12 ఆగ, 2013

రాష్ట్రపతిగారి సతీమణి పుస్తకమా ,,???



ఒకసారి 
రాయలు బెద్దనామాత్యులను 
మహాకావ్య రచనకై ప్రేరేపించెను 
వారన్నారు ..



"నీకు గావలసినప్పుడంతయు 
గవిత్వము వ్రాయుటకు నాకు సాధ్యపడదు..
నా కవితా రచన కనేకోపకరణములు గావలెను.. 
ఊయలమంచముండవలెను..

నాయూహలను దెలిసి వ్రాయగల లేఖకులు గావలెను..
నా పద్యములను 
మధుర రాగ యుక్తముగ ..
నర్థమును జెరుపక ..
గానముసేయగల బాఠకులు బరివేష్టింపవలెను..

ఆత్మకింపయిన భోజనముండవలెను..
రమణీయమగు స్వరూపముగల రమణీమణులు 
దెచ్చియిచ్చు కర్పూర తాంబూలము గావలెను..

ఇన్ని సాధనములు గుదిరినప్పుడే ..
కవిత్వము నాకు దొరలును..

రాయలీ సమాధానమునకు గోపపడలేదు..
వారు జిరునవ్వు నవ్వి ..
యట్లేగానిమ్మన్నారు..

తరువాత నెంతయోకాలము గడచెను
మరల రాయలు పెద్దనామాత్యులను 
గావ్యరచనకై యడుగలేదు

రాయల యాస్థానమున నున్న విద్వాంసులకు 
స్వాతంత్ర్యము మెండు
వారొక్కొక్కసారి..
రాయల యానతికి గూడ బదులొసగుచుండిరి.. 

రాయల నీతి కథలలోని 
కవిసన్మానము కథలోని పంక్తులివి..

శ్రికృష్ణదేవ రాయలు కళాపిపాసి
ఎందరో కవులని ఆయన ప్రొత్సహించాడు
అష్టదిగ్గజాలని తన పక్కన ఉంచుకొని పాలనతో పాటూ కవితారసాస్వాదన కూడా చేస్తూ తన కాలాన్ని 'స్వర్ణయుగ'మనిపించుకున్నాడు.

నాటి కవులు 
ఒకరిని మించి మరొకరు కవిత్వ సృష్టిచేస్తూ వచ్చారు
కవిత్వం కన్నా పాండిత్యానికి పెద్దపీట వుండేది

పాండిత్యంలో ఒకరినొకరు ఓడించుకొని 
'నేనే మహాపండితుడి'నని భుజాలు విరుచుకొనేవారు
తర్వాత్తర్వాత కవిత్వం పలుచబడూ ..బడుతూ ..
వచనకవిత్వం దాకా వచ్చింది
నేటికి వచన కవిత్వం పచన కవిత్వమైపోయిందేమో కూడా

చాగంటి వారొక సారి ఒక తమాషాకధ చెప్పారు
ఎవ్వడినైనా 
'ఒరే ..నీకు సరస్వతీ కటాక్షం లేదురా..'
అంటే 
'ఏవిటండీ అలా మాట్లాడతారు.. 
నాకెంత తెలుసో మీకేం తెలుసు..?'
అంటాడు

'ఒరే నీకు లక్ష్మీ కటాక్షం ఉందిరా..
 అంటే
'అబ్బే ఎక్కడిదండీ ..
ఆవచ్చేది వడ్డీలకే సరిపోటం లేదు..
ఏదో వంశపారంపర్యంగా వస్తోందని చేస్తున్నామంతే..'
అంటాట్ట..

అలా ఈనాటి కవులు కూడా
తలలో పుట్టిన కవితలను 
వెంటనే అక్షర రూపమూ 
ఆ వెంటనే ముద్రణ రూపమూ ఇచ్చి
వాటిని అందరికీ ఉచితంగా పంచిపెడుతూ
మంచి సమీక్షలకోసం 
అభిప్రాయాలకోసం అడ్డమైన గడ్డీ కరుస్తూంటారు 

"నే ను వ్రాసిన పద్యముల సంఖ్య , 
ప్రకటింప బడినవాని సంఖ్య, 
సుమారు ఇరువది వేలుండ వచ్చును. 
నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును "


"ఒకసారి నా సన్మాన సభలో 
నూరుమందివరకూ కవిత్వాలు నాపై వ్రాసారు
అప్పటికప్పుడు 
అక్కడికక్కడ కూచుని రాసిన ఘనులు కూడా వున్నారు..

నాకనిపిస్తుంది 
'కవిత్వం ఇంత తక్కువ పదార్థమిపోయిందా.. అని?"
అని పుట్టపర్తి వారు ఆశ్చర్య పోతారు..

సాధారణంగా పుట్టపర్తి వారు అభిప్రాయం రాయరు
రచన బాగుండివుంటే తప్ప
వారినుంచీ ముందుమాటలను 
సమీక్షలనూ పొందటానికి 
చాలామంది తపన పడేవాళ్ళు..
అలాంటి సంఘటనే ఒకటి జరిగింది
అదేమంటే..




పుట్టపర్తి పదిమందిలో కూచుని వున్నారు
ఇంతలో పోస్ట్ వచ్చింది
ఎవరో అందుకున్నారు.
అయిదారు జాబులు

అప్పట్లో జాబులూ 
రిజిస్టరులో పుస్తకాలు చాలా వచ్చేవి
కాంప్లిమెంటరీ పంపేవారు 
అభిప్రాయం కోసం పంపేవారు.
సాహిత్య పరిషత్  TTD 
ఎన్నో ఇలా

అయ్య ఒక్కో లెటరూ తెరిచి చూస్తున్నారు
ఇంతలో పక్కవారి దృష్టిని ఆకర్షించిందొక ఉత్తరం
దానిపై presiDent of India అని వుంది..
వారు దానిని తెరిచారు.
ప్రెసిడెంట్ నుంచీ అని ఒకరికొకరు గుస గుస లాడుకున్నారు.

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి
నమస్సులు
నా పేరు "..."
నేను రచించిన ఈ గ్రంధ రాజాన్ని మీ పరిశీలన కై పంపుతున్నాను.
మహా శివుని తాండవాన్ని అద్భుతంగా చిత్రించిన మీకు ఇది పంపడం సాహసమే
సహృదయంతో అభిప్రాయం వ్రాసి నన్ను కృతార్థురాలను చేయ ప్రార్థన..
ఇట్లు
".............."
గమనిక
అభిప్రాయం అందిన వెంటనే తగిన మూల్యం పంపబడును.
"......."
w/o V.V.Giri.
President of India

ఈ వుత్తరాన్ని ఎవరో చదివి వినిపించారు.
విన్న వెంటనే పుట్టపర్తి వారి భృకుటి ముడిపడింది...
చివరది మళ్ళీ చదువు...

ఓ శివా
నీవెంత దయాళువు
ఓ శివా
నీ కంఠాన గరళం ధరించావు..
ఓ శివా
బూదిని నీవు ధరించావు
పాములను అలంకరించుకున్నావు
శ్మశానాన వాసమున్నావు
హిమన్నగాల నిష్టపడ్డావు..

కవిత్వాన్ని చదివి పెదవి విరిచారు మరొకరు..
అయినా ప్రెసిడెంట్ భార్య..
అందరికీ ఆశ్చర్యం..

ఇదేం కవిత్వమయ్యా..
దీనికి మీరు అభిప్రాయమా..
చివరన చూడు తగిన మూల్యం పంపుతుందట..

పుట్టపర్తికి ఆ పుస్తకం పై అభిప్రాయం వ్రాయబుధ్ధి కాలేదు
అందరూ
ఎందుకు స్వామీ 
పెద్దవారితో పని అంటూ పుట్టపర్తిని మెత్తబరిచారు
చివరికి తప్పేది లేక మా అమ్మ
ఏవో నాలుగు మంచి మాటలు వ్రాయవలసి వచ్చింది
తదుపరి కొంతకాలానికి
శివశ్రీ అనే కవి
ఈ పుస్తకానికి నిరంకుశులుగా పేరొందిన పుట్టపర్తి 
అభిప్రాయం ఎలా వ్రాసారో నాకు అర్థం కావటం లేదు
అని పత్రికాముఖంగా అన్నాడు
దానికి బాధపడిన పుట్టపర్తి

"నిజమే

నేను కొన్ని ఒత్తిడులకు తలఒగ్గలసి వచ్చింది
దీనిని పత్రికాముఖంగా అంగీకరిస్తున్నాను"
అంటూ
తెలియజేసారు.. 

కవి నిరంకుశుడు. 
నిజాన్ని నిర్భయంగా చెపుతాడు
తనికి దురాశలు లేవు. 
ఆశల ఉచ్చులు లేవు. 
అతడు దేనికీ చిక్కడు ..
వేదనకు ఆవేదనకు నివేదనకు తప్ప. 




శ్రీ జానుమద్ది హనుఛ్చాస్త్రి ,
శ్రీ వీణా రమాపతి రాజు,
శ్రీ మల్లెమాల వేణు గోపాలరెడ్డి ,
మా అక్కయ్య నాగపద్మిని 
తదితరులు ఈ విషయాన్ని ధృవీకరించారు..

ఇంకా
పుట్టపర్తి ఇఛ్చా మరణాన్ని పొందారా..??
సహస్రారం నుంచీ వారి ఆత్మ నిర్గమించిందా..??
అందుకే శ్రీనివాసా అన్న చివరి పలుకులతో జన్మ ఉధ్ధరింపబడిందా
చివరి క్షణాలలో పుట్టపర్తి వారి దగ్గరే ఉన్న శిష్యుడు 
గోవిందు  ఏం చెప్పారు..?
తదుపరి పోస్ట్ లలో