29 సెప్టెం, 2013

దళిత గోవిందం


మాల వాడల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఊరేగింపును తీసుకెళ్ళడానికి 
TTD నిర్ణయం తీసుకున్నప్పుడు 
శ్రీశైలం గారు వార్తలో  ఇలా స్పందించారు 
26 సెప్టెం, 2013

"వైష్ణవ జనతో" 

 


మల్ల్ల్లాది కుటుంబం
 సంగీత సరస్వతి సేవకే ఆవిర్భవించింది
మల్లాది  శ్రీరామమూర్తి గారు గొప్ప సంగీత విద్వాంసులు 
                                         
                             
               
 ఆకాశవాణి మద్రాసు కేంద్రం  
 వారి హరికథా గానాన్ని ప్రసారం చేసేది.
 తర్వాత ఆకాశవాణి విజయ వాడ 
 వారి హరికథామృతానికి తన ఒడిని పడ్డింది..
వారి కుమారులైన మల్లాది సూరిబాబు గారు 
తండ్రి ఇచ్చిన సంస్కారాన్ని బలంగా పుణికి పుచ్చుకున్నారు.

సంగీత ప్రపంచంలో ప్రయాణిస్తూనే 
సంగీత శిక్షణ ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని 
లలిత సంగీత గతులతో ఎన్నో పాటలు 
లలిత సంగీత అభిమానుల గొంతులో అమృతంలా పోసారు..

దేశ దేశాలలో కచ్చేరీలు చేసి 
మన సంగీత వైభవాన్ని ఇనుమడింపజేసారు..
వారి పిల్లలే ప్రపంచ మల్లాది సోదరులుగా ప్రసిధ్ధిగాంచిన శ్రీరామప్రసాద్,రవి కుమార్ లు


వైష్ణవ జనతో అన్న సంగీత రూపకం 
విజయవాడ ఆకాశవాణి లో ప్రసారమైంది 
మహాత్మా గాంధీజీ కి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో 
అనే గుజరాతీ గీతాన్ని పుట్టపర్తి తెనిగించారు.
అక్టోబర్ లో ఈ సంగీత రూపకం పునః ప్రసారమైందట..

మొన్న మల్లాది సూరిబాబు గారు 
ఈ సంగీత రూపకం CD ని మా అక్కయ్యకు పంపిస్తూ 

పుట్టపర్తి వారి ఎంతో విశిష్టమైన అనువాదం అమ్మా ఇది. 
దీనిని ఓలేటి వెంకటేశ్వర్లు గారు పాడినారు. 
ఈ సంగీత రూపకం నుంచీ ఈ గీతాన్ని తీసుకొని 

మా పిల్లలు దేశ విదేశాలలో జరిగే తమ కచ్చేరీ   లలో దీనిని పాడాలనుకుంటున్నారమ్మా 
దీనిని మీకు పంపుతున్నాను అంటూ పంపారు.

మల్లాది సూరిబాబుగారి సంతానం 
మలాదిసోదరులు మాట్లాడుతూ 
 ఇది ప్రతి కచేరీ లోనూ ఈ తెలుగు అనువాదాన్నే 
మేము పాడాలని అనుకుంటున్నామమ్మా ..
ఇంత మంచి సాహిత్యాన్ని 
తెలుగు వారు మరచిపోతున్నారు 
అని బాధేసింది.. 
అంటూ ఫోన్ లో మాట్లాడుతూఅన్నారట  

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మల్లాది సూరిబాబు గారి లేఖ


అక్తోబర్ లో ఈ సంగీత రూపకం పునః ప్రసారమైందట..ఒకప్పుడు కచ్చేరీ చివరలో ఒక దేశభక్తి గీతం 
మన సంగీత విద్వాంసులు పాడే సంప్రదాయం ఉండేది..
పుట్టపర్తి అనువాదం 
 సంగీతం గానం: శ్రీ వోలేటి వేంకటేశ్వర్లు 
 సేకరణ           : పుట్టపర్తి నాగపద్మిని 

 ఇతరుల కష్టములెవ్వడెరుగునొ 

 అతడే వైష్ణవుడూ..
 అతడే వైష్ణవుడూ.. 

సతతము పరులకు సాయము చేయుచు

గతి తానేయని గర్వము పడడో
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

సకల లోకముల సన్నుతి చేయును

అపనిందలచే అపచారము చేయడు
మనసున వాక్కున నిశ్చలుడెవ్వడో
యోగ్యురాలతని కన్న జననియే  
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

సర్వము సమముగ ఎవ్వడెంచునో

ఆశవీడి పర స్త్రీ మాతగ చూచునో
నాలుక వీడిన అసత్యము పల్కడో
పరధనమునకై పాకులాడడో
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..
అతడే వైష్ణవుడూ..

మోహము మాయము మనమున నుండవో

గృహ వైరాగ్యము దృఢముగ కుదురునో
రామ నామమున లీనుడై పోవునో
రాజిల్లు వాని లోక 
అతడే వైష్ణవుడూ
అతడే వైష్ణవుడూ..


కపట లోభముల కదలిచి
కామ క్రోధ శత్రుల 
తపనము జన్మము సర్వ జనులకు

అతడే వైష్ణవుడూ

అతడే వైష్ణవుడూ..


సర్వ శాస్త్రము


పాట వింటూ సాహిత్యం వ్రాయడానికి ప్రయత్నించాను కానీ కొన్ని పదాలు సరిగ్గా వినిపించలేదు

20 సెప్టెం, 2013

సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి..


ఒకసారో పాటకచేరీ జరిగింది ప్రొద్దుటూరులో 

ఓ గాయని అద్భుతంగా పాడింది 
అంతే
 కచేరీ అనంతరం పుట్టపర్తి వారు చెమర్చిన కళ్ళతో లేచారు 
పాడినావిడను అభినందించడంతో పాటూ 
కనకా నీ చేతినున్న గాజులు తీసివ్వు అన్నారు 
 మా అమ్మ కనకవల్లి వెంటనే చేతి గాజులు తీసి 
గాయని పాదాల వద్ద పెట్టి వచ్చేసారు.

ఆ కాలంలో భర్త మాటలకు ఎదురాడటం అరుదు.
తరువాత 
ఏమయ్యా నారాయణాచార్యులూ 
నేను నా కూతురికి పెట్టిన  గాజులు 
మహా ధారాళంగా దానమిచ్చేశావే 
అని ఎత్తి పొడిచింది అత్తగారు
ఏం చెప్పాలో తెలియక నవ్వేశారు పుట్టపర్తి

అమ్మ 'తన కూతురు చేతులు బోసిపోయినందుకు బాధపడుతోందని'
 తెలిసి తానూ బాధ పడాలా ..?
తన భర్త చేసిన పనికి సంతోషించి  అభినందించాలో 
అర్థం కాని కనకవల్లి మిన్నకుండిపోయింది.

18 సెప్టెం, 2013

సిపాయి పితూరీ సమీక్ష1957భారతిలో పుట్టపర్తి రచన 
సిపాయి పితూరీ అన్న కావ్యంపై 1957 జూన్ లో వచ్చిన సమీక్ష
సేకరణ.. శ్రీ రామావఝుల శ్రీశైలం 
సమర్పణ.. పుట్టపర్తి అనూరాధ 

1947 ప్రాంతంలో స్వాతంత్ర్య  పోరాట ప్రభావం 
స్వాతంత్ర్యం రావటం 
గాంధీజీ వ్యక్తిత్వం  
 ఆయన సత్య నిష్ఠ .. 
గాంధీజీ పోవటం .. 
కొంతమంది ప్రత్యక్ష్యంగా గాంధీగారిని చూడటం 
మొదలైన అంశాలవలన ఆనాటి కవిత్వాలలో 
దేశభక్తి  ప్రజ్వరిల్లుతూ వుండేది 
అందువలననే పుట్టపర్తి రచనలలోనూ
 గాంధీజీ మహా ప్రస్థానము 
సిపాయి పితూరీ మొదలైనవి   చోటుచేసుకున్నాయి
నలభైలలో 

ధీరత్వం తొణికిసలాడుతూ.. 

జ్ఞాన భాండాగారం..

అయ్య..
                                 

16 సెప్టెం, 2013

పేరులో నేముంది..?
నామకరణం 
అందరూ తమ పిల్లలకి ఏదో పేరును పెట్టి 
ఆనాటినుంచీ పాపా బుజ్జీ కన్నా చిన్నా నాన్నా వానిని 
పేర్లకు కలిపి పిలువనారంభిస్తారు
కొన్నాళ్ళు పోయేసరికి
ఆపేర్లు ముందూ వెనుక నరుకబడి విచిత్ర రూపాలు పొందుతాయి
అవంతి అవ్వూ అశ్విన్ అశ్శూ 
మగ నామాలకు గాడు అనే విశేషణమూ తగిలించబడుతుంది
కొందరు తమ పెంపుడు జంతువులకూ 
తమకిష్టమైన పేర్లు పెడుతుంటారు

కొందరి పేర్లలో దేశభక్తి తొణికిస లాడుతుంటుంది
లేదా వారి పెద్దల దేశభక్తిని వీరు మోస్తుంటారు
మొన్ననే అమీర్ ఖాన్ 
తన రెండవ భార్య కొడుకుకు ఆజాద్ రావ్ ఖాన్ అని పేరు పెట్టి 
వాళ్ళ అంకుల్ ఆజాద్ అనీ 
ఆయన కుటుంబంలోని వాడినైనందుకు 
ఈనాటికీ గర్వ పడుతున్నాననీ అన్నాడు

ఒక రైతు కొత్తరకం మామిడికి నిర్భయ అనే పేరును పెట్టాడు
అది అతని సాంఘీక చైతన్యానికి ప్రతీక 

ప్రతి యేటా వచ్చే తుఫాన్ లకు 
నీలం తుఫాన్ లైలా తుఫాన్ అనీ పేరిడుతుండటం కద్దు 

ఈ విధంగా తుఫానులకు పేర్లు పెట్టడం వలన
 ఆయా తుఫానులను గుర్తించవచ్చట
ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞురాలు ప్రజలకిష్టంలేని 
రాజకీయ నాయకుల పేర్లను పెట్టేదిట 

మా ముచ్చట్లలో మా పేరు వెనుక కథలూ అప్పుడప్పుడూ 
దొరలుతుంటాయి
ఆ కథాక్రమంబెట్టిదనిన..

ప్రతి తల్లీ తండ్రీ తమ పిల్లలకు
ఇష్టదైవం పేరో తల్లీ తండ్రులపేర్లో కలిసొచ్చేటట్లు పెట్టుకుంటారు కదా..

గాయకులు బహుశా రాగాలపేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారేమో
కవులూ కళాకారుల పిల్లలపేర్లు వారింతవరకూ తాము చేసిన కృషి ప్రతిఫలించేటట్లు పెట్టుకుంటారు

పుట్టపర్తికి ఇరవైరెండేళ్ళ వయసులో తొలిసంతానం కలిగింది
ఆ రోజుల్లో భవభూతి కరుణ రసంలో మునిగి తేలుతున్నారు 
కరుణ రసాన్ని భవభూతి పోషించినంత 
సమర్థవంతంగా మరెవ్వరూ పోషించలేరన్న 
దృఢమైన భావతీవ్రతలో వున్నారు పుట్టపర్తి

కేవలం మనో వేద్యములయి 

మాటలచే చెప్పరాని భావ రహస్యములకు 
ఇతని కవిత నిధి 
ఇతడు మానవ హృదయ పుస్తకమును 
సమగ్రముగ ద్రిప్పినాడు అంటారు
భవభూతి నాటకకర్త వ్యాససంపుటి వ్యాసాలలో 

అందుకే మా పెద్దక్కయ్య పేరు కరుణాదేవి
అందుకేనేమో ఆమె జీవితం కరుణ రసావేశంలోనే తడిసిపోయింది
పుట్టపర్తి అన్ని కోరికలకు ఆమె ఒక చిత్రపటం

తరువాత 
మా రెండవ అక్కయ్య పేరు తరులత
ఆమె పుట్టినప్పుడు
 తోరుదత్ అనే ఆంగ్ల కవయిత్రి రచనలను ఎంతో ప్రీతిగా చదివేవారు
ఆమె పేరు ధ్వనించేలా మా రెండవ అక్కయ్య పేరు
తరు లత అని పెట్టారు
ఆమె తన కమ్మని కంఠంతో మా అయ్యను మంత్రించింది

చూడటానికి కూడా తెల్లగా బొమ్మలా ఉండేది
పైగా కాస్త తెలివి తేటలూ ఎక్కువే
దెబ్బలు పడకుండా తప్పించుకోవటం బాగా తెలుసు
చదువులో కాస్త నెమ్మదించినా దాని ప్రభావం తనపై
పడకుండా మా అయ్య దృష్టిని మరల్చడంలో దిట్ట
చివరికి ఎస్ ఎస్ ఎల్సీ తప్పడంతో ఇంక దీనికి చదువు రాదు
పెళ్ళి చేసేస్తాం అని మా అమ్మ నిర్ణయించింది
దాంతో మా పెద్దక్కయ్య రెండవ అక్కయ్యలకు పెళ్ళి జరిగిపోయింది
నలుగురాడపిల్లలు 
త్వర త్వరగా పెళ్ళి చేసి బాధ్యతలు దించుకోవాలని 
మా అమ్మ తాపత్రయం

దేవుని దయవలన 
మా అయ్య మా అమ్మ నిర్ణయాలకు ఏమీ చెప్పేవారు కాదు
నా మానాన నన్ను వదిలేసి నీవేమైనా చేసుకో

అని ముహూర్త సమయానికి వచ్చి పీటలపై కూర్చుని 
అక్షింతలు వేసి పోవటమే అయ్య పని

తులజ మా మూడవ అక్కయ్య
ఆమె చదువులో ఎప్పుడూ ఫస్టే..
అంతే కాదు కాలేజ్ లో ఏ కాంపిటీషన్ పెట్టినా ప్రైజ్ ఈమెకే..
 అయ్య రచనలను డిక్టేట్ చేస్తుంటే వ్రాయ వలసిన బాధ్యత 
ఎక్కువ భాగం ఈమెదే..

మా అయ్య ఒక విషయంపై చెబుతూ పోతుంటే 
ఎదుటివారి బాధనూ ఇబ్బందినీ అర్థం చేసుకోరు
తనపని కావటమే ముఖ్యం

వారు కూడ తన భావ జలధిలో ఓలలాడాలని 
ఆయన తాపత్రయం
కానీ చిన్నపిల్లలకు 
స్నేహితులు సరదాలు కాస్త సోమరితనం
 కావాలని వుంటుంది కదా అప్పుడప్పుడూ..

కానీ అవి మా అయ్య దగ్గర చెల్లవు
కలేజ్ లో స్పోర్ట్స్ అవర్ ఖాళీ కదా 
అప్పుడు రాయి అని గద్దించేవారు
ఆమెకది బాధ
ఎదురు చెప్పలేదు
గొణుక్కుంటూ ఉక్రోషంతో పూర్తి చేసేది పాపం

కానీ మా అయ్యకు వేరే దారి యేదీ లేదు కదా
ఆయన రాయలేరు చేతులు ఒణుకుతాయి
 పైగా అక్షరాలు కుదరవు
ఆమె అక్షరాలు చక్కగా వుంటాయి..
మా ఇద్దరక్కయ్యల తరువాత ఆమె పెండ్లి జరిగింది
మా బావ రైల్వే ఉద్యోగి
ఆయనకు భక్తి ఎక్కువే.దత్త సంప్రదాయం ఇష్టం జపం ధ్యానం 
భాగవతం భజనలు 
మా అక్కయ్య పరిస్తితి అక్కడా దాదాపు అంతే..


మరాఠీ సాహిత్యంలో 
వీర సావర్కర్ శివాజీ ఆర్ ఎస్ ఎస్ స్వ్రర్ణపత్రములు అనువాదం 
ఈ రచనలలో మా అయ్య బిజీగా వుండేవారు
అదీకాక
మరాఠీ భక్త కవుల జీవితాలు 
ఎప్పుడు మా అయ్య మనసును రంజింపజేసేవి
పండరీ భాగవత రచనకు అంకురార్పణ బీజం పడిందప్పుడే
అందుకే మరాఠీ దేవత తులజా మాత
మా మూడవ అక్కయ్య పేరులో ఒదిగింది 
ఆమె పేరు తులజాదేవి

మా తులజక్కయ్య తరువాత ఒక మగబిడ్డ
వాణిపేరు కృష్ణ చైతన్య
అప్పుడు మా అయ్య కృష్ణ చైతన్య ప్రభువు సంప్రదాయాన్ని ఇష్టపడేవారు
అంటే ఒళ్ళు మరచి ఆడి పాడి ప్రభువుని  కీర్తించటం..
ఆ కృష్ణచైతన్య నెలల బిడ్డగానే చనిపోయాడు..
కానీ తెల్లగా అందంగా ఉండేవాడట..
కనీసం వాడైనా మా అయ్య పేరు నిలిపేవాడేమో బ్రతికుంటే
బ్రతకని బిడ్డ బారెడు అంటారు కదా

మా అమ్మ అప్పుడప్పుడూ వాణ్ణి తలుచుకొనేది
వాడు చనిపోయేరోజున
ఎత్తుకుందామని ఊయల దగ్గరికి వెళ్ళిన మా అమ్మకు 
వాణి తల అగుపించలేదంట ఒక్క నిముషం ..
ఒట్టి శరీరమే కనిపించింది
ఇదేమిటి తల కనిపించటం లేదు ఏమైందబ్బా అనుకుందట
అదేదో అపశకునంలా తోచింది మా అమ్మకు
తర్వాత వాడు కొన్నాళ్ళకేమో చనిపోయాడు 

తరువాత మా నాలుగవ అక్కయ్య నాగపద్మిని
ఆమె మా అమ్మ కడుపులో వుండగా 
మా ఇంటికి పేద్ద నాగుపాము వచ్చిందంట
మా అమ్మ పూజ చేసుకొనే మందాసనం కింద చుట్ట చుట్టుకుని పడుకుందంట
ఏమండీ ఇక్కడ రాండి పామండీ పాము అంటే 
మా అయ్య లేవకుండానే ఏం చేయదులేవే మొక్కో అదే పోతుంది అన్నారట.. 
పాపం మా అమ్మ నిండు గర్భిణీ గభాలున లేవలేదు కదా..
రెండడుగుల దూరంలో పాము 
ఏం చేస్తుందీ..
ఇంతకంటే పెద్ద పెద్దకష్టాలే పడింది మా అమ్మ
అందుకే 
అమ్మా మమ్మల్నీ  మా పిల్లల్నూ ఏం చేయవద్దమ్మా
 చల్లగ చూడు పుట్టిన బిడ్డకు నీపేరే పెట్టుకుంటాము 
అని మొక్కుకుంది

అలానే అది నెమ్మదిగా అక్కడినుంచీ వెళ్ళి పోయి 
దొడ్లో వున్న కన్నంలో దూరిందట..
అక్కడ మూడు రోజులుందిట.
కానీ ఎవ్వరినీ ఏం చేయలేదు..
అలా మా నాగ ఆవిర్భవించింది..

ఎవరికైనా నాగ సంబంధమైన పేరు పెట్టుకుంటే 
వారు అదృష్టవంతులౌతారట
అలానే ఆమె అదృష్టాన్ని అందిపుచ్చుకుంది
చిన్నప్పటినుంచీ చాలా చురుకు
ఆటల్లో పాటల్లో చదువులో అన్నిటిలో ఫస్టే
మా అయ్యను పూర్తిగా సంతృప్తి పరచింది అది
పాట కచ్చేరీలు చేసేది
ఈరోజు నాగ పద్మిని టపా కచేరీ కదా
టపా కచేరీ అని ఆటపట్టించేవారు
పో అయ్యా నన్నట్ల ఏడిపించొద్దు అని బుంగమూతి పెట్టేది

క్లాసికల్ జానపదం ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరికీ ప్రైజ్ రానివ్వదు
తానే సాధించి తెస్తుంది.. విపరీతమైన భావావేశం

అరవిదుల ప్రభావం తో 
మా ఒక్కగానొక్క మగనలుసు కు అరవిందుల పేరు పెట్టారు
అరవిందాశ్రమంలో ఎక్కువ వుండటమూ 
వారి రచనలను అనువదించటమూ జరిగింది

కానీ వాడి చిన్నతనంలో దాదాపు ఒక్కపెట్టున వారం రోజులు ఎడతెరిపిలేకుండా హోరున వానట
వీడేమో నెలల పిల్లవాడు 
ఫిట్సు వచ్చి అలానే వారం ఫిట్స్ లో పడి వున్నాడట

అప్పుడు ఇప్పట్లా వీధికొక్క డాక్టరు లేడు 
ఎక్కడో ఎవరో ఒక డాక్టరు అంతే..
అందుకే వాణి బుధ్ధి మందగించి చదువే రాలేదు
వచ్చినా అంతంత మాత్రమే..

అది మా అయ్యకు బాధ.. 
వాణ్ణి అందరూ కలిసి బాది పారేసే వాళ్ళు
ఆడపిల్లలంతా చదువులో చురుకు మగపిల్లవాడేమో ఇలా వున్నాడు
వాణ్ణి అందరూ కొడుతుంటే మా అమ్మకు సంకటం
చదువు రాకపోతే ఏమైంది 
వాణి బతుకేదో వాడు బతుకుతాడు 
అందరూ చదివి ఊళ్ళేలాలా అనేది మెల్లిగా.. గట్టిగా కాదు
మా అయ్యముందు ఎవరికీ స్వరం పెరగదు 

ఇవన్నీ మా నాగ మొన్న తిరగేసింది
నా పేరు వెనుక చరిత్ర ఏమీ లేదా అంటే లేదు అంది
నా కు బాధేసింది
పోవే నీతో మాట్లాడను ఫో అన్నా
అవునే నీవు ఆక్సిడెంటల్ బర్త్ అంది పైగా
అంటే బలవంతంగా దూరానన్నమాట..
అవును.. అంది మళ్ళీ నన్నేడిపిస్తూ

పోనీలే అయ్య అమ్మల కడుపున పుట్టడానికి 
బలవంతంగా దూరాను నేను
అన్నా

నీవు పుట్టే నాటికి అక్కయ్యల పెళ్ళిళ్ళు అయ్యాయి
వాళ్ళతో పాటీ అమ్మ ఇక్కడ ప్రెగ్నెంట్ 
ఎలా వుంటుంది చెప్పు అమ్మకు అంది
నిజమే అనిపించింది

వియ్యంకులు అల్లుళ్ళముందు 
తానూబిడ్డలతో పాటూ కడుపేసుకు తిరగాలంటే ఎంత కష్టం
అవునులే..
అమ్మ కడుపు దాచుకుని తిరిగేది  
కాన్పవగానే అమ్మ కాస్తయినా రెస్ట్ తీసుకోలేదు
ఇంతలో కూతుళ్ళు కాంపుకు రావటం 
అల్లుళ్ళ మర్యాదలు అమ్మకు తీరికే లేదు 
మా అమ్మకు నాకు పాలివ్వడానికి కూడా తీరిక లేదట..

మా ఇంటి ఓనర్ అవ్వ 
ఆమెది గుడిపాడు 
అందుకని ఆమె గుడిపాటవ్వ అయింది

ఆ గుడిపాటవ్వ కు పిల్లలే లేరు
ఆ మె ఇంటికీ పొలాలకు దాయాదులే అధికారులు
అది ఆమెకు ఇష్టం లేదు 
కానీ యేం చేస్తుంది ఆమెకు పిల్లలు లేరు
ఒంటరి ప్రాణి. 

ఆమె ఒడిలో నేను పడ్డాను
ఆమె తల్లిప్రేమనంతా నాకు పంచింది
మంచానికి గుడ్డ ఊయల కట్టి ఆయమ్మ పాటలు పాడింది
బూచోడొస్తాడు అన్నం తిను అని భయపెట్టింది
దారికి పక్కగా పో పెద్ద పెద్ద బచ్చులొస్తాయ్ అని జాగ్రత్త చెప్పింది..

అమ్మా కనకమ్మా బిడ్డకు పాలియ్యమ్మా
తెల్లగా ఎంత ముద్దుగా ఉందో చూడు అంటూ బతిమాలేదట
మా అక్కయ్యలూ బాలింతలే 
ఇద్దరికీ మగపిల్లలు పుట్టారు వాళ్ళకీ నాకూ మూడు నెలలే తేడా
వాళ్ళూ నాకు పాలిచ్చారు

మా అయ్య నాకు ఆరో నెలకే కాఫీ తాగించారు ప్రేమగా
వద్దండీ చిన్నపిల్ల కఫీ తాగించద్దు అంటే
వింటేనా
రాధా రా.. అని 
నేనయితే మా అయ్య ప్రేమను ఎంత పొందానో చెప్పలేను
అందుకే ఇప్పుడీ ఎడబాటు..
10 సెప్టెం, 2013

7 సెప్టెం, 2013

"భవభూతి" నాటక కర్త

శ్రీ  రామ దాసు సినిమా.
ప్రజల సహకారంతో రామ మందిరం కట్టాడు రామదాసు
మందిర ప్రారంభోత్సవ శుభ సందర్భంలో నే
కొడుకు అన్నం వండే పాత్రలో పడి  చచ్చిపోయాడు

వెంటనే
 వెంటనే రాముని వేషంలో ఉన్న సుమన్
హనుమంతుని పంచ ముఖ ఆంజనేయునిగా పంపాడు


 పెద్ద స్వరూపంతో గాలిలోకి ఎగిరిన ఆయన నీడపడి
రామదాసు  కొడుకు మెల్లగా కళ్ళు విప్పాడు

అదే రామదాసు ని

ప్రభుత్వ ధనంతో రామాలయం నిర్మించావన్న నేరంపై
చెరసాలలో వేసి భయంకరంగా హింసిస్తుంటే
ప్రతి దెబ్బకూ రామా రామా అంటున్నా

చిలుకలకు పండ్లు తినిపిస్తూనూ

ధ్యానంలోనూ
విశ్రాంతిలోనూ కాలం గడిపాడు తప్ప పట్టించుకోలేదు

రామదాసు 

రామా రామా అన్న అరుపులు 
దండకారణ్యంలో వనవాసం సెట్టింగ్ లో 
ఉన్న సీత కు వినపడి ఆమె ఆందోళనగా ముఖం పెట్టి
'ఇంకా కాపాడరెందుకు..?'
అని చూపులతో రాముణ్ణి ప్రశ్నిస్తున్నా
రాముడు అక్కణ్ణుంచీ లేచి వెళ్ళాడే తప్ప
కాపాడలేదు

ఎందుకలా..??

తనకు గుడి కట్టిన రామదాసును 
చెరసాలకెందుకు పంపాడు
అసలే లోకం దేవుడూ లేడూ

 ఏడీ వుంటే చూపించండి

అంటూ నాస్తికత్వాన్ని ఆశ్రయిస్తూవుంటే

తనని నమ్ముకున్న తన భక్తులకు 

ముళ్ళకంచెలడ్డు వేసి దారిని 
ఇంకా ఇంకా క్లిష్ట తరం చేసి
బాబోయ్ దేవుణ్ణి ఫొటో లో చూసి దణ్ణం పెట్టుకోవాలేగాని
నిజంగా చూడాలనుకోకూడదు కళ్ళుపోతాయ్ 
అని పారిపోయేలా చేయడం ఏం భావ్యం..?

ఇంతకూ ఆ దేవుణి ఉద్దేశమేమిటి ..?


చక్కని రాజబాటవేసి
వేయి కన్నులతో కనిపెట్టి చూడవద్దూ..?


కాదు కాదు

క్లిష్ట పరిస్థితులడ్డువైచి  నానావైకల్యములచే
మనసును కలంచి వేయుటయే 
అంటారు పుట్టపర్తి

ఇదంతయు దేనికి..?

అంటే


జ్ఞానో పార్జనకు తత్త్వదృష్టికి, 

కాచిన బంగారు దడ దడ పరుగెత్తిపోతుంది..
ఆవేశిత హృదయము శ్రీఘ్రముగా తత్త్వము నందుకొంటుందట..

వేయి యేండ్ల గురుబోధ కన్న 

ఇవి అతి త్వరలో కార్యోన్ముఖులను చేస్తాయట..

మహాత్ముడగు జీససు శిలువ ఎక్కకున్నా

ఆనంద పాంధుడగు సిధ్ధార్థుడు అడవులకు పోకున్నా
దక్షిణాఫ్రికాలో గాంధీ తన్నులు తినకున్నా
వారు సామాన్యులు గానే మిగిలిపోయేవారు


ఇట్టి పరిస్థితులు మహాత్ములందరికీ సంభవించినవే 

అంటారు పుట్టపర్తి
అప్పుడు వారును కష్టములకు జిక్కి తలపోసినవారే
రామభక్తుడగు కబీరు
దేవాలయమును గట్టిన రామదాసు

మొన్న మొన్న 

లేపాక్షిలో సరస సౌందర్యము గల 
శిల్ప విద్యకై ధనము వెచ్చించి 
కన్నులూడబెరికించుకున్న విరుపణ్ణ
ఈ కోటిలోని వారే నట..

చంద్రగిరిలో బిక్షమెత్తిన తిమ్మరుసు మంత్రి

భావి జీవితమున అఖండసామ్రాజ్జ్యమును 
తనచేతిలో ఆడించి మహా మండలేశ్వరుడై
భళిరా
అనిపించుకున్నాడు

మొన్నటివరకు

ఊరుపేరు లేని విశ్వేశ్వరయ్య
అల్లాడి
నేదు సకల సమ్మాన్యులైనారు


మనిషికి కష్టములు దుఃఖ పరంపరలు రావటం వలననే 

ఆత్మ పరిశోధన   సం  యమనము 
మొదలైన మహాపురుష లక్షణాలు వస్తాయట..


భవభూతి నాటక కర్త లో 
పుట్టపర్తి ఈ తెగలోని వాడే భవభూతి మహాకవి 
అంటారు
భవభూతి కరుణ రసాత్మకతను ఆరాధించే రోజులలో 
తన తొలి సంతానానికి 'కరుణ' అని పేరు పెట్టి
భవభూతి ని తన మనసులోనే కాదు
తన ఇంటిలోనూ కట్టేసుకున్నాడు..

ఇందులో 
భవభూతి చదివిన శాస్త్రములలోని జ్ఞానమును 
తన ప్రవర్తనమునకు జోడించుకున్నాడట భవభూతి 
భవభూతి కాలాన్ని 
అతని మనఃప్రవృత్తినీ 
ఆతని రచనలనూ విపులంగా వివరిస్తారు పుట్టపర్తి 

భవభూతి మనస్సు వీణాతంత్రి వంటిది
ముట్టిన వెంటనే ఖంగున మ్రోగును 
సామాన్యుల మైన మనకు 
అతని యావేశము బరువుగ దోచును
మనకంతటి హృదయము లేని దౌర్భాగ్యమేమోగానీ
ఆ మహాకవి కుంచికది కాదు 

ఈ వ్యాసం వ్యాససంపుటి లోనిది 
ఇప్పటికీ గ్రంధం మూడు ముద్రణలు పొందింది.