పుట్టపర్తి చమత్కార విన్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుట్టపర్తి చమత్కార విన్యాసం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23 మార్చి, 2017

అటమున్న.. నటమున్న..


వటపత్ర శాయి కోసం చిత్ర ఫలితం

భువనంబులేవియు బొదలకమున్న..
భవు కాలి గజ్జెలు పలుకకమున్న ..
జలధులు సర్వంబు నెలయక మున్న..
గలయంత జగతి జీకటి మున్న..
గమలోదరుడు శ్రుతుల్గరవకమున్న..
నటమున్న.. నటమున్న.. నటమున్నమున్న.. 
వటపత్రశాయియై బొటవ్రేలి నోట..
జివుకుచు దానొక్క శిశువు పోలికను
భువనంబులను బండి నవ నవ రీతి..
దనలోనె దానవ్వి ..దానికి నవ్వి..
తనచూపె దాజూచి దానికి నవ్వి. 
తనపల్కె దావిని దా నికి నవ్వి..
నవ్వుపుట్టుక జూచినవ్వి క్రీడించు
నవ్విశ్వకారణు .. నఖిలాభిగమ్యు.. 
వేదాంత వేద్యు .. సంవిన్మూర్తి .. భేద
వాదా విషయు .. భవభేదన ప్రవణు.. 
విశ్వేశు..  విశ్వాత్ము..  విశ్వైకనిలయు..  
శాశ్వతానంద సంశ్రయు..  గుణాతీతు.. 
నగుణు..  నిరంజను .. నిగడితభక్తు.. 
నిగమాగమాధీను .. నగణిత శక్తి.. 
నవ్విష్ణు దేవుని నసలార గాంచి.. 
- పండరీ భాగవతము 

ఒకనాడు మార్కాండేయ మహర్షికి 
ఆ మాయాస్వరూపుని లీలలను చూచి అనుభవించాలని కోరిక పుట్టిందట..

'అట్లేకానీ లేప్పా ..'
 అంటూ నారాయణుడు బదరికాశ్రమమువేపుకి పోయినాడు .. 
అప్పటినుంచీ మార్కాండేయ మహర్షికి 
'ఎప్పుడెప్పుడు మాయను దర్శిస్తానా..'
అని వ్యాకులం మొదలైంది. 

'' గన్ను చూడాలనుకో.. 
కాని బుల్లెట్ చూడాలనుకోకు తట్టుకోలేవ్ ''
అని ఓ సినిమా డైలాగ్.
అలా ..
ఈ ప్రపంచమంతా మాయే అని తెలిసిన సర్వ సంగ పరిత్యాగి తపస్వి అయిన ఆ మార్కాండేయుడు ఆ మాయను చూడాలనుకోవడం విచిత్రం.

ఒక రోజు
హటాత్తుగా కారుమబ్బులు..పెనుగాలులు
కుండపోత .. 
ప్రపంచమే అంతమౌతుందా అన్నట్టు 
భయంకరమైన తుఫాను.. 
అలా కొన్ని దినాలు గడిచాయ్
ఒకనాడు ..  ఒక ఎత్తైన ప్రదేశం మర్రి చెట్టు కానవచ్చాయి.. 
అక్కడికి పోయి చూడగా.. 
ఒక తేలియాడుతున్న మర్రి ఆకుపై పడుకుని వున్న శిశువు.. బొటనవేలిని నోటితో చప్పరిస్తూ.. 
ఆనందంగా తనలో తానే నవ్వుకుంటు న్నాడు..
ఆ పసివాని చూసి భ్రమ చెంది .. 
దగ్గరికి పోయాడు మహర్షి
అంతే.. 
శిశువు కడుపులోకి లాగబడ్డాడు
లోపల యేముంది..
ఆకాశం.. అంతరిక్షం.. 
నక్షత్ర మండలం.. పర్వతాలు
సముద్రాలు, వనములు,దేశాలు
ద్వీపాలు, దిక్కులు, సురాసురులు ,
సమస్తం ఆ ఉదరంలో ఉన్నాయ్

మహర్షి దిగ్భ్రాంతుడయ్యాడు
ఆ దిగ్భ్రాంతిలోనే బయటికి నెట్టబడ్డాడు
మళ్ళీ బయట ప్రళయం ఎటుచూసినా జలమే.. ఎదురుగా ఎత్తైన కొండ మర్రిచెట్టు
దగ్గరకు పోయి చూస్తే
మర్రి ఆకుపై తేలుతున్న శిశువు..

ఏది మాయ.. ఏది నిజం..
చిరునవ్వులు చిందిస్తున్న ఆ బాలుని మనసులో ప్రతిష్టించుకుని నమస్కరించుకున్నాడు
కళ్ళు తెరిచేసరికి ప్రళయంలేదు వాన బీభత్సం లేదు.. ప్రశాంతంగా ఉంది సమస్తం
తనకు అనుభవమైన ఆ యోగమాయా వైభవాన్ని తలచి విచలితుడై
స్వామి నీ మాయకు మోహితులు కానిదెవ్వరు. మాయని నిజంగా ఆ నిజాన్ని శాశ్వతంగా భ్రమించి.. 
 పండితులు .. విద్వాంసులు .. 
ఆఖరికి జ్ఞానులు సైతం
ఈ ప్రాపంచిక బంధాలచే బంధింపబడుతున్నారు
ఎవ్వరైతే నీ శరణు జొచ్చుతారో వారినీ మాయ తాకనైనా లేదు.

అని నమస్కరించాడు
ఆ మర్రి ఆకుపై పవళించిన .. 
చిన్ని కృష్ణుడెలా ఉన్నాడు ??
చూడండి .. 
పండరిభాగవతంలో 
పుట్టపర్తి వర్ణన నచ్చిందా.. 

28 డిసెం, 2016

రస బంధము






''దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తింగాంచు, నిన్నీశుగా
స్తవముల్ సేయు శృతుల్, సమస్త జగదంతర్యామివిన్  నీవ, యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్, గ్రతూ
త్సవ సంధాయక! నన్ను గావగదవే ! స్వాహా వధూ వల్లభా..''
. 

ఈ లాలసత నాటి జనులకే కాదు వారేర్పాటుజేసుకొన్న దేవతలకుగుడగద్దు.
వరూధినీ కామమును నిరాకరించి యింటికి ద్రోవబట్టిన ప్రవరుడు ..
అగ్నిదేవునెన్నోరీతుల బొగడినాడు..
'' దివిషద్వర్గము నీ ముఖ్ముననే దృప్తిగాంచు '' నన్నాడు..
బదులు రాలేదు..

' నిన్నీశుగాశ్రుతులు బొగడునుగదా .. !! ''
యని యగ్ని గొప్పతాము నగ్గించినాడు..

నీవు  '' సమస్తజగదంతర్యామి '' వని యాతని 'రాచరికమూ ను బొగడినాడు..

'' ఆహవనీయంబును, దక్షిణాగ్నియును '' నీయందేగదా యుద్భవించునని యాతని సర్వాధారత్వమును బలికినాడు..
కడకు..

'' గ్రతూత్సవసంధాయక.. !!'' యని యేమో యొయ్యారముగ బిలిచినాడు..

ఇదేదియు గార్యసాధకముగాదనుకొన్న ప్రవరుడు..

'' స్వాహావధూవల్లాభా..'' యని ముగించినంతనే..
యుత్సాహము రేగిన వహ్ని .. '' హా '' యని పైకిలేచి నిలచి నాడట..

29 ఆగ, 2016

అంతో ఇంతో నవ్వబ్బా..

నవ్వు ఒక రకమైన ముఖ కవళిక
నవ్వడమంటే 

రెండు పెదవులు సాగదీయ బడతాయి
నోటి నుంచీ ఒక శబ్దం వస్తుంది..
ఆ శబ్దం..
రక రకాలు

సాధారణంగా
 సంతోషం..ఆనందం కలిగినపుడీ చర్య జరుగుతుంది..
 

 ప్రతి సందర్భంలోనూ
మనం రక రకాల నవ్వులని చూస్తాం
కొందరు ముసి ముసిగా ..
కొందరు గట్టిగా..

పసి పాపలవి బోసి నవ్వులు 

విరగబడి .. పగలబడి .. 
వికటంగా .. కుటిలంగా . . 
ప్రకటి తం గా.. అప్రకటితంగా .. 
ప క ప కా .. విక వికా..
అబ్బో .. నవ్వులెన్నో

నవ్వు  వ్యక్తుల మధ్య  స్నేహాన్ని 
సంభాషణల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది .. 

అంతేకాదు 
నవ్వు అనేది ఆరోగ్యకరమైన అంటువ్యాధి .. 
దీన్ని సైన్సు జెలోటాలజీ అంటుంది .. 
హాస్యాలలో కూడా  రక రకాలు 
ఏ రంగాలలో ఉన్నవారికి 
అందులో  హాస్య సంఘటనలు ఎదురవుతాయి 
డాక్టర్లు యాక్టర్లు కలెక్టర్లు డ్రైవర్లు కండక్టర్లు గుమాస్తాలు కవులు కళాకారులూ .. 
 పోతన కవిత్వము గురించి వ్రాసిన పుట్టపర్తి 
ఆయన లోని హాస్యాన్ని కూడా స్పృశించారు 



శ్రీనాధునిలో విపరీతమైన హాస్యముకలదు..
అతనిది మందహసితము గాదు..
అతి హసితము..
ఒక్కొక్కసారి అప
హసితము గూడ..
 

పోతనామాత్యులయందును హాస్యమున్నది..
శ్రీనాధుడు భోగ్యవస్తువులన్నియు నమరియుండి నవ్వినవాడు..
పోతన పరమ దారిద్ర్యములోనుండి..

తృప్తిగ నవ్విన భాగ్యశాలి..
కాని నగవునందును వారికి గొంత సమ్యమనమే యున్నది..
 

సామాన్యముగ పోతన్నది మందహాసమే..
అరుదుగా తప్ప హద్దు మీరిన చోటుండదు..
కృష్ణుని బాల్య లీలలలో 

యీ హాస్యము కొంత చోటు చేసుకొన్నది..
కాసంత యెక్కువ గూడనేమో..
తమరు చదివికొనవచ్చును..
 

వామనునికథలో 
గురుశాప తప్తుడైన పరిస్థితిలో గూడ బలి..
తన మందహాస ప్రియత్వమును విడువలేదు..
 

అనగా..
దుర్భర దారిద్ర్యమునందును పోతన్న..

తన హాస్య ప్రియత్వమును మానలేదన్నమాట..
ఆ పద్యమీ క్రిందిది..
 

పుట్టినేర్చుకొనెనో.. పుట్టక నేర్చెనో..
చిట్టి బుధ్ధులిట్టి పొట్టి వడుగు..
బొట్టనున్న వెల్ల బూమెలునని నవ్వి
యెలమి ధరణిదాన మిచ్చెనపుడు..

కాని సాధా రణముగ నిట్టి వరుదు..
 ఒక్క పదముతోనో
వాక్యముతోడనో
హాస్యమును సూచించుట పోతన్న వాడుక
 

యయాతి చరిత్రములోని యదువు చెప్పిన 
యీ క్రింది పద్యమట్టిది..
కాంతా హేయము దుర్వికారము దురా కండూతి మిశృంబు హృ
హృచ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేద వ్రణాకంపన
శృఆంతిస్ఫోటక యుక్తమీముదిమి వాంఛందాల్చి నానాసుఖో
పాతంబైన్ వయో నిధానమిది యయ్య తేర యీవచ్చునే..?? 
దీనిలో
'తేర యీవచ్చునే..'
అను పదము చదివి నపుడు మాత్రమే 

కాసంత మన పెదవి విచ్చును..

ఒక్కొక్కసారి
పోతన్నయే మన యెదుట నిలచి.. చిరునవ్వుతో
కెదికి హెచ్చరించుటయు కద్దు..
అట్టిది యొకటి..

తజ్జనని లోగిటంగల
రజ్జు పరంపరల గ్రమ్మరం సుతుగట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలములున్న బొజ్జ తఘ్ఘన్ వశమే..

అట్టి చోటులలో గూడ నితని హాస్యము లలితమైనదే..
ఈ పద్యమును చూడుడు.

''పొడుపు గొండమీద పొడుచుట మొదలుగా
బరువు వెట్టి వినుడు పశ్చిమాద్రి
మరుగు జొచ్చెగాక మసలిన చలిచేత..
జిక్కె చిక్కె ననగ చిక్క కున్నె..?? ''

ఈ పద్యము నందు నాల్గవ పాదమునందు మాత్రమే కొంత హాస్యమున్నది..
సాధారణముగ నాతనికి చేష్టలతో హాస్యమును వణించుట ప్రీతి..
ఇందుకుదాహరణములు 

తమరు గోపికల క్రీడలు మొదలైన వానిలో చూడవచ్చును..

27 జూన్, 2016

ఆతడొక చిత్రపురుషుడు..

















తెన్నాలి కవి 
''పరమ పదనాధ నిరవధిక కృపాపరిపాక పరిచిన సరస్కవితా సనాధు '' డట..
ఆతని ' పరమ పద నాధుడు' ను అతనివంటి హాస్యప్రియుడే..
ఈ విషయ మాయన  వేషమే చెప్పుచున్నది..

ఆ కృష్ణునకు మంచి వెడదలగు కన్నులున్నవి..
వ్రేతల వలపించు వెరవులున్నవి..
మంచి పింఛమును జెరివినాడు
మువ్వంక మురువుతో.. మురళితో ..చూచుటకు ముచ్చటైనవాడు..

ఇన్నియుండియును పాపము దిస్సమొలయేనట..
ఒక్కొక్కసారి ''కడారపటుడై '' గనుపించును..
'చిప్ప కూకటియు'
 నాకృష్ణునకు రామకృష్ణుడు నేర్పిన యొక సౌందర్యము..

ఎన్నియేండ్లనుంచి పట్టుకున్నాడో.. యా ప్రాత చిక్కము ..
నొకసారియైనను వదలడా పరబ్రహ్మము..
గచ్చకాయలో.. మద్దికాయలో యా కృష్ణుని సొమ్ములు..
ముక్కున ముంగరముత్యము కదలుచుండవలసినదే..

ఒకవేళ పాండురంగడు నడచినచో ..
'' పుట పుటనైయున చిని బొజ్జయు గదలుచు.. 
భక్తులతో ..రంగడేగాదు నేనుగూడ నున్నా '' నని హెచ్చరించుచుండును..

ఇట్లీకవి సృష్టించిన కృష్ణమూర్తి నూహించికొన్నప్పుడు 
నా భావనలో
 రామకృష్ణకవికి నకలు మూర్తియే గోచరించును..

ఇక నాదైవమును కవి సంబోధించు రీతులు గూడ పలుపలు రకములు..
ఒకసారి '' నందులేబట్టి '' యని..
సామాన్యముగ ననును..

ఒకపరి '' దేవకితర్ణక '' మని 
గోకులమందున్న దూడలతో గోపాల కృష్ణుని గూడ లెక్కవేసి మాటాడును..

ఇంకొకసారి '' అఖిల నిమౌఘ గిరి గుహా హరి పృధుక '' మని యేమో గంభీరము గ 
నతని గొప్పను జెప్పును..

మరల నొకపరి
 '' ఎన్ని కల్పంబులరిగిన యేనయేండ్ల - వెలయు ప్రాయంబుగల కొయ్య విఠలయ్య '' 
అని కుండ బగులగొట్టినట్లు రహస్యమును విప్పి చూపి
కృష్ణుని పరిహాసము జేయును..
లేక విసుగును జూపించును..

ఆ కృష్ణునివలెనే ఈ రామకృష్ణుడును 
'' అవిదితగతి ''
ఈ పరమ పద నాధుని యుపాసనయు 
రామకృష్ణుని నాటికి దెనుగుదేశమున నింకను బాగుగ బ్రాకలేదు..

కృష్ణరాయలొక్కమారు పండరికిపోయి వచ్చినటుల చరిత్రయున్నది..
అతనికా దేవునిపై భక్తి ప్రపత్తులుండుటకు గురుతా రాయలు గట్టిన విఠలాలయమే..

రామరాయలకును 
పాండురంగనితో సంబంధమున్నట్లేవో కథలున్నవి..

ఎవరికో అక్కడక్కడ నొకరిర్వురికి 
పండరినాధునిపై కన్నున్నను 
ప్రజా సామాన్యమునకా యుపాసన 
తెనాలి కవి నాటికి బాగుగా పా దుకొన్నదిగాదు..

తాతలనుండి రామభద్రుడు 
తెనుగులకు నచ్చినదైవము..

కృష్ణరాయలకు '' విఠ్ఠల సంప్రదాయము ''
సోకుటాకు గారణమున్నది..
అతని కాలమునందును .. 
అందుకు కొంత పూర్వమును 
వైష్ణవముదే ప్రధమతాంబూలమైనను
దానిప్రక్కలో ద్వైతముగుడ ఎదిగినది..

రాయలనాడే 
వ్యాసరాయలు..  కనకదాసు..  పురందరులు మొదలగువారుండిరి..
వీరందరు ప్రధానముగ పాండురంగని యుపాసకులే..

వెంకటపతి రాయల కాలమున ద్వైతులలో సామ్రాజ్యముతో నాంతరిక సంబంధముగలవారెవ్వరును గనుపింపరు..
మరి  వైష్ణవుల శిష్యుడైన తెన్నాలికవికీ ద్వైతవాసన యెట్లుపట్టెనో 
ఆతడొక చిత్రపురుషుడు..

(ఈ ఫొటో  లో వున్నది నేను (చిన్నపిల్ల)అమ్మ అయ్య 
మూడునాలుగు రోజులున్నాము అక్కడ
ఉన్నన్ని రోజులు అయ్యను ఎంత ప్రేమగా చూసిందో అమ్మ 
పక్కన కూచున్నప్పుడు తలపై చేయి వేసి నిమురుతూనే ఉంది 
నోట్లో అన్నం తినిపించడం .. 
నోరు తుడవడం .. 
నాన్నా .. అని పిలవడం.. 
ఎంత అదృష్టం . . )

27 ఏప్రి, 2016

పెద్దన్న రచనా స్వరూపం




పరవశదైన్యమాడుకొను ప్రౌఢల గానదు, ఘర్మ వారిచే
గరగి స్రవించు చిత్రకముగన దనామృత వీటి పాటలా
ధరమున సున్నమంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్న, గానదొక బాల నృపాలుని జూచి, నివ్వెరన్

స్వరోచి మనోరమ వీరి కల్యాణాన్ని వర్ణిస్తున్నాడు పెద్దన. విడిది ఇంటినుంచీ కల్యాణమంటపానికి 
స్వరోచి లేఖ స్వామి చౌదంతిపై కూర్చొని 
మెరవణిగా పోతున్నాడు

అప్పుడు గంధర్వ నగరంలోని స్త్రీలు 
పెండ్లి కుమారుణ్ణి చూడడానికి మేడలెక్కినారు. 
ఈ వివిధ నాయికలను పెద్దన్నగారు 
పది పద్యాలలో చెబుతున్నారు. 

అందులో 
ఒక ముగ్ధ నృపాలుణ్ణి చూసింది.
ఆ సౌందర్యం 
ఆమెను ఆశ్చర్య సముద్రంలో ముంచివేసింది
తదేకంగా ఆవిడ రాకుమారుణ్ణి చూస్తూ వుంది
ఆమె మనసూ పారవశ్యంతో బాహ్య స్మృతిలో లేనేలేదు
ఆమె ఆ చిత్తవృత్తిని వర్ణిస్తున్నాడు కవి

ఆమెతో బాటు చూస్తున్న ప్రౌఢ కాంతలు ఆమె పారవశ్యాన్ని గమనించి మేలమాడుకున్నారు
స్వేదోదయమైంది
తిలకం కరిగి పోతూంది
తాంబూలపు పెదవిపై సున్నం అంటింది
ఆమె స్పృహలోనే లేదు
ఆమెను ఆటపట్టించడానికి ఆమె ఆభరణాన్ని మెల్లగా తీసుకున్నారు
ఆమెకు తోచనేలేదు
ఈ పద్యాన్ని నాకు పాఠం చెబుతూ మా నాన్నగారు దీంట్లో నీకు విశేషం యేమీ కనిపించడంలేదా
అని అడిగారు
ఏముంది పద్యం బాగుంది
పెద్దన్న శైలి శిరీష కోమలం కదా అన్నాను
వారు నవ్వి
అంతమాత్రమే కాదు 
పెద్దన్న గారు తమ రచనా స్వరూపాన్ని తామే 
ఈ పద్యంలో  వివరిస్తున్నారు
అన్నారు
నిజమే ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
మనుచరిత్రను చదివినప్పుడు
వారి రచన అనే క చోట్ల ఈ ముగ్ధాలక్షణానికి వ్యాఖ్యానప్రాయంగా వుంటుంది
-మహాకవి పుట్టపర్తి