14 మార్చి, 2014

తెనాలి చిక్కెమునకు చిక్కితివా పాండురంగా..

రామకృష్ణుడిది ఒక ప్రత్యేక జాతి
కవిత్వం కన్నా వ్యవహార శైలితోనే అందరిదగ్గరా మార్కులు కొట్టేసిన ఘనత అతనిది
 

అతని హాస్యానికి వ్యంగ్యానికి బలికాని వ్యక్తులు లేరంటే 
అతిశయోక్తి కాదేమో

ధూర్జటి వేశ్యా లంపటుడు
పగలు రాయల కొలువు రాత్రి వేశ్యల చెలువు..
తన పధ్ధతికి తనకే అసహ్యం...
 అధిగమించలేని లోలత్వం..
కానీ కవిత్వం అద్భుతం..
 

రాయలవారు ధూర్జటి కవిత్వానికి సంతోషపడి
నీ కవిత్వానికీ అతులిత మాధురీమహిమ ఎలా కలిగిందయ్యా అని ప్రశంసిస్తే..


అక్కడే వున్న రామలింగడు ఊరుకుంటాడా
 

హా తెలిసెన్.. అంటూ వేశ్య వనితల సాంగత్యంవలన ఫుల్లమైన మనసులోంచీ ఉద్భవించిన కవిత్వమది అతులిత మాధురీమహిమ లేకుండా యెలా వుంటుందీ.. అని
ఆ హాశ్చరానికి అర్థం విడమరిచాడు
ధూర్జటిపై ద్వేషమా పగా కాదు స్వభావం అంతే..
 

''స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?''

 
''హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ''


 ఒకసారి కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్ అని పూరణను రాయలవారు రామలింగడు లేని సమయంలో ఇచ్చారట...
ఎవ్వరూ పూరింపలేకపోయారు
ఏనుగుల గుంపు దోమకుత్తుక జొచ్చడమేమిటీ..
 

ద్వారపాలకునితో మిగిలిన కవులు అడిగించారు తెనాలిని
అడిగింది ద్వారపాలకుడు 

దానికి రామకృష్ణుని సమాధానమెలా వుంటుందీ..?
 

''యేరా ఫుల్లుగా కల్లుతాగి పేలుతున్నావా..
 కుంజరయూధంబు ఎట్లా దోమ కుత్తుక జొస్తుందిరా..
 తలతిక్క వెధవా ..''
అని దులిపేశాడు..
 

అదే మళ్ళీ రాయలవారడిగారు
ఇందాకట్లా నోరు చేసుకోడానికి లేదు
కాబట్టీ 

అందులో పంచపాండవులు.. వా రి దుర్విధి..
విరాట కొలువున దాగిన వైనం..
కథలో జొరబడ్డాయి ..
ఆటో మాటిగ్గా 'కుంజర యూధంబు దోమ కుత్తుక' లోకి వెళ్ళిపోయింది..
 ఇది జీవితం ఇక అతని కవితలో ఆ హాస్యం 
ఎలా ప్రతిఫలిస్తుంది..

 ఇలాంటి హాస్య దృష్టి గలవాడు చెప్పిన కవిత్వంలో 
అది భక్తి అయినా కరుణ అయినా దుఃఖమైనా సరే.. 
హాస్య ఛాయలు దూరి తిష్ట వేస్తాయి
వారేంచేసినా సరే..
ఇలాంటిదే క్రింది సందర్భం..


ఉదాహరణకు చూడండి

 పుండరీకుడు తపస్సు చేస్తున్నాడు..
దేవుడు ప్రత్యక్షమయ్యాడు
 

సాధారణంగా ఎవరైనా భగవంతుని రమ్మంటే సందర్భాన్ని బట్టి 
ఆయన వెనకా ముందూ వస్తాడు..
అన్నమయ్య 

'అంతర్యామీ అలసితి సొలసితి..' ఇంక రావయ్యా అంటేకానీ రాలేదు
త్యాగయ్య
 'నగుమోమూ గనలేనీ నా జాలి తెలిసీ.. నను బ్రోవ రారాదా..' అని తల్లడిల్లి పోయాడు

'జగమేలే పరమాత్మా ఎవరీతో మొరలిడుదూ 
వగ జూపకు తాళను నన్నేలు కోరా.. '
అనిబేజారు పడితే కానీ రాలేదు..
గజేంద్రుడు రమ్మంటే మాత్రం..
సిరికింజెప్పడు.. శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు ..
అన్నట్లు ఆదరా బాదరా వచ్చేసాడు.. 
 
అర్జెన్సీని అర్థం చేసుకోవాలి కదా ..

మరి తెనాలి వాని పరమాత్మ ఎలా వచ్చాడు..?
రుక్మిణిని మరచిపోయాడేమో కానీ చిక్కాన్ని మరువలేదట
చేతిలో శంఖం వెన్నముద్దలా వుందట..


వావ్..
ఒక్కసారి చలిది చిక్కాన్ని పట్టుకుని 

ఒక చేతిలో వెన్నముద్దతో వచ్చిన కృష్ణుని ఊహించుకోండి..
 

జాలరులు వలలతో చేపలు పడతారు
హరి మీనావతారుడు..
కాబట్టీ ఋషులు యేం కావాలి జాలరులే గదా..
ఆ జాలరులకు వలలు..?
ఋషులకు వలలింకేం ఉంటాయి

 సర్వ సంగ పరిత్యాగులు 
అందుకు వారి భక్తియే వల
అదే చలిది చిక్కెం..
 

వచ్చిన వాడు బాల కృష్ణుడు
ఆయనకు ఇష్టమైనవి పాలు పెరుగు వెన్న పెరుగన్నపు చిక్కెమది..

అందుకే ఆ కృష్ణుడు రుక్మిణిని మరచినా చిక్కాన్ని మరువలేదు..  అంతేనా..
బహుశా అంతేనేమో..


తెనాలిరచనలోని హాస్యాన్ని 
మనకు పరిచయం చేస్తున్నారు పుట్టపర్తి
పుట్టపర్తి కూడ తెనాలిని బాగా ప్రేమించారనుకుంటా
అందుకే వారి చాలా రచనలలో తెనాలిని మరచిపోలేదు                                   తెనాలి రామకృష్ణుని హాస్యము
                                శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
 

రామకృష్ణకవి స్వభావమే హాస్యమయము. 
ఆతడే యుపమానము చెప్పినను యేమాట యన్నను దానిపైన గొంత హాస్య రస చ్ఛాయ యుండవలసినదే.. 

కుమారస్వామి వెంట ఈశ్వర దర్శనార్థమై ప్రమధగణములు గదలినారు.
వారి యాభరణములు వర్ణించినాడు కవి..
 

వారి వైభవము మనకు దెలియును గదా..
పాములు.. 

కపాలములు.. 
పులి చర్మములు..
అవి యట్లుండనీ..
ఆ యాభరణముల నడిమ
"బురుపారగమేను బూదిబూసినారు" అన్నాడు..
 

వారు విభూతి బూసికొన్నారట..
అది యెట్లున్నదనగా.. బూజు పట్టినటులున్నదట..
 

శ్రీనాధునివంటివాడది చూచిన 
రామకృష్ణుని యీ లోకమున నుండనివ్వడు..
 

శ్రీమహావిష్ణువును బుండరీకుడు గాఢముగ ధ్యానించునపుడాతని ధ్యానదృష్టిలో
గృష్ణ భగవానుడుదోచునట.. 


అపుడా కృష్ణుడు రుక్మిణినైన మరచినాడుగాని..
చలిది చిక్కమును మాత్రము 

దగిలించుకొనియే వచ్చినాడు..
 

ఆ చిక్కము..  
ఆయన ముందు మీనావతరమైనందున 
ఆ మహామహుని బట్టుటకు 
మునులు వేసిన భక్తియనెడు వలవలె నున్నదట..
 

చేతిలోనున్న శంఖము 
వెలితిగా జవికొన్న వెన్నముద్దయనిపించినది..
 

ఇంతలో బుండరీకుని దల్లిదండ్రులు గతించినారు..
పుండరీకునకు సత్సంతానమై పితౄణము దీరినది
సంసారపు జంజాటము జాలించుకొని 

వాడు దైవమునకై బాసిక పట్టుపట్టినాడు..
 

అతి కఠోరమగు దపస్సును 
అనేక వత్సరములు గావించెను..
కృష్ణుని యాటలన్నియు సాగినవికావు.. 

అతనికి దర్శనమివ్వవలసివచ్చినది..
 

పరమాత్మను చూచిన వెంటనే పుండరీకుని 
యనంద మింతింతగాదు..
"క్రొత్త పులునేపున.." 

పులకలు శరీరమున వించినవి
చాల తడవు మాటాడలేకనే పోయినాడు కడకు..
''దేవ అస్మాకం శరణం త్వమేవ గతి రన్యోనాస్తి దుర్వాసనా పస్మారం హరా''
అని అమాంతముగ అడుగుల మీదబడినాడట..
 

ఇంత రసోన్మాదముననుసరించిన పుండరీకుడు విష్ణుస్తుతి నారంభించినాడయ్యా..
అతని మొదటి వాక్యము వినుడు..
సీ.  ''పొదలునీ పొక్కిట పువ్వు కాన్పు నగదా
పెను మాయ పిల్లలు బెట్టుటెల్ల.. ''     2-55
 

ఇది చదివిన వెంటనే 
పాఠకునకు ఫక్కుమని నవ్వు వచ్చును..
 

అంతకు ముందు వాడనుభవించుచూ వచ్చిన తాదాత్మ్యము దూదిపింజవలె నెగిరిపోవును. 

నారద మహర్షి యొక్క "యెర్రని జడలు" 
''సుషుమ్ననాడి యీనిన పిల్ల వెలుగున పడుపున'' నుండెనట.. (2-172)
 

మండుటెండలో దపించు బుండరీకుడు 
కడుపుబ్బించి లింగము వలె నున్నాడట..
శ్రీ మహావిష్ణువు భవన ఘటనకు మొదలికంబమువలె సర్వలోకమునకు బ్రధానుడట..
యీ రీతి నతడేది జెప్పినను కొంత హాస్యమే నడచును..
శంకరునిచే తత్త్వబోధను వినునవకాశమును బోగొట్టుకొన్న నారదుడు
 

ఉ .డక్కిన విష్ణు భక్తియు దృఢంపు విరక్తియు గల్గు నమ్మరు
ద్బుక్కటకున్ భజించు మతి పుట్టక కంపలబడ్డకాకినై
యక్కట మోసబోయితిగదా..
అని పశ్చాతాప బడును 

నారదుని తాపమెట్లయిన నాయె, 
దీని జదివినంతనే మనకు నవ్వు వచ్చును 

కాపు కోడలు దన్ను వలచుచున్నదని  
తెలిసినంతనే నిగమశర్మ
 

''భళిరా తేరకుతేర దక్కెనిటు లీ బంగారుకుండంచు జం
కలు దాటించుచు కెంపు మోవి దొడుకంగా గుబ్బ పాలిండ్లు బి
ట్టలరంగా ముఖగంధ పారణము సేయంగా.. ''    3-67
 

లొట్టలు వేసినాడట..
 

ముఖ గంధ పారణ శబ్ద నిర్మాణమ్న నెంతో హాస్యమును 
దొడుకంగా అలరంగా సేయంగా అను నూతన పదములలో గంపెడు హాస్యమునున్నది

(తెలుగు తీరులు -తెనాలి రామకృష్ణుని తెలుగు కవిత పుటలు)