8 అక్టో, 2011


మార్చిన వార్తా విశేషాలు - శని వారం అక్టోబర్    08th 2011 - 5:33 PM


సాహిత్య జ్ఞాపకాలు
ఆది వారం, సెప్టెంబర్ 13, 2009 , 12:38 [IST]
డాII గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి

సుప్రసిద్ధ కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 1948-56 సంవత్సరాల మధ్యకాలంలో బాల్య కౌమార దశలో ఉన్నారు. శతాంకురాను నిర్మించిన ఈ సాహితీ ప్రముఖుడి సారస్వత అంకుర దశ ఆ కాలంలోనే కనిపిస్తుంది. నాటి ఎనిమిదేళ్ళ కీలకమైన సంధి సమయంలో సుప్రసన్న యాది ఇది.

నా బాల్యంలో పగటిపూట రజాకార్ల దారుణ చర్యల్ని రాత్రివేళల్లో కమ్యూనిస్టుల హింసాత్మక అధ్యాయాలను చూశాను. రెండు రకాలైన హింసో న్మాదాల మధ్య ఆనాటి నా అనుభవాలు గడిచాయి. అదొక ఉద్రిక్తమయమైన సమయం. అప్పటికి నేను ఐదవ తరగతిలో ఉన్నాను. కల్లెడలో సంపన్న భూస్వామి మెర్రబెల్లి వెంకటేశ్వరరావుకు మా కుటుంబంపట్ల గౌరవం ఉండేది. మేము వరంగల్లు నుండి కల్లెడకు తరలి పోయాము. మా తాతగారు కోయిల్‌ కందాడై రంగాచార్యులు, గొప్ప పండితులు. పౌరాణికులుగా ఆయనకు గొప్ప పేరు ఉండేది. నేను ఆయనతో కలసి ఉండేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రేమతో చూసుకునేవారు. కల్లెడలో ప్రతాపురం రాఘవాచారి అనే ఆయన ఖాన్గీ (ప్రైవేటు) పాఠశాలపెట్టి నడిపేవారు. కవిత్వంపై కూడా చర్చలు జరిగేవి. కల్లెడలో ఉన్న రోజుల్లోనే సంపత్కు మారాచార్యతోకలిసి ''అంగదవిజయం అనే రచన చేశాను. రజాకార్లు, కమ్యూనిస్టులు కల్లెడ గ్రామంలోకే వచ్చేశారు. తిరిగి వరంగల్లు వచ్చాము. పరిస్థితులుచూసి బెజవాడ తరలి వెళ్ళాము. కట్టు బట్టలతో కదలిపోయాము. తిరిగి వరంగల్‌ వస్తామనుకోలేదు. ఇదీ ఆనాటి (1948 కి కొంచెంముందు) పరిస్థితి.
 మా తాతగారికి విజయవాడలోనూ విస్తారమైన శిష్యరికం ఉండేది.

అక్కడ కొత్తగుడి ప్రాంతంలో ఉండేవాళ్ళం. తాతగారు తిరిగి వరంగల్లు చూస్తాననుకోలేదు. వరంగల్లు శిస్యులు మా తాతగారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. '''వరంగల్లులో నా వస్తువులేవీ నాకు వద్దు, వాటిపైనాకు పెద్దగా ఆశలేదు, నేను దాచుకున్న పుస్తకాలు పంపించండి- చాలు అని మా తాతగారు శిష్యులకు కబురుపెట్టారు. శిష్యులాయన పుస్తకాల్ని బూరుగు చెక్కపెట్టెల్లో పెట్టి బెజవాడకు పంపించారు. బెజవాడ లోని మున్సిపల్‌ హైస్కూల్‌లో మొదటి ఫారంలో చేరాను. మా బాబాయి సంపత్కు మారాచార్యులవారు రేపల్లెలో చదువుకునేవారు.
బెజవాడలో జీవితం పలువురు ప్రహుఖ సాహితీవేత్తల రచనలతో నాకు పరిచయాన్ని పెంచింది. చెళ్లపిళ్ళ వేంకట శాస్త్రి ఆ రోజుల్లో బెజవాడలోనే ఉండేవారు. విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వెంకటాచలం రచనలతో నాకు అపుడే పరిచయం అయ్యింది. మున్సిపల్‌ హైస్కూల్‌లో కారుమంచి కొండలరావు అనే గొప్ప ఉపాద్యాయుడు ఉండేవారు. తర్వాత ఆయన వరంగల్లులోనూ పనిచేశారు. వరంగల్లునుండి బెజవాడవచ్చేసరికి నా భాషలో మార్పుకనిపించింది.

బెజవాడలో బాగా కష్టపడ్డాం. రెండుమూడు ఇళ్ళు మారాము. కన్యకాపరమేశ్వరి ఆలయ  సత్రంలో ఉచిత వసతి దొరికింది. బెజవాడ జ్ఞాపకాల్లో తెెలంగాణ తాలూకు కొన్ని అపూర్వమైన సాంస్కతిక స్మతులున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ అతి విశిష్టమైన ఉత్సవం. ఆనాటి కల్లోల కాలంలో వరంగల్లు నుండి బెజవాడకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తరలి వచ్చిన కుటుంబాల్లోని మహిళలు- బెజవాడలోనూ బతుకమ్మ పండుగ జరిపారు. బతుకమ్మల్ని పేర్చి బెజవాడ కష్ణా నదిలో నిమజ్జనం చేశారు.  ఇది నా జీవితంలో ఏనాటికీ మరచిపో(లే)ని సాంస్కతిక స్మతి.

తిరిగి మరోమారు తెలంగాణ జ్ఞాపల్లోకి వస్తాను. ఆనాటి వరంగల్లు హిందూ సమాజాన్ని ఆర్యసమాజం సంరక్షించింది. ఆర్యసమాజీయులు వీరోచితంగా వ్యవహరించారు. వరంగల్లు నగరంలో సనాతన ధర్మీయులు అనే మరో వర్ణం కూడా ఉండేది. వీరు ఆర్యసమాజీయుల ఆధునిక భావాలను వ్యతిరేకించే వారు. ఉభయ వర్గాల మధ్య స్పర్థలు ఉండేవి, అయితే అవి తీవ్రమైన సంఘర్షణల స్థాయికి చేరలేదు. హైదరాబాద్‌ సంస్థానంపై పోలీసు చర్య జరిగింది. ఆ ఏడాది అందరూ ఎంతో ఆనందంతో దీపావళి ఉత్సవాలు జరిపారు. పోలీసు చర్య అనంతరం మా కుటుంబం వరంగల్లు చేరుకున్నది. వరంగల్లులో ఆరోజుల్లో ఎ.వి.ఎస్‌ (ఆంధ్ర విద్యాభివర్థినీ పాఠశాల) చాలా ప్రసిద్ధిపొందింది. నేను మూడవ తరగతి అక్కడే చదువుకున్నాను. జాతీయోద్యమ నేపథ్యంలో ఆరంభమైన ఎ.వి.ఎస్‌.కు  ఎంతో గొప్ప చరిత్ర ఉంది.

వరంగల్లు నగర ప్రజా జీవన రంగంలో ప్రముఖులైన భండారు చంద్రమౌళీశ్వరరావు, ఎం.ఎస్‌. రాజలింగంతో పాటు ప్రసిద్ధ మేధావి పాములపర్తి సదాశివరావుకూడా ఈ పాఠశాలలో పనిచేశారు. 1949లో వై.కె. శాస్త్రి అనే ఆయన ప్రదానోపాద్యా యులుగా ఆ పాఠశాలకు వచ్చారు. ఆయన పూర్తిపేరు యద్దనపూడి కోదండరామ శాస్త్రి నెల్లూరు జిల్లావారు. హరిరాధాకష్ణమూర్తి అదే పాఠశాలలో పనిచేశారు. స్కూలు చరిత్రలో మేము చదువుకున్నకాలం స్వర్ణయుగం. మా పాఠశాలకు ఎందరో కవుల్ని, విద్వాంసుల్ని  ఆహ్వానించారు. విశ్వనాథ సత్యనారా యణ, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి వంటి విఖ్యాత పండితతులు మా స్కూల్లో అద్భుతమైన ప్రసంగాలు చేశారు. పసివారికి సైతం తెలుగు భాషా సాహిత్యాలపట్ల ఆసక్తిపెరిగేందుకు ఈ వాతావరణం తోడ్పడింది. 1948-51 సంవత్పరాల మధ్య నాలో సాహిత్యాభిరుచులు అంకురించాయి.

మా బాబాయి సంపత్కుమారాచార్య సరికొత్త సాహిత్య ప్రపంచాన్ని చూపించారు. ఆయన ఆ కాలంలో బందరు సమీపం లోని చిట్టి గూడూరు విద్యాసంస్థలో చదువుకునేవారు. మట్టివాడలోని శీబ్దానుశాసన గ్రంథాలయం నా సాహిత్య పరిచయాన్ని బాగా పెంచింది. ఠంమాల రంగాచార్యుల వారనే పండితుడు పద్యకవిత్వాన్ని విడమరచి బోధించారు. నంది తిమ్మన్న, పారిజాతాపహరణం, కరుణశ్రీ, ఉదయశ్రీ కావ్యాల పరిచయం, మంధరం (రామాయణంలో భాగం) రంగాచార్యుల వారే బోధించారు. వాటిని బాగా అర్థంచేయించారు. వేయిపడగలు నవలను పరిచయం చేశారు. నాలో పద్యసంస్కారం వికసించింది. ప్రముఖ పరిశోధకులు దూపాటి రమణాచార్యుల వారు ఆరోజుల్లో వరంగల్లులో ఉండేవారు. ఆయన అప్పటికే ఉద్యోగ విరమణ పొందారు. ఆయనొక ఆర్ద్రమైన కవి. నాలో ఎదిగిన పద్యసంస్కారం మరింత వికసించేందుకు దూపాటివారు స్ఫూర్తినిచ్చారు. ఇదంతా నేను 6-8 తరగతులు చదువుతున్నప్పటిది. విశ్వనాథవారిని గురించి 1950లో బాగా తెలిసింది.

1951లో వరంగల్లు ఆంధ్రసారస్వత పరిషత్తు శాఖ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు విశ్వనాథ విచ్చేశారు. మూడునాలుగు రోజుల పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం కలిగింది. విశ్వనాథ సోదరులు వేంకటేశ్వర్లు ఇక్కడ పనిచేశారు. 1952-53 సంవత్సరాల్లో నేను ఆయన దగ్గర చదువుకున్నాను. 1950ల ఆరంభంలో వరంగల్లునుండి రెండు పత్రికలు ప్రముఖంగా వచ్చేవి. అందులో ఒకటి కాకతీయ, పామలపర్తి సదాశివరావు, పి.వి.నరసింహారావు  కాకతీయ నిర్వహించారు. మరో పత్రిక 'ప్రగతి. ఇది భండారు చంద్ర మౌళీశ్వరరావు నిర్వహణలో వెలువడింది. ఈ రెండు పత్రికలకు  రచనలు పంపేవాడిని. ఆరోజుల్లో వరంగల్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు శాఖ ఎంతో వైభవంతో నడిచింది.

వరంగల్లులో ఇంటర్మీడియట్‌ కళాశాల ఉండేది. (ఆనాటి నిజాం రాష్ట్రంలోని నాలుగు ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో ఇదిఒకటి) ప్రసిద్ధ పండితులు చలమచర్ల రంగాచార్యులు, ప్రముఖ సంస్కత విద్వాంసులు ప్రమోద గణేశలాలే ఆ రోజుల్లో మా అద్యాపకులు. లాలే అద్భుతమైన వ్యక్తి! 1955లో ''సాహితీ బంధు అవతరించింది. నేను, పేర్వారం జగన్నాథం, చతుర్వేదుల నారాయణరావు ఇందులో  చురుకైన పాత్ర పోషించాము.

తెలంగాణ రచయితల సంఘం రెండవ మహాసభలు జనగాములో జరిగాయి. దాశరథి, కాళోజీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి ప్రసిద్ధులు సభల్లో పాల్గొన్నారు. వి.పి.రాఘవా చార్యులు చక్కగా ఈ సభల్ని నిర్వహించారు. ఈ సభల్లోనే ''ఉదయఘం టలు కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.

1948 - 56 సంవత్పరాల మధ్య జ్ఞాపకాల్లో మా ''సాహితీ బంధు బందం ప్రముఖఘట్టం. సంస్థకు నేను వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాను. విశ్వనాథ సత్యనారాయణ మా సంస్థను ప్రారంభించారు. 1955లో బమ్మెర పోతన ఉత్సవాలు జరిగాయి. నాటి లోకసభ డిప్యూటీ స్పీకర్‌ అనంత శయనం అయ్యంగార్‌ ఈ ఉత్సవాలకు విచ్చేశారు.

యాభై అరవై సంవత్సరాల తర్వాత కూడా ఆనాటి స్మతి పరిమళాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. అవి వరదలుగా పొంగివస్తున్నాయి. 1948-56 సంవత్స రాల సందిగ్ధ సందర్భంలో తెలంగాణ సాంస్కతిక అంతరంగపు వర్ణ చిత్రాలు ఇంకా అనావిష్కతంగానే ఉన్నాయి. ఈ వర్ణ చిత్రాలు వెలుగు చూడాలి. ఆ వర్ణ చిత్రాలకు బాష్యాలు కూడా రావాలి.
 

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి