7 మే, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు-పందికొక్కులను చంపితే ఉబ్బసం ఖాయమా..పుట్టపర్తి అనూరాధ.


  
గురజాడ..
తన విమర్శనా దృష్టిని ఉపయోగించి ..
పరీక్షలలో ..
స్వంతంగా సమాధానాలు వ్రాసేవారు. 
ఇలాంటి విశృంఖలత్వం ప్రదర్శించడంవలన..
BA పరీక్ష ఫెయిల్ అయ్యారు.
 
మిత్రుడు బాధగా..
ఇంత చురుకైనవాడివి ..
నీవు ఫెయిలవడమేమిటి..?? అన్నాడు.
అవును ..
చురుకుపాలు ఎక్కువయ్యే ..ఫెయిలయ్యాను 
అన్నారు.
 
కవులు హాలికులైన నేమి ..??
అని పోతనగారంటే..
 ఆల్కహాలికులైననేమి ..??
అన్నారు శ్రీశ్రీ గారు 
 
ఇలా ..
కవుల జీవితంలో..
చమత్కారం భలే చమత్కారంగా  వుంటుంది..!! 
 
అయ్యలోనూ హాస్యం పాలు ఎక్కువే..
 
సాహిత్యం పక్కనపెడితే ..
తన తోటివారితో తమాషా గా వుండేవారు. ప్రతిమాటలోనూ ..
ఏదో ఒక శ్లేషను తీసి ..
నలుగురికీ చెప్పి ఆనందించేవారు..!!
 
1980 లలో
కడపలోని శ్రీరామకృష్ణ సమాజంలో ..
వావికొలను సుబ్బారావుగారి జయంతి సభను..
జిల్లా రచయితల సంఘం ఏర్పాటుచేసింది. 

తిరుపతి 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాల అధ్యాపకులు 
శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు..

వక్తగా వచ్చారు..
 
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు అధ్యక్షులు.

రామసుబ్బ శర్మ గారికీ ..
అయ్యకు ..
చాలా ఏళ్ళ పరిచయం ..
అంతకు మించిన అనుబంధం ..
రామసుబ్బశర్మ గారికి బంధుప్రీతి జాస్తి. 
అయ్యన్నా వల్లమాలిన అభిమానం ..

అందుకే ..
అయ్య పోయారని తెలియగానే ..
చాలా దిగులుపడ్డారాయన ..
తర్వాత కొన్నాళ్ళకే ..
ఆయన అయ్యను అనుసరించారు..!!
 
అక్కయ్య 
తెలుగు MA పరీక్షలకూ.. వాటికీ.. 
వారింటికి వెళ్ళి వుండేది..!!
 
ఆయన నన్ను పోట్ల గిత్తా ..అనేవారు.
పదవే.. మీ అత్తకు ఒళ్ళు బాగలేదు. 
రా ..తిరుపతి పోదాం.. అనేవారు.
వావికొలను వారి పై ..
రామసుబ్బ శర్మ గారి ప్రసంగం ..
చాలా ఆసక్తి దాయకంగా సాగింది.
రామసుబ్బ శర్మ గారు కూడా మంచి చతురులే..
ప్రసంగాన్ని ముగించబోతూ ఆయన ..
వావికొలను వారు..
వార్థక్యంలో ఉబ్బసంవ్యాధితో బాధపడ్డారని..
అది కర్మ ఫలంగా వచ్చిందని..

గతజన్మలో ..
పందికొక్కును చంపిన పాపానికి..
ఆయనలా బాధపడ్డారనీ..
అన్నారు.
ఈ సందర్భంలో ఒక శ్లోకమూ ప్రస్తావించారు.
 
సభ బిత్తరపోయిందో నిమిషం.
యే పాపం చేస్తే ..
వచ్చే జన్మలో ..
ఎలా బాధపడవలసి వస్తుందో ..?
ఇప్పుడనుభవిస్తున్న బాధలకు ..
గత జన్మలోని తాము చేసిన ..
యే పాపాలు కారణాలో..
 ఆలోచిస్తుండిపోయారందరూ..
 
ఇంతలో ..
పుట్టపర్తి వారు లేచారు..
రామసుబ్బాయ్యా..
నీ మాట వింటుంటే ..గుబులౌతావుందయ్యా ..!!
 
చాలా సంవత్సరాలనుంచీ..
మా ఇంట్లో పందికొక్కుల బాధ వుంది. 
ఇంకే వస్తువు నష్టమైనా భరిస్తాను కానీ ..
పుస్తకాలు పాడైతే తట్టుకోలేను..!!

 ఏం చేసేది ..??
వారానికి ఒకటి రెండు పందికొక్కులనైనా..
చంపక తప్పటం లేదు. .!!
ఆ కర్మ ఫలంగా..
 నేనెన్ని జన్మలెత్తి ..
ఉబ్బసం బాధను అనుభవించాల్నో..!!
అన్నారు.

అంతే..
సభ నవ్వులతో గల గలమంది ఒక్కసారిగా..
 
నిజానికి  ..
సద్యః స్ఫూర్తితో చేసిన ..
ఈ ఎదురు దాడిలో ..
హేతువాదముంది...!!

ఆయన శ్రీ వైష్ణవ అభ్యుదయ వాది. 
ఆ సరస్వతీ పుత్రుని..
ఇరవై ఒకటో వర్ధంతి సందర్భంగా ..
స్మరించుకుందాం ..
అని..
కట్టా నరసిం హులు గారు 
సాక్షి దినపత్రిక 1.9.2011 లో వ్రాసారు.