27 ఏప్రి, 2016

పెద్దన్న రచనా స్వరూపం




పరవశదైన్యమాడుకొను ప్రౌఢల గానదు, ఘర్మ వారిచే
గరగి స్రవించు చిత్రకముగన దనామృత వీటి పాటలా
ధరమున సున్నమంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్న, గానదొక బాల నృపాలుని జూచి, నివ్వెరన్

స్వరోచి మనోరమ వీరి కల్యాణాన్ని వర్ణిస్తున్నాడు పెద్దన. విడిది ఇంటినుంచీ కల్యాణమంటపానికి 
స్వరోచి లేఖ స్వామి చౌదంతిపై కూర్చొని 
మెరవణిగా పోతున్నాడు

అప్పుడు గంధర్వ నగరంలోని స్త్రీలు 
పెండ్లి కుమారుణ్ణి చూడడానికి మేడలెక్కినారు. 
ఈ వివిధ నాయికలను పెద్దన్నగారు 
పది పద్యాలలో చెబుతున్నారు. 

అందులో 
ఒక ముగ్ధ నృపాలుణ్ణి చూసింది.
ఆ సౌందర్యం 
ఆమెను ఆశ్చర్య సముద్రంలో ముంచివేసింది
తదేకంగా ఆవిడ రాకుమారుణ్ణి చూస్తూ వుంది
ఆమె మనసూ పారవశ్యంతో బాహ్య స్మృతిలో లేనేలేదు
ఆమె ఆ చిత్తవృత్తిని వర్ణిస్తున్నాడు కవి

ఆమెతో బాటు చూస్తున్న ప్రౌఢ కాంతలు ఆమె పారవశ్యాన్ని గమనించి మేలమాడుకున్నారు
స్వేదోదయమైంది
తిలకం కరిగి పోతూంది
తాంబూలపు పెదవిపై సున్నం అంటింది
ఆమె స్పృహలోనే లేదు
ఆమెను ఆటపట్టించడానికి ఆమె ఆభరణాన్ని మెల్లగా తీసుకున్నారు
ఆమెకు తోచనేలేదు
ఈ పద్యాన్ని నాకు పాఠం చెబుతూ మా నాన్నగారు దీంట్లో నీకు విశేషం యేమీ కనిపించడంలేదా
అని అడిగారు
ఏముంది పద్యం బాగుంది
పెద్దన్న శైలి శిరీష కోమలం కదా అన్నాను
వారు నవ్వి
అంతమాత్రమే కాదు 
పెద్దన్న గారు తమ రచనా స్వరూపాన్ని తామే 
ఈ పద్యంలో  వివరిస్తున్నారు
అన్నారు
నిజమే ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
మనుచరిత్రను చదివినప్పుడు
వారి రచన అనే క చోట్ల ఈ ముగ్ధాలక్షణానికి వ్యాఖ్యానప్రాయంగా వుంటుంది
-మహాకవి పుట్టపర్తి

7 కామెంట్‌లు :

  1. పెద్దనను మరువలేని ఒక నానుడి ఉంది --గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్... అని...చూడండి ఎంతబాగుందో కదా...ఎప్పటికీ కూడా గడిచిపోయిన కాలమే బాగుంటుంది ఇప్పటికీ అలాగే జరుగుతోంది... పోను పోను మరీ గడ్డుకాలం దాపురించినా ఆశ్చర్యం లేదు కదా...
    చాలా చక్కగా పద్యాల వివరణ ఇచ్చారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరపాటు పడ్డారండీ రమణ గారూ. ఈ నానుడి మూలం‌ ఇది:

      కం. మతిఁ దలపఁగఁ సంసారం
      బతి చంచల మెండమావు లట్టుల సంప
      త్ప్రతతు లతిక్షణికంబులు
      గతకలము మేలు వచ్చుకాలము కంటెన్

      ఇది శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసంలోనిది. పాండురాజుకు పరలోకక్రియలు జరిగిన పిమ్మట ఒకనాడు కృష్ణద్వైపాయనుడు (అంటే వేదవ్యాసుడు) తన తల్లి సత్యవతీమహాదేవి గారితో ఏకాంతంలో చెప్పిన మాటల్లోనిది ఈ పద్యం. అమ్మా ఈ సంసారం అనేది ఎండమావుల్లాగా చంచలమైనది. సంపదలూ సౌఖ్యాలూ అన్నవి క్షణంలో వచ్చిపోయే బాపతు. నీకు ఇప్పటిదాకా జరిగిన కాలమే దొడ్డది రాబోయే కాలంతో పోలిస్తే. ఈ ధృతరాష్ట్రసంతానం కారణంగా కౌవరవంశనాశనం తెచ్చిపెట్టే ప్రళయంలాంటి యుధ్ధం వస్తుంది. ఈ దురదృష్టకర సంఘటనలు చూడటం మనస్తాపం చెందటం చేయకుండా మీరు ఇంక వనాలకు తపస్సు చేసుకుందుకు వెళ్ళండి అని వేదవ్యాసముని బోధన.

      ఈ గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నది తెలుగువారికి బాగా నచ్చి సామెతలాగా ఐపోయింది.

      ఇలాంటిది మరొకటి శ్రీమధ్బాగవతంలోని దశమస్కందం లోనిది ఉంది. పోతన్నగారు విదురుడు శ్రీకృష్ణుణ్ణి మధురకు తోద్కొనిపొవటానికి రేపల్లెకు వచ్చినప్పుడు నందుడి నోట అనిపించిన పద్యం:

      కం. ఊరక రారు మహాత్ములు
      వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం
      గారణము మంగళములకు
      నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా!

      అని. ఇందులోని ఎత్తుగడ ఊరకరారు మహాత్ములు అన్నది కాస్తా తెలుగువాళ్ళకి అందమైన సామెతలాగా ఐపోయింది.

      తొలగించండి
  2. స్వామి ఉటంకించిన ఆ మాట - నేను వ్రాసిన వ్యాసంలోనూ ఉపయోగించుకున్నానండి. :)

    http://eemaata.com/em/issues/201511/7918.html

    రిప్లయితొలగించండి
  3. < " విదురుడు శ్రీకృష్ణుణ్ణి మధురకు తోద్కొనిపొవటానికి రేపల్లెకు వచ్చినప్పుడు నందుడి నోట అనిపించిన పద్యం:"
    ------------
    విదురుడా అక్రూరుడా, శ్యామలీయం గారూ?

    రిప్లయితొలగించండి
  4. సారీ రవి గారూ జవాబివ్వటం లేటైంది మీ వ్యాసం చక్కగా వుంది.

    రిప్లయితొలగించండి
  5. కవిత్వం యొక్క ఆల్కెమీ రహస్యాన్ని పూర్తిగా ఎరిగినవాడు పోతన్న -తిలక్
    పెద్దన లోని యెవ్వతె వీవు భీత హరిణేక్షణ.. చిన్నివెన్నెల కందు.. ఇంతలు కన్నులుండ..
    పద్యాలు పాటల మాదిరి సాగే ఆ తూగు నాకెంతో ఇష్టం..రమణగారూ

    రిప్లయితొలగించండి