1 జన, 2013

అమరం నీ కవనం -అవధాన చక్రవర్తి మేడసాని మోహన్ 

                       అమరం నీ కవనం 


మూర్తీభూత సంగీత సాహిత్య కళాసరస్వతీ
సహృదయ సామ్రాజ్జ చక్రవర్తీ
పుట్టపర్తీ

నీ అస్తమయం కేవలం భౌతికం
నీ కవనోద్యమం కవితా రసజగతికి నిరంతర మహోదయం
అక్షరాలు అస్తమింపవు
అక్షయ మూర్తులు అస్తమింపవు
అక్షర శిల్పాలను అక్షయ కవితా శిల్పాలుగా
దిద్ది తీర్చిన ప్రతిభా ప్రభాకరుడవు నీవు.
నీకు అస్తమయం లేదు
మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ యిత్యాదులన్నీ
సాక్షాత్ సరస్వతీదేవి నిన్ను పిలుచుకునే ముద్దుల పేర్లు
అలంకరించుకున్న ఎన్ని అస్థిపంజరాలు అట్టహాసం చేసినా
నీ శివతాండవ ధాటికి నిలువలేకపోయాయి
అలనాటికి రామదాసుకు , తానీషాకు
సాక్షాత్కరించిన శ్రీరామ చంద్రుని
భువన సుందర మోహనాకారాన్ని
నీ కవితా రూప తపస్సులో సాక్షాత్కారం చేసుకున్నావు.
శ్రీనివాస ప్రబంధ సృష్టి
అఖండ కవితా రసామృత వృష్టి
పండిత సత్తమా...!పరమ భాగవతోత్తమా..!!
భాగవతసుధాలహరీ సమాస్వాదనం చేసిన నీవు
అనల్ప శిల్ప కల్పనా విలసిత కవితా జగత్తులో అజరామరుడవు.
అవధాన చక్రవర్తి మేడసాని మోహన్,ఆంధ్రపత్రిక

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి