పుట్టపర్తి వారి అమూల్యమైన గ్రంధాలు Pdf లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుట్టపర్తి వారి అమూల్యమైన గ్రంధాలు Pdf లో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27 ఫిబ్ర, 2016

కుహు .. కు హూ ..



ప్రాచీన కావ్య సాహిత్యములు జెప్పెడి కొన్ని ఆచారములు మనకర్థమేగావు.
జీవన విధానమే మారిపోయినవి కదా..
నాచనసోముడు మొదలైన వారు ఇట్టి ప్రయోగము లెన్నిటినో చేసినారు.
కీర్తిశేషులు సురవరం ప్రతాపరెడ్డిగారు .. 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారి వంటి విద్వాంసులెంతయో శ్రమకోర్చి కొన్నింటి కర్థములను వివరించిరి.
కాని .. ఇంకను దెలియని వెన్నో గలవు.
అన్నమయ లోనిట్టివి వేలకు..
నలుగురు చెప్పని రీతిగా జెప్పవలె ననునాస వరాహపురాణములో నెక్కువ..
ఈ గుణము హర్షింపదగ్గదే..
కాని.. సాధించుట కష్టము..

ఆంధ్ర సాహిత్యములో నీ ''మురారే స్త్రుతీయః పంధా' ను సమర్థముగా నెగ్గించి కొన్నవారిద్దరే..
రాయలు.. తెనాలి రామకృష్ణుడు..
ఈ క్రిందిది వీరి వసంత వర్ణనములోనొకటి..

కం. తన పగతు కంఠమును బో
లె నటించురతీశ్వరుండలిగి కత్తుల బో
నున బెట్టిన మూల్గెడి విధ
మున పికము ప్రవాళ మధ్యమున నెలుగించెన్..

వసంత కాలములో కోకిల కూసిన స్వారస్యమిది 
మనకవులు కోకిల స్వరమును పంచమ స్వరముతో బోల్చి యెంతయో మురిసిరి..
దాని కషాయ  కంఠమున కేమేమో మేత లు ..
వీరి కోకిల మూల్గినదట..

వరాహ పురాణము పీఠిక నుంచీ..

31 అక్టో, 2015

పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి రచనలు నా జీవి వున్నంతలో అందరికీ అందుబాటులో వుంచాలని తపన పడ్డాను. telugu thesis వారికి రిక్వెస్ట్ చేస్తూ మైల్ చేస్తే వారు ఎంతో ఆదరించారు..నేను పంపిన కంచి కామకోటి సంపాదకీయాలు ప్రచురించారు . ఇంకా పంపితే ప్రచురిస్తామన్నారు. ఇప్పుడు Teluguthesis.com లో పుట్టపర్తి గ్రంధాలు చాలావరకు లభ్యమవుతాయి.
మిత్రులారా.. పుట్టపర్తి పండరీ  భాగవతం విశ్వనాధ వెన్నోళ్ళ పొగడినది బయటికి తేవటమెలా చాలా పెద్ద పుస్తకం స్కానింగ్ చేయటం చాలా పెద్ద పని అనుకుంటూ వుంటిని అది ఈ రోజు నాకు అక్కడ దర్శనమిచ్చింది వెంటనే లింక్ తీసుకున్న్నాను. ఇదిగో..
ఇకపై పుట్టపర్తి పై పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి.. నా ఉడుతాభక్తిని దేవుడు అప్యాయంగా చేకొన్నాడు. 

                                                                                                              ముందుమాట
ఈ పండరీ భాగవత గ్రంధకర్త మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాణాచార్యులు గారు. ఈయన ఈ గ్రంధం వ్రాసి ముప్పదియేండ్లైనదట.. ఈయన కీర్తి అంతకు ముందే మొదలుపెట్టినది. ఈ గ్రంధము మాత్రమిప్పుడు వెలికి వచ్చినది. ఇందులో పుండరీక చరిత్ర,చోకామీళుని కథ, నామదేవ చరిత్రము,గోరాకుంభారు కథ, నరహరి చరిత్రము అన్న అయిదు కథలు కలవు. మొదటి కథ పేరే ఇది. పండరీక్షేత్రమునందలి మహాభక్తుల కథల సంపుటి.
ఇది ద్విపదకావ్యము. పూర్వము మన దేశములో కొన్ని ద్విపద కావ్యములు కలవు. కొన్నింటికి కొంత మర్యాద కలదు. వేణుగోపాల శతక కర్త ద్విపద కావ్యములందు మర్యాద లేనివాడు. దానికి కారణమేమయి వుండును ? పద్యమునందున్న వైశాల్యము ద్విపదకు లేదనవచ్చును. ఒక లోతైన భావము ఒక విస్తారమైన భావము రచనా శిల్పముచేత మూర్తి కట్టించుటకు తగినంత వీలైన లక్షణము ద్విపదలో లేదని యాతడెంచినాడేమో..
కాని మన దేశములో స్త్రీల పాటలన్నియు ద్విపదలో నున్నవి. బసవ పురాణమునకు గౌరన హరిశ్చంద్రకు గల ప్రశస్తి కాదనుటకు వీలులేదు. రంగనాధ రామాయణము ద్విపద గ్రంధము. ద్విపద భారతమన్న గ్రంధము ఆంధ్ర విశ్వ విద్యాలయము వారు పూర్వమచ్చొత్తించిరి. అంద్లో చాల భాగము తిక్కన్న గారి పదాలు ద్విపదలో వ్రాసినట్లుండును. పద్య రచనకు ద్విపద రచనకున్న భేదము ఆ రెంటిని పోల్చి చుచినచో తెలియ గలదేమో..
ద్విపద యనిన తోడనే ఒక తాళము రెండు చరణములతో చెప్పదలచిన భావమైపోవుట. పాటకు వీలుగా నుండుట. సర్వ జనులకు చదువుటకు వీలుగా నుండుట మొదలైన లక్షణములుండవలసినట్లు కనిపించవచ్చును.
ఈ కావ్యములో నా లక్షణములు చాల నున్నవి. కాని ప్రౌఢి కూడా నున్నది. కొన్ని చోట్ల దీర్ఘ సమాసములు కలవు. ప్రతి చరిత్రకు చివర కవి తన కథ కొంత చెప్పి కొనుచుండెను. దాని వలననే కవిని గురించిన వాకబు చాల తెలియగలదు. 
ఈయన వ్రాసిన గ్రంధము పూర్వ ద్విపద కావ్యముల కేమియును తగ్గిపోదు. తగ్గిపోదు సరికదా కొన్నిచోట్ల పూర్వ ద్విపద రచనకు మెరుగు పెట్టినట్లుండును. 
ఈతడు కొన్నివిషయములలో నాకంటే ఘనుడు. అయినను ఈ రచనపై నా అభిప్రాయమడుగుట కేవలము స్నేహధర్మమని భావించుచున్నాను.
విశ్వనాధ సత్యనారాయణ


పండరీ భాగవతము రచన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

24 అక్టో, 2015

బాష్ప తర్పణము



ప్రొద్దుటూరులో జీవితం మొదలుపెట్టిన రోజులలో
మామూలుగానే క్రిందివారిని పరిహసించటం..
పైకి వస్తున్నవారిని కిందకు లాగటం వంటి
మనస్తత్త్వాలు పుట్టపర్తిని బాధించాయి..

చిన్నతనంలోనేఅమ్మను కోల్పోయిన పుట్టపర్తి
సున్నిత హృదయుడు..
పైకి కాఠిన్యం
ఎవరి వద్దా చేయి చాచటం
ఆత్మాభిమానాన్ని కుదువబెట్టి ప్రాపకం సంపాదించటం
వారిపై వీరిపై కథలల్లి వినోదించటం 
వంటి అవలక్షణాలు అంటని
పూవులాంటి స్వచ్చమైన వైఖరి..

సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ తారసపడ్డాడు
ధనవంతుడు.. 
అక్కడి రాజకీయాలనెరిగినవాడు.. 
పుట్టపర్తి తత్త్వాన్నీ
వైదుష్యాన్నీ బాగా గుర్తించినవాడు

అతడు పుట్టపర్తికి ఉద్యోగమిచ్చి
అండదండగా నిలబడ్డాడు..
కానీ కాలం మంచి వాళ్ళని బ్రతకనివ్వదుగా..
ఆయన భగవంతునికి ప్రీతిపాత్రుడయ్యాడు

అందరూ దుఃఖించారు
పుట్టపర్తి దుఃఖం 
ఇలా రాయలసీమ యాసలో వేదనలు చల్లింది..

సామాన్యంగా పంచరత్నాలు.. నవరత్నాలు.. 
గొప్పవారి ప్రాపకం కోసం 
తేలికగా కవుల నోళ్ళలో కులుకుతుంటాయి

కానీ పుట్టపర్తి తత్వా నికది విరుధ్ధం
తన మనసు స్పందించినపుడే అది కవిత అవుతుంది
కల్లలు కథలు పుట్టపర్తి నోట రావు..

కానీ సుబ్బయ్య మరణం
 పుట్టపర్తిని నిశ్చేతనుని చేసింది..

చూడండి..
అన్నీ కాదు గానీ అక్కడక్కడా.. విని పిస్తాను..

''దేవలోకంబునందు నినదించి రెవరొ
బసిడిగంటలు , నగవులు బరిఢవిల్ల
నిచట సుబ్బయ్యగారు గతించిరనుచు
గర్ణములు సోకినది.. వేడి గాడ్పు బలుకు..''

''మృత్యుదేవత నిప్పుల రెక్కలార్చి
కప్పికొనుటయె చావు లోకంబునందు
గాని సుబ్బయ్య యెడనది కనక రథము
దన్ను గొనిపోయె మోక్ష సౌధమ్ము కొరకు''

''చచ్చినాడందురేమియో జాల్ములార
జావలేదు మా సుబ్బయ్య జావలేదు
బ్రదికినాడోయి మృత్యుదేవతకు నతని
దాకు నధికారమేలేదు తథ్యమద్ది''

పుట్టపర్తి ఇంతలా బాధపడటానికి కారణమేంటి
ఆ కొప్పరపు సుబ్బయ్య ఎలాంటివాడు

''కవులకును రవ సెల్లాలు గప్పినాడు
బీదలకు మునుదెర్వు జూపించినాడు
బండితులకై గాన్కలు బంపినాడు
జేయని పనేమి యతడాంధ్రసీమయందు''

అదీ..
కొంచెం ధనవంతుడైతే..
ఆ ధనాన్ని దాచుకోవటమెట్లా అని చింత
ఎవరైనా లాక్కుపోతారేమోనని దిగులు
దీన్ని పెంచటమెలా అన్న బాధ
ఇదే కదా లోకం

ఆ ధనాన్ని మంచిపనులకు వినియోగించటం తెలిసిన వారెందరు
కొప్పరపు సుబ్బయ్యగారు కవులకు రవసెల్లాలు కప్పి తన కళాహృదయం చాటుకున్నాడు
అంతేనా
బీదలౌ తెరువు చూపించినాడు
పండితులకు కాన్క లూ పంపాడట..
ఇవి యే రాజుకో ఉండవలసిన లక్షణాలు కదూ..

ఇంకా చూద్దాం
ఆకలియటంచు దరిజేరినట్టివాని
నుస్సురననివ్వలేదట..

మాన్యులగు వారికొక యవమానమునుకూడా జరుగనివ్వలేదట..
ధర్మముంకు విఘాతమేర్పడు సమయంలో బదుగురను బిలచి ధర్మం జరిపించాడేమో..

ఇతడు హిందువు మన ఇంటివాడు..
ఇతను ముస్లిము పరాయివాడు
అన్న బేధమే చూపలేదట..

తనచుట్టూ వున్నవారిని
తల్లిప్రేమమ్ము..
తండ్రి చిత్తంబులోని క్షేమ తర్కమ్ము
చేర్చి ఆ నలువ సుబ్బయ్యను సృష్టించినాడట..
అందుకే సుబ్బయ్యగారి పలుకులందు  
అంత వాడిమి..  చిత్తమందు అంత తడి.. 
అంటారు పుట్టపర్తి

నిజమే కదా మానవత్వం గలవారిని చూచినపుడు
మన మనసులో కలిగే భావాలు ఇలాంటివే కదూ..

సుబ్బయ్య గారి ఇంటిని పుట్టపర్తి ఏమని వర్ణించారు

''అది గృహమె గాదు నిజముగా నన్న సత్ర
మతడు గృహిగాడు .. జనకుని యట్టి కర్మ
యోగి యాతని మనుగడ వ్యోమగంగ
త్యాగ భోగములకు సమర్థనము సెట్టి..''

నిజంగా ఒకప్పుడు 
ప్రతి ఇల్లూ అన్న సత్రం లాగే వుండేది కదా..
రాత్రి తొమ్మిదీ పది గంటలకు బిచ్చగాళ్ళు 
అమ్మా అంటూ
వచ్చేవారు..
ఆరోజు మిగిలిన కూరలు పప్పు అన్నం అన్నీ కనీసం ఒకరిద్దరి కడుపు నింపేవి..
కానీ ఈ ఫ్రిజ్జు లొచ్చిన తరువాత
బిక్షగాళ్ళూ లేరు..
మిగిలిన అన్నం వేయటమూ లేదు అన్నీ ఫ్రిజ్ లోకే
ఆ చలువ పెట్టెలు మన గుండెల్లోని చలువనెత్తుకెళ్ళిపోయాయేమో..'

డొక్కా సీతమ్మగారు అన్నదానానికెంత పేరుగన్నవారు
ఈనాటికీ ఆమెను స్మరించే వారు ఎందరో వున్నారు 

ఇదేమిటీ పుట్టపర్తి ఇలా పొగడుతున్నారు
అనుకుంటున్నారా..
ఇది చూడండి

''నాకు బొగడింత యన్నచో నచ్చదైన
బొగడకుండగలేను ఆ పుణ్యమూర్తి
గుణము గనపడ్డచో మెచ్చుకొననివాడు
తనువు దాల్చిన దయ్యంబు దైత్యకులుడు..''

పుట్టపర్తికి పొగడటం పొగిడించుకోవటం సరిపోదు
కానీ నిజంగా పొగడవలసినంత ఘనత ఎదురుగా కనపడితే..
గుండె విప్పి పొగడుతారు
అలా పొగడని వాడు 
'తనువు దాల్చిన దయ్యంబు ..దైత్య కులుడు'
 అంటారు నిజమే కదా..

మనం చూస్తూ వుంటాం
ఒకరు అందరినీ పొగడుతుంటారు..
దానిలో కొంత లౌక్యం..
మరికొంత ఒక మంచిమాట పడేస్తే పోయేదేముంది
అన్న ధోరణి..

మరికొంత మంది పిడివాదం.. ప్రతి విషయంలోనూ .. 
అలా విభేదించటం తమ తెలివి అనుకుంటారు .. 
భక్తి అంటే..
ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పూజలూ పునస్కారాలు
వాటిలో వున్నాడా దేవుడు అంటారు..
కానీ 
అవి చేయవద్దని ఆ దేవుడూ చెప్పలేదు కదా
అలా చేస్తూ చేస్తూ ఏకాగ్రత.. భావ శుధ్ధి కలిగి పరిపక్వత వస్తుంది
మొదటే ఎవరూ డాక్టరైపోరు.. LKG నుంచీ మొదలు పెట్టాలి 

మనసును అలా వదిలేస్తే మరింత చంచల మైపోదూ..

''పుణ్య పురుషులు త్యాగులేపొద్దు లేరొ
నాడె నమ్మిన నమ్మకున్నను  ఘటించు 
ప్రళయమనునది లోకంబులారలేదు
బ్రతుకుచున్నారు సుబ్బయ్యవంటి ఘనులు..''

నిజమే 
గుండె బరువెక్కుతోంది కదా..
ఎక్కడ చూచినా అన్యాయం.. అవినీతి 
మానవత్వం క్రమ క్రమంగా అడుగంటిపోతోంది..
ఇలా ఇంకా ఎంత అధమ స్థాయికి వెళ్ళిపోతుందో లోకం..
మన బ్రతుకులిలా వెళ్ళిపోతున్నాయి
మన పిల్లల రోజులు వచ్చేసరికి ఎలా వుంటుందో ఊహించుకోగలమా..
ఎక్కడో కొండకోనల్లో అన్నీ మరచి తపస్సాధనలో మునిగిన సాధువులూ
మంచినీ మానవత్త్వాన్నీ బ్రదికిస్తూ 
సుబ్బయ్య వంటి ఘనులూ ఉండడం వల్లే.
వారి పుణ్య బలమే 
ఈ ధరిత్రిని నిలబెడుతూందేమో..

సిధ్ధ సమాధియోగా కాంపుకు వెళ్ళాం 
తిరుమల కొండలలోని అడవుల లోకి
అక్కడ నిశ్చలంగా తపస్సమాధిలో కూర్చున్న యోగులను దర్శించాం
పుట్టలు పట్టిన వారిని చూచినప్పుడు
నిజంగా మనది తపోభూమి అనిపించింది..
బాష్ప తర్పణము

4 అక్టో, 2015

వసుచరిత్ర సాహితీ సౌరభములు

వసుచరిత్ర సాహితీ సౌరభములు

దివాకర్ల వేంకటావధాని వారి పీఠికతో..
పుట్టపర్తి ప్రియ పుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తిపూర్వక సమర్పణ

13 జులై, 2013

"తీరని బాకీ " ప్రసిద్ధ మళయాళ నాటకములకు పుట్టపర్తి అనువాదం


పుట్టపర్తి కేరళలో మళయాళ డిక్ష్నరీ రూపొందించడానికి 
ఆనాటి మళయాళ పండితుల ఎంపికతో 
అప్పటి కేరళ ప్రభుత్వముచే పిలువబడి
తిరువాన్కూరులో పనిచేస్తున్న కాలంలో 
మళయాళ ప్రసిధ్ధ నాటకాలను తెలుగుకు అనువదించారు. 
అదే యీ "తీరని బాకీ"

అలానే మన విశ్వనాధ సత్యనారాయణగారి ఏకవీరనూ  
మళయాళ భాషలో అనువదించి 
వారికి మన తేటతెనుగు కమ్మదనాన్ని రుచి చూపించారు

కేరళ ప్రభుత్వమూ

మీ తెలుగువారు మీ ప్రతిభను గుర్తించలేదు 
మేము మిమ్మల్ని మా కేరళ ప్రభుత్వము తరఫున 
ఢిల్లీ కేంద్ర గ్రంధాలయానికి మా ప్రతినిధిగా పంపుతున్నాము 
అని ప్రకటించింది


వీనిని అనువదించిన కాలంలోని పరిస్తితులూ
నాటి సంఘటనలను తెలుసుకొనే ప్రయత్నం చేసాను
కానీ
పుట్టపర్తిని తను సంపాదిస్తేనే కానీ గడవని 
కుటుంబ పరిస్థితులూ కానీ
ఆర్థిక పరిస్థితులు కానీ
కేరళ వాతావరణము కానీ
అక్కడ స్థిరంగా నిలుపలేక పోయింది
వారి ఆదరణ
అందివస్తున్న అవకాశాలకంటే
సాధనా మార్గమే ఆయనకు అమూల్యమైనదిగ తోచింది
అందుకే బ్రతుకునకు బడిపంతులు ఉద్యోగమే తనకు సరైనదిగా ఎంచి
తిరిగి కడప గడప తొక్కి
జీవితంలోని ప్రతిక్షణాన్నీ అటు సాహిత్యానికీ

ఇటు ఆధ్యాత్మికానికీ పంచి పెట్టారు.

భగవంతుడు నాకీ అవకాశాన్నిచ్చి 
నన్ను తరింపజేసినందుకు
మా అయ్య నా గురువు 
శ్రీమాన్ పుట్టపర్తి వారి ఆశీస్సులు నాకు లభిస్తాయని 
నా విశ్వాసము.

పుట్టపర్తి అనూరాధ



21 జూన్, 2013

"సరస్వతీ సంహారము " కన్నడ మూలం : బీచీ తెలుగు అనువాదం : సరస్వతీపుత్ర పుట్టపర్తి

"సరస్వతీ  సంహారము " 
ప్రముఖ కన్నడ రచయిత బీచీ రచనకు
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అనువాదం

కన్నడ భాషపై పుట్టపర్తికి చాలా అభిమానం  
మా అమ్మ మా పెద్ద బావగారు 
బసవని వచనాలు తెలుగు లోకి అనువాదం చేసారు..

మా రెండవ అక్కయ్యను 
కర్ణాటక లోని హొస్పేట వద్ద నున్న 
కామలాపురానికి ఇవ్వడం
 అక్కడికి  హంపీ శిధిలాలు దగ్గరే కావడం
 అయ్యకు పరమానందం 

అంతేకాక 
మా బావగారు శ్రీమాన్ రామానుజాచార్యులు 
చాలా మంచివారు. బంధు ప్రీతి ఎక్కువ
మా అయ్యను తన తండ్రి లాగానే 
చూచి ప్రేమించి బాధ్యతను కూడా తీసుకొని 
మా అందరి పెళ్ళిళ్ళూ పెద్దరికం వహించి 
మా అమ్మకు కొండంత అండగా నిలబడినవాడు


మా అయ్య జబ్బు పడినప్పుడు
సొంత కొడుకు కంటే ఎక్కువ సేవ చేసాడు
రెండునెలలు సెలవు పెట్టివచ్చి 
ఆసుపత్రికి రోజూ వెళ్ళి 
పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ అక్కడే వుండటం 
మందులు జాగ్రత్తగా ఇవ్వటం 
చివరికి బాత్రూముకు కూడా తీసుకు వెళ్ళటం 
ఎన్నని చెప్పను..

అయ్య అప్పుడప్పుడూ కామలాపురానికి వచ్చి 
ఒకటి రెండు నెలలుండి
తన  మనవలు మనవరాళ్ళతో సరదాగా 
ఆ శిధిలాల మధ్య తిరుగుతూ
తమాషా కబుర్లు చెబుతూ 

మా బావగారి  తోటలోని 
మామిడి పళ్ళను పనస పళ్ళను పొట్టపగిలేలా తింటూ 
తృప్తిగా కాలక్షేపం చేసేవారం మేమందరం ..

మా బావగారికి సాహిత్య వాసన లేవీ లేకపోయినా 
మంచి మనసుండేది
ఇప్పుడు ఆయనా లేరనుకోండి
జీర్ణ కోశం కాన్సరుతో పోయారు
దేవుడు మంచివాళ్ళను తొందరగా తీసుకు పోతాడు అనిపిస్తుంది

అన్నట్ట్లు 
మా బావగారు Western way లో జాతకాలు చెప్పేవారు
ఆయనతో మా అయ్య 
తన జాతకం ఎన్నిసార్లు చెప్పించుకున్నారో 

29 మే, 2013

శ్రీ శివ లీలా స్తవము






అవి 

పుట్టపర్తి చివరి రోజులు..
''శ్రీ శివలీలా స్తవాన్ని'' 
ఆ రోజుల్లో శిష్యునిగా భక్తునిగా 
ఇంటికి తరుచూ వచ్చే
లక్ష్మీ కాంతం శ్రేష్టి చేతిలో పెట్టారు
ప్రచురించమని 

పుట్టపర్తి వ్రాత అర్థం కాక
తిరిగి అడిగితే ఆగ్రహిస్తారేమో నన్న భయంతో 
కొన్నాళ్ళు..
సంస్కృత శ్లోకాను ..
అవీ శివ పార్వతుల శృంగార ప్రధానమైన వానిని
ప్రజలు యే విధంగా అర్థం చేసుకుంటారో నని కొన్నాళ్ళూ 
కాలయాపన చేసారు..

ఈలోగా 
పుట్టపర్తి పరలోక గతులయ్యారు.
తరువాత 
తన గురువు చివరి కోరిక తీర్చలేకపోయానన్న
బాధ లక్ష్మికాంతం శ్రేష్టిని ఆవరించింది
ఆయన తన ప్రెస్సుకు వచ్చిన 
బ్రహ్మశ్రీ అయిలావఝ్ఝుల రామకృష్ణ శాస్త్రి గారిని 
వనిని కాస్త అర్థం అయ్యేలా వ్రాసి ఇమ్మని అర్థించాడు

వానిని పరిశీలించిన ఆయన

పార్వతీ దేవి అంగాంగ వర్ణన 
ఒక్క ఆది శంకరులకే చెల్లింది..
మరి పుట్టపర్తి వారి ఈ శ్లోకాలను
ఏ విధంగా అర్థం చేసు కోవాలని ఆలోచించి
క్షేత్రయ్య అన్నమాచార్యులు 
జయదేవుడు నారాయణ తీర్థులూ 
భగవంతునిపై శృంగార కీర్తనలు చేసారు..

అనుకొని..

పుట్టపర్తి ఆధ్యాత్మిక సాధనావిశేషములను
 పూర్తిగా తెలిసిన వాడవటంచేత..
అట్టి వ్యతిరేక అనుకూల భావాలు
వారి వారి ప్రాక్తన జన్మార్జిత 
సుకృత దుష్కృత పరిణామ ఫలానుసారంగా 
ఏర్పడతాయని భావించి

ఎత్తివ్రాయడమే కాదు 

శ్లోకాలు చాలా ఇంపుగా వున్నాయి
వీనికి తాత్పర్యం కూడా వ్రాస్తాను అని అడిగారు
శ్రేష్టి  సంతోషంతో ఒప్పుకొని 
పుస్తకాన్ని ముద్రించారు
అదే ఇది..

మా తండ్రి 

కలను నెరవేర్చడంలో నేనూ పాత్రధారి నైనాను
వారి దివ్యాశీస్సులు నాకూ అందుతాయి 


ఒకసారి

లక్ష్మికాంతం శ్రేష్టితో ఫోన్ లో మాట్లాడాను
ఎంత సంతోషపడ్డారో చెప్పలేను
ఆరోజుల్లో 
చాలామంది మంత్రోపదేశం చేయమని
అయ్య అమ్మలను ప్రాణాచారం పడేవారు
కానీ
అందరికీ మంత్రం ఇచ్చేవారు కాదు..
కొందరికి ఏవో స్తోత్రాలు..చెప్పి పంపేవారు..
నీకు ఇదే సరిపోతుంది 
దీనినే త్రికరణ శుధ్ధిగా చేయి అనేవారు

కానీ కొందరు విడిచేవారు కాదు

పలురకాలుగా ఇబ్బంది పెట్టేవారు
అయ్యను నీడలా నుసరించి
వారికి సేవలు చేసి
పురాణానికి వెళ్ళే టప్పుడు
వెనుక భాగవతం పట్టుకుని నడిచీ
ఏవేవో చేసే వారు
వారి దృష్టిలో పుట్టపర్తి భగవత్స్వరూపుడే..

ఎవ్వరెన్ని చెప్పినా

వారే ఎన్ని చూచినా పట్టించుకొనే వారు కాదు.

అయ్య తప్పించుకోవటానికి 

'మీ అమ్మ దగ్గరికి పో..'
అని పంపే వారు..

అమ్మ 

ఇక తప్పక..
వారికి యేదో చెప్పి పంపేది..

అలా యెన్నో సంవత్సరాలు అనుసరించిన వాడే

నా గురుదేవులు
వ్యాసం వ్రాసిన రఘూత్తమ రావు..


రఘూత్తమ రావ్ ద్వారా 

ఏవేవో అనుభవాలను విన్న వారు మాకూ అయ్యను మంత్రోపదేశం చేయమని చెప్పు అని బ్రతిమాలేవారు..

ఒక్కో సారి అయ్య 

ఒరే .. నా ఆశ్రయం పొందితే ఉన్నవి కూడా పోతాయి
సర్వ భ్రష్టుదవవుతావు..
లెక్కలేనన్ని కష్టాలు చుట్టుముడతాయి..
అవి నీవు భరించలేవు..
పరమాత్మ నీ మానసిక శక్తిని పరీక్షించి వదులుతాడు..
ఎందుకీ బాధ..
''మీ అమ్మ దగ్గరికి పో..
ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతావు..''
అని చెప్పేవారు

అన్యాపదేశంగా 

నేను 
నారాయణ స్వరూపుడిని
మీ అమ్మ
లక్ష్మీ స్వరూపం 
అని చెప్పక చెప్పినట్లే కదా 
అని ఆనాటి భక్తులూ శిష్యులూ పరవశంతో అనుకొని
ఇంకా
ఇంకా
వెంటపడేవాళ్ళు.. 

అన్నట్లుగానే..

రఘూత్తమ రావ్
అయ్యను ఆశ్రయించిన కొన్నేళ్ళకే
ఆయన భార్య.
ఎదిగిన కొడుకూ
వయసొచ్చిన కూతురూ..
హటాత్తుగా కన్నుమూసారు..


ఈ విషయాలు చిన్నపిల్లలమైన మాకు 

బాధపడుతూ కాక
అదేదో ఒక తమాషా సంఘటనలాగా చెప్పేవాడు
 రఘోత్తమరావ్ సారు 

అమ్మను ఆశ్రయించి

అన్ని కష్టసుఖాలలో అమ్మకు చేదోడుగా వున్న
మా అన్నయ్య మాలేపాటి సుబ్రమణ్యం
చదివింది అయిదో క్లాసు అయినా
చిన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేరి.. 
Oriental General Insurance కు 
Divisional Manager  స్థాయికి ఎదిగాడు..


''అయ్యకు చేతబడి విద్య కూడా తెలుసమ్మా..''
అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు లక్ష్మీకాంతం శ్రేష్టి..
''కానీ 
అయ్య వానినెప్పుడూ దుర్వినియోగం చేయలేదు..''
అన్నాడు కూడా..








Enter your message here.

3 మే, 2013

షాజీ కావ్యాన్ని పుట్టపర్తి తన పందొమ్మిదవ యేట వ్రాసారు 
అప్పటికాయన తిరుపతిలోచదువుతున్న విద్యార్థి.
 రచనను పుట్టపర్తి నోటివెంట విని సమ్మోహితులైన తోటి విద్యార్థులు 
దీని ముద్రణకు కారకులయ్యారు. 

ఇందులో ఇంకో విశేషముంది
 అదేవిటంటే.. 
ముద్రణ అయిన మరుక్షణం ఇది నాటి ఇంటర్ మీడియట్ పాఠ్య గ్రంధమైంది 
రాసినవాడప్పటికి ఇంకా విద్యార్థియే.. 
 అంతటి అమూల్యమైన కావ్యాన్ని
 మీ ముందుకు భక్తి పూర్వకంగా తెస్తున్నది 
వారి ప్రియ పుత్రిక శ్రీమతి పుట్టపర్తి అనూరాధ


11 జన, 2013

ఇది హిందీ జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత మహదేవి వర్మ పుట్టపర్తి వారికి 1955లో వ్రాసిన లేఖ


ఇది హిందీ జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత మహదేవి వర్మ పుట్టపర్తి వారికి 1955లో వ్రాసిన లేఖ by Anu Radha

పా ద్య ము


"ఋషికాని వాని వ్రాతలు మసి దండుగ కాక ఇంకేమి..?"
 అని  ఎన్నో రచనలను స్వహస్తాలతో చించివేసిన 
పుణ్యపురుషుడు పుట్టపర్తి 
వ్రాసిన వ్రాతలతో పాటూ 
ఋషి కావడానికీ ..
 త్రికరణ శుధ్ధిగా ప్రయత్నించిన 
"పుట్టపర్తి"
 నభూతో న భవిష్యతి. 

ఈ "పాద్యమ"నబడే గ్రంధం
మరాఠీలో సంత సాహిత్యాన్ని చదువుతూఉండిన కాలంలో
ఆ ప్రేరణతో వ్రాసినది
"ప్రేమా భక్తీ మొదలైన వాటికి నశ్వరత్వమూ మాలిన్యమూ లేనట్లే
వాని లక్ష్యాలకు కూడా లేవు
ఈ సత్యాన్ని అనుభవించిన వారు ఋషులు -  కవులు "
 అంటారు. పుట్టపర్తి వారు. 


8 జన, 2013

సప్తగిరి ప్రచురితమైన పుట్టపర్తివారి భాగవతం ఇంగ్లీషు వ్యాఖ్య



సప్తగిరి ప్రచురితమైన పుట్టపర్తివారి భాగవతం ఇంగ్లీషు వ్యాఖ్య Pdf లో మీ కోసం- పుట్టపర్తి అనూరాధ 




6 జన, 2013

వాగ్గేయకారులు పదకృతి సాహిత్యం






త్యాగయ్య తెనుగు దేశమునకు జాతికి నిల్పిపోయిన పెన్నిధులు మూడు రామభక్తి సామ్రాజ్యమొక్కటి సారమైన సంగీతము మరియొకటి,సుధామాధుర్యభాషణ సుకవిత్వము మూడవది. ఆచార్యులవారి సంగీత పాండిత్యానికిది మంచి ఉదాహరణ. వారి ప్రియ పుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ..

vaaggeyakarulu padakrutisaahityam

విప్లవ యోగీశ్వరుడు. రచన సరస్వతీపుత్ర పుట్టపర్తి -వారి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ

1960 లో ప్రధమ ముద్రణ కాబడిన ఈ పుస్తకం వెల అక్షరాలా అరవై అయిదు పైసలు ఆంధ్రా బుక్ స్టాల్ నంద్యాల పబ్లిషర్స్ ముద్రించారు. అరవిందుల జీవితమునకిదొక దర్పణము. అదీ పుట్టపర్తి నారాయణాచార్యులవారు చూపినది Vip Lava Yogis Varu Du

6 డిసెం, 2012