4 డిసెం, 2013

అయ్యో పాపమీ జీవి కెందుకింత వేధ


పుట్టపర్తి వారొక సంగీత కచ్చేరి కెళ్ళారు
రస భావాశ్రితమైన సంగీతం కోసం వెదికారు
సంత బజారు ఘోష కానవచ్చింది
'ఉల్లిపాయలలో మల్లెవాసన'లా 
కడపట కూర్చున్నారు కాబట్టి
'బ్రతుకు జీవుడా..'
అని బయటపడ్డారు..

అది తామస సంగీతము
త్యాగయ్య జన్మమంతా ఉపాసించింది 
సాత్విక సంగీతాన్నే
తరువాత బయలు దేరిన విద్వాంసులు 
దానిని కష్టపడి తామసమున కీడ్చారు..
'త్యాగరాజీ యుధ్ధము లెరుగనే యెరుగడే ..'
అని విస్తుపొయ్యారు..

విలంబ కాలంలోని సాహిత్యాన్ని 
మధ్య కాలంలోనికి తెచ్చే సాహసానికి కూడా ఆయనెన్నడూ పూనుకోలేదు

ఇంతకూ..
 ఆ పాటగాడెంచుకున్నది  
ఒక సంకీర్ణ జాతి ధృవతాళము
తలనొప్పికదిచాలు
ఇక వెర్రి మొర్రి ప్రస్తారములు గూడ
ఆ కోలాహలములో గాయకుని మనసునకు 

రస భావములవైపు చూచు తీరికేలేదు
 

'ఎన్నుకొన్న తాళమెక్కడతప్పునో' అని 
వంటినిండా చెమట
తొడలతోలెగిరి పోవునట్లా తాళము 

వాని ప్రాణము తీయుచుండెను
 

ఆరంభములోనే స్వరములకు పద చ్యు తి
అవి 

బహుకాలము ఎండలో నెండిన వరుగులు
వానినాతడు 

అప్పుడప్పుడు చప్పరించునే యుండును.
 

ఇక అతని సాహిత్యము 
'రావణునకు చిక్కిన రంభ..'

'నగుమోము గనలేని' కృతియది
ఆ సంగతుల రభసలో 

భేతాళుని మూతివలెనున్న రాముని మొగమును
మాపై విసరివేసెను
ఇక 'ఖగరాజు' వచ్చు వేళకు
తాళములను పక్కలకు విసరివేయుచున్న 

సంగీత జ్ఞులు 
'నేనేమి తక్కువ తిన్నానా..'
 అని విజృభించిన ఫిడేలు..
పుట్టపర్తి హాస్య చమత్కృతికి
వ్యంగ్య విన్యాసానికీ
ఇదొక మచ్చుతునక
 నాదము యొక్క బహురూపముల రాగమనిపేరు
అనంతావైరాగారి రాగములకు లెక్కలేదు
ప్రస్తారముతో ఛందస్సులవలె
చమత్కారములతో నలంకారములవలె
శాస్త్రము బెరుగుకొలదియు వీని సంఖ్య బెరిగినది.
 

సమర్థులైనవారు వ్యాప్తికి దెచ్చి 
చక్కగ నిర్వహించిన రాగములును లేకపోలేదు
'గురుగుహ' ముద్రలో కృతులు రచించిన 

సంగీత త్రిమూర్తులలో నొకరగు
ముత్తుస్వామి దీక్షితులు ప్రసిధ్ధులుగదా
 

వీరి తండ్రి రామస్వామి దీక్షితులు
హంసధ్వని రాగమునకు 

రూపురేఖలేర్పరచినది వీరేనందురు
 

కానీ నేడు చాలామంది 
యేవేవో వింత వింత రాగములను బాడుటకు బాధపడుచున్నారు
ఉన్నరాగములు వారి భావ సృష్టికి చాలనట్లు
వారు పాడురాగములకు వారు వేయు కల్పనా స్వరముల నోర్చుకొనునంత కడుపైన ఉండదు.
 

పైగా శతమానము వక్రగతులు
పులిమీద పుట్రయన్నట్లు
ఉత్తరాదివారినుండి యెరువుదెచ్చుకున్న 

వింత వింత బాణీలు
 

అది యట్లుండె..
అఖండమైన కాలమును ఖండములొనర్చి 

యెచ్చు తక్కువలు లేకుండ నికరముగ జోడించి తనియుటకే 'తాళ'మని పేరు
 

'నాదము'కూడనఖండమైనదే..
దానిని వేర్వేరు సరళరేఖలుగా దీర్చి జోడించినప్పుడు ముచ్చటయైన సౌందర్యమేర్పడును
 

దానిని గ్రహించి 
దానివెంట మనము నడచి
లయానందమనుభవింతుము
 

రాగతాళములు పరస్పర మొదిగినప్పుడు మనస్సునకనితరవేద్యమగు నానందము కలుగును
సంవాదమునకానందపడుట 

మనస్సునకు సహజధర్మముగనుక

భావముయొక్క క్రమపుష్టిలేనిది రాగముకాదు
ఒకవేళ యైనను అది సర్కసూఅని, సంగీతముగాలేదు
ఆధార షడ్జమును చక్కగా నంటిపెట్టుకుని స్వరములను వాని వాని స్థానములలో 

శుధ్ధముగ పలికించుటయే శృతిలయము
 

శృతిలయము లేని పాట 
సమ్మతిలేని మాటవంటిది
భావరాగములను ధిక్కరించి రాగమధికారమునెరపుట బీదబలిసి బందెకాడగుట
'అయ్యో ఇది దురాక్రమణకదా '

అని మనసులో బాధ
 

శృతిలయమొకవేళ యభ్యాసముతో సిధ్ధించినను
భావలయము మాత్రము తపః స్సాధ్యము 

  కొందరికి శృతిలయముగూడనుండదు.
 

కర్ణాటక గాయకులలో 
యీ దౌర్బల్యమెక్కువ
కచేరీయంతయు 

శృతిలో గాత్రము సరిగా నదుకక సకిలింతలతో అపస్వరపుమూటలైన గాయకులని నేనెరుగుదును.
 

అట్టివారికి 
సంఖ్యాప్రదానమిన తాళమేముఖ్యము
వింత వింత లెక్కలని ప్రస్తరించుటలో
గ్రామకరణములకు వీరికి భేదములేదు
 

మొదటనే 
యే సంకీర్ణజాతి ధృవతాళమునో యేరికొందురు
తలనొప్పికది చాలును
 

అందులో వెర్రిమొర్రి ప్రస్తారములకు 
అమృతాంజనము ఖర్చు.
 

ఈ కోలాహలములో గాయకుని మనస్సునకు రసభావములవైపుకు జూచుటకు తీరికేదీ..

ఎన్నుకున్న తాళమెక్కడ తప్పునోయని..

యెంటినిండ చెమట
నడుమ నడుమ మార్చు జాతులకెన్ని వర్ణములో
ముఖమున నన్ని సొట్టలు..
ఆ వైభవము "క్రాంతం క్రతుంచాక్షుషము" గావుండును.
 

తొడలతోలెగిరిపోవునట్లాతడు మర్దించుటజూచి
'అయ్యో పాపమీ జీవికెందుకింత వేధ..'
యని మనము జాలిపడవలసివచ్చును
 

చాలని దానికి తాళముతో సాహిత్యమునీడ్చుటకై అవసరమున్నను లేకున్నను
'ఉ ఊ..ఎ ఏ.. 'ల కోలాహలము
 

స్వరములకు పదచ్యుతి ప్రారంభములోనే జరుగును
వానిని గాయకుడు బహుకాలమెండలో ఎండిన వరుగులవలె చప్పరించుచుండును.
 

ఇక సాహిత్యమా..
అది రావణునకు జిక్కిన  రంభ..
 

ఒకసారి యొక గాయకుడు ప్రసిధ్ధుడే.. 
పాడుచున్నాడు
ముందొక పెద్ద బోర్డు

'ఇక్కడ సంగీతమమ్మబడును' అన్నట్లున్నది
లోపలగూర్చున్నాను
 

'నగుమోము గనలేని'
అను త్యాగయ్యగారి కృతినెత్తికొన్నాడు

'అభేరి' రాగమే మృదువైనది
అయ్యగారి సాహిత్యమంతకన్నను మృదువుగానున్నది
మనస్సును నీరుగా నొనర్చు నా రచన యీ క్రిందిది
               

         అభేరి ఆదితాళము
నగుమోము గనలేని నా జాలిదెలిసి
నను బ్రోవగరాదా శ్రీ రఘువర  నీ
 

నగరాజ ధర నీదు పరివారమెల్ల
ఒగిబోధలు సేసేవారలు గాదే అటులుండుదురే
నీ


ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదో
గగనానికిలకూ బహుదూరంబనినాడో
 

జగమేలే పరమాత్మ యెవరితో మొరలిడుదూ
వగజూపకుతాళనునన్నేలుకోరా త్యాగరాజనుత
 
నీ


రాగమును పక్కనబెట్టి వచనముగా జదివికొన్ననూ
పదముల యొద్దిక యెంతయో బాగున్నది
 

సంయుక్తా క్షరములకును 
సంగీతమునకును వైరము
 

'నగరాజ ధర.. 'యనుటలో 
ధరగోవర్ధనమునెత్తుటలోని 
పరిశ్రమమును సూచించుచున్నది
 

పరమాత్ముడు బరువైనవాడు.. గొప్పవాడు..
సాహిత్యము సర్వాంగ సుందరమైనది..
చతురశ్రగతితో హాయిగా నడచు నాదితాళము..
విలంబకాలములో పాడి..

 రసము తాననుభవించి.. ఇతరులననుభవింపజేయుటకెంతయో యవకాశమున్న కృతి
 

ఆ పండితుడు మొదటనే 
ధృతగతితో నారంభించి ..సంగతుల రభసలో
'భేతాళుని మూతి' వలెనున్న 

రాముని మొగమును మాపై విసరివేసెను
 

'ఖగరాజు'  వచ్చు వేళకు
'మురళి ..భంజళి 'మొదలైన యొక్కటే 

గుర్రముల నడకలు..
 

సభలో నున్న సంగీతజ్ఞుల రొద..
వారు శక్త్యానుసారముగ తాళములను  

దిక్కులకు విసరి వేయుచుండిరి..

'నేనేమి తక్కువ తిన్నానని..'
ఫిడేలు వాద్యము విజృంభించినది.
మర్దల ధ్వనుల ఢమఢమలు..
ఒక్కటే సంత బజారు వంటి ఘోష..
'ఇక్కడ రస భావాశృతమైన సంగీతమేదీ..?'

 అని వెదకితిని
 

'ఉల్లిపాయలలో ..మల్లెవాసనలా'
కడపట గూర్చొని యుంటిని గనుక ..
'బ్రతుకు జీవుడా ' యని బైటపడినాను
ఇదే 'తామస' సంగీతము
 

త్యాగయ్యగారు 
జన్మమంతయు నుపాసించిన 'సాత్విక సంగీతము'ను
గాయకుడు కష్టపడి తామసమున కీడ్చెను
 

త్యాగరాజీ యుధ్ధములెరుగనే యెరుగడు
విలంబకాలములో నున్న సాహిత్యమునకు 

మధ్య కాలమును జోడించు స్వాతంత్ర్యము గూడ నాతడరుదుగా తప్ప నవలంబింపలేదు