17 మే, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల క్రిష్ణుడు -పుట్టపర్తి అనూరాధ.

జీవిత చరిత్రలు..
అవి ఎంత గొప్ప వ్యక్తివైనా ..
అప్పుడప్పుడూ విసుగు పుట్టించవచ్చు..


కానీ ..
అప్పుడప్పుడూ వారి జీవితంలోని ..
హాస్య సంఘటనలు ..
చదవడానికి సరదాగా ఉండటమే కాక ..
మనసులో అలా ఉండిపోతాయి..
 
పైగా ..
అవి ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెబుతాయి.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్జాన్ని ..
గడగడలాడించిన గాంధీగారు ..
కస్తూరిబా మాటకు భయపడేవారట..
గతంలో ఆవిడపట్ల ..
అనుచితంగా ప్రవర్తించిన కారణంగా..
అందుకు పశ్చాత్తాప సూచనగా ..
ఆవిడని నొప్పించడానికి ఇష్టపడేవారు కాదట..
 
వార్దాలో ..
ఆశ్రమంలో ..
ఉన్నప్పుడు ఆశ్రమవాసులందరు ..
అది గాంధీజీ అయినా సరే ..
వంట చేయటం ..
గిన్నెలు కడగటం చేసేవారు..
 
ఒకసారి ..
గాంధీగారికి గిన్నెలు కడిగే వంతు వచ్చింది.. 
అలానే ..
గాంధీజీ ..కుమారప్పలు ..తోముతున్నారు.
 

ఇంతలో..
కస్తూరిబా గబగబా వచ్చి..
మీకోసం ..
ఎన్నో ప్రజోపయోగమైన కార్యక్రమాలు.. ఎదురుచూస్తుండగా..
 మీరు గిన్నెలు తోమటమేమిటి..?
అని అన్నారు .
 
కానీ ..
గాంధీజీ వినకుండా ..
కుమారప్పతో కలిసి నవ్వుతూ ..
గిన్నెలు శుభ్రపరుస్తూనే ఉన్నారు..
 

కస్తూరిబా..
గాంధీ గారి చేతిలోని గిన్నెను లాక్కున్నారు..
కానీ ..
పీచు గాంధీ గారి చేతిలోనే వుందిపోయింది..
గాంధీ గారు నవ్వుతూ.. కుమారప్పతో ..


కుమారప్పా ..నీకు పెళ్ళికాలేదు..
నీవదృష్టవంతుడివయ్యా ..
నీకు భార్యలేదు కదా ..
నీమీద పెత్తనం చెలాయించడానికి ..


కానీ నేను ..
గృహస్థ ధర్మం ప్రకారం ..
భార్య మాట వినక తప్పదు.
నాకు వేరే మార్గాంతరం లేదు.
నీవూ.. కస్తూరిబా ..
మిగిలిన గిన్నెలు తోమేసి రండి..
నిన్ను వదిలి వెళుతున్నందుకు..
క్షమిస్తావనుకుంటా..
అని వెళ్ళిపోయారట..
అలా..
సరస్వతీపుత్ర..
 శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వద్ద విద్యాభ్యాసం వారి శిష్యులకొక ..
మరపురాని అనుభూతి. 

తరగతి గదులలోని ఇరుకు వాతావరణంలో ..
విద్యాబోధన చేయడం వారికి నచ్చేది కాదు. 
పాఠశాల ఆవరణలోని చెట్ల నీడలో..
 ఆసీనులై టైం టేబుల్ ప్రకారం..
తన వద్దకే తరలివచ్చే విద్యార్థులకు..
చదువు నేర్పడం వారిదైన బాణీ..

ఆయన మేధాసంపత్తిని గమనించిన హెడ్ మాస్టర్లు
 వారి ఈ పధ్ధతికి అడ్డు చెప్పేవారుకాదు.
కడపలో ఆయన పని  చేస్తుండగా 
పాఠశాల తనిఖీకి విద్యాధికులు విచ్చేసారు.
 
అధికార గర్వమెక్కువ..
ఆడంబరాలపట్ల మక్కువ ..
విద్యాగంధం తక్కువ గల ఆ అధికారులు..
చెట్ల కింద ఆచార్యుల వారు ..
క్లాసులు తీసుకోవడాన్ని విమర్శిస్తూ ..
ఆయనను తరగతి గదిలోకి పిలిపించారు..

హెడ్ మాస్టరు గారు 
ఆయన పాండిత్యాన్ని.. గొప్పదనాన్నీ..
 వారికి వివరించబోయి విఫలులయ్యారు. 

ఆచార్యుల వారిచ్చిన నోట్సులను తనిఖీ చేస్తూ..
 ఒక అధికారి 
ఏమండీ ఆచార్యులవారూ..
 మీ గురించి ..
మీ హెడ్ మాస్టరు చాలా గొప్పగా చెప్పారు.

 కానీ..
 ఇదేమిటండీ ..
కృష్ణుడు ..
అని తప్పుగా వ్రాయించారు..పిల్లలచేత..
క్రిష్ణుడు ..అని కదా వుండాలి. 
అంటూ ఇంకా యేమేమో ..
పిల్లల ముందు చెప్పబోగా..
ఆచార్యులవారు అడ్డుకొని ..

సార్ ..
శ్రీ కృష్ణుడు లీలా రూపధారి ..
మనమెలా భావిస్తే అలా అగుపడతాడు...!!

కానీ ..
నాకు ..నాలాంటి వారికీ ..
శ్రీ కృష్ణుడు వట్రువసుడి రూపంలోనే కనిపిస్తాడు. మహానుభావులైన మీకు ..
గుడి రూపంలో కనిపించాడేమో ..

కానీ పిల్లలూ..
 సామాన్యులమైన మనం ..
వట్రువసుడి కృష్ణుడినే ఆరాధించాలి సుమా..
 అంటూ సుతిమెత్తగా దెబ్బ కొట్టి..
 పాఠాన్ని ఆరంభించారు...

శ్రీమతి గొల్లాపిన్ని (పాణ్యం ) వసుంధరాదేవి.
ఆంధ్ర జ్యోతి డైలీ 11.06.1993