'బాబూ నీకెవరిష్టం?'
'సచిన్ టెండూల్కర్'
అంటాడబ్బాయి
కొద్ది రోజులు బ్యాటూ బాలూ పట్టుకుని ఆడతాడు
పెద్దయ్యాక యే క్లర్కో ఇంజనీరో
'నాకు యంటీఆర్ ఇష్టం
ఆయన సినిమాలు ముఫై సార్లకు పైగా చూసేవాణ్ణి'
అంటూంటారు చాలామంది
తర్వాత నటన చాయలకు కూడ పోకుండా
జీవితం వెళ్ళ దీస్తారు
కానీ కొందరుంటారు..
వాళ్ళ ఇష్టం వారి జీవితాన్ని నడిపిస్తుంది
చూపులు పక్కకు తిప్పనివ్వదు
అన్ని జీవిత ప్రాధాన్యతలూ దాని తరువాతే..
అగ్నియై కాల్చేస్తుంది వాళ్ళని
వాళ్ళే భ్రమర కీట న్యాయానికి నిలుస్తారు
భ్రమరం కీటకాన్ని తనగూట్లో తెచ్చి ఉంచి
దానిచుట్టూ ఝుం... అంటూ
తిరుగుతూ..తిరుగుతూ.. తిరుగుతూ
మొదట భయంగా .. తర్వాత తదేకంగా..
తర్వాత యేకాగ్రతగా ..
తర్వాత తన్ను మరచి.. మరచి .. మరచి .. చూసి..చూసి..
చివరకు కొద్ది రోజులకు
తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం..
ఇదే భ్రమర కీటన్యాయం..
అదే తపస్సు..
అదే అహం బ్రహ్మస్మి..
భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు..
దాన్ని అద్భుతంగా ప్రతిపాదించేదే
పుట్టపర్తి అష్టాక్షరీ కృతి
'' నీవనుచు నీవైతినే పరమాత్మ
నినుజూచి నీవైతినే..''
భక్తుడు పరమాత్మను ఎల్లవేళలా పాడుచు పొగడుచు.. గుణకీర్తనం చేయుచు
తాను అతనై పోవటం ఉపాసన
మరి భ్రమర కీట న్యాయంలో పుట్టపర్తీ ఒక భ్రమరమైన వారే కదా..
మరి వారేం చెబుతారు ..
పోతన్న జీవితమును
రామో పాసనతో నారంభించుట మనయదృష్టము
ఉపాసన యనగా
దాను నమ్మె రామునినో కృష్ణునినో పాడుచు పొగడుచు నాతని దివ్య చరిత్రములను వినుచు జూచుచుండుటయేకదా
అట్లు సేయుటలో
నా యుపాసనా మూర్తి యొక్క
గుణములు అభిరుచులు భక్తున కత్యంత ప్రియములై కొంత కాలమునకు వని స్వభావము గూడ నట్లే మారుటయు గలదని పెద్దలందురు
ఆ భావములు ప్రచండముగ నెదిగినప్పుడు
రూపురేకలు గూడ నట్లే యగునట
భ్రమర కీటక న్యాయమిదే
యీ విషయములు మన యూహ కందవు గాని
హనుమంతుని దీవ్రముగ భావించిన వాళ్ళలో
రా మకృష్ణ పరమహంసకు
తిన్నని తోక యొకటి బయలుదేరినదట.
రాధాదేవి ధ్యానమునందు నిమగ్నుడైన
చైతన్య ప్రభువునకు దాను మగ వాడనుట
యెప్పుడో దప్ప జ్ఞాపక మొచ్చెడిది కాదట..
రెండవదేమో గాని
మొదటి విషయము మాత్రము
పిల్లలకందరికనుభవములో నున్నదే
తోకలేకయే హనుమంతులగుదురు.
కొన్ని వేళలలో పెద్దలము గూడ..