కొంత కాలంక్రితం
ఒక పెళ్ళికని మా వూరు (చిత్తూరు) వెళ్ళాను.
పెళ్ళి భోజనాల తరువాత
బంధు జనులందరూ కూర్చొని పిచ్చా పాటీ
మాట్లాడుకొంటున్నాము.
మాటల సందర్భంలో ఒకరు;
తమిళ, తెలుగు, ఆంగ్ల భాషల్లో విశేష కృషి చేసిన వారు,
ఒక ప్రశ్న అడిగారు.
“జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి
తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది.
ఐతే మిమ్మల్ని ఒక పేరు ప్రతిపాదించమని అడిగితే
మీరెవరి పేరు చెబుతారు?”
హఠాత్తుగా ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం.
ఎవరికీ మాటలు దొరకలేదు.
“ఈసారీ అర్హులు ఎవరూ లేరని తెలుగును
దాటవేస్తారేమో”
అన్నారు ఒకరు మెల్లగా.
మరణావస్థలోనున్న తెలుగు సాహిత్య ఆత్మ శాంతికా
అన్నట్లు
కొన్ని క్షణాల మౌనం తరువాత
మెల్లగా సంభాషణ తమిళ సాహిత్యం వైపు మళ్ళింది.
అక్కడున్నవారిలో పలువురు ఉభయ భాషాభిమానులు
కావడంతో
అవార్డు తెలుగు కవికి వచ్చినా,
తమిళ కవికి వచ్చినా వారికి సంతోషమే.
ఇన్ని రోజులు గడిచినా
ఆ ప్రశ్న నా మనసులోనుండి తొలగి పోలేదు.
“జ్ఞాన పీఠ అవార్డు కు ఒకరి పేరు చెప్పమంటే
నేనెవరి పేరు చెప్పాలి?” .
ఆఖరు సారిగా సినారె కు వచ్చింది.
అప్పుడు నాకు నచ్చలేదు.
పుట్టపర్తి వారికి వస్తుందని నాకు నమ్మకంగా ఉండేది.
అవార్డు ప్రకటించిన కొన్ని రోజులకు
నేను పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని
వారి యింటిలో కలవడం జరిగింది.
వారికి కూడా కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం.
“ అవార్డు గురించే కాదు గానీ,
వారిచ్చే లక్ష రూపాయలతో
నా ఆధ్యాత్మ రామాయణం అచ్చయిపోయేది.
మరో సారి తెలుగు వంతు వచ్చేదాకా
నేను బ్రతికిఉండే అవకాశం లేదు” అన్నారు.
మరో రెండేళ్ళకే వారు దివంగతులయ్యారు.
విశ్వనాధ వారికి అవార్డు వచ్చినప్పుడు
ఎవరికీ ఆక్షేపణలు లేకపోయినా,
అంతటి గొప్ప సమకాలికులు ఆయనకు చాలామందే
ఉండేవారు
– శ్రీశ్రీ, జాషువా, వారి గురువు చెళ్ళపిళ్ళ వారు,
కృష్ణశాస్త్రి, తిలక్, … ఇంకా బోలెడంతమంది.
అదేమి వింతయో గానీ
భూమిపైనుండి డైనోసార్లు హఠాత్తుగా
అంతరించిపోయినట్లు
తెలుగు సాహితీ లోకంనుండి
కవికులం చడీ చప్పుడు లేకుండా అదృశ్యమైపోయింది.
పద్య కవితలు పోతే పోయె,
మంచి వచనమో,
కనీసం చక్కని సాహితీ విలువలతో కూడిన నవలా
సాహిత్యమో
సృజించేవారు కరువైపోయారు.
ఈ మధ్య కాలంలో
జ్ఞాన పీఠ అవార్డుకు ఖచ్చితంగా అర్హులైన వారని
నేను భావించే కరుణశ్రీ,
గుంటూరు శేషేంద్ర శర్మ గారు,
మధురాంతకం రాజారాం గారు …
అందరూ కీర్తిశేషులైపోయారు.
జ్ఞాన పీఠ అవార్డును
మరణానంతరం ఇచ్చే సాంప్రదాయం లేదాయె.
ఇక మిగిలిందెవరు?
తెలుగు సాహితీ లోకంలో
ప్రస్తుతం భయంకరమైన శూన్యం తాండవిస్తోంది.
ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి
‘ తెలుగులో అవార్డు ఇచ్చి చాలా రోజులైపోయింది.
ఇదిగో జ్ఞాన పీఠం, తీసుకోండి’ అంటే
తీసుకోగలవారు కనిపించడంలేదు.
“ ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు
బహూకరింపగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు కోరగలేరు, లేరొకో!
”
అని ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు బాధపడి
పోయారు.
ఆ క్షణాన వారికి ఓదార్పునిస్తూ
“ పెద్దన బోలు సత్కవులు పృధ్విని లేరని నీవెరుంగవే!
పెద్దనకీదలంచినను పేర్మిని నాకిడు కృష్ణరాణృపా ”
అని చెప్పడానికి ఓ పెద్దనామాత్యుడు ఉన్నాడు.
నేడెవరున్నారు?