పుట్టపర్తి విజ్ఞాన సంపన్నులు ..
అనేక భాషలు నేర్చా రు ..
అనేక పుస్తకాలూ వ్రాసారు ..
అంతేకాదు
ఎంత రాసారో అంతకు వంద వంతులు చదివారు ..
ఆకాలంలో కేవలం పుస్తకాలు కొనటా నికే
మద్రాసు వెళ్లేవార ట ..
బస్సులో పుస్తకం చదువుతూ చదువుతూ
జేబులో డబ్బు ఏ దొంగ తీసినా తెలియనంత మమేకమై
పోయేంత పుస్తక ప్రియులు ..
మా అమ్మ ఒక బనియన్ కుట్టింది .
ముందు జేబు వుండేలా ..
దాన్ని దొంగల బనియను అనేవాళ్ళం ..
NTR గార్డెన్స్ లో బుక్ ఫెయిర్ జరుగుతూంది.
మా అయ్య పుస్తకాలు అక్కడ వెలిసాయి.
చాలా మంది సందర్శిస్తున్నారు.
భావాలు పంచుకుంటున్నారు.
ఈ సందర్భంగా
కడప జిల్లా రచయితల సంఘం సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం ఇస్తూ.. పుట్టపర్తి ఇచ్చిన సందేశం.
ఈనాడు హైదరాబాద్ లో
బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంలో
ఆనాటి వారి భావాలను పొందుపరుస్తున్నాను.
ఆశ్చర్యమేమంటే ..
ఆనాటి వారి భావాలు ఈనాటికీ వర్తిస్తుండటం..
అంతేకాదు..
ఈనాటికీ అవి అత్యంతావశ్యమకమై వుండటం
ఎందుకంటే పరిస్థితులు
ఆనాటికంటె ఈనాడు సాంఘీకంగా రాజకీయంగా
దిగజారి ఉన్నాయి కాబట్టి..
చదవండి..
''ఆంగ్లము నుండి మనము ఇంకను అనేక పుస్తకము లను భాషాంతీకరించుకోవలసి వున్నది.
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు.
ఏ విజ్ఞానము కావలసియున్నను
మనము ఇంగ్లీషులోనికి పోవలసినదే..
హిందీ యభివృధ్ధి కూడనంతంతయే యున్నది.
మన దేశంలో అనేక భాషలున్నవి.
మనకు దగ్గరగానున్న భాషలు ఒక్కదానినైనను నేర్చుకొనుటమంచిది.
అప్పుడీ భాషా భేషజములెన్నియో తగ్గును.
''నీవు చెప్పిన సలహాలన్నియు బాగుగనే యున్నవి.
ఈ పనులు చేయుటకు ధనమెక్కడనుంచి వచ్చును ? ''
ప్రశ్న బాగుగనే ఉన్నది..
ఉత్తరము గూడ సులభమే.
ప్రభుత్వమునకు తక్కిన పనులకు ధనమెక్కడినుంచి వచ్చునో ఇదియును అక్కడనుండియే రావలయును. ఉన్నధనమంతయు దీనికే దోచిపెట్టమని
నేను చెప్పుటలేదు.
పెట్టగూడదు గూడ.
కాని ఇదియు కూడ చేయవలసిన పనియేయని ప్రభుత్వము యొక్క దివ్య చిత్తమునకు వచ్చిన చాలును. ఎలక్షన్లకు కోట్ల కొలది వెచ్చించి
ప్రజలకు ఎన్ని దురభ్యాసములు నేర్పుచున్నారో మీరెరుగనిది కాదు.
ఈ సందర్భములో రాజకీయవాదులకు
ఒక చిన్న సలహా..
వారు విందురో విన రో.. నాకు తెలియదు..
కాని మనము చెప్పవలెను గదా..
వారు కొంత చదువుకొనిన బాగుగా నుండునని
నా విన్నపము.
కళాకారులను మనుష్యులుగా గుర్తింపవలెనని నా విన్నపము. కాలమున నిలుచునవి రాజకీయములు కావు. విజ్ఞానమే..! కళలే.. !
పూర్వమిట్లుండలేదు.
ఆనాడు రాజులూ రౌతులూ
తమకున్నంతలో కళలనెంతయో పోషించినారు. రెడ్డిరాజులు సాహిత్యాదులకు చేసినసేవ సామాన్యమైనది కాదు.
ప్రభుత్వమే గాదు ప్రజలు గూడ
విజ్ఞాన విషయమై తమ ధనమును
కొంత ఖర్చు పెట్టవలసియున్నది.
వెర్రి వేడుకలకు .. త్రాగుడు మొదలగు దురభ్యాసములకు లెక్కలేనంత ఖర్చు పెట్టెదరు.
సాహిత్యజ్ఞునకు కళాకారునకు ఒక బొట్టునివ్వరు.
పూర్వమెన్ని విద్యలనో ప్రజలు పోషించినారు.
తోలు బొమ్మలవాండ్లు, పగటివేషగాండ్లు.
బుడు బుడక్కలవాండ్లు, బయలు నాటకం వారు నట్టుకాండ్రు, వీరందరూ ప్రజాభిమానులపై బ్రతికినవారు.
పొరుగున నున్న రష్యా..
ఏ చిన్న కళనైనను చావనివ్వక రక్షించుకొనుచున్నది. ఆయా కళలలో పరిశోధనా భాగములే యేర్పరచినారు. మనకా దృష్టిలేదు.
ఇది నేను ప్రజలకు ప్రభుత్వమునకు కూడ ఇచ్చు సలహా మహాజనులారా ..
ఇవి నాకున్న భావములు ..
వానిని మీముందుంచినాను.
ఆ భావములు మీకు సరిపోకపోవచ్చు.
మీరు వివేకవంతులు
ఆలోచించుకొనగలిగినవారు ..
నాకు మీరే ప్రమాణము.. ''