15 ఏప్రి, 2016

నీలి రాగం

                          శివధనుర్భంగం ..
జనకుడు శివధనుస్సునుగూర్చి పెద్దగా చెబుతాడు. విశ్వామిత్రుడు అదంతా విని ..
కేవలం అతి సామాన్య విషయంగానే ..
''వత్స రామా ధనుః పశ్యా' అంటాడు . 

రాముడు కొంచెం చేతితో తాకుతానంటాడు. 
జనకుడూ విశ్వామిత్రుడూ కానిమ్మంటారు . 
రాముడు ధనుస్సునెత్తి ఎక్కుఎట్టటానికి ప్రయత్నిస్తే..
 అది మధ్యలో విరుగుతుంది. 

ఈ సందర్భంలో వాల్మీకి రెండే శ్లోకాలు వ్రాస్తాడు. 
వాటిలో పెద్ద సమ్రంభం ఏమీ లేదు. 
అతి సామాన్య విషయంగా చెబుతాడు.
 ఆ శ్లోకాలివీ..

''తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః
భూమికంపశ్చ సుమహాన్ , పర్వతస్యేవ దీర్యతః''

నిపేతుశ్చ నరాస్సర్వే తేన శబ్దేన మోహితాః
వర్జయిత్వా మునివరం, రాజానాం తౌ చ రాఘవౌ''

ఇతర కవులిచట 
భయంకరమైన శాబ్దిక కోలాహలం చేసినారు. 
వాల్మీకికి రాముని జీవితంలో శివధనుర్భంగం
 అతి సామన్య విషయంగానే తోచింది..

సీతారాముల శృగారాన్ని కూడా 
ఆయన అట్లే చలా హుందాగా చెబుతాడు. 
సీతాదేవి రామునికి పరమ ప్రియురాలు.. 
ఎందువల్ల ? 
''దారాః పితృకృతా ఇతీ'
ఈ పెళ్ళి తల్లిదండ్రులు చేసినారు.. 
అదే కారణం. 

వాళ్ళ మధ్య ప్రేమ .. 
దినదినానికీ ఎదుగుగుతూ వచ్చింది.
 ''గుణా ద్రూపగుణాచ్చాపీ'
రూపంతో .. 
పరస్పరం వున్న సద్గుణాలతో పెరుగుతూ వచ్చిందట. 

రాముని మనస్సులో సీతకంటే ద్విగుణంగా 
సీతాదేవి మనస్సులో రాముడు పారాడినాడు. 
వాళ్ళప్రేమ ఎప్పుడూ హృదయాలతోనే మాట్లాడేది. 
ఏ సమయంలో రాముడేమి తలుస్తాడో సీత కెరుక.
 అట్లే రామునికి కూడా. 
ఇంత గంభీరంగా వుంటుంది. 

వాళ్ళ వర్తన .. వాళ్ళ ప్రేమ.. 
ఒక్కసారి బయటికి రేఖామాత్రంగా కన పడుతుంది. 

అరణ్యాలకు పోవడానికి ముందు 
కైక రామలక్ష్మణులకు సీతకు నారచీరలిస్తుంది . 
రాముడు కట్టుకున్నాడు. 
సీతాదేవికి ఆ చీర కట్టుకోవడం తెలియదు. 
ఆమె ఎన్నడు కట్టుకుంది గనుక..?? 

ఆమె ఎడమ చేతితో పై కొంగు పట్టుకుని 
కుడిచేతితో చీర అంచును పట్టుకుని 
రాముని వైపు సాభిప్రాయంగా చూచింది. 
అప్పుడు రాముడు వచ్చి తన చేత్తో ఆ చీరను కడతాడు. 

ఈ సన్నివేశం చదివినప్పుడు 
మనకు శరీరం ఝల్లుమంటుంది.
అందుకే సీతారాముల ప్రేమను ఆలంకారికులు 
'నీలిరాగ' మన్నారు . 

ఈరీతిగా ప్రతి   సన్నివేశంలోను.. 
ప్రతివర్ణనలోను.. 
వాల్మీకి సంయమన  శక్తి  ప్రత్యక్షమవుతుంది.
ఇలా చెప్పడం మానవమాత్రులతో అయ్యేది కాదు

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి