9 సెప్టెం, 2012

ఏకాకీ


గురుగీతలో పరమశివుడు 
పార్వతితో చెప్పాడు.
బ్రహ్మజ్ఞానమును పొందిన వ్యక్తి 
ఇష్టపడేది దేనిని..
 
ఏకాకీ..
తనొక్కడే వుండడాన్ని ఇష్టపడతాడు.
అస్తమానం చుట్టూ జనం చేరడాన్ని ఇష్టపడడు.
వాక్కు బ్రహ్మానంద స్థితిని భంగ పరుస్తుంది.
 

చుట్టూ జనం చేరి మాట్లాడుతున్నారనుకోండి
కొన్నాళ్ళకు మాటలే మిగిలిపోతాయి
వాడితో మాటలు వీడితో మాటలు.
ధ్యానం సున్న అయిపోతుంది
అంతకు ముందు చదువుకున్న 
చదువు సున్న అయిపోతుంది..
ఎందుకని..??
 
అన్వయం లేదు..
మళ్ళీ మళ్ళీ చదివిందేది..?
మళ్ళీ మళ్ళీ తిప్పిందేది..?
ధ్యానం లో కూచున్నదేది..?
 
"ఏకాకీ నిస్పృహః శాంతః చింతాసూయా వివర్జితః
బాల్య భావే నయోభాతి శ్రీగురురభినీయతే.."
 
చంద్రశేఖర పరమాచార్యుల వంటి ప్రాజ్ఞులు కూడా
అస్తమానం జనం వచ్చి విసిగిస్తారని 
ఎవ్వరికీ దర్శనం ఇవ్వకుండా 
ఏకాంతంలో మౌనంగా వుండిపోతారు.   
(చాగంటి ఉపన్యాసాలనుంచీ ) 

పుట్టపర్తి వారూ అంతే..
కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీ లోనూ..
మళయాళం లెక్సికన్ కోసం 
తిరువాన్ కూర్ లోనూ..
పనిచేసే సువర్ణావకాశాన్ని వదులుకొని..
ఎక్కడో రాయలసీమలోని కడపలో 

రామకృష్ణా హైస్కూలులో..
మర్రి చెట్టు కింద కూర్చొని..
 తులసీ రామాయణమో..

పారడైజ్ లాస్టో..
శిలప్పదిగారమో..
మేఘసందేశమో చదవాలనుకుంటాడా……? 
మరి ఆయన కెందుకలా అనిపించింది….??
 

కృత్రిమ నాగరికత అంటే గిట్టక…
ఆశ్రిత సాహిత్య మంటే యేవగింపు కనక….!!!!
ఏకాంత ప్రకృతిలో 

సాహిత్య పిపాసిలా 
స్వేచ్చా జీవిలా వుండాలనుకున్నారు..
వున్నారు..
అది కడప రామ కృష్ణా హైస్కూల్
మధ్యాన్నం మూడు గంటల ప్రాంతం..
బయట ఎండ కాస్తున్నా 

ఆ చెట్లు చల్లని నీడలు పరిచాయి
ఆ కొమ్మల గుబురుల్లోంచీ 

అప్పుడప్పుడూ ఓ కోయిలమ్మ..
కూహూ ..కూహూ ..
మని తియ్యగా రాగం తీస్తూంది..
 

క్లాసు రూముల్లో పిల్లలు 
గోల గోలగా చదువు కుంటున్నారు..
ఈ గోలలకూ పుట్టపర్తికీ 

ఏం సంబంధం లేదు..
ఆయనా ఓ పిల్లాడిలా 

చక్కగా కుదురుగా చదువుకుంటున్నాడు 
ప్రకృతి ఒడిలో..
ఇంతలో చెంచుసుబ్బయ్య సారు వచ్చారు..
 

"అయ్యా.."
"ఏం రా.."
"భోజనమైందా..?"
"ఏం భోజనం లేరా..ఎప్పుడూ తినేదేగా..
మొన్న మూడు రోజులు 

సన్మానాలకు పోయినానురా..
చదువు మూల పడింది.."
 

"ఇది..?"
పుస్తకం వంక చూస్తూ అన్నారు 

చెంచుసుబ్బయ్యసారు.
"శిలప్పదిగారం రా..
యుధ్ధ దేవత అయిన తడాడగై ప్రతియార్ ని 

ఏం వర్ణించాడనుకున్నావ్..
తమాషా ఏమంటే ..

ఈమె ఒక చేతిలో కమలం 
ఇంకో చేతిలో కత్తి పట్టుకుని వుంటుంది..
నాదస్వరాన్ని గురించిన ప్రస్తావన కూడా 

ఇందులో ఉందిరా..
అద్భుతమైన రచన అనుకో.."
 

కానీ ..
చెంచు సుబ్బయ్య
ఆపుస్తకం సైజునీ 
ప్రింటింగ్ నాణ్యతనీ 
చూస్తున్నట్లు పుట్టపర్తి వారికి అనిపించింది..
 

ఒకింత నిరాశ కలిగింది..
"సరే రా.."
అన్నారు "ఇంక పోయిరా.." అన్నట్లు.
ఆయన లేచారు.
మళ్ళీ పుట్టపర్తి తన పుస్తకం లో మునిగిపోయారు.

మర్రి చెట్టుకింద పుట్టపర్తి..
చేతిలో శిలప్పదిగారం..

అన్నట్టు ..
జ్ఞానులందరూ వృక్షాలకిందకే చేరుతారు కదూ