3 ఆగ, 2018

చెప్పగదే చెవులునిండ శ్రీహరికథలున్

http://www.andhrajyothy.com/artical?SID=425226
సరస్వతీ పుత్రుని తొలి కవితాపుష్పం ‘పెనుగొండ లక్ష్మి’ 
12-06-2017 00:44:29

కాలొకచోట నిల్వక, ముఖమ్మున నిప్పుకలుప్పతిల్ల, బో
నాలకు నాల్క జాచి యనయంబును గజ్జెలు గట్టియాడు నీ
కాల పిశాచి కేమిటికి గట్టితి పట్టము? దీని గర్భమున్‌
జీలిచి చూడుమెందఱి వజీరుల యాత్మలు మూల్గుచున్నవో
- ‘పెనుగొండ లక్ష్మి’
పుట్టపర్తి నారాయణాచార్యులు
‘పెనుగొండ లక్ష్మి’ పుట్టపర్తి నారాయణాచార్యులు తొలి రచన. ఇది క్షేత్ర ప్రశస్తి కావ్యాల్లో ప్రసిద్ధమైనది. ఈ కావ్యంలోని భావావేశం, భాషా సారళ్యం, కవితా మాధుర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. అందువల్లనే, ‘నా రచనలను చదివినవాళ్ళు ఎక్కువగా నా చిన్ననాటి రచనల్నే మెచ్చుకుంటా’రని పుట్టపర్తివారే ‘పెనుగొండ లక్ష్మి’ ఉపోద్ఘాతంలో స్వయంగా చెప్పుకున్నారు.
ఇందులో 123 పద్యాలు ఉన్నాయి. దీనిని ఆయన పన్నెవండవ ఏట (1926లో) రచించినా ముద్రణ మాత్రం పందొమ్మిదో ఏట అంటే 1933లో జరిగింది. క్షేత్రప్రశస్తి కావ్యంగా ప్రసిద్ధమైన కొడాలి సుబ్బారావు ‘హంపీక్షేత్రం’ కంటే తన కావ్యమే పదహై దేండ్లు పెద్దదని, ఆ రచనా కాలం నాటికి తనకు ఛందస్సు కూడా రాదని, తిక్కన భారతాన్ని బాగా చదువుతుండడం వల్ల ఆ వాచక శక్తి దీనికి పునాది అయిందని, ఆంధ్ర మహాభారతం శక్తి అలాంటిదని పుట్టపర్తి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. సాధారణంగా రచయితలు చేసిన రచనలు వాళ్ళకే పాఠ్య గ్రంథంగా ఉండడం జరగదు. పుట్టపర్తి రాసిన ఈ తొలి రచన ఆయనకే విద్వాన్‌ పరీక్షలో పాఠ్య గ్రంథంగా ఉండడం విశేషం.
పెనుగొండకు ఒక చారిత్రక విశిష్టత ఉంది. ఇది విజయనగర రాజుల కాలంలో గొప్పగా వెలుగొందిన ప్రదేశం. శ్రీకృష్ణదేవరాయలకు వేసవి విడిది. ఒకనాడు శౌర్య పరాక్రమాలకు, సకల సంపదలకు, దానిమ్మ ద్రాక్ష వంటి పండ్ల తోటలకు ఆటపట్టై అలరారింది. ఇలాంటి పెనుగొండలో పుట్టపర్తి చిన్నతనంలో నివసించారు. ‘ముదల’, ‘ఊరడింపు’, ‘కోట’, ‘రణభూములు’, ‘రాజవీధి’, ‘రామబురుజులు’, ‘దేవాలయం’, ‘శిల్పం’, ‘బాబయ్య గోరి’, ‘గగన మహలు’, ‘కడచూపు’, ‘తెలుగురాయడు’ శీర్షికలతో కవి ఒకనాటి పెనుగొండ ఘనతను, నేటి దురవస్థను ఆవేదనాభరితంగా తెలిపారు.
కాల ప్రభావం ఊహింపలేనిది, అతిక్రమింపలేనిది. ఒక క్షణంలో నిండుగా ప్రపంచాన్ని అలరారేలా చేసి మరుక్షణంలో రూపనామక్రియలు లేకుండా చేసే శక్తి కాలానికుంది. అలాంటి కాలమనే పిశాచికి ఎందుకు పట్టంగట్టావని ‘ముదల’లో కవి భగవంతుణ్ణే ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘కాలొకచోట నిల్వక, ముఖమ్మున నిప్పుక లుప్పతిల్ల, బో/నాలకు నాల్క జాచి యనయంబును గజ్జెలు గట్టియాడు నీ/ కాల పిశాచి కేమిటికి గట్టితి పట్టము? దీని గర్భమున్‌/ జీలిచి చూడు మెందఱి వజీరుల యాత్మలు మూల్గుచున్నవో’.
ఒకప్పుడు రాజులతో కళకళలాడిన భవనాల్లో నేడు నిశ్శబ్దం తాండవిస్తోంది. సంపదలకు, ఆనందానికి నిలయమై ప్రకాశించిన ప్రదేశం నిర్జీవంగా ఉంది. తన కాలం నాటి ఆ పెనుగొండ దురవస్థను కవి ‘ఊరడింపు’లో ఇలా వర్ణిస్తున్నారు: ‘అదిగో పాతరలాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద మ/ల్లదె! మా కన్నడ రాజ్యలక్ష్మి నిలువెల్లన్‌ నీరుగా నేడ్చుచు/న్నది, భాగ్యంబులు గాసెగట్టిన మహానందైక సారంబునం/ దుదయంబయ్యె నభాగ్యరేఖ, చెడెనయ్యో పూర్వసౌభాగ్యముల్‌’.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో అల్లసాని పెద్దన రాకపోకలతో, రాయల సార్వభౌమ త్వానికి తల వంచిన సుల్తానుల పూజలతో వెలుగొందుతూ- ఆదివరాహ ధ్వజం నీడలో కీర్తిసౌఖ్యాలను అనుభవిస్తూ, కళింగప్రభువైన గజపతిని నిలువరించి, చీమ సైతం హాయిగా నిద్రించే స్థితిని కల్పించి అలరారిన పెనుగొండ వైభవం ఇలా చెప్పబడింది: ‘గండపెండేరంబు ఘల్లుఘల్లుమన దానములతోడ దేశాక్షి బలుకు నాడు/ సులతానులెల్ల దలలు వంచి కల్కితురాయీల నిను బూజసేయునాడు/ ఆదివరాహ ధ్వజాంతరంబుల నీడ నీ కీర్తి, సుఖము బండించునాడు/ గుహల లోపల దూరికొన్న యా గజపతి తలపైని నీకత్తి గులుకునాడు/ నీదు కన్నుల వెలిచూపు నీడలోన/ జీమయును హాయిగా నిద్రజెందునాడు/ గలుగు నాంధ్రుల భాగ్యసాకల్య గరిమ/ బూడిదను బడి నీ తోడ బోయె దల్లి!’
కళలకు నెలవైన పెనుగొండ నేడు కళావిహీనమై పోయిందని కవి బాధను ఇలా వ్యక్తం చేశారు: ‘ఉలిచే రాలకు జక్కిలింతలిడి యాయుష్ర్పాణముల్వోయు శి/ల్పుల మాధుర్య కళాప్రపంచంబు లయంబున్‌ జెందె, పాతాళమున్‌/ గలసెన్‌ బూర్వకవిత్వ వాసనలు, నుగ్గైపోయె నాంధ్రావనీ/ తలమంబా! యిక లేవ యాంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్‌’.
ఒకనాడు కృష్ణరాయలు అల్లసాని పెద్దన మొదలైన కవులను సన్మానించి పల్లకీ ఎక్కించి పండితులు వాళ్ళను కీర్తిస్తుండగా తానే పల్లకీ మోయగా మెరసిన రాజవీధులు నేడు శూన్యతను ఆవహించాయని కవి ఇలా ఆక్రోశిస్తున్నారు: ‘కవులన్‌ బంగరు పల్లకీల నిడి యుత్కంఠాప్తితో బండిత/ స్తవముల్‌ మ్రోయగ రత్నకంకణ ఝణత్కారంబుగా నాత్మహ/స్త విలాసమ్మున మ్రోసి తెచ్చెనట నౌరా! సార్వభౌ ముండు, నే/ డవలోకింపుము నీరవంబులయి, శూన్యంబైన వీ మార్గముల్‌’.
శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి రత్నరాసుల వైభవాన్ని వర్ణిస్తూ ఒక ఇంటివారు కుట్టాణిముత్యాలను కుప్పలుగా పోయగా, గువ్వలు ధాన్యమనుకుని భ్రమపడి కోరాడుతుండగా, ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు నవ్వబోగా అత్తగారు మర్యాద కాదని వారించినట్లు కవి ఇలా చమత్కారభరితంగా చెప్పారు: ‘కులుకున్‌ బచ్చని రత్నకంబళములన్‌ గుట్టాణిముత్యాలు గు/ప్పలు వోయన్‌ మనవారు, ధాన్యమను భావంబూని గోరాడు గు/వ్వల యజ్ఞానము గాంచి ఫక్కుమని నవ్వన్‌ గ్రొత్త సంసారి య/త్తలు గస్సన్నల నాపియుందురని స్వాంతంబందు నూహించెదన్‌’
పుట్టపర్తి పెనుగొండలోని దేవాలయ శిల్పసంపదకు, శ్రమశక్తికి ముగ్ధులైనారు. ఆ కట్టడాల నిర్మాణం చూసి ఆయన ఎంతగానో ఆశ్చర్యానికి లోనైనారు: ‘ఎట్లు పైకెత్తిరో యేన్గుగున్నలకైన తలదిమ్ము గొలుపు నీ శిలల బరువు/ యేరీతి మలచిరో యీ స్తంభములయందు ప్రోవుగ్రమ్మిన మల్లెపూలచాలు/ యే లేపనంబున నీ కుడ్యములకెల్ల తనరించినారొ యద్దాలతళుకు/ యే యంత్రమున వెలయించిరో వీనికి జెడకయుండెడు చిరంజీవశక్తి/ కని విని యెఱుంగనట్టి దుర్ఘటములైన/ పనులు, స్వాభావికముగ నుండినవి వారి/ కా మహాశక్తి యేరీతి నబ్బెనొక్కొ/ కాలమో! జీవనమో! యేదొ కారణంబు’. చిన్నవయసులోనే ప్రౌఢ కావ్యం రాసిన కవి పుట్టపర్తి. ఈ కావ్యం ఆయన కవిత్వ కృషికి పునాది. ఈ పునాదిపైననే ఆయన అనేక కావ్య హర్మ్యాలు నిర్మించారు.
 భూతపురి గోపాలకృష్ణశాస్త్రి
99666 24276


2 ఆగ, 2018

ఏది నీవు నడచు మార్గం .. యేవి నిన్నూ చూచు కన్నులు..

చాలా విరామం తర్వాత..
 నా మార్గం లో మళ్ళీ ప్రయాణం ..
13 సెప్టెం, 2017

అప్పటి నుండి బుధోత్తమ..

అప్పటినుండి బుధోత్తమ
చెప్పెడు భగవత్కథావిశేషంబులు నా
కెప్పుడు దనివి జనింపదు
చెప్పగదే చెవులు నిండ శ్రీహరి కథలున్

సముద్ర మథన కథా ప్రారంభము..పుట్టపర్తి గారిని తీవ్రంగా నొప్పించింది ..
తరుచూ రెచ్చగొట్టింది..
గట్టిగా ప్రతిస్పందించేలా చేసింది..
ఈ సంకుచిత ప్రాంతీయ ధోరణే..
ఆయన ప్రతిస్పందనలోని పదును చూసి..
పెద్ద పండితులు నొచ్చుకున్నారు.. 
కాని..
ఆయన పడిన నొప్పి వెనుక ఉన్న న్యాయాన్ని గూర్చి ఆలోచించిన వారెందరు..??

ఆ ప్రాంతీయ ఆధిక్యతా భావాల వల్ల..
అఖిల భారతస్థాయిలో ఆ అప్రమేయ ప్రతిభామూర్తికి రావలసిన గౌరవం రాకపోవడంతో..
కలిగిన నష్టాన్ని గూర్చి బాధపడేవారెందరు..??

ప్రతిభ దారి ప్రతిభది..
ప్రశస్థి దారి ప్రశస్థిది..
అని సరిపెట్టుకోక తప్పదు..
అప్పుడప్పుడు.. 
ఆవేదనతో స్పందించినా..

చిన్ననాడే షాజీ లో వర్ణించిన 
'' నిమిష నిమిషంబునకు నెన్నేవిధాల..
బాటు వడుచున్న పరమాత్ము ప్రతిభ జూచి..
సరస సౌందర్య విధికి నాశనములేని 
సృష్టి కలదేమొ యంచు యోచించుచుండు.. ''

ప్రశాంతయోగి చిత్తములోన కలవాడు కాబట్టి..
ఆ రసికత కలిమితో జీవితమంతా 
కావ్య సౌందర్యాలను అన్వేషిస్తూనే వెళ్ళాడు.
కవిత్వీకరిస్తూ సాగాడు..

అయినా..
ఆయన ప్రతిస్పందించింది ..
చాలామంది అనుకున్నట్లు .. 
అన్నట్లు..

తనకేదో దక్కలేదనే అక్కసుతో కాదు..
తన ప్రాంతపు పలుకుబడిని న్యూన పరచినందుకు..
తన రచనల్లో కనిపించే సీమ నుడికారాన్ని వెక్కిరించినందుకు..

ఆ కాలంలో వారే కాదు..
రాయలసీమ మహాకవి.. విద్వాంసులందరూ 
  ఆ వివక్షకు గురయ్యారు..
వ్యధపడ్డారు..

రాళ్ళపల్లి గారంతటివారు 
విద్వాన్ విశ్వం గారి పెన్నేటిపాట మున్ను డిలో 

'' ఇక్కడివారికి చదువు సంతలు లేవని..
వారు అనాగరకులని పరిహాసమును .. 
ఆక్షేపమును జేసినవారును కొందరుండిరి..
నేడును లేకపోలేదు..

ఇది ' క్షతేక్షారమివాసహ్యం ' అన్నట్లయినది..
ఆ సీమలవారికి.
ఇది ముఖ్య కారణముగా .. 
ఈ ఆంధ్ర ఖండమునకు 'రాయలసీమ ' అని 
 విభిన్న నామమును 
తాము ఇతరాంధ్రులతో చేరియుండలేమను భావము ఇందలి ప్రజలకును వ్యాపించినది..''

అని నిర్మొగమాటంగా చెప్పారు .
ఈ వికటాధిక్య విభావ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నందువల్లే.. 
మహాంధ్రభారతికి ఇటీవలగా అలాంటి గర్భ శోకం కలిగింది.
ప్రాంతీయ పరమైన వివక్షకు తోడు అద్వైత, విసిష్టాద్వైత శాఖా భేదం కూడా ఆ రోజుల్లో ధ్వనించిందనడన్నది బహిరంగ సత్యం


- ''ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)''
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

6 సెప్టెం, 2017

నిజభక్తిఁ దలంచెదఁ బుట్టపుట్టువున్‌...పుట్టపట్టికి సరిజోడు పుట్టపర్తి ..
అనేవారు నరాల రామారెడ్డి ..
తన అవధానాల ప్రారంభంలో ..
ఆ మాట అప్పట్లో ఒక నానుడి అయింది.. 

పుట్టపట్టి వాల్మీకి రామాయణాన్ని దర్శింపజేసి భారతీయ సాహిత్యాన్ని పునీతం చేశాడు. 
అదే మాధురీ రస పంథాలో పుట్టపర్తి గారు 
ఒక్క రామాయణమేమిటి .. ??
భాగవతమేమిటి..??
తెలుగు వారి ఇలవేలుపు శ్రీనివాసుని ప్రబంధమేమిటి..??
సాక్షాత్తూ సకల కళాధీశుడు శివుని తాండవాన్ని అమ్మలాస్యాన్ని దర్శించి దర్శింపజేసి..
తెలుగు భారతిని మహిమోపేతం చేశాడు..

20 వ శాతాబ్ది సర్వశ్రేష్ట భారతీయ కృతుల్లో శివతాండవమొకటి..
తెలుగు భాషకు చెందడం దాని దురదృష్టం..
మన మహాదృష్టం..

అలాగే ..
20 వ శతాబ్ది తెలుగునాట ఎల్లలెరుగని ప్రతిభామూర్తులలో 
ఆయన వరిష్టుడు..
నిస్సీమా నిరంకుశ ప్రతిభా గరిష్టుడు..

గత వైభవానికి తావలమైన రాయలసీమలో కాక ..
అక్షర పరిశ్రమకు కేంద్రమైన 
మధ్యాంద్రదేశంలో గనుక జన్మించివుంటే..
అక్కడి తెలుగే నేడు సకల జన ప్రామాణికమైనట్లు
వారే ..
సకలాంధ్రావనికి సర్వోన్నత మాన్యులై ఉండేవారు..

యావదాంధ్ర ప్రజ 
మరెంతో మిన్నగా బ్రహ్మ రథం పట్టి ..
భారత పీఠంపై ఆ సరస్వతీపుత్రుని 
ఎన్నడో ప్రతిష్టించి వుండేవారు.. 

-ఆధునికత సమకాలీనత (కొన్ని పార్శ్వాలు)
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
పూర్వ ఉప కులపతి 
ద్రావిడ విశ్వ విద్యాలయం

2 సెప్టెం, 2017

మన సారధి .. మన సచివుడు..
ఈ రోజు మా అయ్య వెళ్ళి పోయిన దినం..
 సమయం రాత్రి మూడు .. 
 మంచం చుట్టూ  శిష్యులు ..
దశమ స్కంధం పుట్టపర్తి నోట పొంగింది 
మరణ వేదమై ..
......
....

అదే రోజు .. 
ఏకాదశి పుణ్య తిథి .. 
తెల్లవారి ..
గబ గబా స్నానం చేసి..
కలశం పెట్టి సత్యనారాయణ వ్రతం మొదలు పెట్టాను .. 
జీవితంలో సత్యనారాయణ వ్రతం వదలద్దు..
అమ్మ మాటలు..
అయ్యా నాకేమైనా చెప్పు..
నీకేం చెప్పేది..
సత్యనారాయణ వ్రతాలు వదలకుండా చేసుకో..


ఒక టెంకాయ ..
గ్లాసులో నీళ్ళు..
రెండు దీపాలు..
అంతే..
ఏమీలేకపోతే..నీళ్ళైనా నైవేద్యం పెట్టు ..అమ్మ

మనసంతా బాధగా వుంది..
కళ్ళు వర్షిస్తున్నాయి..
విగ్రహం పైఅరచేతిని వుంచి ..
స్వామీ..సర్వ జగన్నాథా..
పూజ ముగిసే వరకు ప్రీతిభావనతో వుండవయ్యా..
ప్రాణప్రతిష్ఠ..
.......
......
 హాస్పిటల్లో..
అందరూ మగత కౌగిట్లో జోగుతున్నవేళ..
ఒక గురువు..
 తన ఆఖరి ప్రయాణానికి సామాను సర్దుకుంటున్నాడు..
లోతైనకళ్ళు..
వణుకుతున్న గొంతుక..
కృష్ణ తత్వాన్ని ప్రవహింపజేస్తోంది  ..
వినిపించని వేణువు శ్రద్ధగా వింటున్న 
ఆ శిష్యుల గుండెల్లో మోగుతోంది...
బ్రతికిఉన్నంతకాలం ..
ఒక దివ్య తేజస్సు ఆ శరీరంలో వుంది కాబట్టి
ఆ అవయవాలు ఇప్పటికీ 
ఆ తేజస్సును వ్యక్తం చేస్తున్నాయ్..
శరీరం భగవంతుడు కాదు..
కృష్ణుడనగానే నెమలి పింఛం వేణువు..
ఇవి కాదు,,
కృష్ణుడు ఆత్మ స్వరూపుడు..
కృష్ణుడంటే ఆత్మ స్పృహ 
ఆత్మ భక్తి..


హఠాత్తుగా ఆయన శ్రీనివాసా..
అంటూ గుండె పట్టుకుని వొరిగి పోయాడు..
శిష్యులు
 అయ్యా..
స్వామీ..
గొల్లుమన్నారు..

అక్కడ నిర్యాణం .. 
ఇక్కడ ప్రాణ ప్రతిష్ట .. 
దేవునిలో లీన మవడమంటే ఇదేనా.. ??2 ఆగ, 2017

మాతండ్రిగారైన పుట్టపర్తి వారి
గ్రంథముల కొరకు

9032796394 నందు
సంప్రదించగలరు
పుట్టపర్తి అనూరాధ