16 జులై, 2012

పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ
            

అయ్య ఆంగ్ల నాటకం హీరో వ్రాసే రోజులలో ..
వెల్లాల ఉమామహేశ్వరరావు...
 y.c.v తదితరులు ఎవరొచ్చినా ..
ఆగ్లం లో నేనొక నాటకం రాసాను ..
దుర్యోధనుడు ప్రధానపాత్ర అంటూ 

చదివి వినిపించే వారు.
అందరూ విని చాలా బాగుంది అనేవారు..


అందులో ..
దుర్యోధనుడు భానుమతికి స్వయంగా యుధ్ధభూమిలోకి వెళ్ళడానికి అలంకారం చేస్తాడనీ..
అతను గొప్ప వైణికుడనీ..

కృష్ణునికి అతని  వీణాపాండిత్యం పై 
అభిమానమనీ చెప్పేవారు.
అయ్య మాటల్లోనే వినండి.
 

"వేంకటేశ్వర వాళ్ళు ప్రచురించే సప్తగిరిలో భాగవతాన్ని ట్రాన్స్ లేషన్ చేస్తూ వచ్చినాను.
రెండు మూడేళ్ళు వ్రాసినాను.
తరువాత అది గూడా నాకు సంతృప్తి నివ్వలేదు.
కానీ ఆ జి. నాగయ్య వాళ్ళంతా ..

బాగానే మెచ్చుకున్నారు. 
ఆహా ..
ఎంత బాగా రాసినావయ్యా ..ఇంగ్లీషు అని..
 

రీసెంట్ గా..
 ఈ హీరో అన్న నాటకం రాసినాను.
ఎందుకు ఈ చాపల్యం పుట్టిందో మరి..
నాకు తెలీకుండానే ..

కొన్ని కొన్ని రాయడానికి ..
మనసులో ఫిట్స్ లాగ వస్తుంది. (నవ్వు)
 

అంతకు ముందు 
ఈ రచన చేయాలని అనుకొనే ఉండను 
ఎందుకో దడ దడా రాసేస్తాను..
ఆ ఉమా మహేశ్వరం రోడ్లో పోతూ వుంటే 

నేను ఇంగ్లీషులో ఒక నాటకం రాసినాను ..
వింటావా ..? 
అని అడిగినాను.
నీ మొహం.. 

నీకు ABCD లు కూడా రావే ..
నీవేంది  ఇంగ్లీషులో రాసేది ..
అన్నాడు..
'పోన్లేప్పా..

 రాకపోతే చించేస్తాంలే..
వచ్చి విను..
 అన్నాను.
 

ఈ  ఉమా మహేశ్వరుడు 
నా బాల్య స్నేహితుడు.
షేక్స్ పియర్ డ్రామాలను చాలా వాటిని 

తెలుగులోకి అనువదించినాడు. 
పాత సినిమాలలో హేరో గా నటించినాడు కూడా..
 

ఫస్ట్ దుర్యోధన స్వగతం విన్నాడు దిగ్భ్రాంతుడైపోయినాడు వాడు..
పిచ్చిపట్టినట్టయిపోయింది వాడికి..
తరువాత నాటకమంతా టైప్ చేయించి..

 పోయిన చోటంతా ఇదే పని వాడికి ..
ఎంత బాగుందీ ..
ఇంగ్లీషు ఎంతబాగుంది ..
అని పొగడడం..
 

భారతం నుంచీ కథ తీసుకున్నానంతే..
పేర్లు తీసుకున్నాను.
దుర్యోధనుడు.. భానుమతి..

 కర్ణుడు ..కృష్ణుడు..
ఆ నాటకమంతా ..

నా స్వీయమైనటువంటి కల్పనే..
దుర్యోధనుడు యుధ్ధానికి పోతుంటాడు..

భానుమతి  నాకుకూడా ఈ రోజు వార్ డ్రస్సు ఇవ్వమంటుంది. 

ఎందుకంటే ..
అర్జునుని ధనుస్సు యొక్క నారిని తెగగొట్టి ..

వాడి ముఖం చూడవలెనని ప్రీతి నాకున్నది..
అంటుంది
నీకేమైనా పిచ్చా..?
అర్జునునితో నేవేమి యుధ్ధం చేస్తావు..?
వాడి ధనుస్సు యొక్క వింటినారిని తెగగొట్టేంత 

 శస్త్ర  పాండిత్యం నీకెక్కడిది..?
అంటె.. ఆమె ఒప్పుకోదు.
 

నీకెందుకులే ..
అలంకారం చేయి అంటుంది.
హెల్మెట్ అన్నీ వాడే పెడతాడు.. 

అక్కణ్ణుంచీ 
యుధ్ధానికి బయలుదేరిపోతుంది..
 

ఆ భానుమతి అంటే 
ద్రౌపతికి మహాప్రీతి. 
ఎందుకు ..
వస్త్రాపహరణం చేసినప్పుడు 
ఆమె అడ్డగించింది దుర్యోధనుణ్ణి.
 

ఈ నాటకంలో దుర్యోధనుడు 
ఏకపత్నీ వ్రతుడు.
భానుమతిని చూస్తే మహాప్రీతి వాడికి. 

ఆమె యొక్క రూప సౌదర్యమే 
వాడి కారెక్టరును రక్షించుకుంటూ వచ్చింది.
అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాను.
 

ద్రౌపతి కృష్ణునివద్ద మురళి నేర్చుకొనే 
స్టూడెం ట్ గా  డెవలప్ చేసినాను.
దుర్యోధనుణ్ణి గొప్ప వైణికుణిగా డెవలప్ చేసినాను.
 

దుర్యోధనుని వీణాపాండిత్యం అంటే 
కృష్ణునికి మహా ప్రీతి.
కృష్ణుని యొక్క మురళి అంటే 

దుర్యోధనునికి మహా ప్రీతి.
 

వాడు సరస్సులో దాక్కున్నప్పుడు 
ఎంత పిల్చినప్పటికిన్నీ పైకి రాడు. 
ఇదో ఇట్ల కాదని చెప్పి ..
కృష్ణుడు మురళీ వాయించే దానికి 
ఆరంభిస్తే లేచొస్తాడు.
 

ఇట్లా డెవలప్ చేసాను..
ముందు చెప్పినాను కదా..

భానుమతి యుధ్ధానికి వస్తానంటుందని 
భానుమతికి యుధ్ధ అలంకారమంతా చేస్తాడు దుర్యోధనుడు. 

ఆమె అర్జునుని వింటి నారి విరగ్గొడుతుంది.
రధ సారధ్యం చేస్తూ ఉండిన కృష్ణుడు 

భేష్ ..భేష్ ..అంటాడు
వాడికి అప్రిషియేషన్ అన్నమాట.
 

అప్పుడు ఏమి అని అర్జునుడు అడిగితే..
"భానుమతి చూడు ..
నీ ధనుస్సు విరగ్గొట్టింది కదా .."అంటాడు.
ఇంతలో ఎవడో  వెనకనుంచీ వచ్చి 

భానుమతిని చంపేస్తాడు.
 

దాంతో ..
దుర్యోధనునికి మనసుచెడి 
యుధ్ధం చేయడానికి ఇష్టం లేకుండా 
వెనక్కి వెళ్ళిపోతాడు.
ఇట్లా ..

ఈ నాటకంలో.. అంతా నా కల్పనే..

దుర్యోధనుని స్వగతమిది..
కర్ణుడు చనిపోయి ఉన్నాడు.. 

ఆ సాయంకాలం..
దుర్యోధనుడు ఆకాశం వైపు చూస్తూ 
నిల్చుని వున్నాడు.
 

The sun is set..
West is bleeding..
Bleeding is my heart..
but his son has set

Sun son 


రెండూ వాడినాను శ్లేష ..
Son in sun Two lights have extinguished
 

ఆ సూర్యుడూ మునిగినాడు ఈ కర్ణుడూ చనిపోయినాడు..
No more karNaa..But I outlive to glean the bones of burnt friendship
 

కాలిపోయిన మా మైత్రి ఎముకలు ఏరుకోవటానికి నేను బ్రతికినాను.
కర్ణుడు పోయినాడు..
 

His victorious wheels , bent their crest to the earth as it were deceitful Jades to the curfew of his life..
Bramhastra.. The potent missile of Gods was dicer''s oath.
 

జూదగాణి ప్రతిజ్ఞ అయి  పోయింది.
బ్రహ్మాస్త్రం కూడా పాండవులపైకి ప్రయోగించింది.
ఇలా నడుస్తుంది శైలి
నాపైన ఇంగ్లీషు ప్రాచీన సాహిత్య ప్రభావం ఎక్కువ 

షేక్స్ పియర్ మిల్టన్ 
నాకు ప్రాణప్రదమైనటువంటివారు.
ఆయన ప్యారడైజ్ లాస్ట్ లో చాలా భాగాలు 

నాకు నోటికి వచ్చు. 
నాకు మిల్టన్ అంటే చాలా ప్రీతి 
కానీ నా అవేర్నెస్ ఏమిటంటే 
ఇంగ్లీషు భాషలో క్లాసికల్ రైటర్స్ అంటేనే 
నాకు అభిమానం
ఈ నాటకం నిండా ..

షేక్స్ పియర్ మిల్టన్ ప్రభావం ఎక్కువగా వున్నది. 
మోడరన్ ఇంగ్లీషు లిటరేచర్ లో 
నేను ఎక్కువగా ప్రవేశిం పలేకపోయినాను.
నా దౌర్బల్యము..
నా స్వభావమది..

ఈ ఆంగ్ల హీరో నాటకాన్ని ..

అయ్య పరమ భక్తుడు..
వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు సమీక్షించారు.
ఈ సమీక్ష చూస్తే..
ఇంత నిర్మొహమాటంగా..
ఖచ్చితంగా..
ఎవరైనా ఏమనుకుంటారో నన్న ఫీలింగ్ లేకుండా..

సమీక్షించి చూపాడు.
పైగా ఈ విధంగా అభిప్రాయం వ్రాయమని 

పుట్టపర్తి వారే సలహా ఇచ్చారు..
చూడండిక ..

ఎస్ వేణుగోపాల్ గారు 
"వల్లంపాటిని అర్థం చేసుకోవాలి..?" అన్న వ్యాసంలో వెలువరించిన అభిప్రాయాలి వి ..

మార్క్సిస్టు విమర్శకులలో 
వల్లంపాటి వెంకట సుబ్బయ్య ఒకరు. 
వస్తు శిల్పాలను ప్రధానంగా చేసుకొని 
విమర్శ కొనసాగించిన మార్క్సిస్టు విమర్శకులలో
 ఒక విశిష్టత కలిగిన వ్యక్తి. 

ఈయన 1937 మార్చి 15వ తేదిన 
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో జన్మించారు. 
ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ చేసి 
కొంతకాలం ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. 
విమర్శ రంగానికి రాకముందు 
కథలు, నవలలు రాసేవారు. 
మార్క్సిస్టు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేశారు. 

పుట్టపర్తి నారాయణచార్యులు గారి 
ప్రోత్సాహంతో విమర్శ రంగంలో 
దృష్టి కేంద్రీకరించాలని భావించారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి 
"శ్రీమద్రామాయణ కల్పవృక్షం" పై రాసిన 
ఒక చిరు సమీక్ష 
ఆయన తొలి విమర్శ రచనగా చెప్పుకోవచ్చు.
తెలుగు సామాజిక విమర్శలో 
ప్రామాణిక రచనలు చేశారు. 

అవి ..
‘కధాశిల్పం’, 
‘నవలా శిల్పం’, 
‘విమర్శా శిల్పం’.

ఆయన ఆంగ్ల సాహిత్యాన్ని కూడా 
విస్తృతంగా అధ్యయనం చేశారు. 
దాని ప్రభావం ఆయన నవలలపై లేకపోలేదు.
 హైదరాబాదు గ్లోబల్ ఆస్పత్రిలో 
ఆయన తన గురువు 
పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి 
ఎప్పుడో ‘రచన’లో రాసిన వ్యాసం 
ఫొటోకాపీ ఇచ్చారు. 
అది చదివి లోలోతులనుంచి కదిలిపోయి, 
కళ్లనీళ్లతో ఆయనకు ఫోన్ చేసి,
 ఏ సాహిత్యకారుడి గురించయినా 
ఎవరయినా సంస్మరణవ్యాసం అంటే 
అట్లా రాయాలని అంటుంటే 
అప్పుడు కూడ 
తన గురువు ఘనత గురించేతప్ప 
తన రచనమీద ప్రశంస గురించి 
మాట్లాడని వినయశీలి ఆయన. 

ఆ మాటల మధ్యలో నారాయణాచార్యులవారి ‘మహాభారత విమర్శనము’ 
గురించి ప్రస్తావన వస్తే 
నేనది చదవలేదని విని, 
మదనపల్లి వెళ్లగానే, 
అంత అనారోగ్యంలో ఉండి కూడ 
నాకు ఆ సంపుటాలు రెండూ పంపించిన పుస్తకప్రేమికుడాయన."
              పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "
                     వల్లంపాటి వెంకట సుబ్బయ్య 
           (సహకారం రామావఝ్ఝుల శ్రీశైలం గారు)
      

సొమవారం 28 మార్చి 2005. 
వివిధ ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక..
 
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మహాపండితుడుగా 
బహుభాషావేత్తగా సుప్రసిధ్ధులు. 
తన జనప్రియ రామాయణంలో  తన్ను గురించి "పాండితీ శోభ పదునాల్గు భాషలందు"
 అని చెప్పుకున్నారు 
పదునాలుగు భాషల్ని చదువుకున్నా 
ఎనిమిది భాషల్లో మాత్రమే 
కవిత్వం రాశారట. 
తమ పండరీ భాగవతం అవతారికలూ 
"విదితాష్ట భాషా కవిత్వ నిర్మాణ మద బంధరుడ" 
అని తన్ను తాను అభివర్ణించుకున్నారు 

వారు కవిత్వం రాసిన ఎనిమిది భాషలేవో 
నాకు తెలియదు. 
తెలుగులో సంస్కృతంలో ఇంగ్లీషులో 
వారు రాసిన కవిత్వాన్ని మాత్రమే 
నేను చూసాను. 
తెలుగులో ..సంస్కృతంలో..
వారి కృషి గురించి చాలామందికి తెలుసు. 
వారి ఇంగ్లీషు కవిత్వాన్ని గురించి 
ఇప్పుడు ఆలోచిద్దాం.

తెలుగు సంస్కృతాల్లో మునిగితేలుతున్న 
యువ పుట్టపర్తి దృష్టిని 
మొట్టమొదట గా 
ఇంగ్లీషు సాహిత్యం మీదకి ఆకర్షించిన వ్యక్తి 
జేమ్స్ హెచ్ కజిన్స్. 
కజిన్స్ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 
ఇంగ్లీషు సాహిత్యమ్మీద 
డాక్టరేట్ పుచ్చుకున్న విద్వాంసులు. 

స్వయంగా గొప్ప కవి. 
కళా విమర్శకుడు. 
అప్పుదు వారు 
మదనపల్లి బెసెంట్ థియొసాఫికల్ కాలేజీలో
 ప్రిన్స్ పల్ గా పనిచేస్తూ వుండేవారు. 

వారు ఒకసారి 
అనంతపురం సీడేడ్ డిస్ట్రిక్ట్ కాలేజీ 
(నేటి ప్రభుత్వ కళాశాల)లో 
షెల్లీ మీద ఉపన్యాసాలివ్వటానికి వచ్చారు 
ఆ ఉపన్యాసాలు విన్న పుట్టపర్తి కళ్ళముందు 
ఒక కొత్త ప్రపంచం సాక్షాత్కరించింది. 
ఆ అనుభవాన్ని గురించి వారే స్వయంగా 
ఇలా చెప్పుకున్నారు.

His manner of speaking and pronounciation swept me off my feet His thoughts on Shelley initiated me into a new world of poetry and ideas

ఇంగ్లీషు భాషను బాగా నేర్చుకోవాలని 
ఇంగ్లీషు సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనీ 
వారిలో గొప్ప కోరిక కలిగింది 
తన అరా కొరా ఇంగ్లీషు పరిజ్ఞానంలో 
ఇంగ్లీషు కవిత్వాన్ని అధ్యయనం చేయటానికి 
తాను పడ్డ పాట్లను గురించి 
వారే స్వయంగా చెప్పుకున్నారు.

I started to study English poetry on my own I waded through it laboriously with the help of dictionaries. I was satisfied with what little I could get from the poems I was reading "
 
కానీ గురువు లేని లోపం మాత్రం 
స్పష్టంగా కనిపిస్తూనే వుండేది. 
కొంతకాలం తరువాత 
అదృష్టవశాత్తూ ఆ లోపం కూడ తీరింది. 
అప్పుడు పెనుగొండలో 
సబ్ కలెక్టరుగా పనిచేస్తున్న జేమ్స్  పిట్ భార్య పుట్టపర్తిని దగ్గరకు తీసి 
ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించింది. 
ఆ అధ్యయనం ఆగుతూ ..సాగుతూ..
నలగైదు ఏళ్ళు కొనసాగింది. 
ఆవిడవద్దనే వారు
షే క్స్ పియర్ నాటకాలను  కూడా చదివారు. 

దాదాపుగా ఆ కాలంలో రాసినవే 
Leaves in tha Wind. 

సంపుటం లోని చాలా పద్యాలు.
 
పెనుగొండ వదిలి
ప్రొద్దుటూరు.. కడప..
 తిరువనంతపురం.. ఢిల్లీ ..
పట్టణాలకు వెళ్ళీన తరువత 
వారికి ఇంగ్లీషు భాష వైశాల్యమూ 
అవసరమూ బాగా అర్థమయ్యాయి. 

ఆ భాషను 
మరింత బాగా నేర్చుకోవాలన్న పంతమూ 
ఆ భాషలో రచన చేయాలన్న కోరికా పెరిగాయి 
కానీ ..
దానికి ఆయన అనుసరించిన పధ్ధతి మాత్రం
 చాలా పాతది . 
వ్యాకరణాన్నీ.. నిఘంటువులనూ.. 
కంఠస్తం చేయడం. 

షేక్స్పియర్ మిల్టన్ లాంటి 
ప్రాచీన మహా కవులను అనుకరించటం 
వారు అనుసరించిన పధ్ధతి 
ఈ పధ్ధతి 
సామాన్య జన వ్యవహారంలో లేని 
సంస్కృతం లాంటి భాషలకు 
పనికొస్తుందేమో కానీ 
అనునిత్యం మారిపోతూ ఉన్న 
ఇంగ్లీషు వంటి సజీవభాషకు పనికి రాదు 

ఈ సంగతి వారు పట్టించుకోలేదు.
ఇంగ్లీషు భాష విషయంలో 
వారిలో ఉన్న వైరుధ్యానికి అదే కారణం.
పుట్టపర్తి ఇంగ్లీషు రచనలు 
రెండే వెలుగు చూసాయి. 
మొదటిది 
Leaves in the Wind అన్న ఖండకావ్యం. 
రెండవది
 Hero అన్న నాటకం. 
మొదటిది 
ఇరవై ఏళ్ళ లోపు వయసులో చేసిన రచన 
తరువాత చాలా కాలానికి 
దాన్ని అక్కడక్కడా సరిదిద్ది 
మూడు నాలుగు పద్యాలు చేర్చి ప్రచురించారు. 

Hero 
మహా భారతంలో దుర్యోధనుని వధ 
ఇతివృత్తంగా రాసిన నాటకం. 
ఇది వయసులో ..అనుభవంలో.. పాండిత్యంలో.. పండిపోయిన తరువాత చేసిన రచన .
 
మొదట 
Hero నాటకాన్ని గురించి ఆలోచిద్దాం. 
ఇందులోని కథ.. పాత్రలూ.. 
మహాభారతంలోనివే అయినా 
కథా సంవిధానమూ ..పాత్రపోషణా.. పుట్టపర్తివే. దుర్యోధనుని పాత్ర పోషణమీద 
షేక్స్పియర్ విషాదాంత కథా నాయకుల ప్రభావం కనిపిస్తుంది. 

అరిస్టాటిల్ చెప్పినట్టుగా 
ఒకే ఒక బలహీనత 
tragic flaw ఉన్న మంచివాడు దుర్యోధనుడు 
అతను రస హృదయం ఉన్న కళాకారుడు కూడా.
అదే అతని బలహీనత.
ద్వైపాయన హ్రదంలో దాక్కొని ఉన్న అతణ్ణీ 
పాండవుల పరుషవాక్యాలూ.. 
పౌరుషవాక్యాలూ ..
బయటికి రప్పించలేవు. 
శ్రీ కృష్ణుని మురళీ గానం మాత్రమే 
ఆ పని చేయగలుగుతుంది. 

షేక్స్పియర్ నాటకాల్లోలాగే 
పాత్రల మనోభావాలకు అద్దంపట్టే స్వగతాలు soliloquies 
ఈ నాటకంలో కూడా చాలా ఉన్నాయి. 

తన ప్రాణ మిత్రుడు కర్ణుడు 
హతుడైపోయిన తరువాత 
దుర్యోధనుని స్వగతం ఇలా ప్రారంభమవుతుంది.
 
"Th sun is set, the west is bleeding
Bleeding is my heart, the son is sun
Two lights are extinguished
No more Karna. The mould of human valour
is crushed to dust by the cursed hand
Of the bastard son. But I out-live
To glean the bones of burnt friendship
Brave my heart, cease thy weeping
Avant, break thee off , dirty dole..."

భావాల సంగతి ఎలా వున్నా
 Hero లో ఉపయోగించిన భాష మాత్రం 
ఆధునిక ఇంగ్లీషు కాదు. 
ఈ నాటకంలో 
షేక్స్ పియర్ కాలం నాటి ఇంగ్లీషును 
పుట్టపర్తి ఉపయోగించారు. 
కనీసం ఉపయోగించడానికి ప్రయత్నించారు. 
ఇది ఆగ్గ్లేయులకే అసాధ్యమైన పని. 

గంభీరమైన విషయాలను ఆవిష్కరించటానికి
 ఆధునిక ఇంగ్లీషు భాష సరిపోదన్న 
పొరబాటు అభిప్రాయం వారికి ఉండేది. 
గంభీరమైన ప్రాచీన ఇతివృత్తం కాబట్టి 
ప్రాచీన భాషల్లోనే ఉండాలని 
పుట్టపర్తి ఎలిజబెత్ ఇంగ్లీషును ఆశ్రయించారు. 

ఇంగ్లీషు మాతృభాషకాని మనకు 
400 సంవత్సరాలనాటి వ్యాకరణం 
భాషా సంప్రదాయం సరిగ్గా తెలియవు. 
ఇంగ్లీషు నుడికారం 
పదప్రయోగం 
ఈ 400 సంవత్సరాలలో 
ఊహాతీతంగా మారిపోయింది. 
అందుచేత Hero నాటకం 
తెలుగు విద్వాంసుడు చేసిన
 విశిష్టమైన ఇంగ్లీషు ప్రయోగం
Hero లా కాకుండా 
Leaves in the Wind  

పుట్టపర్తి ఆత్మ ను ఆవిష్కరించే కావ్య సంపుటి. 

విశ్వాసం ..అవిశ్వాసం..
దేశభక్తి.. కోపం.. అసహనం..
 అన్నీ ఉన్న కావ్యం అది. 
భాష చ క్కని  సమకాలీన ఇంగ్లీషు 
తేటగా.. సూటిగా.. ఉన్న శైలి .
తన కవిత్వాన్ని గురించి కవే ఇలా చెప్పుకుంటాడు.

You ask me to explain my poems
What a request
Something drives my heart
And something writes
And I look at it as you look at me
As winds on waste lands
Passions come and go
Poetry is vital force turned into words
By an unknown chemist
In an unknown laboratory
As the strings of the violin
Reply to the kiss of winds
Some heart in some moody night
Grasps the unhidden treasures...

ఈ కావ్యం 
తెలుగులో భాష అభ్యుదయ కవితోద్యమాల సంధియుగంలో వచ్చింది. 
ఈ రెండు కవిత్వాల లక్షణాలూ 
ఇందులో కనిపిస్తాయి. 
ఉదాహరణకు 
ఒక ప్రకృతి కవిత్వ ఖండాన్ని చూడండి..

Fields play with impish winds
And birds twitter gaily
Moon, the mischievous child
Showers her silvern childhood
On the lap of mother earth
Vemal beauties carol
Through flowers and thickets
And streams flow
In their inevitable curves
At girls with naked limbs
The stars wink with grave ideas ...

పుట్టపర్తి తెలుగు సంస్కృత రచనల్లో 
భక్తి ప్రధాన జీవధార 
వారు రాసిన 
పాద్యము 
సాక్షాత్కారము 
పండరీ భాగవతము 
తెలుగులో అరుదైన కావ్యాలు. 

కానీ పుట్టపర్తి భక్తి 
హృదయ సంబంధమైనది మాత్రమే. 
అది ఎప్పుడు 
మత వ్యవస్థల సమర్థనగా దిగజారదు. 


"Leaves in the Wind" లో కూడా 
భక్తి భావాలకు లోటులేదు. 
కానీ భక్తి పేరుతో చలామణీ అయ్యే 
డాంబికత్వాన్నీ ..మిధ్యాచారాన్నీ ..
లోకవంచననూ..
ఈ కావ్యం నిశితంగా విమర్శిస్తుంది. 
నిజమైన భక్తికీ.. మిధ్యాచారానికీ ..
పొత్తు కుదరదని చెప్పే ..
ఈ ఖండికను చూడండి..

" I looked my head in sacred waters
And caught cough and cold
I bent my head at the feet of bearded men
Who smeared it with dust
I shouted at the clouds expecting a reply
My nerves became weak
I prostrated before the idlos
But they didn' t open their eyes
I read the sacred books days and nights
And lost my sleed over them
The words were good, but where is God?
I turned to my heart and saw in it
A sharp ray of light ; I said to myself
'You are the light : The others are fantasy'..."

Leaves in the wind హరీన్ చటోపాధ్యకు ఎంతగానో నచ్చింది.

 " There is tenderness and sincerity of thought in this. On cannot but see a sincerity of approach to life death.. freedom.. 
chains ..childhood ..and love  .."

అంటూ ఈ కావ్యాన్ని హరీన్ చటోపాధ్యాయ మెచ్చుకున్నాడు.
 
ఈ కావ్యాన్ని చదివిన పాఠకుడు
 పుట్టపర్తి మరిన్ని కావ్యాలు 
ఇంగ్లీషులో రాయనందుకూ 
ఇదే మార్గంలో కొనసాగకుండ 
Hero మార్గం లోకి వెళ్ళి నందుకూ 
బాధపడతాడు.