8 మార్చి, 2012


సమయం ఆరు గంటలు..
ఒక్కొక్కరూ..
కడప మోచంపేటలోని ..
శివుని గుడికి చేరుతున్నారు.
గుడిలో ప్రదక్షిణాలు ముగించి ..
తలా ఓ ప్రదేశంలో కూర్చొని..
ఎదురుచూస్తున్నారు..
ఆచార్యుల వారికోసం..

అక్కడ..
గత కొన్ని సంవత్సరాలుగా..
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ..
ప్రవచనాలు చెబుతున్నారు..
ఇంతలో రానే వచ్చారు అయ్యగారు..
వేదిక సిధ్ధంగానే వుంది..
మైకు అరేంజ్ మెంట్స్ బానే వున్నాయి..
 
అయ్య వచ్చారు..
వెనకాతలే ఓ ఏడేళ్ళ పిల్లా..
అయ్య వేదికపై వెళ్ళి కూచుంది..
మైకు సవరించింది..
నీళ్ళు కింద పడేయ బోయింది..
అమ్మా..
రాధమ్మా..
వద్దమ్మా..
అక్కడి వాళ్ళు వారిస్తూనే వున్నారు..
వింటుందా..??
 
అయ్య ..
అక్కడ వున్న పటానికి నమస్కారం చేస్తున్నారు..
ఇంతలో ..
మైకు దొరకబుచ్చుకుందా పిల్ల..
మా అయ్యకు బుధ్ధిలేదూ....
గట్టిగా మైకులో అరిచింది..
అందరూ ఫకాల్న నవ్వారు..
 
అయ్య చటుక్కున చూసారు..
మళ్ళీ ..
మా అయ్యకు బుధ్ధి లేదూ....                                                            
గాట్టిగా అరిచింది..
అయ్య ముఖంలో పరచుకున్న చిరునవ్వు..
వేదికపై వచ్చారు..
అంతా నవ్వుతున్నారు..
 
అయ్యకు కాస్త సరిగా వినపడేది కాదు..
ఏమంది..ఏమంది..??
అడిగారు అయ్య..
చెప్పారు..
అయ్య..గల గలమని నవ్వారు..
రెండు బుగ్గలపై ముద్దులు పెట్టారు..
"అవునమ్మా నాకు బుధ్ధిలేదు.."
నవ్వి.. నవ్వి ..
ఎర్రబడిన ముఖంతో పలవరించారు ..

తప్పుకదూ అయ్యనలా అనొచ్చా..??
క్కయ్య అంది..చెవి పట్టుకుని..
అయ్యా.. అంటూ
మళ్ళీ అయ్య దగ్గరికే పరిగెత్తింది..
ఆ పోకిరి పిల్ల..
 
ఇక ఆ రోజంతా ఇంటిల్లిపాదీ..
గుడి లోని వారు..
ఇదే విషయం..
చెప్పి చెప్పి నవ్వుకోవటం..
ఇంట్లో అమ్మ పెదవులూ ..
చిరునవ్వుతో విచ్చుకున్నాయి..
అయ్యకు బుధ్ధిలేదన్నందుకు..
అందరూ ముద్దులు పెడుతున్నారేవిటా..?
 అని అనుకుందా పిల్ల..