అది 1941 వ సంవత్సరము
ధర్మవరంలో సరస్వతీ నిలయము
అనే గ్రంధాలయ మూడురోజుల వార్షికోత్సవాలు
చివరిదినమది..
గుఱ్రం జాషువా కవి ఉపన్యసిస్తున్నారు..
పుట్టపర్తి "షాజీ" కావ్య ప్రసక్తి వచ్చింది
షాజీ కావ్య రచన అంతా
నా రచనా విధానానికీ
భావావేశానికీ ప్రతిబింబమే కానీ
దానిలో కవి ఉపజ్ఞ తక్కువ
అన్నారు జాషువా..
సభ నేర్పాటు చేసిన వాడు
స్వయానా పుట్టపర్తి స్నేహితుడు ఆప్తుడు
తన ఆప్తుని పైనా
అందునా
స్వయం ప్రజ్ఞా ధురీణునిపైనా
చేసిన నిందారోపణలను సహించలేకపోయినాడు..
జాషువా గారి ఆరోపణలకు ఆధారాలేవో
సభాముఖంగా వివరించమని కోరినాడు
ఆయన కొంత కోపంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసే సరికి
సభ గగ్గోలయ్యే పరిస్థితి వచ్చింది
అందరూ సర్దుబాటు చేసినారు
ఇది ఎవరి అనుభవమనుకొంటున్నారా
పుట్టపర్తి స్నేహితుడు సహపాఠీ
కలచవీడు శ్రీనివాసాచార్యులు గారివి
ఒక పదహారేండ్ల యువకుడు
తిరుపతి వేంకటేశ్వర సంస్కృత కళాశాలలో
ప్రవేశాన్నర్థించేందుకై వచ్చినాడు
ప్రవేశం నిరాకరింపబడింది
ఎర్రబడిన ముఖంతో
భావి కర్తవ్యాలోచనతో
ఆఫీసు గడప దాకా వస్తూ వస్తూ ఏవో కొన్ని పద్యాలు చెప్పటం
ప్రిన్సిపాలు గారు వినటం తటస్థించించింది
వారూ సామాన్యులు కాదు
సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో దిట్టమైన పండితుడు
అవి వేడుకోలు పద్యాలు కావు
హృదయావర్థకమైన భావపుష్టితో
ఆత్మాభిమానాన్ని వెల్లడించేవి
మనస్సునందే వెలుగు వెలిగిందో
వెంటనే
ప్రిన్సిపాలు గారు పిలిచారు మళ్ళీ వెనుకకా బాలుణ్ణి
మళ్ళీ ఆపద్యాలు చెప్పించుకున్నారు
ప్రిన్సిపాలు గారి ముఖంపై
చిరునవ్వు..
ఆశ్చర్యం ..
వాత్సల్యం.. తొణికిసలాడాయి
వెంటనే నీ ఇష్టం వచ్చిన క్లాసులో చేరవచ్చునని సెలవిచ్చారు
ఈ అనుభవాన్నీ ప్రత్యక్షంగా పంచుకున్నారు
కలచవీడు శ్రీనివాసాచార్యులు గారు
ఏకసంథాగ్రాహిత్వమూ
తీక్ష్ణమైన బుధ్ధీ గల పుట్టపర్తికి
నత్త నడక నడిచే ఆ విద్యా విధానం బొత్తిగా నచ్చలేదు
అందుకే
క్లాసులో పాఠం చెప్పే అయ్య వారికే అర్థం గాని
ప్రశ్నలను సందేహాలనూ వదిలి
వారు తికమక పడితే పగలబడి నవ్వుకునే వారట
ప్రతిక్లాసునూ సాగనివ్వక ఇబ్బంది పెట్టే విద్యార్థిగా
'get out from the class'
అనిపించుకొని దినమంతా లైబ్రరీలో గడిపేవారు
వున్న పుస్తకాలన్నిటినీ చదువుతూ
ఇంకా
జాషువా ఖండ రచనలూ..
రాయప్రోలు తృణకంకణమూ ..
విశ్వనాధ వారి దీర్ఘ సమాసోపేత రచనలనూ ..
చదివి తోటి విద్యార్థులకు వినిపించేవారు
మా అంతట మేము చదువుకుంటే
అంత రమ్యంగా వుండేవి కావు
ఆయన చదివితే అదేదో మైమరచి వినేవాళ్ళం
ఆ హృదయానికీ ఆ కంఠానికీ
అంత పొత్తున్నది
అంటారు శ్రీనివాసాచార్యులు గారు
ఈ విషయాలన్నీ మా అయ్య మాటల్లో
మేము వినే వాళ్ళం
నవ్వి నవ్వి ఎర్రబడిన ఆ ముఖం
ఇంకా గుర్తే..
|