22 సెప్టెం, 2012

devulapalli ramanujaraoలోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది అలోకంబగు
పెంజీకటి కవ్వల
ఎవ్వండేకాకృతి వెలుగు నతను నే సేవింతున్

సాహిత్య అకాడమీ కార్యదర్శి 
దేవులపల్లి రామానుజరావు గారు 
నాకు జిరకాల మిత్రులు 
సాహితీపరులు 
ఉదారులు వారు 
అకాడమీ పక్షమున 
మొదలు పండరీ భాగవతము నకై 
వేయి రూపాయలు మంజూరు చేయించిరి. 
మరల నా కష్టములు చెప్పికొనగా సాహసించి 
రెండవ వేయి నిప్పించినారు 
వారికి నా నమోవాకములు.

పండరీ భాగవతము పీఠికలో 

దేవులపల్లి వారి ప్రస్తావన 
 

ఈ గ్రంధం మొదటిభాగం పూర్తి కావడానికి 
నానా యాతనా పడవలసి వచ్చింది 
రచన సాగుతూ వున్నప్పుడు 
కుం.సౌ. నా భార్య పోయింది. 
ఆమె పోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ 
రచనకు మనసు అభిముఖంగా లేదు 
అయినా వ్రాత సాగవలె 
అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా 
ఒక యోగివలె మనస్సును కుదించుకొని
 వ్రాయవలసి వచ్చింది 

దేవులపల్లి రామానుజరావు గారు 
ఈ గ్రంధాన్ని గడ్డకు తేవడంలో 
యెన్నో రీతుల 
ఓర్పును ప్రదర్శిస్తూ వచ్చినారు 
ఆయన నా నిరంతర శ్రేయోభిలాషి 
ఆయన ఋణాన్ని తీర్చుకోలేను. 

శ్రీనివాస ప్రబంధము మున్నుడిలో 
రామానుజరావ్ గారిని 
ఇలా పుటపర్తివారు  ప్రస్తుతించారు 

ఆయనేమో 
నారాయణాచార్యుల వారితో 
నాకు నలభై సంవత్సరాల పరిచయం 
ఆ పరిచయం క్రమక్రమంగా 
ఆత్మీయతగా పరిణమించింది 

నా పట్ల 
అపారమైన అభిమానం కలిగినవారు
ఆచార్యులవారు 
హైదరాబాదుకు వచ్చినప్పుడు 
నాకు కొన్ని గంటల సహవాసము 
సంభాషణావకాశాన్ని కలిగించేవారు. 

నా యోగ్యతకన్న 
ఆయన ఆర్ద్రహృదయము సౌజన్యము 
ఇందుకు కారణము 
గడచిన ఇరవై సంవత్సరాలలో 
వారు రచించి ప్రకటించిన ఉద్గ్రంధాల పీఠికలలో 
నన్ను గూర్చి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు 
అందుకు వారి సౌజన్యమే ప్రధాన కారణం 
అంటారీయన 
పుర్వ జన్మ బంధాలు 
ఇంత ఘనిష్టంగా ఉంటాయేమో 


భావాంబరమున కావల వెల్గు దైవంబు
భావగోపీనాధుడై వేడ్కజెలగించి
రాగిణీవిభ్రమము లక్కడక్కడ దీర్చి
రాగాలవనజన్య రమణీయతలు చేర్చి
యొకయడుగు జననంబు ఒకయడుగు మరణంబు
ఒకభాగమున సృష్టి యొకవైపు బ్రళయంబు
గనుపింప దిగకన్నుగొనలు మిన్నుల నంట
మునిజనంబుల హృదయంబు దత్పదంబంట
నాడెనమ్మా శివుడు
పాడెనమ్మా భవుడు


                      అసాధారణ ప్రతిభావంతుడు 
                              స్వర్గీయ పుట్టపర్తి
                   శ్రీ దేవులపల్లి రామానుజరావు.

భారతీయ సాహిత్య సముద్రాన్ని 
ఆపోశనం పట్టిన 
అపర అగస్త్యుడు 
స్వర్గీయ డాక్టర్ పుట్టపర్తి 

నారాయణాచార్యులు 
మన దేశంలోని 
వివిధ భాషల రచనల సమాహారం 
భారతీయ సాహిత్యం అది 
అతి ప్రాచీనమైనది 
ఆధునికమైనది 
సుసంపన్నమైనది 
ఈ భారతీయ సాహిత్య స్వరూపాన్ని 
సమగ్రంగా సందర్శించిన 
కవి పండితుడు డాక్టర్ నారాయణాచార్యులు 

హిందీలోని తులసీదాసు రామాయణం 
ఆయనకు కంఠస్తం 
తెలుగు కన్నడముల చుట్టరికం 
ఆయనకు సుపరిచితం 
తమిళభాషలోని 
తిరుప్పావై మొదలైన దివ్య ప్రబంధాలు 
ఆయనకు కరతలామలకాలు 
మళయాళ సారస్వతం 
ఆయనకు సంపూర్ణంగా అవగాహనము 

ఇంకా మరికొన్ని దేశభాషల 
సాహిత్య సౌందర్యాన్ని 
ఆయన ప్రత్యక్షంగా సందర్శించినారు 
ఇంగ్లీషు సాహిత్యాన్ని సంపూర్ణంగా పరిశీలించి 
ఆ భాషలో రచనా శక్తిని ఆకళించుకున్నాడు 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ 
అన్న గేయానికి 
ఆయన చేసినది మనోజ్ఞమైన అనువాదం 

ఇంగ్లీషులో ఆయన వ్రాసిన 
"The Hero" అనే నాటకం 
సాహిత్య రసికులు 
తప్పక చదువవలసిన గ్రంధం 
అనేక భారతీయభాషల్లో పాండిత్యంతో పాటు రచనాశక్తిని కూడా ఆయన సముపార్జించినాడు 

సంస్కృతాంధ్రములలో 
ఆయన పాండిత్యం లోతైనది 
విశాలమైనది 
ఉభయభాషలలో 
ఆయన రచనావ్యాసంగం చేయగల 
శక్తిమంతుడు.
సంగీతంలో ఆయనకు కూలంకషమైన ప్రజ్ఞ 
ఇంతటి బహుముఖ ప్రతిభాస్మపద 
ఆధునిక భారతీయ సాహిత్యంలో 
మరి ఎవ్వరికి ఉన్నది..?


ఆధునిక భారతీయ కవులలో 
రవీంద్రుడు ప్రధమ గణ్యుడు. 
వ్యాసవాల్మీకుల కోవకు చెందినవాడు 
రవీంద్రుడని విజ్ఞుల ఉద్ఘాటన 
రవీంద్ర సాహిత్యం 
రవీంద్ర సంగీతం 
రవీంద్ర చిత్రకళ 
సుప్రసిధ్ధమైనవి 
రవీంద్రుడు కవి గాయకుడు చిత్రకారుడు 

అనేక దేశభాషలను అభ్యసించి 
వానిలో వైదుష్యం సంపాదించిన 
రాహుల్ సాంకృతాయన్ 
భారతీయ విద్యన్మణి మండలిలో దివ్యమణి 

ఆయన వలె 
బహుభాషా పాండిత్యాన్ని 
సంపాదించిన వారి సంఖ్య మిక్కిలి తక్కువ 

స్వర్గీయ ద్వారం వేంకటస్వామి నాయుడు 
సంగీత సాహిత్యాలలో మేటియని 
ఖ్యాతి గాంచిన హరికథా పితామహుడు 
గొప్ప వాగ్గేయకారుడు 

దేశభాషలతో పాటూ 
ఫారసీ మొదలైన భాషల్లో కూడ 
పాండిత్యాన్ని సంపాదించిన 
ప్రతిభావంతుడు 

నారాయణదాసు 
రవీంద్రుడు 
రాహుల్ సాంకృతాయన్ 
వరుసలో కూర్చుండదగిన కుశాగ్రబుధ్ధి నారాయణాచార్యులు 

భారతీయ సాహిత్యంలో 
ఈ ముగ్గురి కోవకు చెందిన మనీషి పుట్టపర్తి.

పుట్టపర్తి నారాయణాచార్యులు 
కవి ..పండితుడు.. విమర్శకుడు..
 సంగీత స్వరూపాన్ని 
సమగ్రంగా సందర్శించిన రసికుడు 
అనర్గళమైన వాగ్ధాటి కలిగిన వక్త. 
కళతో పాటూ శాస్త్రాన్ని కూడా 
చక్కగా అవగాహన చేసుకొని 
సమన్వయించగలిగిన విద్వద్వరేణ్యుడు 

పండితుడుగా భాషల హద్దులను దాటి 
వీరవిహారము చేసిన 
ప్రజ్ఞా సమన్వితుడు 

రాయనసీమలో కరువు వచ్చినప్పుడు 
అప్పటి ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ 
కడపకు వెళ్ళి 
ఆయనను చూచి 
సంభాషించి 
మీరు ఇక్కడ ఉండగా 
ఈ సీమలో కరువు వున్నప్పటికీ 
సాంస్కృతికమైన క్షామం లేదని 
చలోక్తి విసిరినారట. 

గోవింద వల్లభపంత్ ప్రభృతులు 
ఆయన శివతాండవం గానం చేయగా విని ముగ్ధులైనారట.

శివతాండవం 
కొన్ని నూర్ల కాదు 
వేల సభలలో గానం చేయగా 

మనదేశంలోని సాహితీపరులు ఆలకించి ముగ్ధులైనారన్న సత్యం 
అందరికీ తెలిసిందే 

మేఘదూతం 
జనప్రియ రామాయణం 
పండరీభాగవతం 
మొదలైన ఉద్గ్రంధాలు 
ఆయన తెలుగు సరస్వతికి 
సమర్పించిన మణిభూషణాలు 

అనేక సభలలో 
అనేక సాహిత్య ప్రసంగాలు చేసి 
మనదేశంలో సాహిత్య వేత్తలందరిచే 
అభినందనలు పొందిన 
ఆంధ్ర విద్వాంసుడు 
డాక్టర్ పుట్టపర్తి 

తెలుగు కన్నడ భాషల 
సన్నిహిత సంబంధాలను గూర్చి 
ఆయన ప్రామాణికమైన ఉపన్యాసాలు చేసినారు 
ప్రాకృత కవులను గూర్చి
ఆయన చేసిన ప్రసంగాలు 
తెలుగులో విమర్శనా వాజ్మ యానికి అలంకారాలు 

సంస్కృతంతో పాటూ 
ప్రాకృతములో 
ఆయనది నిష్ణాతమైన పాండిత్యం 

ప్రాకృత భాషలో వైదుష్యం కల 
కొద్దిమందిలో 
ఆయన ప్రముఖుడు 

పోతన కవిత్వం మీద 
అధికారపూర్వకమైన ప్రసంగాలు 
ఆయన గావించినారు 

తెలుగులో పదకవితను గూర్చి 
ఆయన చేసిన ప్రసంగం 
అందులోనూ తాళ్ళపాక కవులను గూర్చిన 
ఆయన ఉపన్యాసం ..
క్షేత్రయ్య ..త్యాగరాజు.. రామదాసు..
 వంటి వాగ్గేయకారుల వాజ్మ యానికి 
ఆయన చేసిన వ్యాఖ్యానాలు 
సాటిలేని వని చెబితే 
సత్యోక్తి మాత్రమే..
అతిశయోక్తి కాదు...!!

వసుచరిత్ర 
ఆముక్త మాల్యద వంటి ప్రబంధాలను గూర్చి మహోపన్యాసాలు చేసిన మనీషి 

ఆయన 
కవిత్వము.. సాహిత్య విమర్శ ..
సవ్యసాచి వలె సాధించిన 
ప్రతిభావంతుడు ఆయన
 
తెలుగులోనే కాదు 
అనేక దేశభాషలలో 
సమగ్రమైన పాండిత్యంతో పాటు 
రచనాశక్తి గలిగిన ప్రజ్ఞాధురీణుడు 
పుట్టపర్తి నారాయణాచార్యులు 

నిస్సందేహంగా 
అసాధారణమైన ప్రతిభ ఆయనది 
ఆయనరచనలు శతాధికాలు 
కొన్ని ముద్రితాలు 
కొన్ని అముద్రితాలు 
అముద్రితాలు వెలుగు చూడవలసిన 
కృషి జరుగవలెను 

తుదివరకు 
సాహిత్య తపస్సులోనే నిమగ్నుడై 
శారదాదేవి ఆరాధనలో కన్నులు మూసిన 
కవి వరేణ్యుడు పుట్టపర్తి 

ఆయన అస్తమయంతో 
సాహితీప్రపంచంలో సూర్యాస్తమయం జరిగి తాత్కాలికమైన చీకటి ఆవరించింది 
మళ్ళీ అంతటి 
బహుభాషా కోవిదుడు 
విద్వాంసుడు 
సంగీత సాహిత్యాలలో 
సమానమైన ప్రతిభావంతుడు 
ఉదయించుట ఎప్పుడో గదా..??

నారాయణాచార్యుల వారితో 
నాకు నలభై సంవత్సరాల పరిచయం 
ఆ పరిచయం క్రమక్రమంగా 
ఆత్మీయతగా పరిణమించింది 

నా పట్ల 
అపారమైన అభిమానం కలిగినవారు
ఆచార్యులవారు 

హైదరాబాదుకు వచ్చినప్పుడు 
నాకు కొన్ని గంటల సహవాసము 
సంభాషణావకాశాన్ని కలిగించేవారు. 

నా యోగ్యతకన్న 
ఆయన ఆర్ద్రహృదయము సౌజన్యము 
ఇందుకు కారణము 

మిత్రుల పట్ల ప్రేమ 
వ్యతిరేకులపట్ల 
ముఖ్యంగా వాదోపవాదాలలో 
ప్రతివాది భయంకర స్వరూపం 
ఆయన ప్రదర్శించేవారు 

వేదికలమీద మాట్లాడుతున్నప్పుడు 
రెచ్చగొడితే 
త్రివిక్రమ స్వరూపం చూపించేవారు 

సాహిత్య సాంస్కృతికరంగాలలో 
భిన్న శక్తుల కలయిక 
ఆయనలో మూర్తీభవించి వుండేవి. 

సాధారణంగా 
ఒకచోట ఇమడని భిన్న ప్రతిభలు 
ఆయన వ్యక్తిత్వంలో 
సరస సమ్మేళనం పొందినవి 

నారాయణాచార్యులవంటి 
మహాపండితుని 
మహాకవిని 
మహావక్తను 
గొప్ప విజ్ఞానిని 
అత్యంత ప్రతిభావంతుని 
మళ్ళీ చూడగలనా ..??
 
గడచిన ఇరవై సంవత్సరాలలో 
వారు రచించి ప్రకటించిన ఉద్గ్రంధాల పీఠికలలో 
నన్ను గూర్చి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు 

అందుకు వారి సౌజన్యమే ప్రధాన కారణం
ఆంధ్ర సారస్వత పరిషత్తుతో 
వారికి సన్నిహిత సంబంధాలుండేవి 
వారిని మాలో ఒకరిగా భావించినాము 

1953 లో ఆలంపూరులో 
జరిగిన సభలకు వారు వచ్చి 
మూడు రోజులు మాతో గడిపి 
తెలుగు కన్నడముల చుట్టరికాన్ని గూర్చి 
మంచి ప్రసంగం చేసినారు 

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ మొదటివారంలో 
సారస్వత పరిషత్తు నిర్వహించిన 
పోతన వారోత్సవలలో 
పోతన కవిత్వాన్ని గూర్చి 
మేలైన ఉపన్యాసాలు రెండు చేసినారు 

పరిషత్తు రజతోత్సవాలలో వారు పాల్గొని 
తెలుగులో పదకవితను గూ ర్చి 
మూడురోజులు జరిగిన సాహిత్య సభలకు 
అధ్యక్షత వహించి 
అన్నమాచార్యులమీద 
అధికారికమైన ఉపన్యాసం చేసినారు 

పరిషత్తు ఏ  పండుగ చేసుకున్నా 
నారాయణాచార్యులు గారు ఉండవలసిందే 
నిజానికి 
అత్యంత ప్రతిభావంతులై 
బహుభాషాపారంగతులై న 
డాక్టర్ పుట్టపర్తి 
నారాయణాచార్యులుగారు 
ఆంధ్రసారస్వతపరిషత్తుకు 
ఆస్థాన విద్వాంసులు 

వారు 
పరమపదించడం
సారస్వత పరిషత్తుకు తీరని లోటు 
నా పక్షాన 
సారస్వత పరిషత్తు పక్షాన 
పుట్టపర్తికి శ్ర ధ్ధాంజలి