పుట్టుకనుంచీ మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం
చదవగలిగితే ప్రతి జీవితమూ చరిత్రే..
జీవితం ఒక్కొక్కరి దృష్టికి ఒక్కోలా కనిపిస్తుంది
చార్లీ చాప్లిన్ హాస్యనటుడు
ఆయన జీవితం గురించి యేమంటారంటే..
లాంగ్ షాట్ లో ఆనందం గా
క్లోజప్ లో విషాదంగా కనిపించేదే జీవితం
ఆరుద్ర గారైతే జీవితాన్ని రేడియో సెట్టుతో పోల్చారు
జీవితం రేడియోసెట్టుకు భర్త ఏరియల్ భార్య ఎర్త్
అట..
'జీవితంలో అందరిప్రయత్నమూ గెలవడానికే..
ఎవ్వడూ ఓడదలచడు..'
ఇది దాశరధి రంగాచార్య గారి మాట ..
బాగా చదివి వుద్యోగం సంపాదించి పెళ్ళాడి పిల్లల్ని కని
వీలైనంత డబ్బు కూడబెట్టి పిల్లలకిచ్చి
ఇది అందరూ చేసేది
కొందరు తాము చేసే ఉద్యోగాలతో పాటు ఒక పని పెట్టుకుంటారు
ఆడటమో పాడటమో జంతువుల్ని పెంచటమో..
పార్టీలు విందులు విలాసాలు వీలైనంత జీవితం యాష్ చేయటం మరికొందరి అలవాటు
కొందరు మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తారు
వారు ఏదో లక్ష్యం కోసం తపిస్తుంటారు
వారికి ఏది వున్నా లేకున్నా వానిపై దృష్టివుండదు
అనుక్షణం ఆ లక్ష్యమే గుర్తొస్తుంటుంది
పోనీ ఆ లక్ష్యం నెరవేరిన తరువాత వారు పొందేది
ఏది వున్నా లేకపోయినా సరే.
క్రింద ఇచ్చిన వారి అభిప్రాయాలు చూడండి
ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకున్నారు
తర్వాత
జీవితం గురించిపుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం ..
భగీరధుడు గంగను దెచ్చెను.
రురుడు తాను ప్రేమించిన ప్రమద్వరకు
తన యాయువులో సగమిచ్చినాడు.
పురూరవుడు ఊర్వశీ వ్యామోహితుడై
ఆమెను గనుగొను వరకును వదలలేదు
రాజైన కౌశికుడు బ్రహ్మర్షి యగువరకును దపించినాడు
నడుమ వచ్చిన యపజయములాతని పట్టుదలను సడలింపలేదు..
అవియన్నియు మనపాలికి పురాణములు.
ఆనాడు జీవితమున కొక యర్థముండెను.
మానవులకు పురుషకారములో విశ్వాసముండెను.
జీవితము ..
యేదో అనుభవించి పోవలసిన వెర్రి పదార్థము గాదనియు
ఐహికాముష్మికములను సాధించుటకు
గొప్ప అవకాశమనియు..
ప్రతియొక్కడు విశ్వసించెను
ఐతిహాసిక యుగమునందుకూడ
మానవులలో నా సుగుణముండెను.
ప్రతియొక్కరేదో యొక విషయమున
గట్టుదాకుచునే యుండిరి.
ఒక్కడు మహాయోగి
మరియొకడు మహా భోగి
భోగమును గూడ వారు తృణీకరించలేదు..
యోగికున్న గౌరవమునే భోగికి కూడ నొసగినాడు
అల్పముగా నారంభములైన జీవితములు
ఆకసమంతటి విశాలములుగా పరిణతము లగుచుండెను
మేరుశిఖరములంతటి యున్నతములుగా బెరుగుచుండెను.
సత్యమును జెప్పుటకు వారికి జంకులేదు
దాని నాచరించుటకు గూడ గొంకు లేదు
ఇతరులెన్ని విమర్శించినను తన లక్ష్యమును సాధిం చునంతవరకును వాడు నిద్రబోవుటలేదు.
ప్రతియొక్క గుణమునందును
వారు దివ్యతత్త్వమునే జూచిరి
ఒక్క గుణమునే కడముట్ట నుపాసించిరి.
హైద్రాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియము ను చూచినప్పుడు ..
'ఒక్క మనుష్యుడింతటి పని యొనర్పగలడా..?'
యని మనకాశ్చర్యము గలుగును.
అందులోనే
గొన్నిబహమనీ సుల్తానులు ధరించిన
ఇనుప తొడుగులున్నవి
ఒక్కొక్క తొడుగును నేడొక రెండెడ్ల బండి మోయవలెను.
వారి కత్తులు గూడ
మనవంటి నల్వురు మనుష్యులు మోయవలెను
వానిని బూని వారు యుధ్ధము లొనర్చెడువారు
నేటికిని స్వతంత్ర్యములైన దేశములోనున్న జాతులలో
ఆ గొప్పతనములున్నవి
షా పత్రికలను బంచువాడుగా జీవితములో ప్రవేశించెను.
కడకు బ్రహ్మాండమైన పురుషుడైనాడు.
ఇట్టివారెందరో యున్నారు
అంతమాత్రముతో ఆ దేశములో ధనిక తత్త్వములోని దుర్మార్గములు లేవనుటకు వెలులేదు.
కాని మనకన్నను ఆ జాతులలో ఋజుత్వమెక్కువ
హుందాతనమెక్కువ..
సత్యశీలత యెక్కువ.
జీవితమనుట కర్థమెక్కువ
దానికి కారణము..?
కొన్ని నూర్లయేండ్లుగా ప్రజాతంత్ర జీవితమున కలవాటుపడినవారు వారు.
ఆ వాసన వారికా గొప్పదనమునిచ్చెను
మన సమాజ మార్థికముగా
చచ్చిపోయిన స్థితిలో నున్నది
జీవితమర్థరహితమైన వెర్రిపాటగా మారినది
మన ధర్మములు వీధిలోని బిచ్చగాండ్రను సృష్టించినది.
వారిని జూచి మనకు కరుణ గలుగు స్థితి గూడ పోయినది.
పుట్టుటకును, చచ్చుటకును
మన సమాజములో నర్థములేదు
మానవుని కనీస ధర్మములైనను శూన్యములై పోయినవి
మన వేదాంతమునకు సామాన్యునివైపు చూపేలేదు.
అదెప్పుడును ధనికునకు చామరము వీచును
పేదవానివైపుదిరిగి ''నమ్ము .. నమ్ము'
మని యాజ్ఞాపించును
'శరణాగతుడవైననే .. నీకు గతి' యని బెదరించును
ఉన్న కాస్త బుధ్ధిని తృణీకరించమని యాదేశించును
అట్టడుగునబడిన వానితో
'నీ జీవిత మింతేయనియూ .. '
అది నీ ప్రాచీన కర్మ'
యని వాదించును
'కర్మ యెప్పుడుబుట్టినదని'
యెదురు ప్రశ్న వేసినచో
'అది అనాది' యని.. గ్రుడ్లెర్రజేయును
అందుకే
వివేకానందులు
'దరిద్రదేశము దరిద్ర వేదాంతమునే బోధించునని శంఖారావము జేసెను.
పాపము ..'దేశమున బీదరికము పోవువరకును వేదాంతమును మరచిపొండని ..'బ్రతిమాలెను
'పుణ్యము చేయుటకు చేతగాకున్నచో ..
పాపమైనను చేయుమని..'
వేసరికతో ఉద్బోధించెను
'జీవితమున కర్థమున్నదని 'సూచించెను
కాని యట్టివారి మాటలు మనము విందుమా..??
విన్నచో సమాజములోని చీడపురుగు లెట్లు బ్రదుకును..??
జీవితం ఏమిటి ..??