20 మే, 2013

పెద్దన్నవరూధిని - రోషభీషణ


తెలుగు పంచ మహా కావ్యాలలో

 ప్రథమ ప్రబంధం మను చరిత్ర. 

మార్కండ డే య పురాణంలోని ఒక చిన్న కథను 

తీసికొని 


తన అద్భుత కవితా ప్రావీణ్యంతో 


ఒక రసవత్కావ్యం సృష్టించి తెలుగు కవిత్వ ప్రేమికులకు 


వెల లేని మధురాతి మధురమైన కానుకనిచ్చాడు 

పెద్దన. ఒక వరణా తరంగిణిని, 

ఒక అరుణాస్పద పురాన్ని, 

ఒక ప్రవరుని 

ఒక వరూధినిని, 

ఒక స్వరోచిని, 

ఒక మనోరమను సృష్టించి 

పాఠకుల హృదయాలలో 

ఒక అలౌకిక దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. 

అయితే 

అందులోని ''తరుణి ననన్య కాంతను''

 అనే పద్యం గురించిన చరిత్రను చెబుతూ 

ఈ పద్యం పెద్దన్నది కాదని

 ''పద్యం బొక్కటి చెప్పి..'' లో పుట్టపర్తి వారు 

అంటున్నారు ..


''తరుణి ననన్య కాంత నతి దారుణ పుష్ప శిలెముఖ వ్యధా
భరవివశాంగి నంగభవు బారికి, నగ్గము సేసి, క్రూరుడై
యరిగె, మహీసురాధము దహంకృతితో నని రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చె కషాయదీధితిన్..'' 

పెద్దన్న గారు ఏమనుకొని యీ పద్యం వ్రాసినారో
నాటినుంచీ చాలామందిని యీ రచన వేధిస్తూ వుంది.
నా చిన్నతనంలో 
యీ పద్యం పెద్దన్న గారిది ఔననీ-కాదనీ 
యెన్నో వదోపవాదాలు జరిగాయి

ఇంతకూ యిందులో యేమి చెప్పినాడాయన..
ప్రవరుడు వరూధిని మీద బడితే త్రోసివేసినాడు
ఆవిడ .. తరుణి.. 
మంచి వయస్సులో వున్నదన్నమాట..

'అనన్య కాంత..'
అంతకుముందే మగవాని స్నేహమూ లేనిది..
'కన్నెరికపు రతి'యని 
పెద్దన్నగారే..వేరొకచోట సర్టిఫికెట్టు ఇచ్చినారు..

అటువంటి స్త్రీ 
యేకాంతంలో తనకు తానై వలచివస్తే
ఆమెను మన్మధుని బాణాలకు అగ్గము చేసిపోయినాడని 
ప్రవరునిపైన సూర్యునికి విపరీతమైన కోపము వచ్చిందట..

ఆ కోపంతో 
ఆయన ముఖమండలం యెర్రబారింది..
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి  వర్ణిస్తూ వున్నదీ పద్యం
పైగా .. 
ఇందులో ప్రవరునికి వాడిన విశేషణాలు దారుణంగా వున్నాయి

క్రూరుడు.. 
మహీసురాధముడు.. 
అహంకారి..  అని
ఆయనకు యిచ్చిన యోగ్యతా పత్రాలు

యీ పద్యం నిజంగా పెద్దన్న గారిదే అయితే
ఆయనకు వరూధినిపైన విపరీతమైన సానుభూతి యని 
అర్థమవుతూ వుంది.

అంటే 
ప్రవరుడు వరూధినిని పొంది వుండవలసిందన్నమాట..
నా చిన్నతనంలో
కొందరు 'ఆంగ్ల విద్యా వాసనావాసితులు'
 దీనికిట్లే అర్థం చెప్పి నైష్టికులను గేలిచేసేవారు..

నిజంగా 
పెద్దన్న గారి అభిప్రాయం కూడా అదే అయితే
ఆ లాలసతను చెప్పడానికి 
ఇంత పెద్ద కావ్యం వ్రాయవలసిన పనే లేదు..

పైగా .. 
కావ్యం కూడా కొత్త మలుపు తిరిగి వుండేది..
ఆయన అభిప్రాయం కావ్యరచన్లో 
'కర్మ నిష్టనూ.. '
'వైదిక శ్రధ్ధనూ ..'
సమర్థించడమే..

పైగా యీ పద్యంలో
 ''నభోమణీ' శబ్దం యేమీ బాగ లేదు..
యౌగికార్థం సరిపోదు
రూఢ్యార్థాన్ని  తీసికొని సూర్యుడనే అర్థం చెప్పుకోవలె..

పెద్దన్నగారికి
 ఇలా కక్కుర్తిగా శబ్దాన్ని వాడే దారిద్ర్యం లేదు..
ఇంతకూ యీ రచన ఆయన చేసి వుండడనేది నా అభిప్రాయం
మరి దీనికి బదులు వేరే పద్యం వుండేదో 


లేక ఆ వర్ణనే లేకుండా వుండేదో కూడా చెప్పలేము..
అలా వుండడానికిన్నీ వీలు లేదు కదా
కావ్య ధర్మాన్ని బట్టి 
అస్తమిస్తూ వుండే సూర్యుణ్ణి యేదో ఒక రీతిగా వర్ణించవలసిందే..

ఇంతకూ 
పెద్దన్న యే ముహూర్తంలో దీనిని వ్రాసారో 
అప్పటినుంచీ యీ రచన చాలా గందరగోళంగానే వుంది..