25 మార్చి, 2013

పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాలు..







పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

కడపలోను హైదరాబాద్ లోనూ పెద్ద ఎత్తున.
మొదలు రవీంద్రభారతిలో అనుకున్న కార్యక్రమం 
నాగపద్మిని అధ్వర్యంలో దూరదర్శన్ సప్తగిరి లో 
రెండుగంటల లైవ్ ప్రోగ్రాం గా రూపుదిద్దుకోనుంది. 
అక్కయ్య ఆ పనిలో ఊపిరి సలుపుకోలేనంత బిజీ గా వుంది. 

దూరదర్శన్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్ 
రెండు గంటల లైవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో 
అక్కయ్య ఆనందం అయ్యపై దాని ప్రేమకు 
 ఒక అలంకారమయ్యింది. 

కడప నుంచీ పుట్టపర్తి వారి నిలువెత్తు ఫోటో పంపమని 
అక్కయ్యను ఒకటే ఫోన్ చేస్తున్నారట
దానికేమో తీరటం లేదు. 
అది నాకు పురమాయించింది. 
జానుమద్ది హనుమచ్చాస్త్రి గారింటికి 
 భూతపురి సుబ్రమణ్యం గారి కొడుకు గారికీ ఫోన్ చేసి 
పంపినట్లు చెప్పాను. 

అది బ్రౌన్ లైబ్రరీలో పెట్టాలట. 
నా బ్లాగు లోని అయ్య నిలువెత్తు ఫోటొ పంపాను. 
భూతపురి సుబ్రమణ్యం గారు మంచి కవి పండితులు. 
వారు మా ఇంటికి తరుచూ వచ్చే వారు. 
అయ్యంటే చాలా గౌరవం ఇష్టం.

వారి అబ్బాయికి నన్ను నేను పరిచయం చేసుకొని 
వారి తండ్రి గారితో నాకున్న పరిచయాన్ని 
పొందిన వాత్సల్యాన్నీ చెప్పాను. 
ఆయనా ఎంతో ఆనందపడ్డారు. 

వారి తండ్రి గారి తరుఫున
 ప్రతి సంవత్సరం ఒక కవి ని సత్కరిస్తున్నారట 
నా బ్లాగు చూడమని చెప్పాను 
వారు అప్పుడే చూసి 
నీ ప్రయత్నం చాలా మంచిదమ్మా. అని అన్నారు. 

కడప రేడియో స్టేషన్ డైరెక్టర్ గోపాల్ గారు 
నా అభ్యర్థన మీద కొన్ని పాటలు పంపారు భక్తి రంజనివి. 
ఫోన్ తరువాత మైలు చేసారు పాటలు చూసుకొమ్మని. 

నాకు పట్టరాని సంతోషం 
అయ్య కడప భక్తి రంజని పాటలు ఎలా దొరుకుతాయి.
ఎవరు సహాయం చేస్తారు అని తపించిన నాకు . 

ఆ కడప స్టేషన్ డైరెక్టరు చిన్నదాన్నయిన 
నా అభ్యర్థన మన్నించి పంపటం 
కలయో వైష్ణవ మాయయో కదా...
తీరా మైల్ చూసిన నాకు 
పాలపొంగుపై నీళ్ళు చిలకరించినట్లయింది. 
అవి అసలు అయ్య పాటలు కానేకావు. 
కొంచం దుఃఖం కొంచం నిరాశ. 

నువ్వు చూడవే అయ్య పాటలేమో నని అక్కయ్యకూ పంపాను. 
కానీ అది కూడా 
ఇవి విజయవాడ రిలే పాటలు. అని చప్పరించేసింది. 
అతనికి ఫోన్ చేసి 
అవి అసలు పుట్టపర్తి వారి పాటలు కావండి 
అని మెల్లగా చెప్పాను. 

అతనూ "పుట్టపర్తి వారివి కావా..?"
 అని దిగ్భ్రాతుడై 
"సరే.. మళ్ళీ వెతికిస్తాను...
 నీవు పాటల పల్లవులు వ్రాసి నాకు మళ్ళీ మైల్ చేయమ్మా.." అన్నాడు. 

ఇది ఈశ్వరుడు నాపై కురిపిస్తున్న దయో 
లేక మా అయ్యగారే చేయించుకుంటున్న పనో అర్థం కాలేదు. 
నిన్న నరసిమ్హాచారి  ఫోన్ చేసి 
అయ్య పాటలు కొన్ని  దొరికాయి అంటూ 
 శుభవార్త చెవినేసాడు. 

 కడప రేడియో స్టేషన్ వాళ్ళూ ఒక వారం రోజుల పాటు 
పుట్టపర్తి వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 
ప్రతి రోజూ ఒక గంట సమయం 
పుట్టపర్తి వారి సూక్తి ముక్తావళి శివతాండవం 
ఇంకా పలు కార్య క్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. 

ఆ నరసిమ్హాచారి నేనూ కలిసి పనిచేసాం ఆకాశవాణిలో 
అతను నాకంటే హడావుడిగా వున్నాడు. 
"మా స్టేషన్ డైరెక్టర్ పేరు   సెలక్ట్ చేసారు.." అన్నాడు
" ఏంటి..?"
 అని అడిగా 
"సరస్వతీ పుత్రుని సాహిత్య వైభవం" అట. 

మీ కుటుంబ సభ్యులందరి నంబర్లూ ఇవ్వు త్వరగా 
అని తీసుకున్నాడు. 
"ఈ వారం రోజులూ అయ్యాక..
 భక్తి రంజని పాటలు నాకు వెతికి ఇవ్వాలి.." అన్నా..
" తప్పకుండా అనూరాధా..
పుట్టపర్తి వారికి నేనెంటే ఎంత ప్రేమో తెలుసా ..?
నన్ను కొడుకులా పలకరించేవాడు.." అన్నాడు. 
కృష్ణుడిని గోపికలందరూ నా వాడే అనుకున్నట్లు 
పుట్టపర్తి అందరి వాడూ .. 

ఇక శశిశ్రీ వ్రాసాలు సాక్షి సూర్య జ్యోతి దినపత్రికలలో పడ్డాయి. 
పొద్దుటే 6.30 కు శ్రీశైలం గారి ఫోన్ 
అమ్మా అమ్మా అయ్యగారి పై వ్యాసం జ్యోతిలో పడింది అంటూ.
శశిశ్రీ కి ఫోన్ చేసి పలుకరించా 
వ్యాసం బాగుంది 
అయ్య ఫోటో కొత్తగా వుంది అన్నా 
నేను గీయించానమ్మా అన్నాడు.

మీరు అయ్య కొడుకుగా పుట్టాల్సిందన్నా 
తప్పిపోయి ఎక్కడో పుట్టారు అంటే 
నేనూ అయ్య కొడుకునే లేమ్మా అన్నాడు. 

అన్నట్లు శశిశ్రీ నంబరుకు 
హోసూరు నుంచీ ఒకతను ఫోన్ చేశాడట. 
పుట్టపర్తి వారు పిట్ దొరసాని దగ్గర 
ఇంగ్లీషు చదువుకున్న రోజులలోని స్నేహితుడు 
ఎనభై వయసట.
 ఆ నంబరు కావాలని అడిగాను. 
ఆయన తర్వాత చేస్తానన్నాడు లేమ్మ 
మీకు నంబరు తప్పక ఇస్తాను అన్నాడు. 

ఇంకో విషయం 
శశిశ్రీ పుట్టపర్తి తండ్రి పేరును శ్రీనివాసులు గా మార్చారు. 
ఇంకా కొన్ని తప్పులు దొర్లాయి. 
కేంద్ర సాహిత్య అకాడమీ వారు 
పుట్టపర్తి మోనోగ్రఫీ శశిశ్రీ తో వ్రాయించారు. 
ఆ పుస్తకావిష్కరణా 28 నే అట.
బుక్ రిలీజ్ నాడే ఎనిమిది వందల పుస్తకాలకు 
బుక్ చేసుకున్నారని చెప్పాడు 

ఇక ఈ సంవత్సరమంతా అక్కడక్కడా పుట్టపర్తి శత జయంతి సభలు జరుగుతాయి.

నా ...






అవిగో ....!!!