12 సెప్టెం, 2012

సత్యభామ

సత్యభామ
ఆ పేరులోనే ఓ గమ్మత్తుంది
అందమైన ఆభిజాత్యం ..ఆత్మవిశ్వాసం ..
పెంకెతనం ..అసూయ..
వెరసి సత్యభామ కదూ ..

అందరు పత్ను లున్నా 
తనదే పై చేయిగా 
కృష్ణుని తన కనుసన్నలలో పెట్టుకున్న 
నెరజాణ సత్యభామ 

ఒకసారి నడివీధిలో 
భర్తను అమ్మకానికి పెట్టింది
ఇంత జరిగినా కృష్ణుడు 

సత్యా ..సత్యా ..అని ఆమె వెంటబడ్డాడు తప్ప
రుక్మిణి తులసీ దళం పట్టుకు నిలబడినా 
కేర్ చేయలేదు

సత్యదేవికి 
అలకలూ సాధింపులూ ఎక్కువ..
ఒకసారి నారదుడు పారిజాత పుష్పాన్ని తెచ్చి
రుక్మిణి వద్ద కృష్ణుడుండగా ఇచ్చాడు..

ఆయన పేరే కలహ భోజనుండు
అందరికీ కయ్యాలు పెట్టి ఆనందిస్తాడు
చివరికి కన్నయ్యనూ ఇరికించి 
తమాషా చూసాడు..

తప్పేది లేక 
కృష్ణుడా పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడు
ఆ విషయం తెలుసుకున్న సత్య 
ఊరికే వుంటుందా..

"వ్రేటు వడ్డ ఉరగాంగన యుం బలె, 

నేయి వోయ భగ్గన దరికొన్న 
భీషణ హుతాశన కీల యనంగ.." 
లేచిం ది ..
అయినా కోపగృహంలో పాదాలు వత్తి 
తన్నించుకునీ  ఆమె అలక తీర్చాడు  కృష్ణయ్య 
పారిజాత వృక్షాన్ని 
ఆమె పెరటిలో తెచ్చి పెట్టే దాక నిద్ర పోలేదు 
ఎందుకలా..?

అష్ట పత్నులూ గోపికలు ఎవరికీ దక్కని ప్రేమ 
ఆ సత్య భామ కెందుకు కలిగింది.
ఎందరో ఋషులు 
వేల సంవత్సరాలనుంచి కఠోరంగా తపించినా 
దొరకని ఆ దొంగ 
 సత్యభామకే ఎందు కు వశుడయ్యాడు ..?

అంతే కాదు 
నరకా సురునితో యుద్దా నికి వెళుతుంటే వెంటబడి 
కృష్ణుని వింటి తో యుద్ధం చేసి
అందానికి శౌర్యం అద్ది కృష్ణుని అబ్బుర పరచింది
 

పద్మ పురాణంలో పరమాత్మ 
కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ 
గతజన్మలో గుణవతి 
కార్తీక మాస వ్రతాన్ని నిష్ఠ గా చే య డం వలననే 
సత్యభామగా జన్మించిం దని చెప్పాడు

సత్యాపతి గా ..
భార్యా విధే యునిగా  ..
ఇంత వశుడవడం ..
 భక్తపరాధీనత కు పరాకాష్ట 

ఇది ..
"నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్క బూని తా
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
నని యెద నల్క మానవు గదా యికనైన నరాళ కుంతలా !!" పుట్టపర్తి వారి ప్రబంధనాయికలలోనిది
ఈ సత్యభామ
వారు ఆమెను ఒకసారి పోతనామాత్యుని దృష్టితో
మరోసారి నాచనసోముని కళ్ళతో చూసారు
తండ్రి పెట్టినపేరు సత్య అయితే
భామ నామె కష్టపడి సంపాదించుకున్నదట..
సంస్కృత భాగవతంలోని కృష్ణుడు సత్యనింత నెత్తికెక్కించుకోలేదట..
పుట్టపర్తి వారి ఈ పేరొందిన ప్రబంధ నాయికలు
మనకేం చెబుతారో విందామా..


సత్యభామ

కృష్ణునికి పట్టపురాణులు యెనిమిది మంది 
వారిలో రుక్మిణీ దేవినే పట్టమహిషి అని చెప్పాలి. 

కృష్ణపరమాత్ముడు 
ముందుగా పెండ్లి చేసుకొన్నది కూడా ఈమెనే
ఆ తరువాత 
ఏడుమందిని వివాహమాడినాడు 


వారిలో వరస క్రమంలో 
సత్యభామా దేవి నెంబరు యేదో కాని 
ఆమెకెప్పుడూ రుక్మిణీ దేవితోనే పోటీ ప్రధానంగా రుక్మిణీ దేవితో పోలిస్తే 
విదర్భ రాజపుత్రిలో ప్రధాన గుణం భక్తి 
ఆమె కృష్ణుణ్ణి ఎప్పుడూ 
మానవ మాత్రునిగా భావించి ఎరుగదు. 
ఆమె రమాభగవత్యంశకళ 
కృష్ణునికోసమే తాను జన్మించినాననే 
అభిప్రాయం ఆమెది 
వ్యాస భగవానుడు రుక్మిణీ కృష్ణులది 
"వినుకలి" వలపంటాడు .


తమ భవనానినికి వచ్చే పెద్దలనుండి 
ఆమె యాదవేశ్వరుని 
రూపౌదార్యగుణాదులను విన్నది. 
అతడున్నూ ఆమె 
బుధ్ధి లక్షణౌదార్యపూర శీల గుణములను విన్నాడు. 
ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ మొలకెత్తింది. 


పోతనామాత్యుడు ఆమె యవ్వనోదయాన్నే 
కృష్ణుని కతలో జోడించి రమణీయంగా చెప్పుతాడు. 


మరి సత్యాదేవి..?
కృష్ణుణ్ణి మానవాతీతుడుగా 
యెంతవరకూ అర్థం చేసుకుందో చెప్పలేము. 

అసలామె వివాహమే 
విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. 
సత్యాదేవి సత్రాజిత్తు బిడ్డ 
అతనిది యాదవులలోనే ఒక శాఖ 
చాలాకాలమాయన సూర్యుణ్ణి ఉపాసించి 
ఆయన దయతో శ్యమంతకమణిని పొందుతాడు. 


దాని కాంతి మహోధ్ధతం 
అంతేకాదు 
బంగారం పెడుతుందట. 
అది ఉండే రాజ్జంలో అరిష్టాదులు రావని నమ్మకం 
దాన్ని యాదవ రాజు కిమ్మని కృష్ణుడు 
సత్రాజిత్తు నడుగుతాడు 
అతడొప్పుకోలేదు. 


కథలో ఇది మొదటి ఘట్టం 
సత్రాజిత్తుకు ప్రసేనజిత్తనే తమ్ముడు 
వాడొకనాడామణిని ధరించి వేటకు వెళుతాడు 
వాణ్ణి చంపి ఒక సిం హం 
ఆ మణిని తీసుకొని వెడుతుంది. 


త్రోవలో జాంబవంతుడు 
సింహాన్ని చంపి 
మణిని తీసుకొంటాడు 
ఆయన రామావతారం కాలం నాటివాడు. 
దాన్ని తన సంతానానికి 
క్రీడాకందుకంగా వ్రేలాడగట్టినాడు 


కృష్ణుడే మణికోసం ప్రసేనుణ్ణి చంపినాడని 
సత్రాజిత్తు ప్రచారం 
'మణి తీసుకున్నాడని..' అభియోగం 
'ఉండవచ్చని' యాదవులలో గుసగుసలు 


ఈ అపనింద తప్పించు కోవడానికి 
కృష్ణుడు ప్రయాణం కడతాడు.
జాంబవంతునితో యుధ్ధం 
రత్నమూ.. జాబవతి అనే కన్యారత్నమూ..
కృష్ణునికి ప్రాప్తిస్తాయి 

సభకు సత్రాజిత్తుని పిలిపించి 
జరిగిన కథ చెప్పి 
అందరి సమక్షంలో మణినిస్తాడు 


ఆనాటినుండి 
సత్రాజిత్తుకు దిగులు పట్టుకుంది 
కృష్ణుడు యాదవులలో ముఖ్యుడు 
అతనితోవైరం దేనికి దారితీస్తుందో 


ఈ భయంతో 
తన బిడ్డ సత్యాదేవినీ రత్నాన్నీ
 కృష్ణునికే అర్పిస్తాడు 

యాదవేశ్వరుడు సత్యనేమో పెళ్ళాడాడు 
"మాకున్నూ మణులున్నాయి లెమ్మని"
 హుందాగ రత్నాన్ని వెనక్కిచ్చేస్తాడు. 


వివాహానికి ముందు 
కృష్ణునికి సత్యభామ పైన మనస్సు ఉందో లేదో 
మనకు తెలీదు 
సత్యాదేవి విషయమూ అంతే. 


పైగా ..
కృష్ణునితో వివాహానికి ముందే 
అక్రూర.. కృత వర్మల్లో ..ఒకనికి తన బిడ్డనిస్తానని సత్రాజిత్తు మాటకూడా ఇచ్చినాడట. 


'మనకిత్తుననుచు సమ్మతిజేసి 
తనకూతురు పద్మాక్షునకిచ్చి పాడిదప్పెనని..'
వాళ్ళిద్దరూ తలపోసుకుంటారు 
శ్యమంతకమణి కథనింకా పొడిగిస్తారనుకొండి.


కృష్ణుడు మాత్రం 
వివాహమయిన నాటినుంచీ 
సత్యభామా ప్రియంకరుడుగా మారిపోయినాడు 


ఈమెకు వాళ్ళనాన్న పెట్టినపేరు 
'సత్య..' అని అయి ఉంటుంది. 
'భామ..' అనే బిరుదు 
ఆమె కష్టపడి సంపాదించుకొన్నది. 


భామ అనే పేరు 
యెక్కువ కోపం గల స్త్రీకి కావ్య భాషలో వాడతారు. 
"భామతి కుప్యతీత భామాపతి"
 అని శబ్ద వ్యుత్పత్తి. 
అందుకే సార్థకంగా పద్య ప్రయోగంచేసే 
వసు చరిత్ర కారుడు కూడా 
'సీతా భామాపతి..'  అంటాడు 
సీతాదేవి కోపం చేసుకొన్న ఘట్టంలో 


అలా ..
ఈమెకు రెండు పేర్లున్నా 
భామ అనేది 
యెక్కువ ప్రచారంలో ఉన్నట్లు కనబడుతుంది 
కూచిపూడి వాళ్ళు కూడా 
"భామా కలాపమనే"
 దాన్నే యెక్కువగా ప్రచారంలోకి తెచ్చారు. 


మన ఇళ్ళల్లో చిన్న ఆడపిల్లల్ని కూడా 
"వోయి రావే భామా.."
 అని వెటకారంగా అంటాము అంటే 
ఆ సందర్భంలో 
ఆ పడుచులోని ఠీవి గర్వమూ దృష్టిలో పెట్టుకొని 
ఆ మాట వాడుకుంటాము. 


కృష్ణుని భార్యలో అందం లేని వారు 
ఎవరుంటారు గనుక..
ఏ భార్యను వర్ణించినా
"మృగరాజ మధ్య" అనిన్నీ 
"తారాధిపనిభానన" అనీ అంటూనే వుంటారు. 
కృష్ణుని భార్యలవరకూ ఎందుకు 
ప్రబంధకవులకు ప్రతి ఆడదాని ముఖమూ 
"చంద్రవత్ సమానం"గానే కనపడుతుంది. 

అట్టి సందర్భములో 
యేదో ఇది కావ్య భాష లెమ్మని 
సర్దుకుంటూ ఉంటాము. 


కాని సత్యభామ మాత్రం 
అడుగడుగునా సవాలు చేస్తుంది. 
ఆమె ఆభిజాత్యమూ రూపగర్వమూ
తిమ్మన్న గారి పారిజాతాపహరణం 
మొదలైన గ్రంధాలలో 
మనకు కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ఇంత గొప్ప గ్రంధమైన 
భాగవత పురాణంలోనూ 
తప్పిదారి కృష్ణుడు 
రుక్మిణినయినా యేడ్పించినాడేమో గాని 
సత్యభామ జోలికి పోయేవాడు కాదు. 
ఆమె ఏది కోరితే 
అది తెచ్చి ఇవ్వడం ఆయన రివాజు. 


కృష్ణ పరమాత్మ 
నరకాసురుని పై యుధ్ధానికి 
బయలు దేరుతున్నాడు 


సంస్కృత భాగవతంలో 

శ్రీకృష్ణుడు సత్యాదేవినింతగా 
నెత్తికెక్కించుకొన్నట్లు లేదు. 
యుధ్ధ వర్ణన సందర్భంలో కూడా 

"దృష్ట్యా నభార్యం గరుడోపరిస్థితం 
మారో పరిష్టాత్ ప్రకటిద్ఘనం యధా"
 అని ఇంత మాత్రమె చెబుతాడు 


"సభార్యం"
 అనే విశేషణం యే భార్యను గురించి వ్యాసుడన్నాడో 
మనకు స్పష్టంగా తెలీదు. 
ఆ సందేహాన్ని తీర్చవలసిన శ్రీధరుడు కూడా 
నిమ్మళంగా పైకి వెళ్ళిపోతాడు 


ఈ సందర్భంలో పోతన్నగారున్నూ 
"లలనారత్నము గూడి 
సంగర కథాలాపమ్ములన్ చేయ 
ఉజ్వల నీలాంగు"డని కృష్ణుణ్ణి వర్ణిస్తాడు వ్యాసభగవానుడు 


సూర్యునిపైన ఉండే 
మెరుపుతో కూడిన మేఘంగా
కృష్ణుణ్ణి చెబుతాడు. 


ఈ ఉపమానం పోతన్నగారికి 
సరిగా అతికిందిగా కనబడలేదు 
ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణిగా మార్చివేసినాడు. 
ఇంతకూ యెవరీ లలనారత్నం..??


పోతన్నగారు 
"సత్యభామయే అయివుంటుందని" 
తీర్మానం చేసినవాడు. 
తెనుగు భాగవతంలో 
యుధ్ధానికి పోతూ ఉండే కృష్ణుణ్ణి సత్యాదేవి 
"నన్ను నీ వెంటన్ గొనిపొమ్మ"
 అని ప్రార్థిస్తుంది. 


ప్రయాణమైపోయే వాళ్ళతో 
"నేనూ వస్తానని" చెప్పడం అపశకునం 
దాన్ని తప్పించి పోతన్న 
"నన్ నీ వెంట గొని పొమ్ము.."
 అని సరసంగా మా ర్చి 
తెలుగువారి ఆచారాన్ని నిలబెడతాడు. 


వెంటనే కృష్ణుడు 
ఆమె ధనుష్పాండిత్యం యేమో తెలీనట్టు 
గొప్ప సీసపద్యంలో 
ఆమె లాలిత్యానికీ ..
భయంకరమైన సమరరంగానికీ..
 పొత్తుకుదరదని చెబుతాడు 
ఆమె వింటుందా..?
" ఏయ్ నేను.. నా రూపం.."
 అని బాసీకపట్టు వేసింది. 
పిలుచుకొని పోకతప్పిందికాదు. 


ఈ సన్నివేశాన్నంతా పోతన్న 
యెక్కణ్ణుంచో తెచ్చుకున్నాడు. 
తన రాకను గూర్చి 
కృష్ణునికి తెలుపనయినా తెలిపింది. 
నాచన సోముని సత్యభామ 
కృష్ణునికన్నా తానే ముందు పోయి 
గరుడునిపై కూర్చుంది. 
నా చనసోమన్న 
సత్యాదేవి యుధ్ధంలో పాల్గొనడానికి 
సన్నివేశం ఏర్పాటుచేసినాడు. 


నరకాసురుడు వాడియైన ఒక బాణాన్ని 
కృష్ణుని ఫాలస్థలానికి గురిపెట్టి విడచినాడు. 

దాంతో కృష్ణుడు కొంచం సేపు మూర్చ పోయి 
వెంటనే సేద దేరడం జరుగుతుంది. 
అలత ఇంకా పూర్తిగా పోలేదు 
'నీవు సమరంబె కోరుదువు 
అవసరంబు వచ్చెనని ..'
విల్లు అందించినాడు.


శార్ఙూలం తీసుకుని 
సత్యభామ విజృంభించింది 
నరకాసురునితోనే యుధ్ధం 
వాని సుతుణ్ణి చంపుతుంది 
నరకాసురుడు వివశుడై నిలబడతాడు 


అప్పుడు కృష్ణుడు 
ఆమె చేతినుండి మరల విల్లందుకొని 
తన్ను రుక్మిణి ఎన్నో మారులు బ్రతిమాలినా ఇవ్వని వక్షస్థలంపైని పతకాన్ని 
ఆమెకు బహుమానంగా ఇస్తాడు. 


దీంతో నాచనసోముడు 
రుక్మిణి సత్యభామలకున్న 
పరస్పర మాత్సర్యాన్ని సూచిస్తాడు 


పైగా 
'నోచినవారి సొమ్ములవి 
నోచనివారికి వచ్చునే..?'
అంటూ సత్యాదేవివైపు వకాల్తా నాచనసోముడేర్పరచినసన్నివేశం భాగవతంలో లేదు 


నరకాసురుణ్ణి చూస్తూనే 
ఆమె విల్లందుకుంటుంది. 


ఈ సందర్భంలో సత్యాదేవి యుధ్ధాన్ని 
సుమారు పది పద్యాల్లో 
పోతన్నా నాచనసోముడూ ఇద్దరూ వర్ణించారు 


పోతన్న నాచన సోముణ్ణి అనుసరించి 
మెరుగు పెట్టడానికి పోయిన 
పద్యాలున్నూ కనబడతాయి
 
"గనయంబున్ గొనయంబు నెన్నడుముతో గర్ణావతంసంబుతో
చనుదోయిన్ కనుదోయి సాయకముతో
సంధాన హస్తంబుతో
జెనకం జేయుచు సేయుచుండె
నతిలక్ష్మీ బూతదైతేయత
ర్జన గర్జారవ జర్జరాంగి రుధిరా సారంబు తోరంబుగన్.."

 
పై పద్య రచన నాచన సోమన్నది. 
క్రమాలంకారం 

అల్లె త్రాడు చెవుల వరకూ లాగిందన్నమాట 
కన్నుదోయిని సంధాన హస్తంతో జోడించింది. 
పద్యం కడపట వుండే సరసం 
శృంగారంలో వీరం వలెనే సాగింది 
ఈ పద్యం పోతన్నగారి దృష్టిని ఆకర్షించింది. 


అదే క్రమాలంకారాన్ని తీసుకొని 
దానికంతె మరింత సొగసును జోడించి 
ఈ క్రింది పద్యం అల్లినాడు

"పరు జూచున్ ఒరుజూచు వొంపనల రింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములలో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నుల కెంపు సొంపు బరగన్ చంద్రాస్త సందోహమున్
సరసాలోక సమూహమున్నె నెరుపున్ చంద్రాస్య హేలాగతిన్ .."

 

మత్తేభ విక్రీడితాలే పై గ్రధనానికి 
"అరిజూడున్ హరిజూచు" అనే పద్యం వత్తాపి
 

నాచన సోముడు రెండు చరణాలలో మాత్రమే 
క్రమాలంకారాన్ని నడిపినాడు 
పోతన్న పద్యమంతా తీసుకొని వెళ్ళినాడు 
వీరరసం ప్రధానంగా నిలిచింది. 
శృంగారం ఆనుషంగికంగా..

ఈ సందర్భంలో ఇంకా కొన్ని పద్యాలు 
నాచన సోముణ్ణి అనుకరించినవి ఉన్నాయి 


సత్యాదేవి వేణిని చొల్లెముగా చుట్టింది 
నాచన సోముడు 
గనయమును నెన్నడుముతో సంధించినట్లుగా "సంఘటితనీ వీబంధయై" పాణితో 
పయ్యెదను చక్కగా దురిమింది. 


'శుభద్వీర సమ్రంభముతో
ప్రత్యాలేడపాదంతో నిలిచింది 
అలిక స్వేద వికీర్ణికాలకలూ 
ఆకర్ణికానీత వల్లలిత జ్యానఖపుంఖదీధితులూ లక్ష్యావలోకమూ 
వలయాకార ధనుర్విముక్త విశిఖ 
వ్రాతాహతారాతియై..
సత్యభామ భయంకరంగా నిలిచింది 

ఆమె  

"జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూథంబుగా
నా వి ల్లింద్రశరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా
దా విద్యుల్లతభంగి నింతి సురజి ద్దావాగ్ని మగ్నంబుగా
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభ శ్శీకరశ్రేణి గాన్"

సత్యాదేవి బాణాలకు తట్టుకోలేక నరకాసురుని వెనక్కుపోయి తలదాచుకున్నాయి 

సాత్రాజిత్తి నుండి విల్లందుకున్న కృష్ణుడు 
మరి కొంతసేపు 
నరకాసురునితో యుధ్ధవినోదం చేసి 
చక్రంతో వాని తల ఖండిస్తాడు 
ఇంతకూ నరకాసురుని తోడి యుధ్ధంలో
 పెద్ద భాగం సత్యాదేవిది గానే కనబడుతుంది.
 
ఆంధ్రప్రభ 31.10.1978