంగా ఆగిపోయింది వారి సంభాషణ..
 

యేమిటో చర్చిస్తున్నట్లున్నారు..  అన్నాను.
ఏమీలేదు..
అంటూ కనకమ్మగారు లోపలికి వెళ్ళబోయారు..
 

మిమ్మల్ని సాహిత్య సంబంధమైన 
కొన్ని ప్రశ్నలు వేయాలని వచ్చాను అన్నాను వారితో
 

మా అయ్యగారు రామాయణానికి ఆళ్వార్లు చేసిన వ్యాఖ్యానాన్ని గురించి చెబుతుంటే..
వింటున్నాను..
వారికి ప్రౌఢ రచనలంటే ప్రీతి
నాకు లాలిత్యమంటే మమత..
 

ఒకరీతిగా చూస్తే..
సాహిత్యపరంగా మేమిద్దరూ భినధృవాలం.. 

నేను వాల్మీకిని తరచూ మననం చేసుకుంటూంటే
 

ఆ శ్లోకంలో యేమున్నదని గొణుగుకుంటున్నావు..
అని వ్యాఖ్యానించేవారు.
అన్నారు కనకమ్మగారు..
 

అయితే మీకు కవితా గురువులు 
నారాయణాచార్యుల వారే అన్నమాట..
అన్నాను..
 

మా అయ్యగారి రచనలను ఎత్తివ్రాయడంలోనే 
నాకు కవితా వాసన అబ్బిం దని చెప్పాలి..
 

ఛందస్సు మొదలైన విషయాల్లో నేను అప్పకవీయం మొదలైన గ్రంధాలు చదివి తెలుసుకున్నాను..
నాకు వ్రాయాలనే ఆసకతి చాలా తక్కువ..
ఇతరులు వ్రాసినవి చదివి ఆనందిస్తే పోదా..?
అనే తత్త్వం నాది..
 

ప్రాచీనులు వ్రాసిన గ్రంధాలను అవగాహనం చేసుకొని ఆనందం పొందవచ్చని నా భావన
నాకు కీర్తి దాహం తక్కువ మహిళా సమాజాల పేరిట తిరిగే వాళ్ళను చూస్తే.. నాకు ఇష్టం వుండదు..
అంటూ ఇంకా యేదో చెప్పబోయారు..
 

ఒక్కమాట మీరు ప్రాచీనులన్నారు కదా.. బరి ప్రాచీన కవుల్లో మీకు నచ్చిన కవి యెవరు..
నాకు వాల్మీకి రామాయణం అంటే ప్రాణం 

మాటి మాటికీ వాల్మీకి శ్లోకాలు 
మననం చేసుకుంటూ ఉంటాను కూడా
 

కాళిదాసాది కవుల కవిత కూడా నాకు అంత 
ఆనందాన్ని కలిగించలేదు..
 

మావారు అనేక కావ్యాలు చదివి వినిపిస్తూ వుంటారు వాటిలో స్వారస్యం చెబుతూ వుంటారు
 

ఎన్ని చెప్పినా 
నాకు వాల్మీకి మీదికే మనసు వెళుతుంది
మావారు వ్యాసుని కవిత్వాన్ని నాకు పలుమార్లు చదివి వినిపించారు
 

ఆయన భాషలోనూ భావంలోనూ వాల్మీకి కంటే ప్రౌఢుడు అయినా నాకు వ్యాసుని వాసన అంటలేదు
 

ఇంతకు మీకు కవిత్వ వాసన ఎప్పుడు ఆరంభమైంది
 

అది మా పితృపైతామహంగా వస్తున్న వాసన 

మా పితామహులు గొప్ప తార్కికులు
ఆయన కాశి పండితులు
ఆయన నాకు అమరమూ శబ్దమంజరీ 

చిన్ననాడే నేర్పించారు 
కావ్య పాఠం కూడా చెప్పారు
 

పధ్నాలుగవయేట వివాహమైంది
అప్పటికి చెంపూ కావ్యాలు చదువుతున్నాను
చిన్న చిన్న శ్లోకాలు వ్రాసి 

మా తాతగారి చేత దిద్దించుకొనేదాన్ని
 

నాకు వివాహమవుతూనే ఆచార్యులవారు 
ప్రొద్దుటూరు పాఠశాలలో సంస్కృత పండితులుగా చేరారు 
అప్పుడు వారు చాలా మంది శిష్యులకు 
ఇంటి దగ్గర పాఠాలు చెపుతూ వుండేవారు
 

ఆయనకు కోపం ఎక్కువ 
ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ ఇంకోమారు అడిగితే దూర్వాసులౌతారు
అందువలన శిష్యులకు నేనే చెబుతూ వుండేదాన్ని..
 

సాహిత్యం పైన మీకు అధికారం కలగడానికి 
ఇంకా ఏవైనా కారణాలున్నాయా..
 

కొంతకాలం మావారు నాకు సంగీతం కూడా నేర్పారు
సాహిత్య పరిశ్రమ ఎక్కువ అయిన కొద్దీ 

మా ఇద్దరికీ సంగీతం పైన ఆసక్తి తగ్గిపోయింది
మావారు వ్యాసాదులు డిక్టేట్ చేస్తూ వుండేవారు
మధ్యలో ప్రశ్నిస్తే వల్లమాలిన కోపం
 

ఏదైనా పదమో వాక్యమో అందుకోకపోతే వదిలేసేదాన్ని. వారు సరిచూసేటప్పుడు దాన్ని పూరించేవారు.
ఆయన వ్యాసాలన్నిటికీ లేఖకురాలిని నేనే..
అందువలన నాది శృత పాండిత్యం
ఆయనకు తోచినప్పుడు గంటల తరబడి 

అనేక విషయాలు చెబుతుంటారు
భోజన సమయం కూడా దాటిపోయేది
 

సంగీత సాహిత్యాలంటే మా ఇంటిల్లిపాదికీ చాపల్యం ఉందంటే గొప్పలు చెప్పుకోవటం కాదు..

మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం చెబుతారా..
 

ప్రత్యేకంగా ఏదైనా మహాకావ్యం వ్రాయాలనే పిచ్చి 
నాకు లేదండీ 
కొన్ని కొన్ని పాత్రలమీద 
నాకు ప్రత్యేకమైన సానుభూతి వుంది 
ఊర్మిళ యశోధర కైకేయి సీత
ఇలాంటి పాత్రలు వీళ్ళను కథానాయికలుగా వ్రాద్దామనే అభిలాష మాత్రం ఉంది.
 

మా అందరినీ నిశ్చింతగా వుంచాలన్నదే నా తాపత్రయం.
ఆయన రచనలలో అప్రత్యక్షంగా నేను ఉన్నానులే అనిపిస్తుంది
సాంసారికమైన చింతనలు ఆయన చెవిదాకా రానీయకుండా చూసుకోవ డం నా ప్రధాన ధ్యేయం.
 

ఈమధ్య తారకనామ ముద్రతో 
స్త్రీలకు పనికివచ్చే పాటలు వ్రాసాను
స్స్వాంతస్సుఖాయ వ్రాసుకొన్నాను
అవి ప్రచురణ కావాలనే తహ తహ నాకు లేదు
 

నా రచనలు కావ్యద్వయి అని మేమిద్దరం కలిసి చాలానాళ్ళ క్రితం ప్రచురించాము
అప్పటినుంచీ ఇప్పటివరకూ రచనలే చేయలేదా అంటే చేస్తుంటాను
కానీ వ్రాసినదంతా బయటికి రావాలనే చాపల్యం లేదు
మా అయ్యగారికి చూపిస్తే వారు బాగున్నాయంటుంటారు
అంతటితో సరి..
 

రాజశేఖరుడనే సంస్కృత ఆలంకారికునికి 
అవంతీసుందరి అనే భార్య ఉండేది
రాజశేఖరుడు అవంతీసుందరిని సాహిత్యంలో ఉల్లేఖించేవాడు అప్పుడప్పుడూ
ఆమె రచనలేవీ మనకులభ్యం కావు కానీ ఆమె ఆలంకారికురాలై వుంటుంది
నేను కూడా అలానే గూఢంగా వుండాలని వాంఛిస్తున్నాను..

రెండేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కనకమ్మగారిని సత్కరించింది
ఆ సన్మాన సభలో వారు ప్రసంగించినతీరు  

సాహిత్యవేత్తల మెప్పు పొందింది
ఆచార్యుల వారి సహ ధర్మ చారిణిగా కాక 

స్వయం ప్రతిభ గల ప్రజ్ఞానిధి కనకమ్మ గారు..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి