8 నవం, 2015

మునిమాణిక్యం గారితో ముచ్చట్లు..




                  పెళ్లిళ్లలో  మా అమ్మ అయ్యల  ఆశీర్వా దమే వారికి పదివేలు .. 

ఇరవయ్యవ శతాబ్దం మొదటిపాదంలో 
అంటే కథలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో మునిమాణిక్యం గారు 
హాస్య కథలతో ముందుకు కదిలారు

వారి రచనలలో 
కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు
దాంపత్యజీవితంలోని సౌందర్యమూ కనిపిస్తాయి

వారి కాంతం 
సాహిత్య వేదికపై అలంకరించిన స్థానాన్ని 
వేరుగా చెప్పవలసిన పనిలేదు..

వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ లో
 ఉపాధ్యాయునిగా పనిచేశారట..
ఆకాశవాణిలోనూ పనిచేశారట..
ఆయన నవల '
టీ కప్పులో తుఫాను'
వారి అమ్మాయే కాంతంగా వేసి మెప్పించారట
వారి రచనలు చదువుతున్నా..
అందులో ఇల్లు ఇల్లాలు ఒకటి

మునిమాణిక్యం గారికీ వాళ్ళావిడకూ రోజూ తగవేనట
విసిగిపోయారు ఆయన
కేవలం మా ఇంట్లోనే నా 
అందరీళ్ళలోనూఇంతేనా
వాళ్ళెలా నెట్టుకొస్తున్నారూ
అని సందేహం వారిని తగులుకుంది..
పైకి పొక్కటం లేదు ఎవ్వరూ చెప్పుకోవటం లేదు

సాహిత్య వీధిలో శోధన మొదలు పెట్టారు..
'మీకూ మీ భార్యకూ అభిప్రాయ భేదాలు రావా..
వస్తే ఎలా జరుపుకొని వస్తున్నారు' అని 
ఇంద్రగంటివారిని అడిగారట..
వారు మంచి పండితులు 
సాహితీపరులు మనస్తత్త్వ శాస్త్రం తెలిసిన వారు

ఆయన యేం సమాధానం చెప్పారో తెలుసా..
'నాకూ నా భార్యకూ అభిప్రాయ భేదాలు రాకుండావుండవు
ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగివున్నప్పుడే మేము
భిన్నాభిప్రాయము గలవారము అవుతాము
భిన్న తత్త్వాలకు గల అభిమతాలకు 
సంఘర్షణ యేర్పడి తగవుగా పరిణమిస్తుంది
కాబట్టి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు 
నా అభిప్రాయం చస్తే చెప్పను
ఇంక ఆవిడ యేం చేస్తుంది.. 
నోరు మూసుకుని ఊరుకుంటుంది
ఇదే నేను అవలంబిస్తున్న మార్గం 
పోట్లాటలు రాకుండా వుండటానికి..'

అభిప్రాయ భేదాలు వచ్చినపుడు 
నేనే నోరుమూసుకుని వుంటాను 
అని ఎంత చత్కారంగా చెప్పినారు 
అని సంబర పడ్డారట ముని మాణిక్యం గారు

సరే..కాటూరి గారిని అడిగి చూద్దాం అని
'ఏమండీ అన్నగారూ మీ ఇంటో పోట్టాటలు లేవా..?'
అంటే
'లేవు.. మేమెప్పుడూ పోట్టాడుకోలేదు..'
 అని ఫెడీ మని జవాబు చెప్పారట..

ముని మాణిక్యం గారు ఆశ్చర్య చకితులై .. 
'అదిఎలాగండీ ..
మీ ఆవిడ అంత వినయ సంపన్నురాలా..
సుగుణవతా..చెప్పినట్లు వింటుందా..?'
అని అడిగారు..

ఆయన ముఖం చిట్లించి విసుగుతో
'నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని ఎవరన్నారయ్యా..
ఆవిడ చెప్పినట్లే నేను వింటాను..
ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే..
'దోషము గల్గె నావలన..
 దోసిలి యొగ్గితి నేలుకొమ్ము ..నీ దాసుడ..
 అని ముట్టెద తత్పదద్వయిన్'
అని చెప్పేసి గబ గబా వెళ్ళిపోయారట..

మునిమాణిక్యం గారు 
ఇంకా నయం మాఇంట్లో ఆ పరిస్తితి రాలేదు అనుకొన్నారు 
అనుకొని ఊరుకున్నారా..
దేవులపల్లి గారిని కదిపారు

'ఏమండీ మీ ఆలుమగల మధ్య పోట్లాట పొరుపూ వుంటాయా..'
అని అంతే..
'అమ్మో నా ప్రియురాలితో పోట్లాట..
 నేను భరించలేను..
ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది..
దుస్సహ గాఢ దుఃఖం నేను తట్టుకోలేను..
ఏడుపు వస్తుంది..
నా సంగతి నీకు ఆమాత్రం తెలియదేం..
మృదుల కరుణామధురము నా హృదయము
ఈ సంగతి ఎవ్వరికీ తెలియక పాయె..
ఎవ్వరెరుగ జాలరు ఏమని ఏడ్తునిప్పుడు.. '
అంటూ రుమాలు తో కళ్ళు వత్తుకుంటూ వెళ్ళిపోయారు..

అక్కడితో ఆగినా బాగుండేది .. 
వెళ్ళి వెళ్ళి వేదుల వారినడిగారు

ఆయనేమన్నారు..


'పోట్లాటలు లేకేమయ్యా..
నేనెంత బాధపడుతున్నానో నీకేమి తెలుస్తుంది..
నా బాధ ఎవరికీ చెప్పను
నాలోన నేనే మూల్గుకొందు 

కనికరము జూపు చిరునవ్వు తునకయే కరువయ్యె
నాకు పాడులోకాన'

అని గుట్టు విప్పారట..

 అదీ సంగతి అనుకొని

'మరి దేవులపల్లి వారు రోదనము చేస్తారట.
మీకు ఏడ్పు రాదా..'
అని ఏమైతే అదయిందని అడిగేశారు..

'రాకేమయ్యా చచ్చేట్లు వస్తుంది..
కానీ కనుల రానీనొక బాష్పకణమునైన..' 
అన్నారట దీర్ఘంతా నిట్టూరుస్తూ..

అందుకనే 'మహా సాగరాగాధ హృదయ బడబానల యెవ్వరికి తెలియు' అని గోలపెట్టాడు 

ఇక కవులతో లాభంలేదని
గురువుగారైన శివశంకర స్వామి వారిని అడిగారట..
'స్వామీ..
 భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండే మార్గం ఏది..'
అని
అందుకు వారు గొప్ప సూత్రాన్ని విడమరిచారు
'నాయనా..భార్యా భర్తలమధ్య పోట్లాటలు లేకుండా వుండటము అసంభవం.
ఇది అనాదిగా వస్తున్న సదాచారము.
అనుకూలవతి అంటే కొద్దిగా తేలికగా సరసంగా
ఏదో సంసారపక్షంగా కలహించేది అని ..
అంతే కాని
బొత్తిగా నోరు మూసుకొనికూర్చునేది కాదని అర్థం..
అదీ అసలు రహస్యం..
ఈ పరమ రహస్యాన్ని తెలుసుకొని
నీ జీవిత గమనాన్ని దిద్దుకో..
లేదా సన్యాసం పుచ్చుకో ఎవ్వరికీ చెప్పకుండా
అప్పుడు నీ భార్య చచ్చినట్టు వచ్చి
నీ కాళ్ళపై పడుతుంది..

చూశారా.. ప్రశాంత దాంపత్య జీవనానికి రహస్యం
ఒకటి భార్యా విధేయత లేదా సన్యాసం..
అని ఒక నిర్ణయానికొచ్చారు..

ఎంతైనా కవులు ఉన్మత్తులు..
వచన రచనకారులను అడిగి చూద్దం అని ఆలోచించిచూడగా
మొక్కపాటివారు
చిన్నతనంలో సంగతి జ్ఞాపకం లేదుగాని ..
ప్రస్తుతానికి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాయ్ రోజులు ..'

హాశ్చర్యపోవటం మునిమాణిక్యం గారి వంతు
ఏముంది ..
ఆవిడ రాజమండ్రిలో ..నేను మద్రాసులో
 ఎప్పుడైనా ఫోనులో మాట్లాడుకుంటాం'

గిడుగు వారు
'నేను సవర భాషలో మాట్టాడతాను..
ఆవిడకది అర్థంకాదు..
 సింపుల్ గొడవలేముంటాయ్..'

వేలూరు వారు
ఇంటికి దూరంగా కుటీరం నిర్మించుకొని వుంటారట..
గిడుగు వారింట్లో  గొడవలే లేవు
ఆవిడ అరిచి చచ్చినా వారికి వినపడదట..

బుచ్చిబాబుగారు
తెలియనివారు..
తెలిసిన వారు చెప్పినపుడు వినాలి
మా ఆవిడ 'మీకేం తెలీదు ఊరుకోండీ'
 అంటూ వుంటుంది
ఆవిడమాట మెదలకుండా వినటమే నాపని'

జమ్మలమడకవారు
'మనం సంస్కృతం నేర్చుకోవలె..
 ఆవిడకు అర్థంకాదు. .'
సో ..గొడవలు బంద్..
ఈ విధంగా తన గొడవతో
మొత్తం సాహిత్య లోకపు గుట్టునంతా విప్పేసారు మునిమాణిక్యం గారు

అంటే ఈనాడే కాదు ఆనాటినుంచీ కూడా ఇవేపధ్ధతులన్నమాట ప్రశాంత జీవనానికి..
హోం మినిష్టర్ పదవా మజాకా.. అనిపించింది నాకు

పైన మునిమాణిక్యం గారు వినిపించింది
 నిజమో ..లేక కేవల హాస్యమో తెలియదు కాని..

బయట ఎంత పెన్ను తిప్పినా 
ఇంట్లో వీరంతా పిల్లులేనన్నమాట..

ఇదంతా చదివాక 
మా ఇల్లు గుర్తొచ్చిందినాకు
మా ఇంటి వాతావరణమూ పధ్ధతి 
అందరికంటే ఎంత భిన్నం ..

''చెలిమి పండగ నొక్క చీర దెచ్చితినేమి
కలిమి యొకనాడైన గడప ద్రొక్కినదేమి
మురిపంబు దొలుకాడ ముద్దులాడితినేమి..''

మా అమ్మను తలుచుకుంటే పై పాదాలే గుర్తుకొస్తాయి

''ఆభరణములు లేని దది వింత సొబగయ్యి 
మల్లెపూవట్ట్లు నా మగువ నవ్వినయపుడు
పట్టపగలే ఇంట పదివేల దీపాలు
వెర్రిబాగుల చాన వెన్నవంటీమనసు
దులకింప తోక చుక్కలవంటి కనులతో చూచెనా పదివేలు''

మా అమ్మ రూప వర్ణన ఇది
ఇక గుణ వర్ణన 

''నాపడతి యగుదాన నాతి యొకనాడైన
నిట్టూర్చెనా మారు బట్టలేని దినాల సిగ్గువోవు దినాల''

నేను మా అమ్మను చూచి 
నా జీవితం దిద్దుకున్నాను
నాకు తోచిన ఒకే పదం' సారీ'
ఎవరిది తప్పైనా అదే పదం నన్ను ఆదుకుంది

మా అమ్మ ఇంతకన్నా కష్టపడిందిగదా..
నా కష్టం ఏపాటి..
అని మా అమ్మను స్మరించుకొని 
ముందుకు సాగుతూ 
ఈరోజు ఇలా వున్నాను.

నిజంగా ఆ సారీ
ఎన్ని సారీలను తిరిగి ఇస్తుందను కున్నారు..
ఆ సారీ  ..
శారీలు గా  , బంగారు ఆభరణాలు గా ,
 ఎన్నో బహుమతులుగా
మధుర స్మృతులు గా మా వారు..
మా  సన్నిహితులూ మార్చేస్తుం టారు ..
నిజంగా సారీలో మేజిక్ లేదూ ..



31 అక్టో, 2015

పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి రచనలు నా జీవి వున్నంతలో అందరికీ అందుబాటులో వుంచాలని తపన పడ్డాను. telugu thesis వారికి రిక్వెస్ట్ చేస్తూ మైల్ చేస్తే వారు ఎంతో ఆదరించారు..నేను పంపిన కంచి కామకోటి సంపాదకీయాలు ప్రచురించారు . ఇంకా పంపితే ప్రచురిస్తామన్నారు. ఇప్పుడు Teluguthesis.com లో పుట్టపర్తి గ్రంధాలు చాలావరకు లభ్యమవుతాయి.
మిత్రులారా.. పుట్టపర్తి పండరీ  భాగవతం విశ్వనాధ వెన్నోళ్ళ పొగడినది బయటికి తేవటమెలా చాలా పెద్ద పుస్తకం స్కానింగ్ చేయటం చాలా పెద్ద పని అనుకుంటూ వుంటిని అది ఈ రోజు నాకు అక్కడ దర్శనమిచ్చింది వెంటనే లింక్ తీసుకున్న్నాను. ఇదిగో..
ఇకపై పుట్టపర్తి పై పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి.. నా ఉడుతాభక్తిని దేవుడు అప్యాయంగా చేకొన్నాడు. 

                                                                                                              ముందుమాట
ఈ పండరీ భాగవత గ్రంధకర్త మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాణాచార్యులు గారు. ఈయన ఈ గ్రంధం వ్రాసి ముప్పదియేండ్లైనదట.. ఈయన కీర్తి అంతకు ముందే మొదలుపెట్టినది. ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. ఇందులో పుండరీక చరిత్ర,చోకామీళుని కథ, నామదేవ చరిత్రము,గోరాకుంభారు కథ, నరహరి చరిత్రము అన్న అయిదు కథలు కలవు. మొదటి కథ పేరే ఇది. పండరీక్షేత్రమునందలి మహాభక్తుల కథల సంపుటి.
ఇది ద్విపదకావ్యము. పూర్వము మన దేశములో కొన్ని ద్విపద కావ్యములు కలవు. కొన్నింటికి కొంత మర్యాద కలదు. వేణుగోపాల శతక కర్త ద్విపద కావ్యములందు మర్యాద లేనివాడు. దానికి కారణమేమయి వుండును ? పద్యమునందున్న వైశాల్యము ద్విపదకు లేదనవచ్చును. ఒక లోతైన భావము ఒక విస్తారమైన భావము రచనా శిల్పముచేత మూర్తి కట్టించుటకు తగినంత వీలైన లక్షణము ద్విపదలో లేదని యాతడెంచినాడేమో..
కాని మన దేశములో స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. బసవ పురాణమునకు గౌరన హరిశ్చంద్రకు గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. ద్విపద భారతమన్న గ్రంధము ఆంధ్ర విశ్వ విద్యాలయము వారు పూర్వమచ్చొత్తించిరి. అంద్లో చాల భాగము తిక్కన్న గారి పదాలు ద్విపదలో వ్రాసినట్లుండును. పద్య రచనకు ద్విపద రచనకున్న భేదము ఆ రెంటిని పోల్చి చుచినచో తెలియ గలదేమో..
ద్విపద యనిన తోడనే ఒక తాళము రెండు చరణములతో చెప్పదలచిన భావమైపోవుట. పాటకు వీలుగా నుండుట. సర్వ జనులకు చదువుటకు వీలుగా నుండుట మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
ఈ కావ్యములో నా లక్షణములు చాల నున్నవి. కాని ప్రౌఢి కూడా నున్నది. కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. ప్రతి చరిత్రకు చివర కవి తన కథ కొంత చెప్పి కొనుచుండెను. దాని వలననే కవిని గురించిన వాకబు చాల తెలియగలదు. 
ఈయన వ్రాసిన గ్రంధము పూర్వ ద్విపద కావ్యముల కేమియును తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా కొన్నిచోట్ల పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును. 
ఈతడు కొన్నివిషయములలో నాకంటే ఘనుడు. అయినను ఈ రచనపై నా అభిప్రాయమడుగుట కేవలము స్నేహధర్మమని భావించుచున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ


పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

అందుకే ఆయన ఉక్కు మనిషి



ఒక సభ అది
పుట్టపర్తి ఉపన్యాసం ముగిసింది
శ్రోతలు ఒక రకమైన సమ్మోహనత్వం లో ఉన్నారు
పుట్టపర్తి తమ వాడని ప్రతి వారి హృదయం ఉప్పొంగిపోతూంది
రాయల కాలం నాటి  రక్తం ఏదో 
వారి నరాలలో వడి వడిగా పరుగులెత్తుతున్న ఉద్వేగం
ఇంతలో 
ఎవరో ఒక చీటీ తెచ్చి పుట్టపర్తి వారి కిచ్చారు
అందులో ఏముంది..??

సభకు విచ్చేసిన వారిలో ఒకరు అపర కుబేరుడు నాలుగు   పద్యాలతో అతన్ని ప్రస్తుతిస్తే..
మీ అముద్రిత కావ్యాలకు మోక్షం వస్తుంది..

మరి పుట్టపర్తి యేం చేశారో తెలుసా..

'' పరుల ప్రశంస జేసి నవభాగ్యములందుటకంటే 
నాత్మసుస్థిరుడయి పున్క పాత్రమున దిన్నను 

నా మది జింతలేదు 
శ్వరు గుణ తంద్ర గీతముల 
పాడుచు , జిక్కని పూవువోలె
నా పరువము వాడకుండ 
ఇలపై మని రాలిన జాలు సద్గురు..''
 చీటీ వెనుక ఆ పద్యం రాసి తిరిగి పంపేసారు 


 
  ఈ నియమాన్ని జీవితాంతం పాటించారు పుట్టపర్తి
ఎంతో మంది ధనలక్ష్మీ పుత్రులు 
పుట్టపర్తి కావ్య కన్యల పాణిగ్రహణానికి సిధ్ధపడినా 
ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి
పురం బులు .. వాహనంబులున్ ..
 సొమ్ములు  కొన్ని గొని ..
చొక్కి..  శరీరము వాసి .. 
కాలుచే సమ్మెట వాటులం బడక'

ఆ శ్రీనివాసునికిచ్చిన..పుట్టపర్తి పోతన వారసత్వం 
అమర లోకాలకు వెళ్ళిపోయింది..

ప్రతి మనిషికీ ఒక సందర్భం వస్తుంది
అది నీవెలాంటి వాడివో నిరూపించుకోవలసిన పరీక్ష.
అందులో 
సామాన్యులకు భిన్నంగా స్పందించినవారే.. మహనీయులు అవుతారు

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి అట
సంబరాలు చేసుకుంటున్నారు

ఆయన జీవితంలో ఒక సందర్భం

ఒకసారి సర్దార్ కోర్ట్ లో వాదిస్తున్నారు
కేసు కీలకంగా ఉంది
వాదన జరుగుతూంది..
నువ్వా నేనా అన్నట్లు..

ఇంతలో ఒక టెలిగ్రాం ..సర్దారుకు..
ఎవరో తెచ్చి ఇచ్చారు 
సర్దారు దాన్ని విప్పి చదివి.. మడిచి కోటు జేబులో పెట్టుకున్నారు
కేసు యధావిధిగా సాగింది

తరువాత కుప్ప కూలిపోయారు
అది వారి భార్య చనిపోయిన వార్త
కానీ క్రితం వరకు జరిగిన వారి వాదనలో 
వారి గొంతు చెక్కు చెదరలేదు
 వాదనలో పదును తగ్గలేదు
వృత్తే దైవం వారికి
రజాకారుల దుష్కృత్యాల నుంచీ 
నిజాం నవాబుల చేతుల నుంచీ 
హైదరాబాద్ సంస్థానాన్ని విడిపించిన ఘనుడు ఈయన 

రాజ కీయాలలో  ఇటువంటి విలువలు పాటిస్తున్న నాయకు లుంటే  మనకు స్వర్ణాంధ్ర ,
బంగారు తెలంగాణ అసాధ్యమా.. 

ఇంకో విషయం .. 
పటేల్ ఉప ప్రధాని గా వుండగా ఆయన కుమారుడు 
అవినీతికి పాల్పడే వాడ ట .. 
అది తెలుసుకున్న పటేల్ పరిశ్రమల శాఖా మంత్రికి ఒక లేఖ వ్రాసారు.. 
ఏమని.. 
కొడుకు అవినీతితో తనకు సంబంధం లేదని 
అతనిపై ఎటువంటి చర్య అయినా తీసుకొమనీ.. 
చూసారా.. 
చివరి దశలో కూడా కొడుకు ముఖం చుడటానికి ఇష్ట పడక స్నేహితుని వద్ద కన్ను మూసారట.. 

అందుకే కాలాలు వెళ్ళిపోయినా
పుట్టపర్తి వారన్నట్టు 
మృత్యుదేవతకు వారిని తాకే అధికారం  ఉండదు
అందుకే ఆయన  ఉక్కు మనిషి
మరి పుట్టపర్తి మార్గం అందుకు భిన్నమా మీరే చెప్పండి..

24 అక్టో, 2015

బాష్ప తర్పణము



ప్రొద్దుటూరులో జీవితం మొదలుపెట్టిన రోజులలో
మామూలుగానే క్రిందివారిని పరిహసించటం..
పైకి వస్తున్నవారిని కిందకు లాగటం వంటి
మనస్తత్త్వాలు పుట్టపర్తిని బాధించాయి..

చిన్నతనంలోనేఅమ్మను కోల్పోయిన పుట్టపర్తి
సున్నిత హృదయుడు..
పైకి కాఠిన్యం
ఎవరి వద్దా చేయి చాచటం
ఆత్మాభిమానాన్ని కుదువబెట్టి ప్రాపకం సంపాదించటం
వారిపై వీరిపై కథలల్లి వినోదించటం 
వంటి అవలక్షణాలు అంటని
పూవులాంటి స్వచ్చమైన వైఖరి..

సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ తారసపడ్డాడు
ధనవంతుడు.. 
అక్కడి రాజకీయాలనెరిగినవాడు.. 
పుట్టపర్తి తత్త్వాన్నీ
వైదుష్యాన్నీ బాగా గుర్తించినవాడు

అతడు పుట్టపర్తికి ఉద్యోగమిచ్చి
అండదండగా నిలబడ్డాడు..
కానీ కాలం మంచి వాళ్ళని బ్రతకనివ్వదుగా..
ఆయన భగవంతునికి ప్రీతిపాత్రుడయ్యాడు

అందరూ దుఃఖించారు
పుట్టపర్తి దుఃఖం 
ఇలా రాయలసీమ యాసలో వేదనలు చల్లింది..

సామాన్యంగా పంచరత్నాలు.. నవరత్నాలు.. 
గొప్పవారి ప్రాపకం కోసం 
తేలికగా కవుల నోళ్ళలో కులుకుతుంటాయి

కానీ పుట్టపర్తి తత్వా నికది విరుధ్ధం
తన మనసు స్పందించినపుడే అది కవిత అవుతుంది
కల్లలు కథలు పుట్టపర్తి నోట రావు..

కానీ సుబ్బయ్య మరణం
 పుట్టపర్తిని నిశ్చేతనుని చేసింది..

చూడండి..
అన్నీ కాదు గానీ అక్కడక్కడా.. విని పిస్తాను..

''దేవలోకంబునందు నినదించి రెవరొ
బసిడిగంటలు , నగవులు బరిఢవిల్ల
నిచట సుబ్బయ్యగారు గతించిరనుచు
గర్ణములు సోకినది.. వేడి గాడ్పు బలుకు..''

''మృత్యుదేవత నిప్పుల రెక్కలార్చి
కప్పికొనుటయె చావు లోకంబునందు
గాని సుబ్బయ్య యెడనది కనక రథము
దన్ను గొనిపోయె మోక్ష సౌధమ్ము కొరకు''

''చచ్చినాడందురేమియో జాల్ములార
జావలేదు మా సుబ్బయ్య జావలేదు
బ్రదికినాడోయి మృత్యుదేవతకు నతని
దాకు నధికారమేలేదు తథ్యమద్ది''

పుట్టపర్తి ఇంతలా బాధపడటానికి కారణమేంటి
ఆ కొప్పరపు సుబ్బయ్య ఎలాంటివాడు

''కవులకును రవ సెల్లాలు గప్పినాడు
బీదలకు మునుదెర్వు జూపించినాడు
బండితులకై గాన్కలు బంపినాడు
జేయని పనేమి యతడాంధ్రసీమయందు''

అదీ..
కొంచెం ధనవంతుడైతే..
ఆ ధనాన్ని దాచుకోవటమెట్లా అని చింత
ఎవరైనా లాక్కుపోతారేమోనని దిగులు
దీన్ని పెంచటమెలా అన్న బాధ
ఇదే కదా లోకం

ఆ ధనాన్ని మంచిపనులకు వినియోగించటం తెలిసిన వారెందరు
కొప్పరపు సుబ్బయ్యగారు కవులకు రవసెల్లాలు కప్పి తన కళాహృదయం చాటుకున్నాడు
అంతేనా
బీదలౌ తెరువు చూపించినాడు
పండితులకు కాన్క లూ పంపాడట..
ఇవి యే రాజుకో ఉండవలసిన లక్షణాలు కదూ..

ఇంకా చూద్దాం
ఆకలియటంచు దరిజేరినట్టివాని
నుస్సురననివ్వలేదట..

మాన్యులగు వారికొక యవమానమునుకూడా జరుగనివ్వలేదట..
ధర్మముంకు విఘాతమేర్పడు సమయంలో బదుగురను బిలచి ధర్మం జరిపించాడేమో..

ఇతడు హిందువు మన ఇంటివాడు..
ఇతను ముస్లిము పరాయివాడు
అన్న బేధమే చూపలేదట..

తనచుట్టూ వున్నవారిని
తల్లిప్రేమమ్ము..
తండ్రి చిత్తంబులోని క్షేమ తర్కమ్ము
చేర్చి ఆ నలువ సుబ్బయ్యను సృష్టించినాడట..
అందుకే సుబ్బయ్యగారి పలుకులందు  
అంత వాడిమి..  చిత్తమందు అంత తడి.. 
అంటారు పుట్టపర్తి

నిజమే కదా మానవత్వం గలవారిని చూచినపుడు
మన మనసులో కలిగే భావాలు ఇలాంటివే కదూ..

సుబ్బయ్య గారి ఇంటిని పుట్టపర్తి ఏమని వర్ణించారు

''అది గృహమె గాదు నిజముగా నన్న సత్ర
మతడు గృహిగాడు .. జనకుని యట్టి కర్మ
యోగి యాతని మనుగడ వ్యోమగంగ
త్యాగ భోగములకు సమర్థనము సెట్టి..''

నిజంగా ఒకప్పుడు 
ప్రతి ఇల్లూ అన్న సత్రం లాగే వుండేది కదా..
రాత్రి తొమ్మిదీ పది గంటలకు బిచ్చగాళ్ళు 
అమ్మా అంటూ
వచ్చేవారు..
ఆరోజు మిగిలిన కూరలు పప్పు అన్నం అన్నీ కనీసం ఒకరిద్దరి కడుపు నింపేవి..
కానీ ఈ ఫ్రిజ్జు లొచ్చిన తరువాత
బిక్షగాళ్ళూ లేరు..
మిగిలిన అన్నం వేయటమూ లేదు అన్నీ ఫ్రిజ్ లోకే
ఆ చలువ పెట్టెలు మన గుండెల్లోని చలువనెత్తుకెళ్ళిపోయాయేమో..'

డొక్కా సీతమ్మగారు అన్నదానానికెంత పేరుగన్నవారు
ఈనాటికీ ఆమెను స్మరించే వారు ఎందరో వున్నారు 

ఇదేమిటీ పుట్టపర్తి ఇలా పొగడుతున్నారు
అనుకుంటున్నారా..
ఇది చూడండి

''నాకు బొగడింత యన్నచో నచ్చదైన
బొగడకుండగలేను ఆ పుణ్యమూర్తి
గుణము గనపడ్డచో మెచ్చుకొననివాడు
తనువు దాల్చిన దయ్యంబు దైత్యకులుడు..''

పుట్టపర్తికి పొగడటం పొగిడించుకోవటం సరిపోదు
కానీ నిజంగా పొగడవలసినంత ఘనత ఎదురుగా కనపడితే..
గుండె విప్పి పొగడుతారు
అలా పొగడని వాడు 
'తనువు దాల్చిన దయ్యంబు ..దైత్య కులుడు'
 అంటారు నిజమే కదా..

మనం చూస్తూ వుంటాం
ఒకరు అందరినీ పొగడుతుంటారు..
దానిలో కొంత లౌక్యం..
మరికొంత ఒక మంచిమాట పడేస్తే పోయేదేముంది
అన్న ధోరణి..

మరికొంత మంది పిడివాదం.. ప్రతి విషయంలోనూ .. 
అలా విభేదించటం తమ తెలివి అనుకుంటారు .. 
భక్తి అంటే..
ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పూజలూ పునస్కారాలు
వాటిలో వున్నాడా దేవుడు అంటారు..
కానీ 
అవి చేయవద్దని ఆ దేవుడూ చెప్పలేదు కదా
అలా చేస్తూ చేస్తూ ఏకాగ్రత.. భావ శుధ్ధి కలిగి పరిపక్వత వస్తుంది
మొదటే ఎవరూ డాక్టరైపోరు.. LKG నుంచీ మొదలు పెట్టాలి 

మనసును అలా వదిలేస్తే మరింత చంచల మైపోదూ..

''పుణ్య పురుషులు త్యాగులేపొద్దు లేరొ
నాడె నమ్మిన నమ్మకున్నను  ఘటించు 
ప్రళయమనునది లోకంబులారలేదు
బ్రతుకుచున్నారు సుబ్బయ్యవంటి ఘనులు..''

నిజమే 
గుండె బరువెక్కుతోంది కదా..
ఎక్కడ చూచినా అన్యాయం.. అవినీతి 
మానవత్వం క్రమ క్రమంగా అడుగంటిపోతోంది..
ఇలా ఇంకా ఎంత అధమ స్థాయికి వెళ్ళిపోతుందో లోకం..
మన బ్రతుకులిలా వెళ్ళిపోతున్నాయి
మన పిల్లల రోజులు వచ్చేసరికి ఎలా వుంటుందో ఊహించుకోగలమా..
ఎక్కడో కొండకోనల్లో అన్నీ మరచి తపస్సాధనలో మునిగిన సాధువులూ
మంచినీ మానవత్త్వాన్నీ బ్రదికిస్తూ 
సుబ్బయ్య వంటి ఘనులూ ఉండడం వల్లే.
వారి పుణ్య బలమే 
ఈ ధరిత్రిని నిలబెడుతూందేమో..

సిధ్ధ సమాధియోగా కాంపుకు వెళ్ళాం 
తిరుమల కొండలలోని అడవుల లోకి
అక్కడ నిశ్చలంగా తపస్సమాధిలో కూర్చున్న యోగులను దర్శించాం
పుట్టలు పట్టిన వారిని చూచినప్పుడు
నిజంగా మనది తపోభూమి అనిపించింది..
బాష్ప తర్పణము

ఒక వాక్యం జీవిత ప్రయాణమా .. ?


15 అక్టో, 2015

అసాధ్యుడు



కడప రామకృష్ణా జూనియర్ కాలేజీలో
 పుట్టపర్తి గారు తెలుగు పండితులుగా పైచేస్తున్న రోజులలో ..
ఒకసారి కడపకు శృంగేరి పీఠాధిపతులు వచ్చారు.
ఈయన స్వామి దగ్గరకెళ్ళినా తనతోటి బ్రాహ్మణులు 
పుట్టపర్తి గారికి పిలక లేదనీ ..
బొట్టులేదనీ.. 
సాంప్రదాయక వేషం లేదనీ ..
పీఠాధిపతులకు పరిచయం చేయలేదట..

స్కూలు కరస్పాండెంట్ అయిన శ్రీ రంగనాధం గారు పుట్టపర్తిని పరిచయం చేశారు..
అప్పుడు వెంట వెంటనే 
15, 20 శ్లోకాలు  పీఠాధిపతుల్ని ప్రశంసిస్తూ సంస్కృతంలోచెప్పారు  పుట్టపర్తి

ఆ తర్వాత 
స్వామి పుట్టపర్తి వారిని తన రూముకు పిలిపించుకుని 
'అధాతో బ్రహ్మ జిజ్ఞాస'
 అన్న మొదటి బ్రహ్మ సూత్రంపై చర్చకు దిగారు
గంటన్నరసేపు వాగ్వాదం జరిగింది

స్వాములవారు పుట్టపర్తిని 
పెద్ద జరీ అంచు శాలువాను కప్పి ఆశీర్వదించారు..
ఆ తర్వాత మాట్లాడుతూ..
పుట్టపర్తి గారిని క్రాపు తీసేసి పిలక జుట్టు పెట్టుకోమని సూచించారట స్వాములవారు..
పుట్టపర్తికి కోపం వచ్చి 
'తాను 24 లక్షల సార్లు గాయత్రిని ..
25 కోట్లు నారాయణమంత్రాని జపించాననీ..
కానీ తనకే దివ్యనుభూతీ కలుగలేదనీ..
వారికేమైనా కలిగివుంటే చెప్పమనీ 'కోరినారట.
తులసీదాసు ను ఉదహరిస్తూ ఒక చరణం చెప్పినారు

అందుకు అగ్రహోదగ్రులైన స్వామి 
'తులసీదాసుకేమి తెలుసు ..??
అతడు ముస్లిం కాదా..?' అన్నారట..

'తులసీదాసుకు తెలియనిది..  నీకేమి తెలుసు..?' 
అని కోపంగా ప్రశ్నించి పుట్టపర్తి బయటికి వచ్చేశారు

ఆ తర్వాత స్వాములవారు 
'పుట్టపర్తి అసాధ్యుడనీ..
అతనిని వప్పించలేకపోయాననీ '

అన్నారట
కానీ ..
కంచి పరమాచార్యుల వారు 
పుట్టపర్తి ని అధిక్షేపించలేదు
వారి బాహ్యరూపంకన్నా లోపలి వ్యక్తికే విలువనిచ్చారు

శ్రీ. వి. రమాపతిరాజు వ్యాసం పుట్టపర్తి వర్ధంతి సందర్భంగా 
ఆంధ్రజ్యోతి , తిరుపతి, 01-09-82.