26 జూన్, 2015

యుధ్ధాలతో ఒరిగేదేమీ లేదు..

నేను పోస్ట్ చేసే విధిలో 
గూగుల్ నూ వెదికి కొంత సమాచారం తీసుకుంటాను
సామవేదం.. చాగంటి వంటి మహాత్ముల ప్రవచనాలు విని కొంత సంస్కారాన్ని పెంచుకుంటున్నాను..
 

పోతన్న రాయలసీమలో పుట్టినారని వ్రాసాను..
అది గూగుల్ నుంచీ తీసుకున్నదే..
 

శ్యామలీయం గారు
 ''కొంపముంచారు.. 
పోతన్న రాయలసీమలో పుట్టారంటే
తెలంగాణావాళ్ళతో విభేదం వస్తుందేమో నని .''

చ మత్కరించారు..

''యేమీ రాదులెండి.. 
 తెలంగాణా వాళ్ళు మాకు విరోధులేమీ కారు .. బంధువులే.. 
ఆ మాటకొస్తే ఆత్మ బంధువులు.. 
పోతన్న భాగవతమే భగవత్స్వరూపం .. 
'' భగవంతుడు .. భక్తుడు .. భాగవ తమూ ఒక్కటే వేరు కాదు ''
అన్న పుట్టపర్తి చివరి వాక్యాలు అర్థం కావడానికి 
ఎంతో ఔన్నత్యం కావాలి.. 

మాకు తెలంగాణా వారితో ప్రేమానుబంధాలే వున్నాయి మీ సంగతి చూసుకోండి అన్నగారూ..  
అంటూ ..

కవికి కులమతాలు లేవని జాషువా వంటి వారం టుంటే.. 
ప్రాంతీయతలు కూడానా.. 
అన్నారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెంది
 పుట్టపర్తి పై రిసెర్చ్ చేసిన పద్మావతిగారు..''

మన విభేదాలు పోతన గారికి ఆపాదించడం ఎందుకులెండి వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనిద్దాం.. 
నేను మా తండ్రి గారి విశేషాలు 
వారి అభిమానులకు అందించాలనే ఉద్దేశం తో 
బ్లాగు నడిపిస్తున్నానే తప్ప 
నేను పెద్ద జ్ఞాన వంతురాలిని కాదు.. 
కనీసం అలా చెప్పడం నటించటం కూడా రాదు 
నన్నిలా ఒదిలేయండి.. 

మనం 
పోతన్న తెలంగాణా వాడివన్నా పొంగిపోడు.. 
రాయలసీమ వాడివన్నా కుంగిపోడు.. 
అందుకే 
ఆయన భాగవతా న్ని పట్టుకుని ఎంతో మంది తరించిపోతున్నారు..
పుట్టపర్తి అనూరాధ. ''
అంటూ జవాబిచ్చాను .. 

తరువాత మనసంతా వికలమైంది. 
మొన్న పద్మావతి గారి సంభాషణ గుర్తుకొచ్చింది .. 
అది ఇదే .. 
ఆవిడ మాటల్లో నే ..

 '' ద్వానా శాస్త్రిగారు ఈ విషయాన్ని బాగా మేన్షన్ చేసారు   కవులందరినీ సంపుటిగా వేశారట ద్వానాశాస్త్రిగారు .. 
తన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పుట్టపర్తిని ఆహ్వానించారు ద్వానా శాస్త్రి గారు .. 
 సభలో పుస్తకం పరిశీలించారు పుట్టపర్తి 

ఆ పుస్తకం చూపించి సభాముఖంగానే..
 ఇందులో రాయలసీమ కవుల ప్రసక్తి ఎక్కడన్నా వుందా..
ఒక్కరిపేరైనా ప్రస్తావించారా .. 

మా రాయలసీమ కవుల పేర్లేమైనా వున్నాయా..
అని కోపంగా అడిగారు 
ద్వానా శాస్త్రి గారికీ కోపం వచ్చిం ది.. 

ఇద్దరినీ అనుసంధానం చేసారు జానుమద్ది .. 
ద్వానా శాస్త్రి గారింటికి వెళ్ళారు .. 
ద్వానా శాస్త్రిగారు .. బాగానే ఆదరించారు 

''నేను ఇట్లా   అన్నానంటే.. 

మీ కందరికీ కోపం రావచ్చు
కానీ నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది..

నా కవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను..

ఇది తప్పు .. .  పధ్ధతి కాదు 
 అని అన్నారట..

అప్పుడు ద్వానా 
శాస్త్రి గారి మనసులొ ఒక బీజం పడింది.. 
ప్రాంతీయతత్త్వం ఉండకూడదు..అని..
రాయలసీమ .. తెలంగాణ ఇలా అందరు కవులనూ కలుపుకోవటం ప్రారంభించారు..
అందరినీ సమాన దృష్టి తో చూడటం..
ఆదరించటం చేశారట..
 

సాహిత్య చరిత్రలో కూడా 
ఆంధ్ర రాయలసీమ తెలంగాణా ప్రాంతాల కవులను గురించి రాశారట..
సమానదృష్టితో చూడటం అలవర్చు కున్నారు..
 

పొట్టిశ్రీరాముల యూనివర్శిటీనుంచీ అవార్డ్ వచ్చిన సందర్భంలో
 

 ద్వానా శాస్త్రి గారికి 
కవులందరి పట్ల సమాన దృష్టి ఉంది.. 
ప్రాంతీయత అనే దురలవాటు ఈనకు లేదు 
అందుకే ఈ అవార్డ్ వచ్చింది అని శివారెడ్డి గారు వేదికపైనుంచీ చెప్పారట..
 

అప్పుడు జవాబుగా 
నాకు ఇటువంటి దృష్టి పడటానికి బేస్ యేది .. 
పునాది యేది అంటే..
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .. 

అని నాలో ఈ బీజం పడటానికి 
ఇదిగో ఈ సన్నివేశం అని చెప్పారట..
 

తరువాత 
ఉస్మానియా యూనివర్సిటీ లో 
పుట్టపర్తి ఉపన్యాసాల ద్వారా నేను స్పూర్తిని పొందాను..
ఇటువంటి దృష్టి నాకు 

నారాయణాచార్యుల వారి వల్లే పడింది..
అని చెప్పారట..
 

పద్మావతి గారు 
పుట్టపర్తి శ్రీనివాస ప్రబంధం పై రిసెర్చ్ చేస్తున్నారు..
ఆక్రమంలో రాళ్ళబండిగారినీ  ద్వానా శాస్త్రి గారినీ.. 

ఇలా ఎందరితో నో  ఇంటర్వ్యూ నిర్వహించి 
దాన్ని రికార్డ్ కూడా చేశారు..
ఆవిడ సబ్మిషన్ అదీ అయ్యాక 

అన్నీ మీకు అందజేస్తానని చెప్పారు..
ఈ సంఘటనను పెడదామని ఆలోచనలో వుండగానే..
శ్యామలీయం గారి ద్వారా దీన్ని చెప్పాల్సి వచ్చింది..
 

నేను పుట్టపర్తి కూతురిగా 
వీనిని వెలుగులోకి తెస్తున్నానే కానీ..
నాకు యేమీ జ్ఞానం లేదు..
నేనొక మూఢురాలిని అని గుర్తించి..
నా అజ్ఞానాన్ని మా తండ్రి గారిని చూసి క్షమించమని ప్రార్థన..


యే ప్రాంతం వారైనా..
పుట్టపర్తి ప్రబంధ నాయికలు ఉపన్యాసాలు యూనివర్శిటీలో ప్రత్యక్షంగా విన్న అదృష్టవంతులలో నేనూ ఒకడిని అన్న ద్వానా శాస్త్రి గారికి వినయంగా ప్రణమిల్లుతూ..
పుట్టపర్తి అనూరాధ.


7 కామెంట్‌లు :

  1. అనురాధ గారూ:

    మీరు "మా సీమ" టపాలో కొందరు రాయలసీమ మహనీయులను పరిచయం చేసారు చాలా సంతోషం.

    *అన్ని ప్రాంతాలకున్నట్టే* రాయలసీమకు ఘన చరిత్ర వుంది అనడం మీ సంస్కారాన్ని తెలియచేస్తుంది. Hats off to your broad minded nature!

    ఇక పోతన విషయానికి వస్తే, పోతన స్వగ్రామం బమ్మెర, ఒంటిమిట్ట అని వేర్వేరు అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే. ఆయన బమ్మెరలొనె పుట్టారని విచారణ పిదుప నిర్దారనన జరిగిందని ఎక్కడో చదివాను ఎంత నిజమో తెలీదు.

    మీరు రాసిన "పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం" అన్న విషయంపై ఎటువంటి ఆక్షేపణకు తావు ఉండకూడదు. As far as I can see this is not an assertion but an acknowledgment that such a view is held by some.

    నేను తెలంగాణా వాడిని, వాదిని కూడా కానీ సీమ అల్లుణ్ణి. మీరు అన్న తెలంగాణా-సీమ ఆత్మబందుత్వానికి నేనూ ఒక నిదర్శనం. మీరు సీమ ప్రజల గురించి రాసిన "అమాయకులు.. కల్లా కపటం తెలియని వారు నటించటం..రాదు.. ఆత్మ వంచన చేసుకోవటం..తెలియదు లోపలేముందో అదే మాట్లాడతారు.. మనసుకు నచ్చితే శక్తి వంచన లేకుండా చేస్తారు" అన్న వాక్యం తెలంగాణా వారికి కూడా అదే మోతాదులో వర్తిస్తుందని నా నమ్మకం.

    మీ తండ్రి గారి గురించి ప్రస్తుత సమాజానికి తెలియచేయడానికి చేస్తున్న కృషి అమోఘం. All the best.

    రిప్లయితొలగించండి
  2. అమ్మా అనూరాధ గారూ,

    ఒక చిన్న చమత్కారవ్యాఖ్య మరొక టపాకు దారితీసిందన్నమాట. ఈ టపా కూడా బాగుంది, ఎన్నో మంచి విషయాలు ప్రస్తావించారు. కానీ, ఇంతచిన్న విషయానికి మీ మనస్సు వికలం కావటం ఎందుకో అర్థం కాలేదు. నా వలన పొరపాటు జరిగిందని మీరు భావిస్తే మన్నించండి.

    జైగారూ, ఒకవేళ మీకు నా వ్యాఖ్యలో దురర్థం ఏమన్నా స్ఫురించి ఉంటే అది అనుద్ధిష్టం, మన్నించండి.

    కవులకూ రచయితలకూ ప్రాంతీయతలను ఆపాదించటం ఎన్నడూ మంచిది కాదు. రచనల్లో ప్రాంతీయతలను ప్రాంతీయవాదాల ఆవశ్యకతలను సమర్థిస్తూ ఒక ప్రముఖ తెలుగు పత్రికలో లోగడ ఒక ప్రముఖ విమర్శకులు పెద్ద వ్యాసం ప్రచురించారు. అటువంటి ఆలోచనాధోరణులు అసంగతమూ ప్రమాదకరమూ అనిపించి నేను ఒక ప్రతివ్యాసం పంపాను ఆ పత్రికకే. నేనేమీ లబ్ధప్రతిష్ఠుడనైన కవినో రచయితనో కాను కాబట్టి హాయిగా దాన్నిఆ పత్రికవారు చెత్తబుట్టకు ఆహారంగా వేసారు.

    మీరు ఏ ప్రాంతంవారైనా, మీకు తెలంగాణా వారు ఆత్మబంధువులు అన్న మాట నచ్చింది. జైగారు తెలంగాణా బిడ్డ యైనా రాయనసీమ ఆల్లుణ్ణన్నారు. చాలా సంతోషం. ఈ దేహికి ఆత్మబంధువులో దాదాపుగా అందరూ తెలంగాణాలోనే కుటుంబాలతో నివసిస్తున్నారు. మా తాతలూ తండ్రులూ నేనూ ఎవరమూ తెలంగాణాలో జనించకపోయినా మా ఆఖరి తమ్ముడు మాత్రం తెలంగాణాలోనే జన్మించాడండి. నేనైతే ఇరవైరెండేళ్ళవాడిగా తెలంగాణాకు వచ్చాను ఒక కేంద్రప్రభుత్వరంగసంస్థలో చిరుద్యోగిగా చేరటానికి. ఇప్పుడు నాకు అరవైమూడు. నేను తెలంగాణావాడినో ఆంధ్రావాడినో నాకు తెలియదు. అది ఒక చిక్కు ప్రశ్నయేమో! ఎవరికి తోచినట్లు వారు లెక్కవేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేను కేవలం తెలుగువాడిని. ఆ గుర్తింపు నాకు చాలు. అదీ అవసరం లేదనుకొని ఉంటే అమెరికా పౌరుడిగా స్థిరపడి ఉండే వాడినేమో! పోనీయండి, నాకు నచ్చిన పని నేను చేసాను.

    చ. అరయ తెలుంగువాడ నను నట్టిది యొక్కటి చాలు గాని యే
    పురమున బుట్టినాడ మరి పోయి మరెక్కడ నాల్గురాళ్ళకై
    కర మనురక్తి చేరితిని కాలము తీరిగ భూమిపై కళే
    బర మెట వీడువాడ నిటువంటివి బుధ్ధి తలంచు వాడనే.

    ఉ. రాముని నమ్మి యుంటి రఘురాముడు చూపెడు ప్రేమ చాలు నీ
    భూమిని యెవ్వరేమనిన పోయెడు దేమియు లేదు వచ్చు మే
    లేమియు లేదు నాకు హితులే యని యెన్నెద నందఱన్ పరం
    ధాముని రామచంద్రుని సదా మిము బ్రోవగ వేడుచుండెదన్.

    స్వస్తిరస్తు.

    రిప్లయితొలగించండి
  3. అమ్మా అనూరాధగారు,

    నా వ్యాఖ్య ఒకదాని వలన మీకు నొవ్వు కలిగినందుకు క్షంతవ్యుడిని. నా ముందటి కించిత్తు దీర్ఘమైన ఆ వ్యాఖ్యను మీరు ప్రచురించనవసరం లేదు. ఈ వ్యాఖ్యనూ మీరు ప్రచురించనవసరం అనుకోను. గతం గతః. శతాధికనమస్కారములు.

    రిప్లయితొలగించండి
  4. జై గారూ , తప్పకుండా..
    ప్రజలెక్కడైనా మంచివారేనండీ..
    వారికి ప్రశాంత జీవనం కావాలి..
    నిశ్చింతైన భవితకావాలి..
    పక్కనున్న వాడు తెలుగువాడైనా .. పక్క రాష్ట్రం వాడైనా ఆఖరికి విదేశీ అయినా తమలో కలుపుకుపోవటమే తెలుసు ..
    వారి సంప్రదాయాలను తెలుసుకుంటారు.. గౌరవిస్తారు.. మన సంప్రదాయాలను తెలుపుతారు..
    ఇక పోతన్న విషయానికొస్తే..
    పోనీలెండి పోతన్న మనవాడు అనుకుంటే అది కూడా ఒక రకమైన భక్తే కదా..
    ఇక్కడ ఒక్కమాట.. పుట్టపర్తి నారాయణాచార్యులు అని వుందంటే.. మా నాన్న పుట్టపర్తిలో పుట్టారనా..కాదే..
    కొందరి ఇంటికి ఇంటిపేరుగా యేదో ఒక ఊరిపేరు ఉంటుంది..
    దానర్థం ఆ వూరిలో వారు పుట్టారని కానీ చెందినవారు అని కానీ అర్థమా..యేమో నాకు తెలీదు..
    అయినా మనకెందుకీ గొడవలు..
    హాయిగా మనపని మనం చేసుకోక..కదండీ..
    బమ్మెర పోతన బమ్మెర లోనే పుట్టాడంటే మనకేమభ్యంతరం..
    ఆయన భాగవతంతో పనికానీ ..

    పుట్టపర్తి అనూరాధ

    రిప్లయితొలగించండి

  5. శ్యామలీయం గారూ..
    మీ మానస్సు నొప్పించినందుకు క్షంతవ్యురాలిని..
    ఆరుద్ర .. దాశరధి..సినారె.. వీళ్ళందరూ..
    అన్నా అన్నా.. అంటూ మా అయ్య దగ్గర మసలుకొను వాళ్ళట..
    సినారెని పుట్టపర్తిని గురించి చెప్పమంటే..
    యే నారాయణాచార్యులు.. ఓ .. పుట్టపర్తి నారాయణాచార్యులా,, ఓ.. ఇద్దరున్నారు కదూ..
    అంటూ నవ్వారు..ఎంత బాధనిపిస్తుంది చెప్పండి..
    పుట్టపర్తి నారాయణాచార్యులంటే.. అంత గుర్తుకు రాని వాడైపోయాడా..
    చరిత్రలో నిలబడిపోయే చరిత్ర ఆయనది
    విశ్వనాధ తనకొచ్చిన జ్ఞానపీఠ్ డబ్బుతో
    శివాలయం కట్టించారట..
    మా అయ్య కోసం నేనూ ఆపని చేయాలని వుంది..
    ఇంకా యేవేవో..
    దైవం అనుకూలించాలి..

    పుట్టపర్తి అనూరాధ

    రిప్లయితొలగించండి
  6. మిమ్మల్ని అనవసరచమత్కృతిపూర్వకంగా నొప్పించానేమో అన్నదే నా శంకగాని మీరేమిటి నన్ను నొప్పించట మేమిటి! అటువంటిదేమీ లేదు.

    శా. అరయన్ జీవుల దిక్కుమాలిన మహాహంకార హుంకారముల్
    తరచై యేహ్యత గొల్పు చెడ్డపనులున్ దర్పోధ్ధతల్ దైవమున్
    పరిహాసంబును జేయుచుండు నన స్వల్పప్రజ్ఞతాసిధ్ధులౌ
    నరులే యుత్తమునైన గాంచి నగరే నానాప్రకారంబులన్

    అందుచేత మీరు విచారించవలసిన పనిలేదు. ఎఱుకగలవారిని అది ఆట్టే లేని వారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది లోకసహజం. మీరు మీ నాయనగారి కొఱకు ఏదైనా మంచి స్మృతిచిహ్నం ఏర్పరచాలనుకుంటే అది సత్కార్యం కాబట్టి తప్పకుండా దైవానుగ్రహం తోడవుతుంది.

    కం దైవం బనుకూలించుట
    కావలయును భూమి నెంత ఘనులకు నైనన్
    దైవంబున కీ భూమిని గల
    జీవులు తన పథమునందు చేరుట వలయున్.

    అట్లా దైవపథాన్ని పట్టిన ఒక కాబట్టి భక్తునికి మీరు చేయదలచుకున్న ఏర్పాటు ఎంతో భగవత్ప్రీతికరం కూడా.

    రిప్లయితొలగించండి
  7. అన్నగారూ .. కృతజ్ఞతలు..
    మీరింత సహృదయంతో అర్థం చేసుకున్నందుకు..
    నేను మా ఇంట్లో .. చిన్న పిల్లని..
    అమ్మా అయ్యల ఇద్దరిప్రేమనీ ముద్దు ముద్దుగా పొందిన అదృష్టవంతురాలిని..
    అందరూ చిన్నపిల్లగా పరిగణించడంతో ..
    నేనెంత పెద్ద దాన్నైనా..
    నాలోని ఆ చిన్నతనం పోలేదు..
    ఎప్పటికి పోతుందో..
    పోవాలని నేను అనుకోవటం కూడా లేదు..
    ఆ లాలన .. ప్రేమ.. ఇవి చాలవూ..
    నన్నెప్పుడూ అలా .. ఊయల ఊపుతూనే వుంటాయి..
    కొంచెం సిగ్గనిపించినా .. ఇది నిజం..
    అమ్మా .. అయ్యల loving care అలాంటిది మరి..
    పుట్టపర్తి అనూరాధ

    రిప్లయితొలగించండి