14 ఫిబ్ర, 2014
యజ్ఞ వేదిక
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
తస్మాత్ జాగ్రత జాగ్రత.
''కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత.. ''
జీవితం ఒక కల వంటిది..
జీవి కనే కల
షడూర్ములు కలలోని సన్నివేశాలను
నిజమని భ్రమింపజేస్తాయి..
ఆ సన్నివేశాలతో మమేకమై
జీవి తప్పటడుగులు వేసేలా
పురికొల్పుతాయి
ప్రయాణాన్ని నాలుగడుగులు ముందుకూ
మూడడుగులు వెనక్కు పడేలా చేస్తాయి..
జ్ఞానమనే రత్నాన్ని అపహరించే దొంగలు
కామ క్రోధ లోభాలు
జీవుని యాత్రలో వెనక్కి పోయేటట్లు..
భయంకరమైన యాతన వేపుకు తోసివేయగల
నైపుణి వాని సొత్తు
వానికి జీవితోటే కానీ
అతను వేసుకున్న బట్టలతో పనిలేదు
రాజైనా పేదైనా సాధువైనా సన్యాసైనా..
ఒకటే
క్షణంలో రాజును పేదలా..
సన్యాసిని సంసారిలా..
మార్చేస్తాయి
గీతాచార్యుడందుకే వీనిని
'నరక ద్వారములు' అన్నాడు..
ఈ నడుమ ఒక రోజు నాకో ఫోన్ వచ్చింది..
ఒక పీఠాధిపతి కార్యాలయం నుంచీ
ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు
పీఠాధిపత్యం పొందాడు
జీవితంలో కొన్ని అయాచితంగా లభిస్తాయి
వానిలో మన ప్రమేయమేం వుండదు..
పాపం పసివాడు
సన్యాసదీక్ష అవలంబించాడు..
అనుకొని..
పుట్టపర్తి ప్రతిదినమూ వారింటికెళ్ళి
భగవద్గీత చెప్పేవారట..
వానికి సన్యాసి ధర్మం గురించి
యేదో నేర్పించాలని తపన
పుట్టపర్తికీ కొంత సన్యాసిత్వం పై అపేక్ష వున్నది
అందుకు కారణం
కొందరు లోపల వున్నారు
వారు ..
అరవిందులు..
రమణులు..
రామకృష్ణులు..
వారు ఆశ్రమ జీవితం కొరకు కొంత ప్రయత్నించి వున్నారు కూడా
కానీ మనసులోని అన్ని భావనలను సాకారమొనర్చడం సాధ్యం కాదు
అదీ భార్య నలుగురు పిల్లలతో..
తన సఫలమవని కోరికపట్ల అసంతృప్తి..
కానీ ..
ఆశ్రమ జీవితంపై విడని మోహం..
చంద్ర శేఖర పరమాచార్యులవారు కూడా
అతి చిన్నవయసులో పీఠాధిపతిగా యెంపిక అయ్యారు
ఆ పసివాడు గుర్రపు బండిలో బోర్లా పడుకుని
తనలో తాను దుఃఖించార ట..
ఆ తర్వాత ఆ కొత్త పాత్రలో వొదగడానికీ
తనను తాను మార్చుకోడాని కి
దినదినమూ ప్రయత్నం చేశారట..
కొత్తలో సత్యదండాన్ని వదలి తిరిగేవారుట..
తరువాత
తన నడుముకు బట్టతో గట్టిగా కట్టుకుని పడుకునేవారు
ఆ ప్రయత్నాలు స్వచ్చమైన..
శక్తివంతమైన సన్యాసిని ..
మనకు చూపాయి..
యెక్కడికైనా నడకే..
లేదా పల్లకీ
ఇతర వాహనాలు యేనాడూ యెక్కలేదు..
మౌన వ్రతాలూ ఉపవాస దీక్షలూ..
కఠిన ఆహార నియమాలూ
ధ్యాన యోగాది నిత్యకృత్యాలూ..
వయసు ప్రలోభాలకు తావివ్వలేదు..
పూర్వాశ్రమ బంధాలను
తిరిగి కొనసాగించలేదు..
పూర్తిగా తన జీవితాన్ని
వైదిక ధర్మానికి ఆశ్రమ విలువలకూ రాసిచ్చేసారు..
అందుకే ఆయన్ని నడిచే దేవుడన్నారు..
కోటీశ్వ రులు సైతం రోడ్డుమీద కూడా సాగిల పడేవారు..
యీనాడూ కూడా మంచి కార్యాక్రమాలను నిర్వహిస్తున్న గణపతి సచ్చిదానంద స్వామి
వంటి వారూ..
అలానే సన్యాసిత్వానికి మసి పూస్తున్న నిత్యానందలూ
మనకు తగుల్తూనే ఉన్నారు..
మరీ స్వామి మనకేం చెబుతారో..
అని ఆలోచిస్తూ
నేను వెళ్ళాను..
దూరం నుంచే.. కిటికీ లోంచీ పేద్ద టీవీదర్శనమిచ్చింది
అందులో ఫుట్ బాల్ మ్యాచ్..
బయట పిల్లలు పిలకలతో వేదాలు చదువుకుంటున్నారు
మరి..లోన టీవీ..??
నాకు సాదరంగా ఆహ్వానం పలికారు..
టీవీ రూం లొంచీ స్వామి బయటికి వచ్చారు..
వూగే వుయ్యల కుర్చీలో స్వామి ఆశీనులయ్యారు..
స్వామి భారీ విగ్రహం కుర్చీలో కష్టపడి ఒదిగింది..
ఇంతలో స్వామి వారి సహోదరులు వచ్చి చేరారు..
'పుట్టపర్తివారు మాకు చాలా సన్నిహితులు..'
అంటూ చెప్పారు..
కానీ..
తరువాత సాగిన సంభాషణ అంతా ..
ఎవరు అన్య కులస్తుణ్ణిచేసుకున్నారు..
ఎవరెవరికి యేయే వ్యసనాలున్నాయి..
వగైరాలచుట్టూతిరిగింది..
పది మాటలు స్వచ్చంగా ధారగా సూటిగా
మాట్లాడలేని స్వాములవారు..
మాటిమాటికీ తడబడుతున్నారు..
వాళ్ళ లో వాళ్ళే మేనేజర్లూ..అకవుటెంట్లూ..నట..
కాషాయ వేషధారణలో తప్ప
యెందులోనూ కనపడని పవిత్రత..
ఆకాషాయంకూడా గత్యంతరంలేక
వాళ్ళని భరిస్తున్నట్లనిపించింది..
పైకి సంభాషణ సాగుతున్నా
లోలోన నా మనసు రోదిస్తోంది
మా అయ్యగురించి
యేమైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో
అని ఎంతో ఆశగా వెళ్ళిన నాకు
తీవ్ర భంగపాటు..
స్వామి గారూ ..వారి సహోదరులూ..
ఆ వాతావరణం చూసిన నన్ను
చుట్టుముట్టిన అశాంతి..
అతనే..
అతనే ..
సన్యాసి..
నిజమైన సన్యాసి..
నిజమైన సన్యాసి..
నా మనసులో ధ్వనులు ప్రతిధ్వనులను సృష్టిస్తున్నాయి..
''నేను ఇన్ని కోట్ల గాయత్రి చేసాను ..
ఇన్ని కోట్ల అష్టాక్షరి చేసాను ..
ఇదీ నా స్థితి..
నాకే అనుభూతీ కలుగలేదు....
నీకు కలిగిందా..?
నీవు దేవుణ్ణి చూశావా ..?
నాకు చూపగలవా ..?''
అని పీఠాధిపతులనే ప్రశ్నించి తత్తర పుట్టించినవాడు
వాళ్ళేం చెబుతారు..
అంత సాధన వాళ్ళే చేసివుండరు
అదీకాక అంత తపన వాళ్ళలో వుంటేకదా..?
ఆధ్యాత్మికానుభూతి కలుగలేదని
అశాంతితో ఇల్లు విడిచి దేశం పట్టిపోయి..
అనేక మంది సాధువులనూ సన్యాసులనూ కలుస్తూ..
చివరకు హిమసానువుల పైనుంచీ విరక్తితో
జీవితం త్యజించాలనుకున్న పుట్టపర్తి ఎక్కడా..
వీళ్ళెక్కడా..
అందుకే పుట్టపర్తికి దేవుడు కనిపించాడు
దయానంద సరస్వతి గా ..
ప్రేమగా తన ఆశ్రమానికి తీసుకెళ్ళారు..
అన్ని విధాలా పరీక్షించారు..
కాదు కాదు
తండ్రి తన పిల్లవాణి సామర్థ్యానికి మురిసినట్లు మురిసిపోయారు
పుట్టపర్తిని విరక్తినుంచీ బయటకు తెచ్చి..
నాయనా నీకు ఇంకా జీవితం ముందుంది..
కీర్తి కిరీటాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి..
ఎన్నో అనుభవాలు నీకై వేచి వున్నాయి..
తరువాత ..
నిన్ను నేనే నా దగ్గరికి పిలిపించుకుంటాను..
అని చెప్పి పంపారు..
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యులవారు
నీకు అంత్యదశలో కృష్ణదర్శనమవుతుందని భరోసా ఇచ్చారు..
నూనెకీ ...నీటికీ ..తేడా లేదు
అగ్నిలో పోసినప్పుడు మాత్రమే..
దాని నిజ స్వరూపం తెలుస్తుంది..
అగ్నిని ఆర్పేవి నీళ్ళు
మరింత ప్రజ్వలింపజేసేది నూనె..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)