27 ఏప్రి, 2016

పెద్దన్న రచనా స్వరూపం




పరవశదైన్యమాడుకొను ప్రౌఢల గానదు, ఘర్మ వారిచే
గరగి స్రవించు చిత్రకముగన దనామృత వీటి పాటలా
ధరమున సున్నమంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్న, గానదొక బాల నృపాలుని జూచి, నివ్వెరన్

స్వరోచి మనోరమ వీరి కల్యాణాన్ని వర్ణిస్తున్నాడు పెద్దన. విడిది ఇంటినుంచీ కల్యాణమంటపానికి 
స్వరోచి లేఖ స్వామి చౌదంతిపై కూర్చొని 
మెరవణిగా పోతున్నాడు

అప్పుడు గంధర్వ నగరంలోని స్త్రీలు 
పెండ్లి కుమారుణ్ణి చూడడానికి మేడలెక్కినారు. 
ఈ వివిధ నాయికలను పెద్దన్నగారు 
పది పద్యాలలో చెబుతున్నారు. 

అందులో 
ఒక ముగ్ధ నృపాలుణ్ణి చూసింది.
ఆ సౌందర్యం 
ఆమెను ఆశ్చర్య సముద్రంలో ముంచివేసింది
తదేకంగా ఆవిడ రాకుమారుణ్ణి చూస్తూ వుంది
ఆమె మనసూ పారవశ్యంతో బాహ్య స్మృతిలో లేనేలేదు
ఆమె ఆ చిత్తవృత్తిని వర్ణిస్తున్నాడు కవి

ఆమెతో బాటు చూస్తున్న ప్రౌఢ కాంతలు ఆమె పారవశ్యాన్ని గమనించి మేలమాడుకున్నారు
స్వేదోదయమైంది
తిలకం కరిగి పోతూంది
తాంబూలపు పెదవిపై సున్నం అంటింది
ఆమె స్పృహలోనే లేదు
ఆమెను ఆటపట్టించడానికి ఆమె ఆభరణాన్ని మెల్లగా తీసుకున్నారు
ఆమెకు తోచనేలేదు
ఈ పద్యాన్ని నాకు పాఠం చెబుతూ మా నాన్నగారు దీంట్లో నీకు విశేషం యేమీ కనిపించడంలేదా
అని అడిగారు
ఏముంది పద్యం బాగుంది
పెద్దన్న శైలి శిరీష కోమలం కదా అన్నాను
వారు నవ్వి
అంతమాత్రమే కాదు 
పెద్దన్న గారు తమ రచనా స్వరూపాన్ని తామే 
ఈ పద్యంలో  వివరిస్తున్నారు
అన్నారు
నిజమే ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
మనుచరిత్రను చదివినప్పుడు
వారి రచన అనే క చోట్ల ఈ ముగ్ధాలక్షణానికి వ్యాఖ్యానప్రాయంగా వుంటుంది
-మహాకవి పుట్టపర్తి