17 జన, 2016

రసలుబ్ధులు



ఒకసారి గుంటూరులో పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులుగారితో 
వారి శిష్యుడు
'స్వామీ నాకు వాల్మీకి రామాయణం చదవాలనివుంది'
అన్నాడట
'చదువు..  ఇందులో నీకు కష్టమేముందీ ..??
తెలుగే కదా..'
అన్నారట 
నిజమైన మాట..
అలాగే కన్నడిగులకు అది కన్నడంలాగే కనబడుతుంది
మళయాళీలకు కూడా అంతే..
ఎటొచ్చీ తమిళునికి మాత్రమే 
దానిని ప్రత్యేకంగా అర్థం చేసుకోవ ల సి న 
అవసరం వుంటుంది
ఎందుకు చెబుతున్నానంటే 
వాల్మీకి వాడిన సంస్కృతం 
ఏ భాషలోనైనా ఒదిగిపోయి 
అది తమ భాషే అనిపించేంత సులభంగా వుంటుంది
నిఘంటువు చూచుకోవలసిన సంస్కృత శబ్దం ఒక్కటిన్నీ సాధారణంగా వాల్మీకి రామాయణంలో కనిపించదు..

ఇక మనస్తత్త్వం విషయానికొస్తే..
వాల్మీకి మనస్తత్త్వం పరమ కోమలమైనది
ఎంతసేపు చెప్పినా తనకు విసుగులేదు
ఇతరులని విసిగించడు
తాత్త్వికంగా వాదించడు
ఏదైనా క్లిష్ట సమస్య వస్తే 
ఏష ధర్మః స్సనాతనః
అని మెల్లగా జారుకుంటాడు..

సావిత్రి వంటి మహాకవ్యన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అని నిరాశ

ఇది శ్రీమద్వాల్మీకి ప్రణీత శ్రీమద్రామాయణము అయోధ్యాకాండము
మొదటి సంపుటము వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామ చంద్రుడు
వారి శ్రీమద్రామాయణ దర్శనం 
ముందుమాటలో పుట్టపర్తి ప్రస్తావించిన విషయాలు

పాత్ర చిత్రణ విషయానికొస్తే
వాల్మీకి పాత్ర చిత్రణ 
వాని ప్రవేశం 
వానిని అవసరం తీరిన వెంటనే 
మృదువుగా అదృశ్యం చేయటం లో 
వాల్మీకి అనుసరించిన విధానం మొదలైన విషయాల్లో ఎందరినో కవిత్వం వరకూ పోకుండానే కేవలం కధే ఎందరినో అకర్షించింది..

ఇక్కడ చూడం డి


విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికై 
తపస్సు మొదలెడతాడు
మొదట పరమ శివుడు ప్రత్యక్ష మౌతాడు
ఏవో వరాలు .. 
తరువాత వెయ్యి సంవత్సరాల ఘోర తపస్సు 
మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షం
'నీవు రాజర్షివైనావు' అన్నాడు
సంతోషపడలేదు.. 
'నేనెప్పటికి  బ్రహ్మర్షి నౌతా' నని బాధపడ్డాడు
తరువాత త్రిశంకునితో తపస్సు వ్యయం
శునశ్శేపునికి   తపస్సు ధారపోయడం
మళ్ళీ పశ్చిమతీరంలో తపం
అక్కడ మేనక ప్రత్యక్షం
మానవ దౌర్బల్యం కమ్మి మేనకతో జీవితం సాగిస్తూండగా
హటాత్తుగా
 'యేం చేయాలని వచ్చాను.. 
యేం చేస్తున్నాను.. ??'
అన్న స్పృహ
మళ్ళీ ఉత్తర తీరంలోవెయ్యి సంవత్సరాల ఘోర తపస్సు

బ్రహ్మ 'నీవు మహర్షివయ్యావయ్యా' అన్నా డు 
విన్నవెంటనే 
'బ్రహ్మర్షి నెప్పుడౌతానో..?' అన్న చింతకన్నా
జితేంద్రియుడనయ్యానా
అని అడిగాడట
ఎందుకు 
తన ప్రయత్నమంతా
కామ క్రోధాల వల్ల పాడైపోతూంది
చూశారా..
మనం చేసే ప్రయత్నాలను అడ్డుకొనేది ఎవరో కాదు 
మన మనసే..
మనసు చేసే మాయ వల్ల 
మనం మనం కాకుండా పోతాం
మనల్నిమనం కోల్పోతాం
మనం వేరే అవతారమెత్తుతాం

కనుకే వాల్మీకి 
విశ్వామిత్రుని ప్రయత్నాన్నే ప్రధానంగా చూపాడుతప్ప 
అతను ప్రలోభ పడిన సన్నివేశాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు
అదే పుట్టపర్తి వారు చెబుతున్నారు..



''కొన్ని విషయాలు ఆయన జారవిడుస్తూ పోతాడు.. ఇతరులు ఆ సన్నివేశాలను పెంచి పెద్ద జేస్తారు.. 
ఒక సన్నివేశం చూపుతాను
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావలెనని తపస్సు చేస్తున్నాడు
అంతకుముందు రెండు మూడు విఘ్నాలు జరిగినాయి..
వాటిని దాటుకుని మరలా వెయ్యి సంవత్సరాలు
తపస్సు చేసినాడు తపస్సు ముగించి వ్రతస్నాతుడై నెమ్మదిగా కూర్చున్నాడు..
ఇంతలో దేవేంద్రుడు వచ్చి 
''నీవు ఇప్పటికి ఋషివైనా''
వని చెప్పిపోతాడు
కాని గాధేయుని ఆకాంక్ష అదికాదు గదా..
తాను బ్రహ్మర్షి కావలె..
మరలా  తపస్సున కారంభించినాడు.
దేవతలు విడుస్తారా..
ఆయన తపోభంగం కలిగించడానికి 
ఇంకో ఎత్తుగడ యెత్తినారు
మేనకను పంపినారు.
అదీ సామాన్యురాలు కాదు
పరమాప్సరస
పుష్కరాల్లో స్నానం చే స్తూంది
విశ్వామిత్రుడు చూస్తాడు
మేఘంలో మెరుపు వలె మేనక ప్రకాశిస్తూంది.
ఆమెను చూచిన విశ్వామిత్రుడు కందర్పవశుడైనాడు
'ఓసీ.. అప్సరా నీకు స్వాగతం..
నా ఆశ్రమంలో వుండు.. మదన తాప తప్తుణ్ణైన నన్ను అనుగ్రహించు..'
అంటాడు.. 
'సరే ..' నంటుంది
పదివర్షాలు గడిచిపోయినాయి..
ఒకనాడు తన పరిస్తితిని తలచుకొని విశ్వామిత్రుడు సిగ్గుపడతాడు
ఇదంతా దేవతలు పన్నిన పన్నుగడ
మేనకను చూస్తాడు
ఆమె శాప భయంతో వణకిపోతుంది
నమస్కరించి నిలబడ్డది
మేనకను అనునయించి పంపివేస్తాడు
ఈ కథనంతా వాల్మీకి మూడు నాలుగు శ్లోకాలలో చెప్పివేసినాడు
బ్రహ్మర్షివంటి విశ్వామిత్రుని జీవితంలో 
ఇది ఒక చిన్న దౌర్బల్యం
ఇది పెంచి పెద్దగా వర్ణించవలసిన అవసరం 
వాల్మీకికి తోచలేదు
వాల్మీకి తప్ప తక్కిన కవులంతా
ఈ సందర్భంలో తమ శృంగార చాపల్యాన్ని

గ్రుమ్మరించినారు
వారు వాల్మీకి హృదయాన్ని గమనించనేలేదు