20 ఫిబ్ర, 2014

ఒకసారి అమ్మతో గండికి పోదామా




మా ఇంట్లో కొన్ని డబ్బులు కూడాయి
అమ్మ అయ్యకు దిక్కు తోచలేదు
డబ్బులేకపోతే ఒకటే సమస్య
డబ్బుంటే చీంతే చింత
కవి వైసీవీ రెడ్డి ఒక దిక్కుమాలిన సలహా చెప్పాడు
 

ఒక పెంచలమ్మ
ఆమె మున్సిపాలిటీలో స్వీపరు
కానీ పెద్ద పెద్ద వారితో పరిచయాలు
వడ్డీ వ్యాపారం చేస్తుంది
పోలీసు అధికారులు ఎందరో పెద్దవాళ్ళు 

ఆమె దగ్గర తమ డబ్బు దాస్తుంటారు
ఆమె నెల నెలా వడ్డీ తెచ్చి ఇస్తుంది
 

అమ్మ అయ్య ఇద్దరూ బాగానే ట్రాప్ లో పడ్డారు
పెంచలమ్మ వచ్చింది
ఇంట్లో మూలన కూచుంది
అచ్చం బాపు బొమ్మలా వుంది 

ఇంకా మాట్లాడితే 
విష్ణువు ఎత్తిన మోహినీ అవతారంలా వుంది
పెద్ద కుంకుమ బొట్టూ నోట్లో తమల పాకులూ
 

మధ్య వర్తి యైసీవీ.. 
డబ్బు తెచ్చి ఆమె చేతిలో పోసారు  
ఒకానొక దుర్ముహూర్తంలో ఆమె  పరారైంది 


 అమ్మ అయ్యల వేదన కంతులేదు
ఇంట్లో ఇద్దరాడపిల్లల పెళ్ళి చేయాలి 

పెద్ద సంసారం
అయినా యీ మాయలో మనం పడటమేమిటి 

అన్న పశ్చాత్తాపం
అమ్మ అయ్య ఆజ్ఞ మేరకు వేంపల్లె ప్రయాణమైంది
అప్పట్లో ప్రయాణమంటే 

బియ్యం పప్పులూ చింతపండు మూటగట్టుకొని బస్సెక్కడమే
అమ్మ వెంటే నేనూ 

మొండిచేయటం ఒక బ్రహ్మాస్త్రం
సరే..
 

గండి ఆంజనేయ క్షేత్రం
చుట్టు కొండలు పారే నది పచ్చటి ప్రకృతి
 

బస్సు దిగినాక చాలా దూరం నడవాలి
అక్కడ యే వసతులూ లేవు
భక్తులు వస్తారు అంతే
రోగగ్రస్తులూ మానసిక రోగులూ ఎక్కువ
నదిలో స్నానం చేయడం గుడిలో కూచోవటం
నమ్మిన వారికి నమ్ముకున్నంత
 

ఒంటరిగా ఆడమనిషి ఎలా వెళుతుంది
ఎక్కడ వుంటుంది

భద్రత వుందా
ఇవేవీ అయ్యా ఆలోచించరూ
అమ్మా ఆలో చించదూ..
యేం మనుషులో కదూ
 

అయ్య ఆజ్ఞా
 వెంటనే  రామాయణం చంకలో పెట్టుకొని 

 అమ్మప్రయాణం
సరే కథ కొస్తా
అక్కడ ప్రకృతి ఎంత బాగుందనుకున్నారు
అబ్బ..
 నడక దారిలో చిన్న నీటిపాయ
అందులో చిన్న చిన్న చేపపిల్లలు
పెద్ద పెద్ద చామ ఆకులు   
నేను చిన్న పిల్లను కదా ఆటలే ఆటలు

 పాపఘ్ని నది అట
అమ్మ నదిలో స్నానం చేసి గుడిలో కూర్చొని 
పారాయణ చేస్తుంది
నలభై రోజులు
పారాయణ యే రెండుకో మూడుకో నాలుగుకో 

ఒక దరికి చేరుకుంటుంది
అప్పుడు సత్రానికి వచ్చి వంటచేస్తుంది
 

ఎట్లంటారా
మూడు రాళ్ళు పెట్టి కట్టెలతో వంట..
అన్నం పప్పు
నాకు అన్ని స్తోత్రాలు పాటలూ వచ్చేవి..
ఆడుతూ ఆడుతూ స్తోత్రాలు చెప్పేదాన్ని


ఇంకో విషయం
అక్కడ దయ్యం పట్టిన వాళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు స్వామి దగ్గరికి
 

నర సిం హస్వామి ఆంజనేయ స్వామి
దగ్గరికి వీళ్ళు ఎక్కువగా తీసుకొస్తారు
వీళ్ళు ఫేమస్  దయ్యాల డాక్టర్లు..
నలభై రోజుల సేవ చేయించి తీసుకెళ్తారు
తగ్గుతుందేమో
తగ్గకపోతే ఎందుకు వస్తారు 


వాళ్ళు మనపక్కనే కూచుని ఊగుతుంటారు
మా అమ్మ అయ్యలతో నేను ఘటికాచలామో 

మరి తులజాపూరో పోయినప్పుడు
అక్కడా ఇదే
యీ దయ్యం పట్టిన వాళ్ళని  ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు
 

భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు దండం పెట్టుకొని
 వీరి మధ్యనుంచే వెళుతుంటారు
వీళ్ళు ఎవరినీ యేమీ చేయరు
 

ఆఖరికి పన్నెండు గంటల వేళ గంటలు పెద్దగా మోగిస్తూ హారతి ఇస్తూ పాటలు పాడుతూంటారు
అప్పుడు యీ పూనకమొచ్చిన వళ్ళని చూడాలి రెచ్చిపోతారు
 

ఒకామె రాతి స్థంభాన్ని సర సరా యెక్కింది
ఆ స్థంభానికి పట్టు యేమాత్రం దొరకదు 

యేవో బొమ్మలు చెక్కివున్నాయి
ఆమె ఆ స్థంభాన్ని యెక్కి వూగుతున్న పేద్ద గంటని అందిపుచ్చుకుంది
స్థంభాన్ని వదిలేసి గంటని పట్టుకొని వెళ్ళాడుతూంది
ఉల్టా కాలి వేళ్ళతో ఆ స్థంభం గొలుసులని పట్టుకొని
ఆ గంటమీదినుంచీ కిందికి వేళ్ళాడుతూంది
తన శరీరంతో ఆ గంటని పెద్ద పెద్దగా వూపుతోంది
ఎంత వేగంగా  అంటె నేను చెప్పలేను
 

భక్తులు భయంగా ఆమెను చూస్తూ దేవుణ్ణి చూస్తూ హారతిలో పాల్గొంటున్నారు
ఆమెకు ఆ కాలి వేళ్ళతో ఆ గంట గొలుసులలో 

ఎట్లా గ్రిప్ దొరికిందో
కిందపడకుండా అంత వేగంగా ఎలా ఊగిందో నాకే తెలీదు అసలా స్థంభం ఎలా సర సరా యెక్కిందో కూడ ఆశ్చర్యమే..

వాళ్ళ దీక్ష అయిపోతూనే  

వారి ఉన్మాదం నెమ్మదిస్తుండవచ్చు
 

అంతెందుకండీ
ఒకసారి ఒక ప్రఖ్యాత వైద్యుడు అతి కష్టమైన కీలకమైన ఆపరేషను చేస్తున్నాడట
దాన్ని వైద్య విద్యార్థులు చూస్తున్నారు
రోగి బంధువులు వున్నారు
టీవీల గుండ అది ప్రసార మవుతూంది
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది 

విలేకరులడిగారు అంత పెద్ద ఆపరేషను అంతమంది చూస్తుండగా ఎంతో నిబ్బరంగా ఎలా చేసారు అని
 

దానికి అతనేం చెప్పాడో తెలుసా..
అక్కడ ఎవరున్నారు ముగ్గురమే.
నేను రోగి ఆ భగవంతుడు అన్నాడట..


ఎంత డాక్టరైనా 
తాను ఒక పనిముట్టును మాత్రమే నని 
అతనికి తెలుసు

సరే..
నలభై రోజులు ముగిసాయి
చివరిరోజు అక్కడ అమ్మ పూజముగుస్తుందని తెలియగానే
అయ్య శిష్యులు మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు 

మా నాగక్కయ్య స్నేహితుల కుటుంబాలు
అందరూ గండికి ప్రయాణమై వచ్చారు
అమ్మ అయ్య యేం చేసినా వారికి అపురూపమే
 

చివరికి యేం జరిగింది ..
ఆ పెంచలమ్మ ఊరికి తిరిగి వచ్చింది 

మాఇంట్లో అదే మూలన వచ్చి కూచుంది
 ఆ హనుమంతుడు తన తోకతో పట్టి తీసుకు వచ్చాడని మురిసిపోయారందరూ

శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి


"శత వసంత సాహితీ కీర్తి పుట్టపర్తి "

ద్రవిడ విశ్వ విద్యాలయం తెలుగు శాఖ వారు 
పుట్టపర్తి శతజయంతి సందర్భంగా 

3 నుంచీ 5 వ తారీకు కుప్పం లో వరకు మూడు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు

వారు సూచించిన వివిధ అంశాలు 
చాలా కొత్తగా వైవిధ్య భరితంగా ఉన్నాయి
ఔత్సాహికులు పాల్గొనవచ్చు