12 సెప్టెం, 2016

ఆచెడు భావముల్.. కలచునప్పుడు..

శివతాండవంపై 
శ్రీ వఝ్ఝల రంగాచార్యులు  గారు పరిశోధన చేశారు
పుట్టపర్తి రచనలను విశ్లేషిస్తూ
'పాద్యము ' గురించి వారు క్రింది విధంగా రాసారు.

భగవంతుని 
గురుదేవునిగా యోగిపుంగవునిగా భావిస్తూ 
ఒక జీవుడు చేసే ఆత్మ నివేదన 
ఈ పాద్యము.



పరమాత్మ 
సర్వ జగన్నియామక శక్తిగా 
సానంద సాకార స్వరూపునిగా 
మొదటి రెండు కావ్యములందు వర్ణింపబడెను యోగపుంగవునిగా సంభావింపబడెను. 

పాద్యమునందు అట్టి పరమాత్మయే 
యోగిరూపమున గురుదేవుని రూపమున 
తన ఇంటికరుదెంచెనని చెప్పబడినది.


'' తరుణాబ్జ తుహిన ముక్తామాల బోలునే
  త్రముల దయార్ద్ర భాష్పములతోడ
  గంభీరభావ నిష్కలుష దీప్తులు పర్వి
  యొరబెట్టి విడిచిన పరిధితోడ
  నవరసాల కిసాల ప్రవిమలారుణకాంతి 
  నొడిగొన్న జుంజురు జడలతోడ
  నావంటి పతితులెందరినైన రక్షింప
  జూచిన అభయహస్తంబుతోడ... 

  యజ్ఞవేదికవలె బవిత్రారుణములు
  నిండుచూపులు దిక్కులనిండి వెలుగ
  మా గురుస్వామి నాపాలి మధురమూర్తి
  వచ్చినాడమ్మ మా ఇంటివరకు నేడు''



  ఈ పద్యమున 'ఇల్లు' అనగా 
భక్తిభావనాకుటీరము. 
అందొక సుమూర్తమున 
పరమేశ్వరుని రూపము ప్రత్యక్షమైనది. 
ఆ రూపము 'యోగి రూపమువలె' వున్నది.

పుట్టపర్తి ఈ రూపమును సంభావించుటకు కారణము ఆయన ఉపాసించెడి 
'అష్టాక్షరీ మంత్ర' ప్రభావమనవచ్చును. 
నారాయణ ఋషి ద్వారా 
అష్టాక్షరీమంత్రము లోకమున పరంపరగా ప్రవచింపబడెను. 

మంత్రమునకు ..మంత్రద్రష్టకు ..
అభేదమును భావించుట సంప్రదాయము. 
ఈ విధముగ పరమాత్మ రూపమును 
యోగి రూపముగ కవి సంభావించెను. 

ఆయన దివ్య రూపమును కీర్తించి 
తన వేదన లేక ఆర్తిని ప్రకటించెను. 
ఈ నివేదన 
భగవంతుని గుణాధిక్యము 
ఆత్న న్యూనతా భావముగా 
ఇరువది ఏడు పద్యములలో సాగినది. 

సృష్టింపబడిన ఛందోమయాకారం కూడా భావానుగుణముగా నున్నది. 
భగవంతుని స్వరూపము సీసపద్యమునందు వర్ణింపబడెను. 

తరువాతి  వన్నియు తేటగీతిపద్యములు. 
ఈ పద్యములలో జీ వుని వేదన వర్ణింపబడి 
అహంకారము త్యజింపబడినది. 

చివరకు తన్మయీభావస్థితిని 
జీవా త్మ అనుభవించినది.
ఆత్మ సమర్పణము భక్తి భావనాదశలలో చివరిమెట్టు. 

ఆ స్తితిని చేరకముందు 
భక్తునకు భగవంతునియెడ ఆసక్తి యుండును. 
ఈ ఆసక్తి భావనాపరము. 
దీనినే నారదాదులు అహేతుకమగు పదునొకండు భక్తి భావనాసక్తులుగా చెప్పిరి.

 ఆత్మ నివేదన మొనరించిన భక్తునకు 
పరమేశ్వరుడు ఎలవేళలా 
అతడు కోరినట్లు దర్శనమిచ్చుచుండును. 
భగవంతుని అనుభవముగాఢమై 
భావనలు పరిపక్వమై 
రసపర్యవసాయి అగును. 

భక్తి రసాయన కారులు వీటినే 
దాస్య సఖ్య మధుర శాంత రసములుగా చెప్పిరి. 

నారదాదులు చెప్పిన భక్తిభావములు - రసములు
గుణమాహాత్మ్యా సక్తి
స్మరణాసక్తి
రూపాసక్తి
పూజాసక్తి
దాస్యాసక్తి 
ఆత్మ నివేదనాసక్తి 
వాత్సల్యాసక్తి
కాంతాసక్తి
పరమవిరహాసక్తి
తన్మయతాసక్తి

పాద్యమునందు వర్ణింపబడిన జీవేశ్వరుల సంబంధము గాఢమైనది కాదు.
ఒక సన్ముహూర్త మున .. 
' కల వలె హతాత్తుగా వచ్చి '
 భగవంతుని రూపము నిలచినది

ఆ రూ పమును కనులార దర్శించి 
తనివితీర సంభాషింతమనుకున్నంతలో 
అందులకు తాను 'అర్హుడనా.. ?'
 యను సందేహము కల్గి జీవుడు కొట్టు మిట్టాడినాడు.

ఈ దశలో భావములు 
ఒకదానిపై ఒకటి యుబికి రాగా 
వాటిని నిలుపుకోలేక పోయినాడు
జీవుడు  భగవంతుని రూపమును దర్శించుటలో 
కలిగిన ఈ భావాసక్తులనే 'పాద్యము' వర్ణించినది

''సాత్మస్మిన్ పరమ ప్రేమ  రూపా' 
ప్రేమ  యనగా ఒక వస్తువునందు లేదా వ్యక్తియందు కల్గెడి అనురాగము. 
లౌకికమైన ప్రేమ  ఉపాధులనాశ్రయించి యుండును. అలౌకికమైన ప్రేమ 
భగవంతుని రూపము నాశ్రయించి యుండును. 
అట్టిదియే భక్తియని నారదాదుల అభిప్రాయము. 

ఉపనిషత్తుల యందు ఈ ప్రేమ భావనము 
'ఉపాసన' యని పేర్కొనబడినది.

లౌకిక విషయములందు ప్రేమ క్షణికమైనది. 
కాని భగవంతునియందు కల్గెడి ప్రేమ 
తైలధారవలె అవిఛ్చిన్నముగా నుండవలెను. 

పరమశబ్దముచే ఈ ప్రేమను 
భగవంతుని యందు తప్ప 
ఇతరుల యందుండకూడదని నారదాదులు సూచించిరి. 

భగవంతుని యందుండు ప్రేమ 
నిష్కామముగా నుండవలెను. 
పెనుగొండ లక్ష్మియందు మొదటిపద్యము లోని ప్రేమాధీశ్వరుడాను వర్ణనమిట్టిదే.

భగవంతుని సర్వజ్ఞత్వ సర్వశక్తిమత్వమూ 
కవి సృజనాత్మక సాహిత్యములోని 
మొదటిపద్యమునందే ప్రకటింపబడినవి. 
పాద్యమునందు 
వాత్సల్య సౌశీల్య సౌలభ్యములు వర్ణింపబడినవి. 

'' వాసనయెలేని క్షుద్రపుష్పమ్మునెవరు 
  తలధరింతురు రాలిపోవలెనెగాని
  బ్రతుకుజీకిన నా ప్రేత హృదయమెంత
  ఇంపుగానందుకొంటివోయి గురూజీ''

తన బ్రతుకు 
'వాసనలేని క్షుద్ర పుష్పము ' వంటిదని 
ఆత్మన్యూనతను వెల్లడించి, 
ఇటువంటి నికృష్ట జీవితమును ఆకర్షించిన 
భగవంతుని స్తుతించెను. 

ఈ వర్ణనలో  
'' మహర్షీ ''
అని భగవంతుని సంబోధించుట చేత..
'యమే వైషవృణుతే తేన లభ్యః'
అను ఉపనిషద్వాక్యమిచట అనువర్తించును.
పాపినిగానీ.. పుణ్యవంతునిగానీ..ఎవరినైతే భగవంతుడు స్వీకరించాలనుకుంటాడో.. 
అతనిపై తన అవ్యాజకృపాకటాక్షము ప్రసరింపజేసి స్వీకరిస్తాడని అర్థము.
భగవంతుని వాత్సల్యము అవ్యాజకృపా కటాక్షము పైపద్యమున వర్ణింపబడెను. 

రెండవపద్యములో భగవంతుని వాత్సల్య భావమును 
'' ఆ మహాఋషి చూపులయందు పొడమి జీవకారుణ్యమెల్లడా చిలికినదియో'
అని జీవకారుణ్యమూర్తిగా సంభావించెను.

నా పేదహృదయమెంత ఇంపుగానందుకొంటివోయి మహర్షి.. '' 
అనుటలో ఇట్టి భావన విశదమగుచున్నది.
భగవంతుని వాత్సల్య గుణమును సన్నుతించుట
 భక్తి భావనా సక్తులలోని గుణ మహాత్మ్యాసక్తి యని చెప్పవచ్చును.
తన ను  అకారణముగా ఈ సంఘము బహిష్కరించినదని తాను తిరిగి మరణించుటకే జన్మనెత్తిన జడుడనని 
తన కారుణ్యగాధ భగవంతునికి నివేదించెను.

శివతత్వసారము మొదలగు భక్తి శతకములలో 
'నేనొక నికృష్ట మనుజుడ.. '
నని ఆత్మన్యూనత్వమును వెల్లడించుటకనిపించును

ఆధునిక కవులలో భావకవులు కొందరు 
తమను తాము అతి దైన్యంగా చిత్రించుకుని 
భగవంతుని కరుణామయునిగను 
పాపులను రక్షించువానిగను అభివర్ణించిరి. 

ఇది క్రీస్తు మత ప్రభావము కావచ్చును. 
ఆప్తుడగు జీవుడు తన దైన్యమును 
భగవంతునకు నివేదించి ఆయన కటాక్షమును కోరును. 

ఇట్టి జీవునకు 'ఆర్తుడ'నిపేరు. 
పాద్యమునందు కనిపించెడి
జీవునివేదనలో ఆర్తి లక్షణమున్నది.

'' లౌకికవిషాదముల గుండె రగిలి రగిలి
   నీ చరణ సీమ నాశ్రయించితిని నేను ''

భగవంతుని ఆశ్రయించిననూ 
ఆ సంబంధములోని ఒక నూత్న అనుతాపమును జీవుడు పొందుచున్నాడు. 
అతని దర్శనము జీవునకు అంత స్పష్టముగా లేదు. అందువలన..

'కలవలె హటాత్తుగ వచ్చి నిలిచినావు
 తండ్రి పతితుడ ఈ గృహాంతరమునందు
 సత్యమునువోలె నెపుడు శాశ్వతముగాగ
 నిండుచూపుల నన్ను మన్నింపవయ్యా..''

అని కోరుకొనెను.
స్వప్నావస్థ వలెనున్న అస్పష్టానుభవమును 
'సత్యము' వలె శాశ్వతము చేయుమని కవి భావన. 
ఈ పద్యమున రెండు విశేషములున్నవి.


 పరమాత్మను సత్యముతో నుపమించుటచేత
 'సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా '
అను ఉపనిషద్వాక్యమిచట అనువర్తించును.
పరమాత్మను 'తండ్రి' అని సంబోధించుట పాద్యమున రెండుమూడుచోట్ల కనిపించును
జీవేశ్వరులకు గల నవవిధ సంబంధములలో 
పితాపుత్ర సంబంధమొకటి. 

'పితాచరక్షకశ్శేషీ' అనుసంబంధము పాద్యమున 
జీవుడు ప్రదర్శించినాడనవచ్చును.

శాశ్వతముగా తన  హృదయమున నిలువుమని.. భగవంతుని ప్రార్థించినకవి
అతనికి సమర్పించిన 'ముఖపూజ' విలక్షణమైనది.
పలుకరింతమని బుధ్ధిపుట్టునుగాని 
వెంటనే సిగ్గు ఆవరించును..
మనసులో భావ శబలత్వమున్నది.. 
దరిజేరి నిలచెదామనినంతనే .. శరీరము కంపిం చి.. గుండెలు దద్దరిల్లుచున్నవి.. 

రాక రాక వచ్చిన గురుదేవుని జూడగా 
కనుల భాష్పములు నిండినవి..
ఆ భాష్పపూరంబుతో పాద్యమిడుదుననుకొనినంతలో

'ప్రతిజలకణము పరమ పూతంబు 
తమ పేరు పలుకదేమో'
అని సందేహము..

ఈ విధముగా సాగినది ముఖపూజ..
ఇందురేఖామాత్రముగా 'కాంతాసక్తి' కని పించుచున్నది..

తనను కాంతగా చిత్రించుకొని 
పరమాత్మను ప్రియునిగా భావించుట
కాంతాసక్తి.
ఈ విషయము అయిదారుపద్యములలో వర్ణింపబడి చివరగా..

'' నా తలపుపంట.. నావాడు.. నాధవుడు.. '' 
అని స్పష్టముగా మధుర భక్తి భావన.

తరువాతి రెండుపద్యములలో 
పుత్రభావముతో తల్లడిల్లుట వర్ణింపబడెను
జీవునకు కల్గిన ఈ అనుతాపము
 అతనికి అంటియున్న అహంకారము వలన కల్గుచున్నదని గ్రహించి 
ఆ అహంకారమును త్యజించెను.

'నేననెడి భావమున తెగనీల్గిపోవు
 శిరమువంచితి గురుదేవు చరణ సీమ'

'నేను' అను భావమును విడనాడుటయే 
అహంకార త్యాగము. 
అహము తొలగిన వెంటనే 
సర్వము భగవదధీనము అగును.
అదియే ఆత్మ  నివేదనము.

ఈ స్తితిలో కామ్యమునకు తావుండదు.
అందువలన అంతఃకరణము పరిశుధ్ధమై 
గురుదేవుని అమృత మయమైన వాక్కులను వినగల్గెను.
రూపమును కనగల్గెను..
అతని శీతలఛ్చాయలో తన్మయమును అనుభవించెను.

ఈ విధముగా పాద్యపద్య తారావళియందు 
జీవేశ్వరుల సంబంధములోని 
భావాసక్తులు ప్రకటింపబడినవి. 

ఇందు ప్రకటింపబడిన జీవుని వేదన 
'వేదనాశతకము'
 నందు విస్తృతముగా వివరించబడినది. 
భగవంతుని గుణాధిక్యము విభూతులుగా 
తద్విభూతుల అనుభవము గాఢమై 
భక్తి భావాసక్తులు
 దాస్య సఖ్య మధుర శాంతి రసములుగా
'విభూతి శతకము' నందు పర్యవసించినవి.

ఒక విధముగా పాద్యము 
వేదనాశతక .. విభూతి శతకములకు 
సంక్షిప్త రూపమని చెప్పవచ్చును.