ఆత్మకు సంకల్పము గల్గును
అప్పుడది మనస్సునుద్బోధించును
ఆ మనస్సు నాభియందున్న అగ్నిని గొట్టును
అగ్ని వాయువును ప్రేరేపించును
యీ కార్యతంత్రమే నాదమునకు పురుడు దీర్చుట..
బ్రహ్మగ్రంధి నుందీ బయలుదేరిన నాదము నాభిహృత్కంఠరస నసాదులకెక్కి వ్యక్తమగుచున్నది
అది నాభి యందలి సూక్ష్మము
హృదయమందీషద్వ్యక్తము
కంఠమున బూర్ణరూపముతో నుండును
మూర్ధమందపూర్ణము
ముఖమునందు కృత్రిమమనుట
నాదము మరల రెండు రీతులు
అనాహత నాదమొకటి
ఏకాగ్రమైన మనస్సులకే ఇది సాధ్యము
కనుక దీనిని గురూపదిష్ట మార్గమున మహర్షులుపాసింతురు
ఆహతము మనుష్యులకు దక్కినది
ఇది లోకరంజకము భవభంజకము
నాదమొక మహాసముద్రము
దాని యుపాసనయు మహాయోగము
జన్మమంతయు పలు రీతుల రాగ ప్రస్తారము జూపి..విసివి
కడకు
నాదసాగరమున శిరోదఘ్నముగ మునిగిన నాదయోగులను నేనెరుగుదును
బిడారం కిష్టప్ప గారివంటి వారు
అక్కడ లోకాపేక్ష తక్కువ
వింత వింత స్వరపంపకముల కుస్తీలు లేవు
మెదడు నొప్పిబుట్టించు తాళముల ఖత్తులేదు
ఆ స్వరపంపకము చక్కని రాజమార్గము
వారు వాడు తాళములేడెనిమిది మించిలేవు
ఆకారముల హావళి
హెచ్చు గడల హేషారవము
ముక్తాయింపుల కోలహలము
యేదియు వుండదు
వీనియన్నింటికిని నాదముతో నాలుమగల యొద్దిక
ప్రత్యేకముగ
దమ మొగము జూపించుటకే సిగ్గు
కాని
యీ యనుభూతిని పంచుకొనుటకల్ప సంస్కారము చాలదు...
(వాగ్గేయకారులు పదకృతి సాహిత్యం నుంచీ.. )