డా .సుందర రామకృష్ణ(M.A.,M.O.L.,Ph.D) గారు
కవి
గాయకుడు
రంగస్థల కృష్ణుడు
సినిమా నటుడు
బుల్లి తెర శ్రీనాధుడు
సినీనటి జమునతో కలిసి
కృష్ణుడైనాడీయన ఎన్నోసార్లు
సుందర రామకృష్ణ గారు
జాషువా అభిమాని
ఆనాడు సంఘంలోని కుళ్ళును దురాచారాలను
జాషువా తూర్పార బడితే
ఈనాడు వారి అభిమాని అయిన
సుందర రామ కృష్ణ గారు
అంతన్నా ధాటీగా సమాజాన్ని దుయ్యబట్టారు
"వాణిని సర్వ లోక జన వంద్య పురాణిగ వెల్గుచున్న పూ
బోణిని నిన్ను బట్టుకొని మోటుగ నీ "ప్రొఫెసర్లు"సైతమున్
'వానీ'యటంచు బల్క "వారెవా" యెటులోర్వగ జాలుచుంటివో
ఏ నొక చింతబెత్తమది యిచ్చెద వారల నీడ్చి కొట్టవే.."
ఇది అక్కిరాజు సుందర రామ కృష్ణ గారి కలం గళం
అధిక్షేప కవిత్వం లో అందెవేసిన చేయి సుందర రామకృష్ణ గారు
సమాజంలో జరిగే అన్యాయాలను
అన్యాయాలని ఆయన అనుకున్న వానిని శారదాదేవికి విన్నవించి
కాదు గట్టిగా చెప్పి
కాదు కాదు ఈ పదం కూడా సరిపోదు
తెగించి దబాయించి చెప్పి
అమ్మవారి దయను కూడా డిమాండు చేసి
త్రిశతిని వ్రాసారు
వారి ఇంటికి నన్ను ఆహ్వానించగా వెళ్ళిన నాకు
తెల్లని గడ్డంతో
ఆయన దర్శకేంద్రుడు
రాఘవేంద్రునిలా కనిపించాడో క్షణం
కాస్త అవీ ఇవీ మాటలయ్యాక
ఆయన చెప్పటం మొదలెట్టారు
పద్యాలను కమ్మని కంఠంతో చక్కని రాగంతో
మధ్య మధ్య చిన్న చిన్న వ్యాఖ్యలతో పాడారు
అన్నీ అమ్మతో చెప్పే అల్లరి పిల్లాడిలా అనిపించారు
ఆయన చెప్పినవి
తనకోసం కాదు
సంఘం లో జరిగే అన్యాయాలు మోసాలు
వాణిని వానిని చేసే ప్రొఫెసర్లను బాదటానికి
అమ్మకు చింతబెత్తమియ్యటానికీ వెనుకాడని
గడుగ్గాయి పిల్లాడు
ఈ సరస్వతీ దేవి బిడ్డడు
దొంగ సర్టిఫికేట్లు పల్లీ బఠాణీల మాదిరి
హైకోర్టు గేటుకు ముందర
కోఠీ వీధులలో
ఏర్ పోర్టుకు ఆవల ఈవల
అమ్ముతున్నారమ్మా
ఇంక
సరస్వతీ నమస్తూభ్యం అని నిన్ను
మా పిల్లలు భీతిగా కొల్చే రోజులు పొయ్యాయి
పిచ్చితల్లీ ..అని
చదువులమ్మకే భయం పెట్టాడీ గడుసు కవి
అంతే కాదు
పుట్టపర్తి వారికి జ్ఞానపీఠ విషయంలో
అన్యాయం జరిగిందని
అమ్మవారికీ చార్జి షీటులిచ్చాడీ శతక కర్త
పుట్టపర్తి వారు పోయి ఇరవై సంవత్సరాలైంది
ఇప్పుడెందుకు మళ్ళీ
పాతవి తిరగతోడటమంటే
అలా అని అందరూ ఊరుకొంటే ఎలా
అని తాను వ్రాసిన పద్యాలు పాడుతూ
ముఖ్యంగా ఆంధ్ర దేశంలో
పద్యం గాని గేయంగానీ
నిజమైన సిసలైన పాండిత్య ప్రకర్ష తో రచనలు వెలయించిన వాళ్ళలో
అగ్రేసరులలో అగ్రేసరుడు
మనకు వెంటనే రాయలసీమ ప్రాంతం నుంచీ అది కూడా
గుర్తొచ్చేటటువంటి వ్యక్తి
ఒక హిమాలయ శృంగం
ఎవరయ్యా అంటే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
సాహిత్యంలో పదునాలుగు భాషలలో పాండిత్యం సాధించి
మనకు బ్రహ్మండమైన కావ్యాలను
మనకందించినటువంటి వాడు
ప్రభుత్వాలు సంస్థలు గుర్తించినాయా అంటే
అది ఆనాటినుంచీ ఈ నాటి వరకు ఒక ప్రశ్నార్థకం
కొంత మందికి కొన్ని భిన్న మైన వ్యక్తిత్వాలుంటాయ్
మనం అడగటమేంది నన్ను గుర్తిస్తారులే
అటువంటి మనస్తత్వమున్నవాడు
పుట్టపర్తి నారాయణాచార్యులు
యేనాడూ ఆయన నాకీ బిరుదు కావాలని
లేదూ ఈ పదవి కావాలని ఆయన అడగలేదు
ఏది ఏమైనా
పూర్ణ పురుషుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు.
అందరం పాఠాలు చెప్పినటువంటి వాళ్ళమే.
తెలుగు జాతి గొప్పదనం తెలుగు తల్లి గొప్పదనం
నిజానికి చాలా బాధేస్తున్నది
రేపు 27,28,29 ప్రపంచ తెలుగు మహాసభలన్నారు
ఆయన పేరు మీద ఏదన్నా పెట్టి
ఒక రెండు రోజులు లేదా ఒకరోజు
కేవలం ఆయన సాహిత్యంపై ఒక నలుగురితో మాట్లాడించి వుండినట్లయితే
చాలా బాగుండేదని నా అభిప్రాయం
నేను చెప్పే మాటలతో కూడా
భిన్నమైన అభిప్రాయాలుండే వాళ్ళు ఉండొచ్చు.
పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక మామూలు గొప్ప కవి
అనేటటువంటి వాళ్ళు కూడ వుంటారు.
అది లోకంలో ఎప్పుడూ వుండేదే.
ఆయన సాహిత్యం లోతుగా చదివి
చెప్పగలిగిన వాళ్ళు చెబితే తెలుస్తుంది
మంచి వ్యక్తులతో సమావేశాలు పెడితే
ఆయనంటే ఏవిటో ఈ తరం వాళ్ళకు తెలుస్తుంది.
ఆనాటి తరానికి మనం చెప్పక్కర్లేదు
అది చేయాల్సిన ఆవశ్యకత వుంది.
నేను చాలా ఆగ్రహంతోటి
ఏవిటి
ఆగ్రహం తోటి
నండూరి రామకృష్ణమాచార్యుల వారికీ
సూర్య నారాయణ రాజు గారికీ అంకితమిచ్చి
అంకితమిస్తూ 2005 లో శారద అనే ఒక సతకం వ్రాసాను
దీనిలో నేను శారదాదేవిని నిలదీసాను
కేవలం పై పై మెరుగులు ఇచ్చకాలు పలికే వాళ్ళను చేరదీస్తున్నావు
తీ ..సంతోషమే
కానీ నిజమైన పాండిత్యం కలిగిన వాళ్ళను
గొప్ప పండితులను కూడా నీవు దగ్గరికి తీయాలి కదమ్మా.
ముఖ్యంగా
జ్ఞానపీఠాన్ని ఉద్దేశం లో పెట్టుకొని
శారదా అనే నా పద్య కావ్యంలో అమ్మవారిని అధిక్షేపిస్తూ
పద్యాలు పరంపరగా రాసాను
దానిలోంచి ఒక నాలుగు పద్యాలివి.
"సారయశుండు పండితుడు సర్వవిధంబుల తెల్గు ధాత్రిపై
కారణ జన్ముడీతడని ఖ్యాతి గడించిన స్వచ్చకీర్తి మం
దారుడు నీదుపట్టి పదునాలుగు బాసల మేటియైన ప్ర
జ్ఞారవి 'పుట్టపర్తీకవి చంద్రుని కంజలులిత్తు శారదా"
అని పుట్టపర్తి వారికి అంజలులిచ్చారు
ఇదేవిటీ యేదో ఆవేశంగా రాశానన్నావ్
కవిచంద్రుడు అంజలులు అని సామరస్యంగా వెళ్ళిపోతున్నావ్
అని అంటామని ముందే గ్రహించి
అదేవిటి యేదో ఆశ్చర్యంగా రాశానన్నాడు
పద్యాలేమో సౌమ్యంగా వున్నాయ్ అనుకుంటున్నారేమో
ఈ క్రింది పద్యాలు చూడండి అంటున్నాడు
"ఆతని నూకి ప్రక్కకటు "హాంఫటు-గప్ చుప్" యన్నయట్టు ఓ.
మాతరో..!నిన్ను నీవె అవమానము నిక్కము చేసికొంటివే..!
పూతచరిత్ర..!వాణి..!నవమోహిని..!నీదగు జ్ఞానపీఠికే
నూతనశక్తి ఆ సుకవి నూరువిధాల తలంప శారదా..!"
నూకి అనేది తెలంగాణాలో బాగా ఎక్కువగా వాడే మాండలీకం
చిన్నప్పుడు హాంఫట్ గప్చిప్ అని గారడిని మనం చూసాం
అదిగో అలా చేసావ్ నీవు
అటువంటి మహాకవిని పక్కకు పడేసి.
నిన్ను నీవు అవమానం చేసుకున్నావ్ ఏమైనా
చాలా బాధ తోటి అన్నాను నేను
"తీయని మాటలన్ మివుల తీయని చేతల తోడ నీవు "నా
రాయణు" సాక్షి మోసమును లావుగ జేసితె "పుట్టపర్తి"నిన్
మాయల తల్లినేననెడి మాటలు గావివి ఆంధ్ర లోకమే
కూయుచునుండె నిచ్చలును కుక్కుటమై ..!వగలాడి శారదా..!
కోడై కూస్తుందంటాం చూడండి
నారాయణుని సాక్షి గా నీవు పుట్టపర్తి నారాయణుణ్ణి నీవు మోసం చేసావ్
అది నేనన్న మాట కాదు
నేనన్నానంటే ఏదో పక్ష పాతంతో అన్నాననుకోవచ్చు
ఆయన నాకు బంధువు కాదు
పోనీ ఇప్పట్లాగ
నా ప్రాంతీయుడూ కాదు
నిజమైన కవికి కులము మతము ప్రాంతీయతేమిటండీ..
జాషువా వున్నాడు
ఒప్పుకోని తీరాలి
మహాకవి
అంచేత బాధతో
నువ్ మాత్రం తప్పు చేసావూ
నేనిది ఢంకా బజాయించి చెప్పగలనూ
"అక్కట కన్న పుత్రునకు న్యాయము సేయని పల్కుతల్లి! నే
నిక్కరణిన్ దురాగ్రహము నెవ్వియొ బల్కుచుంటి గాన నీ
తిక్క గుదుర్తురా యని మదిన్ తలపోసి నిరంకుశత్వము
ప్రక్కకు నెట్టివైచితివొ రచ్చ యొనర్చెద నిన్ను!శారదా.."
ఒకవేళ నేను నిన్ను ఇట్ల అన్నాను కదా అని
నా మీద ఆగ్రహం తోటి నన్నేమైనా చేయ దలచుకున్నావంటే
రచ్చ చేస్తాను
ఈ రచ్చ అనేది కూడా గమ్మత్తైన మాట
ధీయుతులైనవారు నిను తిట్టక ముద్దును పెట్టుకుందురే..?
మాయురె..?మోసగత్తె వనుమానము లేదని పల్కకుందురే..?
కోయిల గొంతుదాన..!అతి గొప్పకు బోతివి నిశ్చయంబు..!నీ
ధ్యేయమదేమిటో తెలియదే మరి నాకు వరాల శారదా..!"
నిన్ను తిట్టక ముద్దు పెట్టుకోమంటావా
అనేది తెలుగులో కద్దు
ఇంత గొప్పదానివైవుండి.
పోతన లాంటి వాళ్ళను చూసినదానివైవుండి
కాళిదాసాదులను చూసినదానివైయ్యండి.
శ్రీనాధాది కవులను చూసినదానివయ్యుండి
ఇదేమిటమ్మా..
ఏమండీ ఇంతవరకు ఎవరైనా చెప్పగలరండీ..
తరువాతి పద్యాలు చాలా ధైర్యంతో చెప్పాను
ఇది నా గొప్పదనమనండి
నా మొండి ధైర్యమనండి
పొగరనండి
పిచ్చితనమనండి
మూర్ఖత్వమనండి..
నేనేమన్నానంటే..
'పగలే వెన్నెల 'యన్నమాత్రమున.. అంబా అంత 'ఖుషౌ'దువా..?
'జగమే ఊయల' యన్నమాట.. మునుపచ్చా ..నీవు విన్లేదటే..?
పొగరున్ ..గర్వము.. క(చ)న్నుల్న్ వెలుగు అంభోజాక్షి..!విద్యాసతీ..!
సొగసౌ నవ్వుల చూడకట్టు ..కసితో..చో ద్యంబుగా శారదా..!
ఇంకోమాట కూడా అన్నానండీ అదికూడా చెప్పాలి మీకు
'చాం(సాం)బుభళా' కవిత్వములు.. సారసలోచన నేనెగాదు.. ఆ
రింగులజుట్టుచాన ..కమలేక్షణ సుబ్బులు నుంచుకున్న.. మా
రంగయ తాత గూడ ..కడు లావుగ.. సర్వులు మెచ్చునట్లు.. వ్రా
యంగలడే ..తలంపగను..! ఆ గతి జూడకు.. గుస్స ..శారదా..!!
గుస్సా అనేది కూడా తెలంగాణ మాటే
అలా అమ్మవారిమీద నా కోపం చూపా
నాభావం
ఈ పద్యాలన్నీ చెప్పిన తరువాత కూడా అర్థం కాకపోతే
వేస్టిక ..
పుట్టపర్తి నారాయణాచార్యులకు ఎంత అన్యాయం జరిగిందనేటటువంటిది
ఇక్కడ నా బాధ
నా హృదయావేదన
అంతకంటే
నేనెవరినీ అవమానించాలని
తక్కువచేయాలని కాదండి
ఎవడి గొప్పతనం వాడిది
ఎవడి విలువ వాడిది
అందుకే నేనన్నాను..
"దర్పంబున్ వగలెన్నొ చూపి బుధులన్ దద్దమ్మలన్ సేయుటల్
ముర్పెంబంచు తలంచినావే వికచంభోజాక్షి? బల్ యోచింప
నేర్పే!మ్రొక్కుచునుంటి నీకు మరియున్ నీ జ్ఞాన పీఠంబుకున్
సర్పంబట్టుల బుస్సు బుస్సుమనకే ! సర్వజ్ఞ!శ్రీ శారదా!!"
నువ్వు చాలా తప్పు చేసావ్
ఆ రెండు పద్యాలివి
ఒక కవి ఎవరైనా ఇంకో కవికి అన్యాయం జరిగితే ఇన్ని పద్యాలు రాయడు..
నాకు రాయాలనిపించింది..
రాశా..
చిన్నపిల్లలు సారీ చెప్పు సారీ చెప్పు అని ఏడిపిస్తారు
చిన్నపిల్లలం అమ్మ ముందు మనమెంతండి..
శారదను నేనెవణ్ణి తప్పు పట్టడానికి
నేనెంత
నా పాండిత్యమెంత..
కాని
ఒక ఆవేదన
నేరము లొప్పుకొమ్ము ..కడు నిక్కును టెక్కును చూపినావొ తూ
ర్పారగబట్టెదన్..! పెడసరమ్ముగ పల్కగ చూచినావొ, నా
నోరు భయంకరంబది..మనోన్మయి నన్సుతు రెచ్చగొట్టి బే
జారయిపోకహో.. నిగమ సన్నుత.. పల్కులరాణి.. శారదా..!!
ఒక కవి ఎవరైనా ఇంకో కవికి అన్యాయం జరిగితే
ఇన్ని పద్యాలు రాయడు..
నాకు రాయాలనిపించింది..
రాశా..
ఒకవేళ కొంతమందికి కోపాలొస్తాయి
అందుకే అన్నా
అండజయాన..! నా పలుకులన్నియు తుఛ్చులు కుట్రగాళ్ళకున్
గుండెల మీద గుద్దినటు - క్రోధము మీర మహోగ్రమూర్తియై
చండిక భీకరాకృతిని సల్పిన నాట్యమిదన్న రీతిగా
నుండును - నీవెరుంగవో తలోదరి కారణమేమొ..? శారదా..!!
అక్కిరాజు రమాపతి రావు గారికి
పుట్టపర్తి వారిపై ఎనలేని గౌరవాభిమానాలున్నా
ఆయన స్వభావం మృదువైనది.
వారి తమ్ముడైన సుందర రామ కృష్ణ గారు
గుండె ధైర్యం మెండుగా గల గుంటూరోడు
అన్నదమ్ములిద్దరిలో ఎంత వ్యత్యాసం
అనిపించింది
ఆయన శారదతో
"గుంటూరోళ్ళతొ పెట్టుకోకు
మొదలే గూండాలులే శారదా.."
అంటున్నారు
మీరూ చూడండి
|